ICC Women’s World Cup Final: క్రికెట్ ప్రపంచకప్‌ను ఇప్పటి వరకు ఎక్కువ సార్లు గెలిచిన దేశం ఏదైనా ఉందా అంటే వెంటేనే అందరూ చెప్పే సమాధానం ఆస్ట్రేలియా. ఇది పురుషల క్రికెట్ వరకు.. అయితే పురుషులకు తాము ఏ మాత్రం తీసిపోము అన్నట్టు ఆస్ట్రేలియా అమ్మాయిలు కూడా అదరగొట్టేశారు. మహిళా క్రికెట్ ప్రపంచ కప్పును ఎగరేసుకుపోయారు.
మహిళల వన్డే ప్రపంచకప్‌ను గెలిచి ఏడోసారి ప్రపంచ విజేతగా అవతరించింది ఆస్ట్రేలియా. గతంలో పురుషుల వన్డే ప్రపంచకప్ నెగ్గి సంచలనం సృష్టించిన ఇంగ్లండ్.. ఈసారి మహిళల వన్డే ప్రపంచకప్ లో కూడా ఫైనల్ వరకు వెళ్లింది కానీ.. కప్పును ముద్దాడలేకపోయింది. ఆస్ట్రేలియా మహిళల జట్టు ఆల్ రౌండ్ ప్రదర్శనతో 71 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.
మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 356 రన్స్ చేసింది. మొదట కాస్త నెమ్మదిగా ఆడిన ఆసిస్.. ఆతర్వాత స్పీడె పెంచింది. ముఖ్యంగా అలీసా హీలీ ఫోర్లతో ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కులు చూపించింది. 100 బంతుల్లో సెంచరీ కంప్లీట్ చేసిన హీలీ జట్టు భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించింది. ఆమెకు తోడుగా హైన్స్ రావడంతో.. ఇద్దరూ కలిసి 160 పరుగులు జోడించారు. ఇక రెండో వికెట్ గా వచ్చిన బెత్ మూనీతో కలిసి హీలీ మరింత రెచ్చిపోయింది. ఈ క్రమంలోనే ఆమె ఏకంగా 150 పరుగులు చేసి ఆల్ టైమ్ రికార్డ్ నెలకొల్పింది.
ఇప్పటి వరకు ప్రపంచకప్ లో ఎక్కువ పరుగులు చేసిన రికార్డు ఆసీస్ మాజీ సారథి ఆడమ్ గిల్ క్రిస్ట్ (149)పేరిట ఉండేది. కానీ దాన్ని హీలీ బద్దలు కొట్టింది. ఇలా దుమ్ము రేపే బ్యాటింగ్ తో ఆస్ట్రేలియా 357పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది.
అయితే ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన ఇంగ్లండ్ చతికిల పడిపోయింది. 43.4 ఓవర్లలో 285 పరుగులు చేసి ఆల్ ఔట్ అయిపోయింది. దీంతో ఆసిస్ గెలుపు సునాయాసమైంది. ఇంగ్లండ్ తరఫున నాట్ స్కీవర్ మాత్రమే పోరాడింది. ఆమె 121 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్స్ తో 148 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచింది. కానీ ఆమె ఒంటరి పోరాటం పనిచయలేదు.
ఇంగ్లండ్ ను ఆరంభంలోనే మేగాన్ ష్కుట్ తన పదునైన బౌలింగ్ దెబ్బ కొట్టింది. ఓపెనర్లు బీమౌంట్ (27), డాని వ్యాట్ (4) చాలా త్వరగా ఔట్ కావడంతో.. మిడిల్ ఆర్డర్‌పై భారం పడింది. దాంతో వారు ఒత్తిడిలోకి వెళ్లిపోయారు. కెప్టెన్ హీథర్ నైట్ (26)కూడా త్వరగానే ఔట్ అయిపోయింది. 86 రన్స్ వద్ద మూడు వికెట్లు కోల్పోయి ఇంగ్లండ్ కష్టాల్లో పడిపోయింది. ఈ సమయంలోనే గ్రౌండ్ లోకి వచ్చిన నాట్ స్కీవర్ ఆదుకునే ప్రయత్నం చేసింది. కానీ ఆమె ఒంటరి పోరాటానికి ఎవరూ అండగా నిలబడలేకపోయారు. ఫలితంగా భారీ తేడాతో ఘోర ఓటమిని మూటగట్టుకుంది ఇంగ్లండ్.
Also Read:Movement of Maoists: బొగ్గు గని గూండాలపై మావోయిస్టుల నజర్?