Palasa cashew : పలాస జీడిపప్పుకు మరో అరుదైన గుర్తింపు లభించింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు ప్రసాదంలో పలాస జీడిపప్పును వినియోగించుకునేందుకు టీటీడీ నిర్ణయించింది. రుచి, సువాసనలు తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదానికి ఎంతో ప్రాధాన్యం, ప్రాముఖ్యత ఉంది. ఈ లడ్డు తయారీలో వినియోగించే వస్తువుల్లో జీడిపప్పు ప్రధాన భూమిక పోషిస్తోంది. ఇకనుంచి టీటీడీ లడ్డు తయారీలో పలాస జీడిపప్పును వినియోగించనున్నారు. తిరుపతి బాలాజీ లడ్డూల తయారీకి రోజుకు మూడు టన్నుల జీడిపప్పు అవసరం. గతంలో ఈ జీడిపప్పును కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి గుత్త పద్ధతిలో సేకరించేవారు. మొదట నేరుగా తిరుమల తిరుపతి దేవస్థానమే కొనుగోలు చేసేది. తరువాత ఈ సేకరణలో రకరకాల మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం గ్లోబల్ టెండర్ల ద్వారా సేకరిస్తున్నారు. తాజాగా పలాస కు చెందిన వ్యాపారి కోరాడ సంతోష్ ఈ గ్లోబల్ టెండర్లను దక్కించుకున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన వందలాది మంది వ్యాపారులు పోటీపడ్డారు. కానీ అనూహ్యంగా పలాస జీడి వ్యాపారికి టెండర్ దక్కింది. దీంతో ఇకనుంచి పలాస నుంచి టీటీడీకి జీడిపప్పు ఎగుమతి కానుంది.
* 45 ఏళ్ల తర్వాత
వాస్తవానికి 45 ఏళ్ల కిందట పలాస జీడిపప్పుని ఎక్కువగా వినియోగించేవారు. కానీ ఉత్పత్తి తగ్గడంతో కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి జీడిపప్పు సరఫరా అయ్యేది. ఏపీతో పోటీపడి మరి ఆ రాష్ట్రాలు టెండర్లు దక్కించుకున్న సందర్భాలు ఉన్నాయి. అప్పటినుంచి మన రాష్ట్ర జీడిపప్పు విదేశాలకు, స్థానిక విక్రయాలకు మాత్రమే పరిమితం అయ్యేది. ప్రధాన ఆలయాలకు సరఫరాకు నోచుకోలేదు. 45 సంవత్సరాల తరువాత ఆ ఛాన్స్ పలాస జీడిపప్పుకు రావడంతో వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
* ఐదో స్థానంలో మన రాష్ట్రం
జీడిపప్పు తయారీలో మన రాష్ట్రం దేశవ్యాప్తంగా 5వ స్థానంలో ఉంది. శ్రీకాకుళం జిల్లాలోని ఎక్కువగా జీడి సాగవుతోంది. జీడి పరిశ్రమలు కూడా ఎక్కువగా ఇక్కడే ఉన్నాయి. దాదాపు 30 వేల హెక్టారుల్లో జిడి సాగుతోంది. విశాఖ విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ఏజెన్సీలో సైతం సాగు అధికం. దేశవ్యాప్తంగా మూడు వేలకు పైగా జీడి పరిశ్రమలు ఉండగా.. శ్రీకాకుళం జిల్లాలో దాదాపు300 వరకు పరిశ్రమలు ఉన్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ జంట పట్టణాల్లో అధికంగా ఉన్నాయి. దాదాపు 50 వేల మంది వరకు పరిశ్రమలపై ఆధారపడి బతుకుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి లడ్డు సరఫరాకు అవకాశం రావడంతో వ్యాపారులతో పాటు కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
* రోజుకు మూడు టన్నులు
తిరుపతి బాలాజీ లడ్డూల తయారీకి రోజుకు మూడు టన్నుల జీడిపప్పు అవసరం. ప్రస్తుతం జిహెచ్ బద్ద రకం జీడిపప్పు సరఫరా చేయాలని టీటీడీ నుంచి సమాచారం అందింది. ఈ మేరకు ఆ రకం పప్పు తయారీలో నిమగ్నమయ్యారు కార్మికులు. తిరుమల తిరుపతి దేవస్థానానికి పంపించనుండడంతో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దాదాపు 300 మంది కార్మికులు టీటీడీకి పంపించే జీడిపప్పు గ్రేడింగ్ పనిలో నిమగ్నమయ్యారు. పలాస కాశీబుగ్గ జీడి పరిశ్రమలకు ఇదొక వరంగా అభివర్ణించారు పారిశ్రామిక వాడ జీడి ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు మల్లా రామేశ్వరరావు. టీటీడీకి నాణ్యమైన జీడిపప్పు అందించే అవకాశం దక్కడం పూర్వజన్మ సుకృతంగా అభివర్ణించారు.