Krishna and Hanuman : మహావిష్ణువు దశావతారాల్లో శ్రీకృష్ణ అవతారం ఎనిమిదవది. భాగవతం పురాణం ప్రకారం శ్రీకృష్ణుడు మథుర నుంచి యాదవులతో కలిసి వెళ్లి సముద్ర తీరాన ద్వారక నగరాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. కురుక్షేత్ర యుద్ధానికి ముందు శ్రీకృష్ణుడు యాదవుల రక్షణ కోసం విశ్వకర్మ సహాయంతో ద్వారక నగరాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత శ్రీకృష్ణుడు ఈ నగరం నుంచి 36 సంవత్సరాలు పరిపాలన చేసినట్లు చెబుతున్నారు. అయితే కలియుగం ఆరంభం అయ్యే సమయంలో ద్వారకానగరం మునిగిపోతుంది. ఈ సమయంలో శ్రీకృష్ణుడు హనుమాన్ కు చెప్పిన రహస్యం ఒకటి ఉంది. అదేంటంటే?
శ్రీ మహావిష్ణువుకు, ఆంజనేయుడికి అవినాభావ సంబంధం ఉంది. మహావిష్ణువు ఏడవ అవతారమైన శ్రీరాముడికి హనుమంతుడు అత్యంత ప్రియమైన భక్తుడు. రాముడి కార్యాల కోసం హనుమంతుడు తన ప్రాణాలను సైతం లెక్కచేయడు. అయితే త్రేతా యుగం ముగిసిన తర్వాత ద్వాపరయుగం వచ్చిన విషయం తెలిసిందే. హనుమంతుడికి చిరంజీవి అనే ఆశీర్వాదం ఉంటుంది. అందువల్ల ఈయన మరణించకుండా అలాగే ఉండిపోయి ద్వాపర యుగంలో కూడా మహావిష్ణువు ఎనిమిదవ అవతారమైన శ్రీకృష్ణుడికి కూడా కలుస్తాడు. ముఖ్యంగా ద్వాపర యుగం మునిగిపోయే సమయంలో శ్రీకృష్ణుడు సముద్ర తీరాన మౌనంగా ఉన్న సమయంలో హనుమంతుడిని పిలిచి కొన్ని రహస్యాలు చెబుతాడు.
ఈ సందర్భంగా శ్రీకృష్ణుడు హనుమంతుడిని పిలుస్తాడు. అప్పుడు హనుమంతుడు వృద్ధాప్యంలో కనిపిస్తాడు. ఈ సమయంలో తన పిలుపుకు కారణం ఏంటి అని అడుగుతాడు. దీంతో అప్పుడు శ్రీకృష్ణుడు కలియుగం ప్రారంభం అవుతోందని.. ఇప్పుడు నేను ఉండలేను అని.. కానీ నీతో అవసరం ఈ కలియుగానికి ఉంటుందని చెబుతాడు. తనతో ఎలాంటి అవసరం ఉంటుందని.. హనుమాన్ అడగగా.. కలియుగంలో భక్తులు దేవుడి కోసం వెతుకుతారు. కానీ తమలోనే దేవుడు ఉన్నాడన్న విషయం చాలామంది గుర్తించరు. ఆయుధాలతో చేయలేని పనిని తమ భక్తి భావంతో చేయగలుగుతారు. అందువల్ల వీరికి తోడుగా నీవు ఉండాలని హనుమంతుడితో శ్రీకృష్ణుడు అంటాడు.
అప్పుడు హనుమంతుడు.. ఇక్కడ నాకు కర్తవ్యం ఏంటి స్వామి? అని అడగగా.. ఎక్కడైతే అధర్మం ఉంటుందో.. ఎవరైతే కష్టాలు పడతారో వారి వద్ద నీవు చేరి వారిని రక్షించాలని హనుమాన్ కు శ్రీకృష్ణుడు ఆదేశాలు ఇస్తాడు. దీంతో తన కర్తవ్యం సమర్థవంతంగా నిర్వహిస్తానని శ్రీకృష్ణుడికి హామీ ఇస్తాడు. అలా చెప్పిన తర్వాత శ్రీకృష్ణుడు తన అవతారాన్ని విడిచిపెడతాడు. తదనంతరం ద్వారకా నగరం కూడా మునిగిపోతుంది.