Big breaking : కర్ణాటక రాజధానిలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనలో పదిమంది కన్నుమూశారు. 50 కి మించి మంది గాయపడ్డారు. వారంతా ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. చనిపోయిన వారికి పరిహారం చెల్లిస్తామని అటు ప్రభుత్వం, ఇటు కర్ణాటక క్రికెట్ జట్టు, బెంగళూరు యాజమాన్యం ప్రకటించినప్పటికీ మృతుల కుటుంబాలలో ఆగ్రహం చల్లారడం లేదు. పైగా తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. వారిచ్చే పరిహారానికంటే తిరిగి మేమే ఎక్కువ మొత్తంలో చెల్లిస్తాం.. చనిపోయిన మా వాళ్ళ ప్రాణాలు తిరిగి తీసుకురండి అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిణామం అక్కడ మీడియాలో ప్రముఖంగా ప్రసారమవుతోంది. ఇక సోషల్ మీడియా గురించి చెప్పాల్సిన అవసరం లేదు..
ముందుగానే చెప్పినట్టు ఈ విషయంలో ఖాకీలు నిన్నటి నుంచి దర్యాప్తును వేగంగా మొదలుపెట్టారు. ఇప్పటికే ప్రభుత్వం ఒక కమిటీ ఏర్పాటు చేసింది. పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇందులో భాగంగానే పలువురికి నోటీసులు జారీ చేశారు. ఆ తర్వాత అరెస్టులకు శుక్రవారం తెల్లవారుజాము నుంచి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా బెంగళూరు మార్కెటింగ్ హెడ్ స్పెషల్ సొసలే ను అరెస్ట్ చేశారు. ముంబై వెళ్లడానికి సొసలే విమానాశ్రయానికి చేరుకోగా.. అతడిని అక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు. విజయ యాత్రకు సంబంధించి నిఖిల్ సొసలే అనధికారికంగా ప్రమోషన్లు నిర్వహించారని.. అనుమతి లేకుండానే పరేడ్ నిర్వహించారని పోలీసులు అభియోగాలు మోపారు. ఇక ఇప్పటికే ఆ రాష్ట్ర క్రికెట్ సంఘం సెక్రటరీ శంకర్, ట్రెజరర్ జయరాం పరారీలో ఉన్నారు.
Also Read : బెంగళూరు కు ఎంత ప్రైజ్ మనీ వచ్చింది? ఆరెంజ్, పర్పుల్ క్యాప్ లు ఎవరికి దక్కాయంటే!
” కర్ణాటక పోలీసులు ఈ ఘటనలో దర్యాప్తును వేగం చేశారు. ఈ ఘటనలో ప్రత్యక్షంగా ప్రమేయం ఉన్నవారిని, పరోక్షంగా పాలుపంచుకున్న వారిని వదిలిపెట్టడం లేదు. దీనికి సంబంధించి కీలకమైన ఆధారాలు సేకరించారు. సిసి ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు. సామాజిక మాధ్యమాలలో విపరీతంగా ప్రచారం చేసిన బెంగళూరు తరఫు వారిని పోలీసులు గుర్తించారు. వారందరినీ అరెస్టు చేస్తున్నారు. త్వరలోనే ఈ ఘటనలో భారీగా అరెస్టులు ఉంటాయని తెలుస్తోంది. ఇదే కనక జరిగితే ఈ ఘటనలో మరిన్ని పెద్ద తలకాయలు అరెస్టు అయ్యే అవకాశం లేకపోలేదని” కర్ణాటక మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ఘటన జరగడానికి కన్నడ క్రికెట్ సంఘం బాధ్యులు, కన్నడ జట్టు నిర్వాహకులు కారణమని పోలీసులు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఈవెంట్ నిర్వహించిన సంస్థపై కూడా పోలీసులు అభియోగాలు మోపారాని తెలుస్తోంది. మొత్తంగా చూస్తే ఈ సంఘటనలో మరిన్ని అరెస్టులు చోటుచేసుకునే అవకాశం ఉందని కర్ణాటక రాష్ట్రంలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది.