Pavan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pavan Kalyan) తాజాగా తమిళ మీడియా ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన పార్టీ జనసేనను తమిళనాడు(Tamilnadu)లో విస్తరిస్తామని ప్రకటించారు. సినీ గ్లామర్‌తో ఇరుగుపొరుగు రాష్ట్రాల్లో అభిమానులను సంపాదించిన పవన్, ఈ సందోహాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే, ఈ నిర్ణయంపై చర్చ జోరుగా సాగుతోంది. తమిళనాడులో విస్తరణ మంచి ఆలోచనే అయినప్పటికీ, ముందు ఆంధ్రప్రదేశ్‌లో (AP) పార్టీని బలోపేతం చేసుకోవాలని సూచనలు వెలువడుతున్నాయి. ఏపీలో జనసేన గత ఎన్నికల్లో 21 సీట్లలో పోటీ చేసి విజయం సాధించింది. అయితే, ఈ విజయం టీడీపీ(TDP) మద్దతుతో సాధ్యమైందన్న వాస్తవాన్ని మరచిపోలేము. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా, జనసేన ఎమ్మెల్యేల కంటే స్థానిక టీడీపీ నేతల ప్రాబల్యం నియోజకవర్గాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ఇటీవల జనసేన ఎమ్మెల్యేలు రహస్య సమావేశం నిర్వహించి తమ ఆవేదన వ్యక్తం చేశారన్న ప్రచారం కూడా జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీలో పార్టీ పటిష్టతపై దృష్టి పెట్టడం కంటే తమిళనాడుపై ఆసక్తి చూపడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
Also Read : ఏపీలో ఉచిత విద్యుత్.. ఉత్తర్వులు జారీ!
ముందు ఇక్కడ దృష్టి పెట్టాలి..
పవన్‌కు అభిమానులు, బలమైన సామాజిక వర్గం ఉన్నప్పటికీ, జనసేన ఏపీలో 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బలంగా నిలబడాల్సిన అవసరం ఉంది. అధికారంలోకి వచ్చి పది నెలలు గడిచినా పార్టీ విస్తరణపై సీరియస్‌గా ఫోకస్ చేయలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గోదావరి జిల్లాల్లో జనసేన(Janasena)కు మద్దతుగా నిలిచిన సీనియర్ నేత హరి రామజోగయ్య, కాపు సామాజిక వర్గం కోసం కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అభివద్ధి ప్రాజెక్టులను చేపట్టాలని లేఖలు రాస్తున్నారు.
తెలంగాణా(Telangana)లోనూ పవన్‌కు అభిమానులు, తెలుగు జనాభా ఉన్నప్పటికీ, గత ఎన్నికల్లో జనసేన ప్రభావం చూపలేకపోయింది. అలాంటిది, సెంటిమెంట్‌కు పెద్దపీట వేసే తమిళనాడులో జనసేన ఎంతవరకు ఆదరణ పొందుతుందన్నది సందేహంగా ఉంది. పవన్‌కు జాతీయ స్థాయిలో రాణించాలన్న ఆకాంక్ష ఉన్నప్పటికీ, ముందు సొంత రాష్ట్రంలో పార్టీని చక్కదిద్దుకోవాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఏపీలో టీడీపీ అతిపెద్ద పార్టీగా, వైసీపీ రెండో స్థానంలో ఉంటే, జనసేన ఇంకా తన స్థానాన్ని బలోపేతం చేసుకోవాల్సి ఉంది. 21 సీట్ల విజయం గతంతో పోలిస్తే మెరుగైన ఫలితమే అయినా, ఇంతటితో సరిపోదని, తమిళనాడు వైపు చూడడానికి ఇంకా సమయం ఉందని విశ్లేషకులు సూచిస్తున్నారు.
Also Read : సునీత బెదిరించారు.. వివేకా పీఏ బయటపెట్టిన సంచలన నిజం