కరోనా కట్టడికి లాక్ డౌన్ మాత్రమే మార్గమని ఒక వంక ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేస్తుండగా, దేశంలో వైరస్ సోకినా వారి సంఖ్యా కూడా పెరుగుతూ ఉండగా ఎక్కడికక్కడ చిక్కుకు పోయిన లక్షలాది మంత్రి వలస కార్మికులు పల్లెబాట పడుతూ ఉండడంతో ప్రభుత్వ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. లాక్ డౌన్ ఉద్దేశం నీరుకారి పోతుందని భయపడుతున్నాయి.
ఎక్కడికక్కడే వారు ఉండేటట్లు చేయడం కోసం వారికి తక్షణమే సహాయ శిబిరాలను ఏర్పాటుచేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ సూచించింది. పైగా వారందరికీ తాత్కాలిక వసతి, భోజన సదుపాయం కల్పించడంతోపాటు వైద్య పరీక్షలు నిర్వహించాలని కూడా చెప్పింది.
పైగా, అందుకోసం ఇందుకోసం ఎస్డీఆర్‌ఎఫ్ (రాష్ట్ర విపత్తు సహాయ నిధి) నిధులుగా ఉన్న రూ 29,000 కోట్లను ఉపయోగించుకోమని కూడా చెప్పింది. అయినా పట్టణాల్లో పని కోసం వచ్చినవారంతా.. ఇప్పుడు సొంత ఊళ్లకు బారులు తీరుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీ నుంచి యూపీ, బీహార్, మధ్యప్రదేశ్ వెళ్లే వలస కార్మికుల పరిస్థితి దయనీయంగా ఉన్నది. యమునా ఎక్స్‌ప్రెస్‌వే వద్ద జనం సునామీలా విరుచుకుపడుతున్నారు.
ఇక అక్కడ సామాజిక దూరం పాటించేవారే కనిపించడం లేదు. లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో జనం జీవనోపాధి కోల్పోవడంతో ఎలా బ్రతుకాలో దిక్కుతోచని స్థితిలో వారంతా పుట్టినూళ్లకు వెళ్తున్నారు. కరోనా సంక్రమణను అడ్డుకోవాలంటే సామాజిక దూరం పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నా వలస కూలీల వ్యథలు మరోలా ఉన్నాయి.
వారిని ఇంటికి చేర్చేవారు లేరు. దాదాపు వంద కిలోమీటర్ల దూరం కాలిబాటన నడిచేందుకు కొందరు సాహసం చేస్తున్నారు. లక్షలాది సంఖ్యలో ఉన్న వలస కూలీలను తరలించేందుకు యుపి ప్రభుత్వం సుమారు వెయ్యి బస్సులు ఏర్పాటు చేసింది. అయినా ఆ ఏర్పాట్లు మాత్రం సరిపోవడం లేదు. ఆగ్రా, అలీఘడ్, లక్నో, కాన్పూర్, బీహార్ వెళ్లాల్సిన మజ్దూరీలు బిక్కుబిక్కుమంటున్నారు. బస్సులు ఎన్ని ఉన్నా.. జనం అంతకన్నా ఎక్కువ ఉన్నారు.
ఎంతో కష్టపడి కూలీలంతా స్వంత ఊళ్లకు వెళ్లినా.. అక్కడ వైరస్ కేసులు ఎక్కువ అయితే అదో పెద్ద సమస్యగా మారుతుందని ప్రభుత్వ వర్గాలు ఖంగారు పడుతున్నాయి. భారీ సంఖ్యలో వెళ్తున్న వీరంతా గ్రామాలకే పరిమితంకానున్నారు. కానీ గ్రామాల్లో వైద్య సదుపాయాలు ఏమీ ఉండవు. ఒకవేళ ఇంత సంఖ్యలో తరలివెళ్తున్న ఈ కూలీలు వైరస్‌ను తమ ఊళ్లకు మోసుకువెళ్తే పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నారు.
2017 ఆర్థిక సర్వే ప్రకారం దేశవ్యాప్తంగా గత అయిదేళ్లలో సుమారు 14 కోట్ల జనాభా వలస వెళ్లింది. అంటే వాళ్లంతా జీవనోపాధి కోసం రాష్ట్రాలను దాటారు. ఆ జాబితాలో యుపి, బీహార్ వాళ్లే ఎక్కువ ఉన్నారు. కానీ వీరంతా తమ వెంట కరోనాను తీసుకువెళ్తున్నారేమో అన్న సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. వీరిని ఎట్లా కట్టడి చేయాలో రాష్ట్ర ప్రభుత్వాలకు సహితం దిక్కు తోచడం లేదు.