Home Blog Page 8564

సినీ కార్మికుల సంక్షేమానికి శర్వానంద్ విరాళం

దేశంలో కరోనా నివారణకు కేంద్రం 21రోజుల లాక్డౌన్ ప్రకటించింది. కరోనా ప్రభావంతో ఇప్పటికే షూటింగ్ వాయిదా పడ్డాయి. థియేటర్ల మూతపడటంతో చిత్రపరిశ్రమ ఇబ్బందులు ఎదుర్కొంటుంది. రోజువారీ షూటింగ్లో పాల్గొనే సినీ కార్మికులకు ఉపాధి దొరకక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో సినీ కార్మికులనే ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ‘సీసీసీ(క‌రోనా క్రైసిస్ చారిటీ) మనకోసం ఏర్పాటైంది. ఇందులో సీని పెద్దలు సభ్యులుగా ఉంటారు. ఈ ఛారిటీ ఆధ్వర్యంలో సినీ కార్మికుల సంక్షేమానికి పలు సంక్షేమ కార్యక్రమాలను చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

‘సీసీసీ మనకోసం’ కమిటీకి ఇప్పటికే పలువురు సెలబెట్రీలు విరాళాలను ప్రకటించారు. ఈ జాబితాలో యంగ్ హీరో శర్వానంద్ చేరారు. సినీ కార్మికుల కోసం శర్వానంద్ 15లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఆదివారం ‘ఐయామ్ శర్వానంద్’ అంటూ ట్వీటర్లో అడుగుపెట్టారు. ఆ వెంటనే సినీ కార్మికులను ఆదుకునేందుకు ‘సీసీసీ’కి 15లక్షల విరాళాన్ని ఇస్తున్నట్లు ప్రకటించారు.

దిన‌స‌రి వేతనంతో ప‌ని చేసే కార్మికులు సినిమా కోసం అంద‌రికంటే ఎక్కువ‌గా క‌ష్ట‌ప‌డుతుంటార‌ని శర్వానంత్ తెలిపారు. కరోనా ఎఫెక్ట్ తో షూటింగ్ లు వాయిదా పడటంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో కార్మికులను ఆదుకునేందుకు ఏర్పడిన ‘క‌రోనా క్రైసిస్ చారిటీ’కి తనవంతు సాయంగా రూ. 15ల‌క్ష‌లు ఇస్తున్నట్లు ట్వీటర్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా కరోనా కట్టడికి ప్రజలంతా స్వీయనియంత్రణ పాటించాలని కోరారు. వైద్యులు అందించే సూచ‌న‌ల‌ను పాటించి కరోనాను దూరంగా ఉండాలని శర్వానంద్ సూచించారు.

అధిక ధరలకు విక్రయిస్తే జైలుకే

నిత్యావసర వస్తువులను అధిక ధరలను విక్రయిస్తే జైలుకు వెళ్ళవలసి వస్తుందని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి హెచ్చరించారు. కరోనా కట్టడి చర్యలపై అత్యున్నత స్థాయి సమక్ష జరుపుతూ ఆ విధంగా అమ్మేవారిపై చర్యలు తీసుకోవాలని, దీనిపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు ఆదేశించారు.

నిత్యావసరాలు అమ్మే దుకాణం వద్ద ధరల పట్టికను కచ్చితంగా ప్రదర్శించాలని, అదే పట్టికలో అధిక ధరలకు అమ్మితే ఫిర్యాదు చేయాల్సిన కాల్‌ సెంటర్‌ నంబర్‌ను అందరికీ కనిపించేలా ఉంచాలని స్పష్టం చేశారు. నిత్యావసర వస్తువుల ధరలపై టీవీల్లో, పత్రికల్లో జిల్లాల వారీగా ధరలను ప్రకటించాలని, విస్తృతంగా ఈ« దరలపై ప్రచారం చేయాలని సూచించారు.

ప్రతి సూపర్‌మార్కెట్‌ వద్దా, ప్రతి దుకాణం వద్ద కచ్చితంగా ధరల పట్టికను ఉంచాలని చెప్పారు. నిత్యావసరాలను అధిక ధరలకు అమ్మితే జైలుకేనని సీఎం హెచ్చరించారు. ప్రతి దుకాణం వద్ద ధరల పట్టిక, కాల్‌ సెంటర్‌ నెంబర్‌ ఏర్పాటు చేయాలని చెప్పారు. దేశం మొత్తం లాక్‌డౌన్‌లో ఉంది, ఈ పరిస్థితిని అధిక ఆర్జనకోసం వినియోగించుకోవడం దారుణమని విమర్శించారు. దీనిని ఎటువంటి పరిస్థితుల్లో సహించేది లేదని తేల్చి చెప్పారు.

దుకాణాల వద్ద సామాజిక దూరం పాటించేలా చూడాలని, రేషన్‌ దుకాణాల వద్ద ఒకే లైను కాకుండా సామాజిక దూరం పాటించేలా మూడుకు మించి లైన్లు ఉండేలా చూడాలని సూచించారు. మొబైల్‌ వ్యాన్ల ద్వారా కూరగాయలు, నిత్యావసరాలు అమ్మడాన్ని ప్రోత్సహించాలని చెప్పారు. ఓల్డేజ్‌ హోంలకు కావాల్సిన వాటిని అందించాలన్న సీఎం సామాజిక దూరం పాటిస్తూ వ్యవసాయ, ఆక్వా రంగ కార్యకలాపాలు నిర్వహించాలని స్పష్టం చేయారు.

మరింత పటిష్టంగా లాక్‌డౌన్‌ అమలు చేయాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. అర్బన్‌ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ సమయం కుదిస్తామని తెలిపారు. పట్టణాలు, నగరాల్లో ఉదయం 6 నుంచి ఉదయం 11 వరకు మాత్రమే నిత్యావసరాలకు అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు. మిగతా ప్రాంతాల్లో ఉదయం 6 నుంచి ఒంటిగంట వరకే అనుమతి ఇస్తామని చెప్పారు.

రైతులకు, ఆక్వా రైతులకు కనీస గిట్టుబాటు ధరలు అందాలని, వలస కూలీలు, కార్మికుల కోసం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. షెల్టర్లలో మెనూ ప్రకారం మంచి భోజనం పెట్టాలని జగన్‌ ఆదేశించారు.

 

ఏపీలో 11 గంటల వరకే బయటకు అనుమతి

రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అర్బన్ ప్రాంతాల్లో నిత్యావసరాలకు అనుమతించే సమయాన్ని కుదించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉదయం 6 నుంచి 11 గంటల వరకు మాత్రమే నిత్యావసర వస్తువుల కొనుగోలుకు అనుమతి ఇవ్వాలని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో యధావిధిగా ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అవకాశం ఇవ్వాలన్నారు. కోవిడ్‌ –19 వ్యాప్తి, ప్రస్తుత పరిస్థితులను తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆదివారం జరిగిన సమీక్షా సమావేశంలో జగన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో కోవిడ్‌ వ్యాప్తి నివారణకు మరింత పటిష్టంగా చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఆమేరకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు.
క్షేత్రస్థాయిలో వాలంటీర్లు, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు నిరంతరం ప్రతి కుటుంబం వివరాలను నమోదు చేసేలా, వారు పటిష్టంగా కార్యకలాపాలు నిర్వహించేలా చూడాలన్నారు. నగరాలు, పట్టణాల్లో హాట్‌ స్పాట్లను గుర్తించి ఆమేరకు మరిన్ని చర్యలు తీసుకోనున్నట్టు సీఎంకు అధికారులు వివరించారు.

నిత్యావసర వస్తువుల ధరలను ఎక్కువుగా అమ్మేవారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ధరల పట్టికలో అధిక ధరలకు అమ్మితే ఫిర్యాదు చేయాల్సిన కాల్‌ సెంటర్‌ నంబర్‌ను అందరికీ కనిపించేలా ఉంచాలని తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలపై టీవీల్లో, పత్రికల్లో జిల్లాల వారీగా ధరలను ప్రకటించాలని చెప్పారు. విస్తృతంగా ఈ దరలపై ప్రచారం చేయాలని, ఎక్కువ ధరలకు అమ్మేవారిని జైళ్లకు పంపాలని ఆదేశించారు. ప్రతి సూపర్‌ మార్కెట్‌ వద్దా, దుకాణం వద్దా కచ్చితంగా ధరల పట్టికను ఉంచాలన్నారు. దేశం మొత్తం లాక్‌డౌన్‌లో ఉంది, ఈ పరిస్థితిని అధిక ఆర్జన కోసం వినియోగించుకోవడం దారుణం అన్నారు. దుకాణాల వద్ద సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

రేషన్‌ దుకాణాల వద్ద ఒకే లైను కాకుండా సామాజిక దూరం పాటించేలా మూడుకు మించి లైన్లు ఉండేలా చూడాలన్నారు. అలాగే మొబైల్‌ వ్యాన్ల ద్వారా కూరగాయలు, నిత్యావసరాల అమ్మకాన్ని ప్రోత్సహించాలని చెప్పారు. ఆర్టీసీ బస్సుల ద్వారా నిత్యావసరాల పంపిణీపై సమావేశంలో ప్రస్తావన రావడంతో అధికారులు కూర్చుని దీనిపై ఆలోచనలు చేయాలన్న సీఎం ఆదేశించారు.ఓల్డేజ్‌ హోంలకు కావాల్సిన నిత్యావసర వస్తువులను అందించాలన్నారు.

సామాజిక దూరం పాటిస్తూ వ్యవసాయ, ఆక్వా రంగ కార్యకలాపాలు:

ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానికి ఇచ్చిన ఆదేశాలపై చర్యలను సీఎంకు ఉన్నతాధికారులు వివరించారు. నిర్ణయించిన ధరకన్నా తక్కువకు రైతుల నుంచి వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేస్తే వీరిపై చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరికలు జారీచేసినట్లు చెప్పారు.ఈ ధరలపై ప్రచారం చేస్తున్నామని, ఆక్వా ఉత్పత్తుల ఎగుమతుల కార్యకలాపాలను పునఃప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

సామాజిక దూరం పాటిస్తూ ఆక్వా పరిశ్రమలు నడిపేందుకు యత్నిస్తున్నామని చెప్పారు. కూలీల ఆరోగ్య రక్షణకోసం మాస్కులు, గ్లావ్స్‌ ఇచ్చేందుకు ఆక్వా ఫ్యాక్టరీ యజమానులు అంగీకరించారన్న అధికారులు సీఎంకు తెలిపారు. జిల్లాల వారీగా నోడల్‌ అధికారులను నియమించి, రైతుల నుంచి వచ్చే ఫిర్యాదులపై దృష్టిసారిస్తామన్నారు.

అలాగే వ్యవసాయానికి అవసరమైన ఎరువులు రవాణా నిలిచిపోకుండా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు సీఎంకు తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి విత్తనాల సరఫరా కూడా నిలిచిపోకుండా చూస్తున్నమన్నారు.రైతులకు కావాల్సిన ఎరువులు, విత్తనాలను ఎక్కడికక్కడ నిల్వచేస్తున్నట్లు చెప్పారు. సామాజిక దూరం పాటిస్తూ వ్యవసాయ కార్యకలాపాలు కొనసాగించుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు ఇచ్చిందని, దీనిపై గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నామని అధికారుల తెలిపారు.

వ్యవసాయం, ఆక్వా రంగాల్లో కార్యకలాపాలు కొనసాగేలా, అదే సమయంలో వైరస్‌ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని సీఎం జగన్ ఆదేశించారు, జాగ్రత్తలు తీసుకుని వాటి కార్యకలాపాలు ఉదయం 6 గంటలనుంచి 1 గంటవరకూ కొనసాగేలా చూడాలనన్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు ధరలు తగ్గకుండా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. కనీస గిట్టుబాటు ధరలు వారికి లభించాలని స్పష్టం చేశారు. అగ్రీ ప్రోసెసింగ్‌ యూనిట్లలో కూడా సామాజిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకుని, వాటి కార్యకలాపాలు కొనసాగించాలని సూచించారు.

లాక్‌డౌన్‌ కారణంగా ఏ ఏ నిత్యావసర వస్తువులు తక్కువుగా మార్కెట్లో లభ్యం అవుతున్నాయో గుర్తించి, వాటిని కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు.ప్రతి జిల్లాలో ఇంటిగ్రేటెడ్‌ కాల్‌ సెంటర్‌ ఉందన్న డీజీపీ సవాంగ్ తెలిపారు. ఎక్కడ సమస్యలున్నా వెంటనే పరిష్కారానికి కాల్‌సెంట్‌ద్వారా ప్రయత్నిస్తున్నామన్నారు. ప్రస్తుతం అర్బన్‌ ప్రాంతాలపై దృష్టిపెట్టామని చెప్పారు. అర్బన్‌ ప్రాంతాల్లో కరోనా వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున వీటిపై ప్రత్యేక దృష్టిపెట్టామని డీజీపీ గౌతమ్ సవాంగ్ చెప్పారు. మంత్రులు ఆళ్లనాని, బొత్స, మేకతోటి సుచరిత, కన్నబాబు, బుగ్గన రాజేంద్రనాథ్, మోపిదేవి వెంకట రమణ హాజరు, చీఫ్‌ సెక్రటరీ నీలం సాహ్ని, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

తక్షణం జిల్లాల సరిహద్దులు మూసివేయండి

లాక్‌డౌన్ తో పట్టణాలలో ఉపాధి అవకాశాలు స్తంభించి పోవడంతో లక్షల సంఖ్యలో వలస కార్మికులు గ్రామాలకు ప్రయాణం కావడం పట్ల కేంద్రం కలవరం చెందుతున్నది. అందుకనే తక్షణం రాష్ట్రాల సరిహద్దులతో పాటు జిల్లాల సరిహద్దులను కూడా మూసి వేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. కరోనా వైరస్ గ్రామాలకు వ్యాప్తి చెందకుండా కట్టడి చేయాలని సూచించింది.

కేవ‌లం నిత్య‌వ‌స‌ర స‌రుకులకు మాత్రమే అనుమ‌తి ఇవ్వా‌ల‌ని స్పష్టం చేస్తూ గ్రామాలకు ఈ వైరస్ వ్యాప్తి చెందితే అక్కడ వారికి వైద్య సదుపాయాలు, దిగ్బంధన సౌకర్యాలు కల్పించడం దుర్లభం కాగలదని ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్ప‌టికే స‌రిహ‌ద్దు‌లు దాటిన వారిని 14 రోజుల పాటు క్వా‌రంటైన్‌లో ఉంచాల‌ని సూచించిది.

నిబంధ‌న‌లు ఉల్లంఘించి ఎవ‌రైనా ప్ర‌యాణం చేస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించింది. లాక్‌డౌన్‌ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో ఆదివారం కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గూబా జరిపిన వీడియో కాన్ఫరెన్స్‌లో కొన్ని ప్రాంతాల్లో వలసకూలీలు.. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్తున్నట్లుగా గుర్తించామని దీనిని పూర్తిగా నివారించాలని స్పష్టం చేసారు.

ఎక్కడైనా ప్రజలు ప్రయాణాలు చేస్తే దానికి స్థానిక కలెక్టర్లు, ఎస్పీలను బాధ్యులు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అత్యవసర విపత్తుల చట్టం కింద ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ఈ బాధ్యతను తమ భుజాలకెత్తుకోవాలని ఆదేశించారు.

కరోనా భారత్‌కు జీవన్మరణ సమస్య

కోవిడ్ -19పై ప్రస్తుతం సాగిస్తున్న పోరాటం భారత్ కు జీవన్మరణ సమస్య అని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మన్‌ కీ బాత్‌ సందేశం ఇస్తూ లాక్‌డౌన్‌ కారణంగా పేదప్రజలకు కలిగిన ఇబ్బందికి క్షమాపణలు కోరారు. ప్రపంచ దేశాలను చూసిన తర్వాతనే లాక్‌డౌన్‌ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతూ కోవిడ్‌-19పై యుద్ధానికి కఠిన నిర్ణయాలు తప్పవని స్పష్టం చేసారు.

హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా సూచించిన వ్యక్తులు నియమాలను ఉల్లంఘిస్తూ యధేచ్చగా లాక్‌డౌన్‌ నియమాలు పాటించకపోతే కరోనా వైరస్‌ డేంజర్‌ నుంచి మనల్ని కాపాడుకోవడం చాలా కష్టతరమౌతుందని హెచ్చరించారు. ఎటువంటి లక్షణాలు లేనప్పటికి స్వీయ క్వారంటైన్‌ను పాటిస్తున్న వారికి ప్రధాని అభినందనలు తెలిపారు.

కరోనాపై యుద్ధంలో ఇటువంటి కఠిన నిర్ణయాలు తప్పవని పేర్కొంటూ భారత ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటం అతి ముఖ్యమని చెప్పారు. లక్ష్మణరేఖను ప్రజలు మరికొన్ని రోజులు పాటించాలని కోరారు.

కరోనాపై వైద్యులు, నర్సులు, సిబ్బంది నిరంతరం పోరాడుతున్నారని ప్రధాని కొనియాడారు. ఏ విధమైన భౌతిక ప్రతిఫలం ఆశించకుండా రోగులకు సేవ చేసే వైద్యుడే అత్యుత్తమ వైద్యుడని ఆచార్య చరకుడు చెప్పారని గుర్తు చేస్తూ ఇటువంటి సేవాభావంతో పనిచేస్తున్న ప్రతి నర్సుకు వందనం చేస్తున్నట్లు ప్రధాని తెలిపారు.

ప్రపంచం 2020ని నర్సుల అంతర్జాతీయ దినోత్సవంగా జరుపుకుంటోందని చెబుతూ వీరందరూ సాటిలేని అంకితభావంతో పనిచేస్తున్నట్లు మోదీ కొనియాడారు. కరోనాపై పోరాటంలో నర్సులు, డాక్టర్లు, పారామెడికల్‌ సిబ్బంది ముందువరుసలో ఉన్నారని ప్రశంసించారు.

కరోనా ఏ ఒక్క ప్రాంతానికో,ప్రదేశానికో పరిమితం కాలేదని, ఇంకా కొందరు సీరియస్ గా తీసుకోవట్టేదని ప్రధాని విచారం వ్యక్తం చేశారు. వైరస్ కు పేద,ధనిక తేడా లేదని చెబుతూ కరోనాపై చేస్తున్న యుద్దంలో గెలవాల్సిందేనని స్పష్టం చేశారు.

వలస కార్మికుల కదలికతో లాక్ డౌన్ కు ముప్పు!

కరోనా కట్టడికి లాక్ డౌన్ మాత్రమే మార్గమని ఒక వంక ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేస్తుండగా, దేశంలో వైరస్ సోకినా వారి సంఖ్యా కూడా పెరుగుతూ ఉండగా ఎక్కడికక్కడ చిక్కుకు పోయిన లక్షలాది మంత్రి వలస కార్మికులు పల్లెబాట పడుతూ ఉండడంతో ప్రభుత్వ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. లాక్ డౌన్ ఉద్దేశం నీరుకారి పోతుందని భయపడుతున్నాయి.

ఎక్కడికక్కడే వారు ఉండేటట్లు చేయడం కోసం వారికి తక్షణమే సహాయ శిబిరాలను ఏర్పాటుచేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ సూచించింది. పైగా వారందరికీ తాత్కాలిక వసతి, భోజన సదుపాయం కల్పించడంతోపాటు వైద్య పరీక్షలు నిర్వహించాలని కూడా చెప్పింది.

పైగా, అందుకోసం ఇందుకోసం ఎస్డీఆర్‌ఎఫ్‌ (రాష్ట్ర విపత్తు సహాయ నిధి) నిధులుగా ఉన్న రూ 29,000 కోట్లను ఉపయోగించుకోమని కూడా చెప్పింది. అయినా ప‌ట్ట‌ణాల్లో ప‌ని కోసం వ‌చ్చిన‌వారంతా.. ఇప్పుడు సొంత ఊళ్ల‌కు బారులు తీరుతున్నారు. దేశ రాజ‌ధాని ఢిల్లీ నుంచి యూపీ, బీహార్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్ వెళ్లే వ‌ల‌స కార్మికుల ప‌రిస్థితి ద‌య‌నీయంగా ఉన్న‌ది. య‌మునా ఎక్స్‌ప్రెస్‌వే వ‌ద్ద జ‌నం సునామీలా విరుచుకుప‌డుతున్నారు.

ఇక అక్క‌డ సామాజిక దూరం పాటించేవారే కనిపించడం లేదు. లాక్‌డౌన్ ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో జ‌నం జీవ‌నోపాధి కోల్పోవడంతో ఎలా బ్ర‌తుకాలో దిక్కుతోచ‌ని స్థితిలో వారంతా పుట్టినూళ్ల‌కు వెళ్తున్నారు. క‌రోనా సంక్ర‌మ‌ణ‌ను అడ్డుకోవాలంటే సామాజిక దూరం పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నా వ‌ల‌స కూలీల వ్య‌థ‌లు మ‌రోలా ఉన్నాయి.

వారిని ఇంటికి చేర్చేవారు లేరు. దాదాపు వంద కిలోమీట‌ర్ల దూరం కాలిబాట‌న న‌డిచేందుకు కొంద‌రు సాహ‌సం చేస్తున్నారు. ల‌క్ష‌లాది సంఖ్య‌లో ఉన్న వ‌ల‌స కూలీల‌ను త‌ర‌లించేందుకు యుపి ప్ర‌భుత్వం సుమారు వెయ్యి బ‌స్సులు ఏర్పాటు చేసింది. అయినా ఆ ఏర్పాట్లు మాత్రం స‌రిపోవ‌డం లేదు. ఆగ్రా, అలీఘ‌డ్‌, ల‌క్నో, కాన్పూర్‌, బీహార్ వెళ్లాల్సిన మ‌జ్దూరీలు బిక్కుబిక్కుమంటున్నారు. బ‌స్సులు ఎన్ని ఉన్నా.. జ‌నం అంత‌క‌న్నా ఎక్కువ ఉన్నారు.

ఎంతో క‌ష్ట‌ప‌డి కూలీలంతా స్వంత ఊళ్ల‌కు వెళ్లినా.. అక్క‌డ వైర‌స్ కేసులు ఎక్కువ అయితే అదో పెద్ద స‌మ‌స్య‌గా మారుతుందని ప్రభుత్వ వర్గాలు ఖంగారు పడుతున్నాయి. భారీ సంఖ్య‌లో వెళ్తున్న వీరంతా గ్రామాల‌కే ప‌రిమితంకానున్నారు. కానీ గ్రామాల్లో వైద్య స‌దుపాయాలు ఏమీ ఉండ‌వు. ఒక‌వేళ ఇంత సంఖ్య‌లో త‌ర‌లివెళ్తున్న ఈ కూలీలు వైర‌స్‌ను త‌మ ఊళ్ల‌కు మోసుకువెళ్తే ప‌రిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నారు.

2017 ఆర్థిక స‌ర్వే ప్ర‌కారం దేశ‌వ్యాప్తంగా గ‌త అయిదేళ్ల‌లో సుమారు 14 కోట్ల జ‌నాభా వ‌ల‌స వెళ్లింది. అంటే వాళ్లంతా జీవ‌నోపాధి కోసం రాష్ట్రాల‌ను దాటారు. ఆ జాబితాలో యుపి, బీహార్ వాళ్లే ఎక్కువ ఉన్నారు. కానీ వీరంతా త‌మ వెంట క‌రోనాను తీసుకువెళ్తున్నారేమో అన్న సందేహాలు కూడా వ్య‌క్తం అవుతున్నాయి. వీరిని ఎట్లా కట్టడి చేయాలో రాష్ట్ర ప్రభుత్వాలకు సహితం దిక్కు తోచడం లేదు.

కోలుకొంటున్న వూహాన్‌ నగరం… దోషిగా చైనా!

కరోనా వైరస్‌కు పుట్టినిల్లయిన చైనాలోని వూహాన్‌ నగరం కోలుకున్నది. రెండు నెలల లాక్‌డౌన్‌ ఎత్తివేస్తున్నట్టు చైనా ప్రభుత్వం శనివారం ప్రకటించింది. దాదాపు 63 రోజులపాటు లాక్‌డౌన్‌కు గురైన ప్రజానీకం ఒక్కసారిగా స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నంత భావోద్వేగానికి లోనయ్యారు. దాదాపు కోటి పది లక్షల జనాభా ఉన్న వూహాన్‌.. జనవరి మొదటివారం నుంచి వార్తల్లోకెక్కింది.

తొలి కరోనా వైరస్‌ నమోదుతో వూహాన్‌ నగరంపై చైనా ప్రభుత్వం దృష్టిసారించింది. లాక్‌డౌన్‌ ప్రకటించి ప్రజలను ఇండ్లకే పరిమితం చేసింది. రోడ్లను బ్లాక్‌ చేశారు. నగరంలోకి ఇతర ప్రాంతాలవారు రాకుండా సరిహద్దులను మూసేశారు. చైనాతోపాటు మిగతా ప్రపంచదేశాలతో వూహాన్‌కు సంబంధాలు లేకుండా చేశారు.

ఎక్కడికక్కడ క్వారంటైన్‌ కేంద్రాలను ఏర్పాటుచేసి వైద్యారోగ్య సిబ్బంది 24 గంటలపాటు సేవలందించారు. మొత్తానికి కరోనా వైరస్‌ను కట్టడిచేశారు. ఈ నేపథ్యంలో శనివారం లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తున్నట్టు చైనా ప్రభుత్వం ప్రకటించింది.

ఇలా ఉండగా, కరోనా వైరస్ కారణంగా ప్రపంచ జనాల ముందు చైనా తలదించుకోవాల్సి వస్తున్నది. ఈ వ్యాధి చైనా నుంచే వ్యాపించటంతో ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా పశ్చిమ దేశాల ప్రజలు చైనా అంటే చీదరించుకుంటున్నారని పలు కధనాలు వెలువడుతున్నాయి.

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్విట్టర్లో అయితే చైనాను అసహ్యించుకుంటూ పోస్టులు పెడుతున్నవారి సంఖ్య ఏకంగా 900 శాతం పెరిగిందని ట్విటర్‌లో ట్రెండ్ అయిన హాష్‌ట్యాగ్‌ల ఆధారంగా లైట్ అనే సోషల్ మీడియా విశ్లేషణ సంస్థ తేల్చింది.

ముఖ్యంగా కోవిడ్-19 వైరస్ బయటపడిన తర్వాత చైనాతోపాటు ఆసియా పౌరులపై పశ్చిమ దేశాల్లో జాతి వివక్ష వ్యాఖ్యలు పెరిగిపోయాయి. వేలాది వెబ్‌సైట్లు, సోషల్‌మీడియా గ్రూపులు, వీడియోలు, చిత్రాలు, ఆడియోలను పరిశీలించిన తర్వాత ఈ అంచనాకు వచ్చినట్లు లైట్ సంస్థ వెల్లడించింది.

ప్రజల్లో ఈ పెడదోరణిపై అమెరికాలాంటి దేశాల్లో హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. గతేడాది డిసెంబర్‌లో చైనాలోని వుహాన్‌లో కోవిడ్-19 బయటపడిన తర్వాత ఆ దేశ ప్రజల ఆహారపు అలవాట్లపై అభ్యంతరకరమైన పోస్టులు పెరిగిపోయాయి.

ఔదార్యాన్ని చాటుకున్న విజయవాడ పోలీసులు

కరోనా వ్యాప్తిని నివారించే క్రమంలో పోలీసులు పలువురిని కొట్టిన, జర్నలిస్టులపై దాడి చేసిన ఘటనలు చూశాం. మరోవైపు ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ముందున్నాం అంటున్నారు పోలీసులు. విజయవాడలో పోలీసులు ఆదివారం తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో కబేళా సమీపంలో నివాసం ఉండే షేక్ సిద్ధికా(25) నిండు గర్భిణీ. ఈ రోజు ఉదయం ఆమెకు ఉన్నట్టుండి నొప్పులు రావడంతో ఆసుపత్రికి తరలించేందుకు కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు. స్థానికంగా ఉన్న ఆటో స్టాండ్ లో ఆటో కోసం ప్రయత్నించగా ఎవరు కిరాయికి రాకపోవడంతో కుటుంబ సభ్యులకు దిక్కుతోచని పరిస్థితి ఎదురయ్యింది.

ఏమిచేయాలో తెలియని పరిస్థితులలో వారు భవానీపురం పోలీసులను ఆశ్రయించారు. వెంటనే స్పందించిన భవానీపురం పోలీస్ స్టేషన్ సి ఐ మోహన్ రెడ్డి గారు సిబ్బందితో కలసి వెంటనే సిద్ధికా ఇంటికి చేరుకొని ఆ మహిళను ఠాణా వాహనంలో అమెరికన్ హాస్పిటల్ కు తరలించారు. దీంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. కరోనా వ్యాప్తిని నివారించేందుకు రోడ్లపై తిరుగుతున్నా వారిపై కఠినంగా వ్యవహరిస్తున్న పోలీసులు ఆపద సమయంలో ఆపన్నులను అడుకోవడంలోను ముందుంటున్నారు.

ఆర్ ఆర్ ఆర్ సినిమా స్టోరీ చెప్పేసిన రాజమౌళి

rrr shooting

భారత ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ తో సినీ జనాలు యాక్టివిటీ లేకుండా ఉన్నప్పుడు రాజమౌళి టీం ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రచారాన్ని స్టార్ట్ చేసి అందరినీ సర్ ప్రైజ్ చేసింది. ఉగాది రోజున ఆర్ ఆర్ ఆర్ చిత్రం యొక్క మొదట మోషన్ పోస్టర్ మరియు టైటిల్ ను విడుదల చేసిన రాజమౌళి టీమ్ రెండు రోజుల గ్యాప్ తరవాత మార్చ్ 27 వ తారీఖున రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ‘భీమ్ ఫర్ రామరాజు’ అంటూ చెర్రీ పాత్ర ఇంట్రో వీడియోను విడుదల చేశారు.

కాగా ఈ వీడియోకు భారీ స్పందన దక్కుతోంది. టాలీవుడ్ చరిత్రలో అత్యధిక లైక్స్ పొందిన వీడియో గా రికార్డు సృష్టించింది . తెలుగు సినిమాల పరంగా 24 గంటల్లో అత్యధిక లైకులు పొందిన టీజర్స్ లో ఆర్ ఆర్ ఆర్ చిత్రం యొక్క టీజర్ కి 494 k లైకులు దక్కగా ప్రధమ స్థానం లో నిలిచింది. ఆ తరవాతి రెండు ,మూడు స్థానాల్లో సాహో 455 k దక్కించు కోగా , అజ్ఞాత వాసి 412 k దక్కించుకొంది. ఇక నాలుగు ,అయిదు స్థానాల్లో ఆల వైకుంఠపురం లో 387 కే , సరిలేరు నీకెవ్వరు 386 k లైకులు దక్కించు కొన్నాయి. .

దీంతో పాటుగా సినిమా కథ ఏమై ఉంటుందా అనే ఆలోచన అందరిలో వచ్చింది. రామ్ చరణ్ వస్త్రధారణ పోలీసు యూనిఫాం లో ఉండడం.. అల్లూరి సీతారామ రాజు పాత్ర కాషాయ వస్త్రాలలో షర్టు లేకుండా ఉండడంతో జనాల్లో కథపై కొత్త సందేహాలు వచ్చాయి.

ఈ విషయంపై రాజమౌళి స్పందిస్తూ “అల్లూరి సీతారామరాజు.. కొమరం భీమ్ నిజ జీవితంలో ఒకరినొకరు కలవలేదు. అయితే వారిద్దరికీ కొన్ని పోలికలు ఉన్నాయి. వారిద్దరూ చాలా చిన్న వయసులోనే ఇంటినుంచి బయటకు వచ్చారు. బ్రిటిష్.. నిజాం పాలన కు వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. ఇద్దరి జీవితంలో జరిగిన పలు ముఖ్యమైన ఘట్టాలను కలిపి మేము RRR రూపొందించాం. 1920 లో ఇద్దరు స్నేహితులు చెడుకు వ్యతిరేకంగా చేసినపోరాటమే RRR మూల కథ” అంటూ సినిమా కథ వెల్లడించారు.

కరోనాతో స్పెయిన్ యువరాణి మృతి

చైనాలోని వూహాన్లో పుట్టిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని బెంబెలెత్తిస్తుంది. ప్రస్తుతం ఈ వైరస్ 200పైగా దేశాలకు సోకింది. కరోనా దాటికి అమెరికా, ఇటలీ, స్పెయిన్, చైనా వంటి అగ్రదేశాలు విలవిలలాడిపోతున్నాయి. ప్రస్తుతం ఇండియాలోనే కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. తాజాగా కరోనా మహమ్మరితో స్పెయిన్ యువరాణి మరియా థెరిసా(86) మృతిచెందింది. కరోనా వైరస్ కు ఆమె చికిత్స చేయించుకుంటున్నప్పటికీ మరియా థెరిసా మృతిచెందాడం అందరినీ షాకింగ్ కు గురిచేసింది.

స్పెయిన్ యువరాణి మరియా థెరిసా మృతివార్తను ఆమె సోదరుడు ప్రిన్స్ ఎన్రిక్ డి బోర్బన్ ఫేస్ బుక్ పోస్ట్ ద్వారా ప్రజలకు తెలియజేశాడు. ప్రపంచంలోని ఒక రాజ కుటుంబం నుంచి కరోనాతో మృతిచెందాడం ఇదే తొలిసారి. యూరోపియన్ దేశాల్లో ఇటలీ తరువాత కరోనాతో స్పెయిన్ ఎక్కువగా ప్రభావితమైంది. కరోనా మహమ్మరికి ఇటలీలో మరణమృదంగం కొనసాగుతుండగా స్పెయిన్ లోనూ అంతకంతకు కరోనా ప్రభావం తీవ్రరూపం దాల్చింది. దీంతో స్పెయిన్ కరోనా దాటికి అతలాకుతులం అవుతోంది. రెండ్రోజుల క్రితం మాడ్రిడ్‌లో స్పెయిన్ యువరాణి మరియా థెరిసాకు అంత్యక్రియలు జరిగాయి. మరియా థెరిసా పారిస్‌లో 1933 లో జన్మించారు.

తాజాగా ప్రపంచంలో కరోనా పాజిటివ్ 6లక్షలకు పైగా నమోదయ్యాయి. 27వేల మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. తాజాగా కరోనా అగ్రరాజ్యాన్ని బెంబెలెత్తిస్తుంది. అమెరికాలో ఏకంగా లక్షకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. దీంతో కరోనా కట్టడికి ట్రంప్ సర్కార్ చర్యలు చేపట్టింది. అదేవిధంగా ఇటలీ, స్పెయిన్ దేశాలు కరోనా దాటికి విలవిలలాడిపోతున్నాయి. భారత్ లోనూ కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది.

కరోనా వైరస్ పేద, ధనిక అనే తేడా లేకుండా అందరినీ కబళిస్తుంది. దీంతో ప్రజలంతా స్వీయ నియంత్రణ పాటించాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయి. స్వీయనియంత్రణ పాటించడం ద్వారానే కరోనాను కట్టడి చేయగలగమని చెబుతున్నాయి.

అనుకున్న టైమ్ కే రానున్న ‘వకీల్ సాబ్’

pawan

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెల్సిందే. రెండేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న పవన్ కల్యాణ్ బాలీవుడ్ మూవీ ‘పింక్’ తెలుగు రీమేక్లో నటిస్తున్నారు. ఈ మూవీని దిల్ రాజు, శ్రీదేవి భర్త బోనికపూర్ భారీ బడ్జెట్లో నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ రామోజీ ఫిల్మీ సిటీ ఇటీవల శరవేగంగా జరుపుకుంది. అయితే దేశంలో కరోనా ఎంట్రీతో సినిమా షూటింగ్ లన్నీ వాయిదా పడ్డాయి. దీంతో ‘వకీల్ సాబ్’ మూవీ కూడా వాయిదా పడింది. అయితే అప్పటికే ‘వకీల్ సాబ్’ 80శాతం షూటింగ్ కాంప్లీట్ చేసుంది.

కరోనా వైరస్ వల్ల వచ్చిన గ్యాప్ ను కూడా ‘వకీల్ సాబ్’ సద్వినియోగం చేసుకునే పనిలో పడింది. దీనిలో భాగంగా ‘వకీల్ సాబ్’ వర్క్ ప్రమ్ చేపట్టింది. తాజాగా ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఇప్ప‌టివ‌ర‌కు పూర్త‌యిన సినిమా ఎడిటింగ్ చూసి డ‌బ్బింగ్ చెబుతున్నట్లు తెల్సింది. పవన్ కల్యాణ్ ఓవైపు కరోనాపై పోరాడుతూనే మరోవైపు ‘వకీల్ సాబ్’ మూవీ పనులను ఇంటి నుంచే చేస్తుండటం గమనార్హం. పవన్ చేస్తున్న పని ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

‘వకీల్ సాబ్’ మూవీకి శ్రీరామ్ వేణు ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో పవన్ సరసన లావణ్య త్రిపాఠి ఖరారైనట్లు తెలుస్తోంది. నివేథా థామస్, అంజలి, అనన్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. లాక్డౌన్ ఎత్తివేయ‌గానే సినిమాలోని మిగిలిన షూటింగ్ త్వ‌ర‌గా పూర్తి చేసి అనుకున్న టైమ్‌లో విడుద‌ల చేయాలని చిత్రబృందం భావిస్తుంది. పరిస్థితులు అన్ని అనుకూలిస్తే మూవీని మే15న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇళ్లకే పరిమితమైన టీడీపీ ఆవిర్భావ దినోత్సవం

తెలుగుదేశం పార్టీ 38వ ఆవిర్భావ దినోత్సవం కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ అమలులో ఉన్నందున ఇళ్లకే పరిమితం అయ్యింది. పార్టీ ఆవిర్భావం అయినప్పటి నుంచి ఈ విధంగా ఎన్నడూ జరగలేదని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ హైదరాబాద్ లోని వారి నివాసంలో పార్టీ వ్యస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ జెండా ఆవిష్కరించి ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వారి వారి ఇళ్ల వద్దే పార్టీ జెండా ఆవిష్కరించి ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవాలని పిలుపునిచ్చారు. విజయవాడలో రూరల్ మండలం గొల్లపూడి గ్రామంలో తన నివాసంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. గ్రామంలోని వన్ సెంటర్లలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి ఆయన ఒక్కరే వెళ్లి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఇతర జిల్లాల్లో ఆయా జిల్లాల పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రులు, ఇతర ముఖ్యనాయకులు వారి వారి ఇళ్ళవద్దే పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. కరోనా ప్రభావంతో పార్టీ ఆవిర్భావ దినోత్సవం బహిరంగంగా భారీ స్థాయిలో నిర్వహించలేక పోవడం నిరాశకు గురవుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఇంతకు మించి మరో మార్గం కనిపించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఐసోలేషన్ లో ఎమ్మెల్యే ముస్తఫా కుటుంబం

గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా తో పాటు కుటుంబ సభ్యులు, సిబ్బంది మొత్తం 15 మందిని కాటూరి మెడికల్ కాలేజీ ఐసోలేషన్ వార్డ్ కి అధికారులు తరలించారు. గుంటూరు డి.ఎం అండ్ హెచ్.ఓ యాస్మిన్ కాటూరి మెడికల్ కాలేజ్ చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. గుంటూరు ప్రభుత్వ వైద్యశాల వైద్య బృందం వీరికి వైద్య సేవలు అందిస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే ఎమ్మెల్యే ముస్తఫా బావమరిది, పొగాకు వ్యాపారస్తుడు సుభాని ఇటీవల ఢిల్లీ వెళ్లి వచ్చారు. అనంతరం ఈ నెల 22వ తేదీన జనతా కర్ఫ్యూ నిర్వహించిన రోజున ఆయన విందు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విందులో ఎమ్మెల్యే ముస్తఫా తో పాటు మరో 200 వరకు పాల్గొన్నట్లు సమాచారం. అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న సుభానిని ఆసుపత్రికి తరలించి పరీక్షలు నిర్వహించారు. పరీక్షలు పూర్తయిన అనంతరం పాజిటివ్ అని తేలడంతో ఐసోలేషన్ లో ఉంచి చేస్తున్నారు. ఎమ్మెల్యే ముస్తఫా, ఆయన కుటుంబ సభ్యులకు కరోనా లక్షణాలు కనిపించడంతో శనివారం నగర శివారులో ఉన్న కాటూరి మెడికల్ కాలేజీకి తరలించి ఐసోలేషన్ లో ఉంచారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా అధికార పక్షానికి చెందిన ఎమ్మెల్యే కు కరోనా వైరస్ బారినపడటం చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే ముస్తఫా బావమరిది సుభాని ఇచ్చిన విందుకు హాజరైన వారందరికీ ఇప్పుడు భయాందోళన పట్టుకుంది.

మద్యం షాపులు తెరవాలంటున్న బాలీవుడ్ నటుడు!

దేశంలో కరోనా మహమ్మరి విజృంభిస్తుండటంతో రోజురోజుకు కోవిడ్-19పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కొన్నిరోజుల క్రితం కేంద్రం లాక్డౌన్ అమలు చేస్తుంది. దీంతో ప్రతీఒక్కరూ ఇళ్లకే పరిమితమయ్యారు. లాక్డౌన్ అమలుతో ప్రజా రవాణ స్తంభించిపోయింది. నిత్యావసరులకు అందుబాటులో లేకుండా పోయాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉండే మద్యంప్రియులకు మద్యం దొరకడంలేదని ఆత్మహత్యలకు పాల్పడున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి.

దీంతో మద్యంప్రియులకు అండగా బాలీవుడ్ సీనియర్ నటుడు రిషీ కపూర్ నిలిచారు. రోజులో రెండు గంట‌లైనా మద్యం షాపులు తెర‌వాల‌ని కోరుతున్న మద్యంప్రియులకు ఆయన మద్దతు పలికారు. ప్ర‌తిరోజూ సాయంత్రం లిక్క‌ర్ షాపులు తెర‌వాలంటూ రిషికపూర్ ప్ర‌భుత్వాన్ని కోరారు. ప్రభుత్వానికి ఆయన ట్వీటర్లో పలు సూచనలు చేశారు. లైసెన్స్ ఉన్న మద్యం దుకాణాలను కొంతకాలం సాయంత్ర వేళల్లో తెరిస్తే బావుంటుందని.. దీనిని ప్రజలు తప్పుగా అర్థం చేసుకుని తనను తిట్టొద్దని కోరారు.

కరోనా కట్టడికి ప్రభుత్వాలకు ఎక్సైజ్ శాఖ నుంచి డబ్బులు అవసరమని అన్నారు. అంతేకాకుండా లాక్డౌన్ కారణంగా ప్రజల్లో ఓ రకమైన అనిశ్చితి, నిరాశ నెలకొంటుందని తెలిపారు. ఈ సమయంలో మనిషికి మద్యం అవసరముంటుందని పేర్కొన్నారు. కనీసం బ్లాక్‌లో అయినా మ‌ద్యం అమ్మే ఏర్పాటు చేయడంటూ మద్యంప్రియులకు ఆయన వత్తాసు పలికారు. అయితే రిషికపూర్ విన్నపంపై ప్రభుత్వం ఏమేరకు స్పందిస్తుందో వేచి చూడాల్సిందే..

అక్షయ్ భారీ విరాళంపై ట్వింకిల్ ఖన్నా ట్వీట్

కరోనా కట్టడి కేంద్రం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ అభినందించారు. కరోనా నివారణకు తనవంతు సాయంగా పీఎం సహాయనిధికి రూ.25కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించిన సంగతి తెల్సిందే. దీంతో అక్షయ్ కుమార్ పై పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే పెద్దమొత్తంలో భారీ విరాళం ప్రకటించడంపై అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా ట్వీటర్లో తన స్పందనను తెలియజేశారు.

కరోనా కట్టడి కోసం తన భర్త రూ.25 కోట్ల భారీ విరాళం ఇచ్చి తనను ఎంతో గర్వపడేలా చేశారని పేర్కొంది. అయితే ఇంత పెద్ద మొత్తంలో విరాళం ప్రకటించే ముందు నేను కూడా ఒకసారి ఆలోచించుకోమని సూచించినట్లు తెలిపింది. మనకు కూడా కొంత మనీ అవసరం కదా.. ఇంత పెద్ద మొత్తం ఇస్తే ఎలా అని అన్నానని చెప్పింది. దానికి అక్షయ్ స్పందిస్తూ ‘నేను నా కెరీర్ ప్రారంభించినప్పుడు నా దగ్గర ఏమీ లేదు.. ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం ఎవరో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని.. ఇలాంటి పరిస్థితులలో ఏమీ లేని వారి కోసం ఏదైనా సాయం చేయకుండా ఎలా ఉండగలను’ అంటూ సమాధానం ఇచ్చారని ట్వింకిల్ ఖన్నా తన ట్వీట్‌లో తెలిపారు.

కరోనా నివారణకు ఇంత మొత్తంలో భారీ విరాళం ప్రకటించిన హీరోగా అక్షయ్ కుమార్ టాప్ లో నిలిచారు. కరోనా నివారణకు టాలీవుడ్ సెలబెట్రీలు ముందుకురాగా బాలీవుడ్ నుంచి ఒక్కరు కూడా స్పందించకపోవడంతో పలు విమర్శలకు తావిచ్చింది. అయితే బాలీవుడ్ నుంచి స్పందించిన అక్షయ్ కుమార్ ఏకంగా రూ.25కోట్ల భారీ విరాళం ప్రకటించి ఆశ్చర్యానికి గురిచేశాడు. కష్టాల్లో ఉన్న ప్రజలకు ఎల్లప్పుడు తాను అండగా ఉంటానని అక్షయ్ కుమార్ చాటిచెప్పాడు. అక్షయ్ కుమార్ దాతృత్వానికి ప్రతీఒక్కరు ఆయనను అభినందిస్తున్నారు.

కరోనా కట్టడికి ప్రధాని నిధి ‘పీఎం-కేర్స్‌’

కోవిడ్‌-19ని కట్టడి చేసేందుకు అవసరమైన నిధులు సేకరణ కోసం.. ప్రధానమంత్రి పౌర సహాయ, ఉపశమన అత్యవసర నిధి (పీఎం-కేర్స్‌)ని ఏర్పాటు చేశారు. దీనికి నిధులు ఇవ్వడం ద్వారా కరోనా మహమ్మారిపై పోరాటానికి చేయూత ఇవ్వాలని దేశ ప్రజలకు ఆయన పిలుపిచ్చారు.

కోవిద్-19పై పోరాటానికి అండగా నిలబడాలనుకునే వారు పీఎం-కేర్స్‌కు విరాళాలు అందించాలని కోరారు. ఆరోగ్యకర దేశాన్ని తయారు చేసేందుకు ఈ నిధిని వినియోగిస్తామని ప్రధాని మోదీ తెలిపారు.

కరోనా లాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొ ప్రజలను ఆదుకోవడానికి ఈ నిధిని ఉపయోగిస్తామని చెప్పారు. www.pmindia.gov.in సైట్‌లో విరాళాలు చెల్లించాలని ప్రధాని సూచించారు.

తక్కువ విరాళాలను కూడా తీసుకుంటా డానికి, ప్రజలను కాపాడే పరిశోధనలను ప్రోత్సహించేందుకు ఈ నిధులను వినియోగిస్తామని ప్రధాని తెలిపారు. ఆరోగ్యకరమైన, శ్రేయస్కరమైన దేశాన్ని భవిష్యత్తు తరాలకు అందించే సమయం ఆసన్నమైందని ప్రధాని పిలుపునిచ్చారు.

పీఎం-కేర్స్‌ ట్రస్ట్‌కు ప్రధానమంత్రి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ట్రస్ట్‌ సభ్యుల్లో హోం, రక్షణ, ఆర్థిక మంత్రులు కూడా ఉంటారు.

కాగా, బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ పీఎం కేర్స్‌కు తొలివిరాళం రూ.25 కోట్లు ప్రకటించారు. ప్రస్తుతం దేశ ప్రజల ప్రాణాల రక్షణే తనకు ముఖ్యమని ఆయన ట్వీట్‌ చేశారు. అక్షయ్‌ భార్య ట్వింకిల్‌ ఖన్నా తన భర్తను కొనియాడారు.

ఇంత పెద్ద మొత్తం ఎలా ఇస్తావని తాను ప్రశ్నించగా.. ‘మొదట్లో ఏమీ లేని నేను ప్రస్తుతం ఈ స్థితిలో ఉన్నాను. ఏమీ లేని వారి కోసం నేను ఏమీ చేయకుండా ఎలా ఉండగలను’ అని అక్షయ్‌ చెప్పారని, ఆయనను చూస్తే గర్వంగా ఉన్నదని ఆమె ట్వీట్‌ చేశారు.

భారత్ లో 1,000కి దాటిన కరోనా కేసులు..

దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. రోజురోజుకు వందలాది కేసులు నమోదవుతున్నాయి.. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1029 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.24 మంది చనిపోయారు. 85 మంది కోలుకున్నారు.

అత్యధికంగా మహారాష్ట్రలో 186, కేరళలో 182 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కర్ణాటక 81, తెలంగాణ 67, ఉత్తరప్రదేశ్ 65,గుజరాత్ 55, రాజస్థాన్ 54, ఢిల్లీ 49 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక అత్యధికంగా మహారాష్ట్రలో 6 మంది కరోనాతో చనిపోయారు.ఆ తర్వాత గుజరాత్ లో 4, కర్ణాటకలో 3, మధ్యప్రదేశ్ 2 మరణాలు నమోదయ్యాయి. ఇక తెలంగాణలో కరోనాతో ఒకరు చనిపోయారు.

కాగా, కరోనా అమెరికాకు, యూరప్లకు చుక్కలు చూపిస్తోంది. ల‌‌క్ష కేసులు దాటిన మొదటి దేశంగా అమెరికా నిలిస్తే, 3 లక్షల‌‌కు పైగా కేసుల‌‌తో ప్రపంచంలో సగం కేసులు ఐరోపాకు పరిమిత కావడం గమనార్హం. ఇట‌‌లీ, స్పెయిన్‌‌లోనూ ప‌‌రిస్థితి మ‌‌రింత దిగ‌‌జారిపోతోంది. ఇట‌‌లీలో ఒక్కరోజే వెయ్యి మంది, స్పెయిన్‌‌లో 837 మంది బ‌‌ల‌‌య్యారు. ఫ్రాన్స్‌‌, ఇరాన్‌‌‌‌లోనూ ప‌‌రిస్థితి ఏమంత బాగాలేదు.

ప్రపంచ‌‌వ్యాప్తంగా 6,63,431 మంది క‌‌రోనాకు బాధితుల‌‌య్యారు. చ‌‌నిపోయిన వారి సంఖ్య 30 వేలు దాటింది. 30,865 మంది ఇప్పటిదాకా క‌‌రోనాకు బ‌‌ల‌‌య్యారు. 1,41,953 మంది కోలుకున్నారు. స్పెయిన్‌‌లో ఒక్కరోజే 552 మంది చ‌‌నిపోయారు. బ్రిట‌‌న్‌‌లో మ‌‌ర‌‌ణాలు వెయ్యి మార్కును దాటాయి. 1,019 మంది చ‌‌నిపోయారు.

ఇరాన్ లో గత 24 గంటల్లో 3 వేలకు పైగా కొత్త కేసులొచ్చాయని అక్కడి అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు 2,517 మంది చనిపోయారని, 3,200 మంది పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ఆఫ్రికా ఖండంలోనూ మెల్లమెల్లగా వైరస్‌‌‌‌‌‌‌‌ ఉధృతి పెరుగుతోంది.

దక్షిణాఫ్రికాలో తొలి కరోనా మరణం నమోదవడంతో ఆ దేశం శుక్రవారం నుంచి మూడు వారాల లాక్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌ ప్రకటించింది. కెన్యాలో కర్ఫ్యూ హింసాత్మకమైంది. ఫెర్రీలో ప్రయాణిస్తున్న వారిపై పోలీసులు టియర్‌‌‌‌‌‌‌‌ గ్యాస్‌‌‌‌‌‌‌‌ ప్రయోగించారు.

‘నన్ను క్షమించండి. కొంత మంది చనిపోతారు.. చనిపోతారు. అదే జీవితం’ అంటూ బ్రెజిల్‌‌‌‌‌‌‌‌ అధ్యక్షుడు జెయిర్‌‌‌‌‌‌‌‌ బొల్సోనారో వివాదాస్పద వాఖ్యలు చేశారు. కరోనా వైరస్‌‌‌‌‌‌‌‌ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవడానికి చర్యలు తీసుకోవడం లేదంటూ బొల్సోనారోపై అక్కడి రాష్ట్రాల గవర్నర్లు విమర్శలు చేస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకే ఆయన చర్యలు తీసుకుంటున్నారని మండిపడుతున్నారు.