సోము వీర్రాజు ఆంధ్ర బిజెపికి నూతన అధ్యక్షుడుగా ఎన్నికైన దగ్గర్నుంచి రాజకీయ పరిణామాలు చక చకా జరుగుతున్నాయి. ముందుగా రాజధానిపై బిజెపిలో వున్న వైరుధ్యాలు తొలగిపోయాయి. సోము వీర్రాజు దీనిపై కేంద్రంతో మాట్లాడి స్పష్టమైన లైన్ తీసుకున్నాడు. ముందుగా పార్టీ లో రక రకాల అభిప్రాయాలు వ్యక్తపరచటానికి చెక్ పెట్టాడు. ఇప్పటికే ఒకరిని సస్పెండ్ చేయటం కూడా జరిగింది. దానితో అంతర్గత వ్యవహారాల పై గ్రిప్ వచ్చింది. ఎవరికి తోచినట్లు వాళ్ళు మాట్లాడితే కాంగ్రెస్ లో లాగా బిజెపి లో పప్పులుడకవని కొత్తగా వచ్చినవాళ్ళకు అర్ధమవ్వాలనే ఈ వేటు వేసాడని అనుకుంటున్నారు. వచ్చిన వారంలోనే పరిస్థితులు చక్కబరచటంలో దిట్ట అని నిరూపించుకున్నాడు. మొదట్నుంచీ పార్టీలో పనిచేయటంతో పార్టీలో ఆసుపాసులు క్షుణ్ణంగా తెలియటంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా గట్టి నిర్ణయాల వైపు అడుగులు పడుతున్నాయి.
దానితోపాటు రాజకీయ కార్యకలాపాలు కూడా వెంటనే మొదలుపెట్టాడు. ముందుగా మెగా స్టార్ చిరంజీవి ని కలవటం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాడని అర్ధమవుతుంది. సామాజిక సమీకరణల్లో భాగంగా ముందుగా కాపు సామాజిక వర్గాన్ని కోర్ బేస్ గా చేసుకొనే వ్యూహం లో భాగమే ఈ కలయిక అని పరిశీలకులు భావిస్తున్నారు. ఇప్పటికే తెలుగుదేశానికి కమ్మ సామాజిక వర్గం , వై ఎస్ ఆర్ సి పి కి రెడ్డి, దళిత సామాజిక వర్గాలు కోర్ బేస్ గా ఉండటంతో బిజెపి లోతుగా ఆలోచించి కాపు సామాజిక వర్గాన్ని తమ కోర్ బేస్ గా ఆంధ్రలో చేసుకోవాలని పావులు కదుపుతున్నట్లు తెలుస్తుంది. అందుకే బిజెపి కి సోము వీర్రాజు ని అధ్యక్షుడిగా చేయటం, చేసిన వెంటనే కొత్త అధ్యక్షుడు మొదటిగా చిరంజీవిని కలవటం చూస్తే ఈ వ్యూహాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని స్పష్టంగా అర్ధమవుతుంది. ఈ ప్రయత్నం విజయవంతమయితేనే బిజెపి కి ముందు పునాది ఏర్పడుతుంది. ఆంధ్రా రాజకీయాల్లో ఇష్టమున్నా లేకపోయినా కుల సమీకరణలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అయితే ఈ ప్రయత్నం విజయవంతమవుతుందో లేదో అనేది ఇప్పుడే చెప్పలేము.
కాపు సామాజిక వర్గం ప్రస్తుతం ఒకవైపు సమీకరించ బడలేదు. మొన్నటి ఎన్నికల్లో జగన్, పవన్ కళ్యాణ్ మధ్య చీలిపోయింది. ప్రజారాజ్య మప్పుడే ఆ సమీకరణ జరిగింది. ఆ తర్వాత జరగలేదు. అదేసమయంలో రాజకీయ సంప్రదింపులు కూడా మొదలయ్యాయి. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ని స్వయంగా ఇంటికెళ్ళి సోము వీర్రాజు కలవటం , ఇద్దరూ కలిసి వీడియో లో మాట్లాడటం జరిగింది. అందులో సోము వీర్రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో పరిస్థితుల్ని అధ్యయనం చేసి పవన్ కళ్యాణ్ నాయకత్వం లో 2024 కి తయారవుతామని చెప్పటం విశేషం. అంటే ఈ మూడో ప్రత్యామ్నాయానికి పవన్ కళ్యాణ్ నాయకుడని స్పష్టం చేసినట్లే. ఇది కూడా బిజెపి వ్యూహం లో భాగామేననుకోవాలి. ప్రస్తుతం బిజెపి ఆంధ్రాలో జీరో గానే వుంది. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ కి యూత్ లో క్రేజ్ వుంది. మూడో ప్రత్యామ్నాయానికి ఒక ఊపు రావాలంటే ప్రజాదరణ అవసరం. అది పవన్ కళ్యాణ్ ద్వారానే సాధ్యమవుతుందని బిజెపి భావించినట్లు తెలుస్తుంది. ఇది ఒకవిధంగా సస్పెన్సు కి తెరపడినట్లే. ఇది కూడా కాపు సామాజిక వర్గం ఈ కూటమి వైపు మొగ్గటానికి దారితీస్తుందని భావించవచ్చు. అంటే కాపు సామాజిక వర్గాన్ని కోర్ బేస్ గా చేసుకోవటానికి కావాల్సిన అన్ని ప్రయత్నాలు సోము వీర్రాజు చేస్తున్నట్లు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ నాయకత్వాన బిజెపి-జనసేన ఆంధ్రాలో వై ఎస్ ఆర్ సి పి కి గట్టి ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
An Independent Editor, Trend Stetting Analyst.
Read MoreWeb Title: Pavan kalyan will lead bjp janasena alliance
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com