Home Blog Page 8563

ప్రతి వరి గింజ కొనుగోలుకు కేసీఆర్ భరోసా

కరోనా మహమ్మారి సమయంలో రైతులు తమ ఉత్పత్తుల అమ్మకం పట్ల ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు భరోసా ఇచ్చారు. ప్రతి వరి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు కోసం పౌరసరఫరాల సంస్థకు మార్కెఫెట్ కు ప్రభుత్వం సుమారు రూ 30,000 కోట్ల మేరకు విడుదల చేసినదాని చెబుతూ ఇంత భారీ మొత్తాన్ని రైతుల కోసం ఉమ్మడి ఏపీలో కూడా ఎన్నడూ కేటాయించలేదని చెప్పారు.

మొక్కజొన్నకు ప్రస్తుతం గిట్టుబాటు ధర లేదని చెబుతూ అయినా కనీస మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తామని చెప్పారు. అందుకోసం రూ.3,200 కోట్లు మార్క్‌ఫెడ్‌కు మంజూరు చేశామని చెబుతూ మొక్కజొన్న ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని స్పష్టం చెప్పారు.

ఈ ఏడు 40 లక్షల ఎకరాల్లో వరి పంట, 14 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సిద్ధంగా ఉందని చెబుతూ రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ తొందర పడకూడదని కోరారు. ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో పంట పండుతుంది కాబట్టి క్రమబద్ధతిలో రైతులు ధాన్యాన్ని అమ్ముకోవాలని సూచించారు. ప్రభుత్వం కూపన్‌లు ఇచ్చి , వాటి ప్రకారమే కొనుగోలు చేస్తుందని చెప్పారు.

కూపన్‌ల పంపిణీలో వ్యవసాయ అధికారులది ప్రధాన పాత్ర అని చెబుతూ ఇప్పటికే సమీక్ష జరిపి బాధ్యతలు అప్పగించామని తెలిపారు. కూపన్లలో ఉన్న తేదీల ప్రకారమే విక్రయాలు జరుగుతాయని స్పష్టం చేశారు.

చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రాష్ట్ర పౌరసరఫరాల సంస్థకు అందుకోసం రూ 25,000 కోట్లు సమకూర్చామని చెబుతూ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి ఏర్పాట్లు లేవని గుర్తు చేశారు. నెలా 15 రోజుల పాటు ధాన్యం కొనుగోలు చేస్తామని, డబ్బులన్ని ఆన్‌లైన్‌లో బదిలీ చేస్తామని వివరిస్తూ రైతులు సహకరించాలని కోరారు.

ఊరి ధాన్యం ఎలా పోవాలనేది సమీక్షల ద్వారా చర్చించుకోవాలని చెబుతూ బిహార్‌ నుంచి హమాలీలను రప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. అనవసరంగా కొనుగోలు కేంద్రం వద్దకు రావద్దని హితవు చెప్పారు. పంట కోయడానికి రైతులు హార్వెస్టర్లను సిద్ధం చేసుకోవాలని తెలిపారు.

కరోనా దిగ్బంధనం సమయంలో గ్రామాలకు ముళ్ల కంచెలు వేయడం మంచిదే కానీ, ఎవరినీ రానీయమంటే మంచిది కాదని హితవు చెప్పారు. రేషన్‌ బియ్యం లారీలను అడ్డుకోకూడదని సీఎం కేసీఆర్‌ సూచించారు.

సరిహద్దులు మూశారు.. కనీసం కడుపు నింపండి!

కరోనాని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న వేళ వలస కార్ముకుల భాధలు వర్ణనాతీతం. రెక్కాడితే కానీ డొక్కాడని పేద ప్రజల పరిస్థితి బహు దయనీయం. వలస వెళ్లిన ప్రాంతంలో పని లేదు సొంతూరికి వెళ్ళాటంటే అధికారుల అడ్డంకులు అనేకం. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో మూలిగే నక్క మీద తాటికాయ పడినట్లయింది. వలస కూలీల ద్వారా కరోనా వైరస్‌ వ్యాప్తి జరగకుండా అడ్డుకోవడం కోసం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, జిల్లాల సరిహద్దులను మూసేయాలని కేంద్రం ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను అతిక్రమిస్తే.. 14 రోజుల పాటు క్వారంటైన్‌ లో ఉంచాలని స్పష్టం చేసింది. అయితే, కేంద్రం కఠినమైన ఆదేశాలను జారీ చేసినప్పటికీ.. ఉపాధి కరువైన వలస కూలీలు మూకుమ్మడిగా నగరాల నుంచి తమ స్వస్థలాలకు కాలినడక సహా తమకు వీలైన అన్ని మార్గాల ద్వారా వెళ్లేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు.

చాలామంది కార్మికులు వారి పని ప్రదేశాల్లో చిక్కుకుపోయి ఆకలితో నకనకలాడుతున్నారు. ఎటువంటి రవాణా లేకపోవడంతో చాలామంది కార్మికులు కడుపు చేతబట్టుకుని వందలాది కిలోమీటర్లు నడిచే తమ స్వస్థలాలకు చేరుకోవడానికి బయలుదేరారు. కొన్ని చోట్ల నిస్సహాయ స్థితిలో కనిపించిన వాహనాల్లో ఎక్కుతున్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో తక్షణమే వాస్తవంగా నెలకొన్న స్థితిగతులపై ప్రభుత్వం దృష్టి సారించాలని మేథావులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అంగన్‌వాడీలు, పంచాయతీ భవనాలు, ప్రభుత్వ స్కూళ్ళు, కాలేజీలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, కమ్యూనిటీ హాళ్ళు, జిల్లా కార్యాలయాలను ప్రభుత్వం ఉపయోగించుకోవాలని వారు కోరారు. ఉచితంగా ఆహారం సరఫరా చేయడం, వైద్య సంరక్షణ అందచేయడం వంటి చర్యలు చేపట్టాలని కోరారు.

Rang De Movie First Look Stills and Posters

మాంసం కోసం మహిళను కొట్టి చంపిన వ్యక్తి

మాంసం కూర వండకపోవడం ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడానికి కారణమయ్యింది. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం లో ఈ సంఘటన చోటు చేసుకుంది. మద్యం సేవించి వ్యక్తి మాంసం కూర వండలేదని ఒక మహిళను కర్రతో కొట్టి చంపాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రంపచోడవరం మండలంలోని సిరిగిందలపాడుకు చెందిన లక్ష్మి జగ్గంపేట మండలంలోని మల్లిశాలలోని ఓ జీడిమామిడి తోటలో కాపలాదారుగా పనిచేస్తోంది.

సోకులగూడెం గ్రామానికి చెందిన తోకల వెంకటేశ్ కూడా అదే తోటలో పనిచేస్తున్నాడు. దీంతో గత కొంతకాలంగా ఇద్దరూ కలిసే ఉంటున్నారు. శనివారం రాత్రి పూటుగా మద్యం సేవించి ఆ మత్తులో ఇంటికి వచ్చిన వెంకటేశ్ ఆదివారం కూడా మాంసం కూర ఎందుకు వండలేదని లక్ష్మితో గొడవ పెట్టుకున్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాట పెరగడంతో వెంకటేశ్ ఆగ్రహంతో ఊగిపోయాడు. పక్కనే ఉన్న కర్ర తీసుకుని లక్ష్మిపై దాడిచేశాడు. తీవ్ర గాయాల పాలైన లక్ష్మి నిన్న ఉదయం మృతి చెందింది. ఆమె కుమారుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు.. మరణాలు

దేశంలో కరోనా మృతుల సంఖ్య ఆదివారం 27కు చేరింది. ఆరు రాష్ట్రాల్లో కరోనా రోగులు కొందరు మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య పెరిగింది. ఇక కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య దేశవ్యాప్తంగా 1024గా నమోదైంది. ఈ వివరాలను ఆదివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది.

తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, కర్నాటకల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఈ వైరస్‌కు బలి అయ్యారని ఉదయం పది గంటల అధికారిక గణాంకాలలో వెల్లడైంది.ఇక కోవిడ్ వైరస్ సోకిన వారి సంఖ్య వేయికి చేరువ కావడం ఆందోళనకర పరిణామంగా మారింది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ సాగుతూ వస్తున్నా మరణాలు, కొత్తగా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు.

కరోనా సోకిన వారిలో 867 మందిని తీవ్రస్థాయి కేటగిరిలో చేర్చారు. కరోనా వచ్చిన వారిలో 86 మందికి నయం అయింది. వారిని డిశ్చార్జ్ చేశారు.ఒక వ్యక్తి పారిపొయ్యాడు.ఇ ప్పుడు తాజాగా నమోదైన మొత్తం 1024 కరోనా కేసులలో 48 మంది విదేశీయులు ఉన్నారు. కేసులలో మహారాష్ట్ర ప్రథమ స్థానంలో ఉంది. ఇక్కడ కేసుల సంఖ్య 186గా నమోదైంది. వీరిలో ముగ్గురు విదేశీయులు ఉన్నారు.

కేరళలో 182 మందికి కరోనా వచ్చింది. వీరిలో ఎనమండుగురు విదేశీయులు ఉన్నారు. మహారాష్ట్రలో మృతుల సంఖ్య 6కు చేరింది. తరువాతి క్రమంలో గుజరాత్‌లో 4, కర్నాటకలో 3, మధ్యప్రదేశ్‌లో 2, ఢిల్లీలో 2, తెలంగాణ, కేరళ, తమిళనాడు, బీహార్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, జమ్మూ కశ్మీర్‌లలో ఒక్కరు చొప్పున మరణించారు. కర్నాటకలో కరోనా సోకిన వారి సంఖ్య 76కు చేరింది.

తెలంగాణలో 66 (వీరిలో పది మంది విదేశీయులు), రాజస్థాన్‌లో 54 (వీరిలో ఇద్దరు విదేశీయులు), ఉత్తరప్రదేశ్‌లో 55 (ఓ విదేశీయుడు), గుజరాత్‌లో 53 (ఓ విదేశీయుడు), తమిళనాడులో 42 (ఆరుగురు విదేశీయులు) ఢిల్లీలో 39 మంది (వీరిలో ఓ విదేశీయుడు), పంజాబ్‌లో 38 , హర్యానాలో 33 (14 మంది విదేశీయులు), మధ్యప్రదేశ్‌లో 30, జమ్మూ కశ్మీర్‌లో 31, పశ్చిమబెంగాల్‌లో 17, ఆంధ్రప్రదేశ్‌లో 14, లడఖ్‌లో 13 మందికి కరోనా సోకిందని అధికారిక వివరాలలో తెలిపారు.

బీహార్‌లో తొమ్మండుగురికి, చండీగఢ్‌లో ఎనమండుగురికి, ఛత్తీస్‌గఢ్‌లో ఆరుగురికి, ఉత్తరాఖండ్‌లో ఆరుగురికి (వీరిలో ఓ విదేశీయుడు), హిమాచల్‌ప్రదేశ్‌లో, ఒడిషాలలో ముగ్గురు చొప్పున కరోనాకు గురయ్యారు. అండమాన్ నికోబార్ దీవులలో తొమ్మిది కేసులు, గోవాలో మూడు కేసులు నమోదు అయ్యాయి. పుదుచ్చేరి, మిజోరం, మణిపూర్‌లో ఒక్కొక్కరు చొప్పున కరోనా బాధితులు అయ్యారు.

మెరికాలో కరోనా మృతుల సంఖ్య 2,300 దాటింది. ప్రపంచంలోనే అత్యధికంగా 1,33,000 కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య మూడు రోజుల్లోనే రెట్టింపైంది. మొత్తం మరణాల్లో పావు భాగం న్యూయార్క్‌ నగరంలోనే సంభవించాయి. ఇటలీ పరిస్థితులే న్యూయార్క్‌లోనూ ఎదురుకావొచ్చని అక్కడి వైద్య నిపుణులు భయాందోళనలు వ్యక్తంచేశారు.

యూరప్‌లో కరోనా మృతుల సంఖ్య 20,000 దాటింది. ఇందులో సగం మరణాలు ఇటలీలోనే (10,779) చోటుచేసుకున్నాయి. ఇటలీ తర్వాత అత్యధికంగా ప్రభావితమైన స్పెయిన్‌లో ఆదివారం ఒక్కరోజే 838 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మృతుల సంఖ్య 6,606కి పెరిగింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను స్పెయిన్‌ మరింత కఠినతరం చేసింది. ఫ్రాన్స్‌లో 2,600 మందికిపైగా మరణించారు. బ్రిటన్‌లో మృతుల సంఖ్య 1200 దాటింది.

కరోనా కోరల్లో చిక్కి యూరప్‌, అమెరికా విలవిల్లాడుతున్నాయి. ఇటలీ, స్పెయిన్‌లలో ఒకే రోజు 800 మందికిపైగా చొప్పున మృత్యువాతపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 33,000 దాటింది. 7 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ప్రపంచంలో దాదాపు మూడింట ఒక వంతు జనా భా దిగ్బంధంలో ఉన్నది. అమెరికాలో కరోనా వ్యాప్తికి కేంద్ర స్థానంగా ఉన్న న్యూయార్క్‌ నగరాన్ని దిగ్బంధించాలని ప్రతిపాదించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. స్థానిక నేతల నుంచి వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గారు.

ఏప్రిల్ 7 తర్వాత కరోనా ఫ్రీగా తెలంగాణ : కేసీఆర్

తెలంగాణలో కరోనా కట్టడికి ప్రభుత్వం అన్నివిధలా చర్యలు తీసుకుందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఆదివారం సాయంత్రం కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే ప్రభుత్వం కరోనా నివారణకు ప్రభుత్వం అన్నిరకాల చర్యలు చేపట్టిందని తెలిపారు. ఆదివారం నాటికి తెలంగాణలో 70మంది కరోనా పాజిటివ్ కేులు నమోదైనట్లు పేర్కొన్నారు. ఇందులో 11మంది కోలుకున్నారని వీరికి టెస్టుల్లో నెగిటివ్ రిపోర్టు వచ్చిందని తెలిపారు. ఏప్రిల్ 7నాటికి తెలంగాణ కరోనా ఫ్రీ రాష్ట్రంగా మారనుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

ప్రాణాంతక కరోనా వైరస్ పై సాగిస్తున్న పోరులో ప్రభుత్వం గణనీయమైన ఫలితాలని సాధిస్తుందని తెలిపారు. కరోనా నుంచి కోలుకున్న వారిని సోమవారం డిశ్చార్జి చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. తెలంగాణలో 70కరోనా కేసులు నమోదుకాగా ఒక వ్యక్తి డిశ్చార్జి అయినట్లు తెలిపారు. మరో 11మందికి నెగెటివ్ రావడం సంతోషంగా ఉందన్నారు. దీంతో బాధితుల సంఖ్య 58మందికి చేరుతుందన్నారు. వీరికి మరోసారి టెస్టులు నిర్వహించి డిశ్చార్జి చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా 25,937మంది కారంటైన్లో ఉన్నారని తెలిపారు. వీరికి 14 రోజుల పరిశీలన పూర్తయ్యాక వారిలో కరోనా లక్షణాలేవీ లేనట్లయితే వారినికూడా డిశ్చార్జ్ చేస్తామన్నారు.

మార్చి 30నాటికి 1,899మంది, 31నాటికి 1,450మందిని.. ఇలా దశలవారీగా కరోనా నుంచి కోలుకున్న వారిని డిశ్చార్జ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఏప్రిల్ 7నాటికి రాష్ట్రంలోని పాజిటివ్ కేసులన్నీ నెగెటివ్ గా మారతాయనే ఆశాభావాన్ని కేసీఆర్ వ్యక్తం చేశారు. మొత్తంగా ఏప్రిల్ 7తర్వాత రాష్ట్రంలో ఒక్కరంటే ఒక్కరు కూడా కరోనా బాధితులు ఉండరని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కరోనా కట్టడికి ప్రభుత్వానికి ప్రజలందిస్తున్న సహకారం మరువలేనదని స్పష్టం చేశారు. తెలంగాణలో ఏప్రిల్ 15వరకు లాక్డౌన్ కొనసాగుతుందని తెలిపారు. కరోనా నివారణకు స్వీయనియంత్రణే శ్రీరామరక్ష అన్నారు. సామాజిక దూరం పాటిస్తూ కరోనాను ఎదుర్కోవాలని కేసీఆర్ స్పష్టం చేశారు.

కరోనాపై పోరుకు సిద్దమైన ఇస్రో!

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇస్రో ముందుకు వచ్చింది. షార్ లో ప్రస్తుతానికి వాహక నౌకల తయారీ నిలిపివేసి, కరోనాపై పోరాటంలో తమ వంతు సహకారాన్ని అందిస్తామని ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధన సంస్థ) ప్రకటించింది. ఇందులో భాగంగా అత్యాధునిక వైద్య పరికరాలను తయారు చేస్తామని పేర్కొంది. సులువుగా ఆపరేట్ చేయగల వెంటిలేటర్లు, ఆక్సిజన్ కెనిస్టర్లతో పాటు మాస్కుల తయారీని ప్రారంభిస్తామని వెల్లడించింది. కేరళలోని తిరువనంతపురంలో ఉన్న విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఉద్యోగులు వీటిని డిజైన్ చేస్తారని, ఆపై తయారీ బాధ్యతలను పరిశ్రమలకు అప్పగిస్తామని వెల్లడించింది.

ఇప్పటికే ఈ సెంటర్ లో 1000 లీటర్ల శానిటైజర్ ను తయారు చేశామని, మాస్క్ ల తయారీలో ఉద్యోగులు పాలు పంచుకుంటున్నారని ఇస్రో ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఇస్రో ఉద్యోగులు ఇంటి నుంచి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నారని, అయితే, ప్రస్తుతానికి వాహక నౌకల తయారీని నిలిపి వేశామని తెలిపారు. శ్రీహరికోటలోని షార్ కేంద్రంలో పీఎస్ఎల్వీ సీ-49, సీ-50 వాహక నౌకల అనుసంధాన పనులను కూడా ప్రస్తుతానికి నిలిపివేశామని వెల్లడించారు. ఇప్పటికే ఎన్నో ప్రయోగాలలో విజయం సాధించిన ఇస్రో కరోనా పై పోరాటంలో ప్రజలకు తమవంతు సాయం అందించడం అభినందించదగ్గ విషయం.

జర్మనీలో కరోనా విజృంభణ.. ఆర్థిక మంత్రి ఆత్మహత్య

ప్రస్తుతం ప్రపంచాన్ని బెంబెలెత్తిస్తున్న మహమ్మరి కరోనా(కోవిడ్-19). ఈ వైరస్ బారినపడిన ప్రజలు మృత్యువాతపడుతున్న సంఘటనలు ఇప్పటివరకు చూశాం. అయితే ఈ మహమ్మరి పరోక్షంగా ప్రజల ప్రాణాలను బలగొనడం మొదలైట్టింది. జర్మనీ దేశంలో కరోనా ధాటికి ఆర్థిక వ్యవస్థ అతలాకూతలమైంది. దీనిని తట్టుకోలేక జర్మనీలోని హెస్సీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి థామస్ షాఫర్(54) ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది.

చైనాలోని వూహాన్లో పుట్టిన కరోనా(కోవిడ్-19) వైరస్ క్రమంగా ప్రపంచ దేశాలకు పాకింది. కరోనా దాటికి అమెరికా, ఇటలీ, చైనా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ దేశాలు అతలాకుతులం అవుతున్నాయి. ఇప్పటికే ఆయా దేశాలు లాక్డౌన్ చర్యలు చేపట్టాయి. దీంతో ఆయా దేశాల్లో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. దీని ప్రభావంతో ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. కరోనా వైరస్ ప్రభావం చైనాయేతర దేశాల్లోనే ఎక్కువగా ఉంటుంది. కరోనా దాటికి ఇటలీ దేశం శవాలదిబ్బను తలపిస్తోంది. అదేవిధంగా స్పెయిన్ దేశంలో కరోనా ప్రభావం ఎక్కువగానే నమోదవుతుంది. ఇటీవలే స్పెయిన్ యువరాణి మరియా థెరిసా కరోనాతో మృతిచెందిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

యూకే లోనూ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. కరోనాతో ఇక్కడి రాజకుటుంబాలు బెంబెలెత్తిపోతున్నాయి. తాజాగా బ్రిటన్ యువరాజు చార్లెస్ కరోనా సోకడంతో ప్రస్తుతం ఐసోలేషన్లో చికిత్స చేయించుకుంటున్నారు. ఇక జర్మనీలో కరోనా ప్రభావంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకోలేని స్థితిలోకి చేరుకుంది. ఆర్థిక మాంద్యం పరిస్థితులకు దారితీయడంతో ఆ దేశ ఆర్థిక మంత్రి బలవన్మరణానికి పాల్పడ్డాడు. శనివారం రైలు పట్టలపై నిర్జీవంగా కనిపించారు.

షాఫర్ జర్మనీలోని హెస్సీ రాష్ట్ర ఆర్థిక మంత్రి. ఆయన గత పదేళ్లుగా ఆర్థికమంత్రిగా సేవలందిస్తున్నారు. ప్రముఖ బ్యాంకుల కేంద్ర స్థానమైన హెస్సీ కరోనా దాటికి అతలాకుతలమైది. దీంతో భవిష్యత్ పరిస్థితిని అంచనా వేసిన షాఫర్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

కరోనాతో పోరాడుతున్న సిబ్బందికి రూ. 50 లక్షల బీమా

కొవిడ్-19 వైరస్ తో పోరాడుతున్న ఆరోగ్య సిబ్బందికి రూ.50 లక్షల బీమా వర్తింపచేస్తున్నట్లు రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవాహరెడ్డి తెలిపారు. ఈ భీమా 90 రోజులకు వర్తిస్తుందన్నారు. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ కింద బీమా చెల్లించడం జరుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో వైద్యులు మొదలుకొని వర్కర్లందరికీ బీమా పథకం వర్తిస్తుందని తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రులు , ఎయిమ్స్, సిజిహెచ్ఎస్ ,కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బంది కీ వర్తింపు చేస్తున్నట్లు చెప్పారు. జాతీయ విపత్తు నివారణా నిధి (ఏన్డీఆర్ఎఫ్) నుండి బీమా సొమ్మును చెల్లిస్తామని తెలిపారు. ఇప్పటికే బీమా పాలసీలు ఉన్నవారికీ వర్తిస్తుందన్నారు.

ఇతర బీమా పథకాలకంటే ఎక్కువగా కవరేజీ ఈ బీమా పథకం ప్రత్యేకతగా చెప్పారు. రాష్ట్రంలో కరోనా వైరస్ బారిన పడిన వారికి వైద్యులు, ఇతర సిబ్బంది ప్రాణాలు ఫణంగా పెట్టి వైద్య సేవలు అందిస్తున్నారు. సమయాన్ని సైతం లెక్కచేయకుండా పని చేస్తున్నారు. వీరి సేవలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ బీమా పధకాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో పనిచేస్తున్న వైద్యులు, పారమెడికల్ సిబ్బంది ఈ పధకాన్ని అమలు చేస్తున్నందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఏప్రిల్ 1 నుంచి ఆంధ్రాబ్యాంక్ సహా 5 బ్యాంకులు కనుమరుగు!

ఆంధ్ర బ్యాంక్ సహా మరో ఐదు బ్యాంకుల విలీనానికి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. దీంతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గతంలో ప్రకటించిన బ్యాంకుల విలీనం ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తుంది. దీంతో బ్యాంకుల సంఖ్య 10 నుంచి 4కు తగ్గుతుంది. ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలను పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో విలీనం చేస్తారు. సిండికేట్ బ్యాంక్ కెనరా బ్యాంక్‌లోను, ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకులు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోను, అలహాబాద్ బ్యాంక్ కూడా ఇండియన్ బ్యాంక్‌లోను విలీనానికి రంగం సిద్ధం చేశారు. ఏప్రిల్ 1 నుంచి విలీనమైన బ్యాంకుల బ్రాంచులు అన్నీ మెయిన్ బ్యాంక్ బ్రాంచిలుగా మారిపోనున్నాయి. ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ బ్రాంచిలు పీఎన్‌బీ బ్రాంచులుగా, సిండికేట్ బ్యాంక్ బ్రాంచిలు కెనరా బ్యాంక్ బ్రాంచిలుగా, ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ బ్రాంచిలు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచిలుగా రూపాంతరం చెందుతాయి. అలాగే అలహాబాద్ బ్యాంక్ బ్రాంచిలు ఇండియన్ బ్యాంక్ బ్రాంచిలుగా పనిచేస్తాయి.

విలీనం తర్వాత దేశంలో ప్రభుత్వ రంగానికి సంబంధించి 7 పెద్ద బ్యాంకులు, 5 చిన్న బ్యాంకులు మాత్రమే మిగులుతాయి. 2017లో ప్రభుత్వ రంగంలో దాదాపు 27 బ్యాంకులు ఉండేవి. విలీనం తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ రెండో అతిపెద్ద బ్యాంక్‌గా అవతరిస్తుంది. ఎస్‌బీఐ అతిపెద్ద బ్యాంక్‌గా కొనసాగుతోంది. ఇక బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) మూడో అతిపెద్ద బ్యాంక్ అవుతుంది. దీని తర్వాతి స్థానంలో కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్లు ఉంటాయి. ఆంధ్ర బ్యాంక్ విలీనాన్ని కేంద్రం ప్రకటించిన వెంటనే తెలుగు ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం విలీనం తరువాత అయిన ఆంధ్ర బ్యాంకు పేరుతో కొనసాగించాలని కోరారు. కేంద్రం ఈ విన్నపాలను పరిగణనలోకి తీసుకోలేదు. యూనియన్ బ్యాంకులో ఆంధ్ర బ్యాంకును విలీనం చేసి మొత్తాన్ని యూనియన్ బ్యాంకుగా మార్చనున్నారు.

కరోనాపై గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి కేటీఆర్

దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా దేశంలో 1,099 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 27మంది మృతిచెందాడు. 90మంది రికవరీ అయినట్లు తెలుస్తోంది. అదేవిధంగా తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 70కి చేరింది. కాగా ఇదులో 11మందికి తాజా రిపోర్టులో నెగిటివ్ వచ్చిందని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ విషయాన్ని మీతో పంచుకోవడానికి సంతోషంగా ఉందని ఆయన ట్వీట్ చేశారు.

కరోనా మహమ్మరిని తెలంగాణ ప్రభుత్వం ఎదుర్కొనేందుకు అన్నివిధలా సన్నద్ధంగా ఉందని పేర్కొన్నారు. అదేవిధంగా తెలంగాణలో కరోనా బాధితులకు చికిత్సను అందించేందుకు కింగ్‌కోఠిలో 350 పడకల ఆసుపత్రిని పూర్తి అధునాతనంగా సిద్ధం చేసినట్లు మంత్రి ఫొటోలతో సహా షేర్ చేశారు. అలాగే హైదరాబాద్‌లోని నాలుగు ఆసుపత్రుల్లో కరోనా బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

తెలంగాణలోని జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో నడుస్తున్న అన్నపూర్ణ క్యాంటీన్లలో ప్రతీఒక్కరికి మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం ఉచితంగా అందించనున్నట్లు కేటీఆర్ తెలిపారు. శనివారం మధ్యాహ్నం 30వేల మందికి మధ్యాహ్న భోజనం, 7,500 మందికి రాత్రి భోజనం అందించినట్లు తెలిపారు. 50అన్నపూర్ణ క్యాంటీన్లలో ఉచితంగా భోజనం అందించనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వానికి ప్రజలు అన్నివిధలా సహకరించాలని కోరారు. వైద్యుల సూచనలు పాటిస్తే ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావాలని కోరారు. ప్రజలు స్వీయనియంత్రణ పాటిస్తే కరోనా రాకుండా అరికట్టవచ్చన్నారు. తద్వారా సమాజాన్ని కూడా కాపాడుకోవచ్చని తెలిపారు. కరోనా ఇబ్బంది కొన్ని రోజులే ఉంటుందని త్వరగా ఈ క్రైసిస్ పోతుందని కేటీఆర్ చెప్పారు.

రేషన్ కోసం ప్రజలు పడిగాపులు

కరోనా ప్రభావంతో రాష్ట్ర ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు అవకాశం లేకుండా పోయింది. పేదలకు పనులు లేకపోవడంతో ఈ నెల 29 నుంచి రేషన్ పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తొలి రోజు రేషన్ దుకాణాల ముందు ప్రజలు పడిగాపులు పడాల్సి వచ్చింది. ప్రతి కుటుంబానికి 5 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు ఇస్తామని అధికారులు ప్రకటించడంతో ఆదివారం తెల్లవారుజాము నుంచే కార్డుదారులు డిపోల వద్ద పడిగాపులు పడ్డారు. ఈ పోస్ విధానం వల్ల రేషన్ పంపిణీలో జాప్యం జరుగుతోందని భావించి, ఆ విధానాన్ని పక్కన పెట్టి సంతకాలు తీసుకుని సరుకు పంపిణీ చేయాలని నిర్ణయించినా డిపోల వద్ద సరుకు పంపిణీ లో జాప్యం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తొలుత ఇంటివద్దకే వాలంటీర్లు వచ్చి సరుకులు పంపిణీ చేస్తారని, రూ.వెయ్యి నగదు అందజేస్తామని సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. ఎప్పుడు ఈ నెల 28వ తేదీన మాత్రం అధికారులు రేషన్ డిపోల వద్దకే వచ్చి సరుకులు తీసుకోవాలని సూచించారు. వచ్చే నెల 14వ తేదీ వరకు రేషన్ పంపిణీ జరుగుతుందని అధికారులు ప్రకటించినా ఆదివారం ఒక్క రోజే రేషన్ పంపిణీ జరుగుతుందని పుకార్లు షికార్లు చేయడంతో అధిక సంఖ్యలో ప్రజలు రేషన్ డిపోల తరలి వచ్చారు. మధ్యాహ్నం 1 గంట వరకు ఎండలో అవస్థల పాలయ్యారు. గుంటూరు జిల్లా మెడికొండూరులో డిపో వద్దకు 6 గంటలకే కార్డుదారులు చేరుకున్నా అధికారులు రాలేదంటూ చాలా సమయం రేషన్ పంపిణీ చేయలేదు. కార్డుదారులు ఎండలో ఇక్కట్లు పడుతున్నా తాగునీరు సైతం ఏర్పాటు చేయలేదు. కొన్ని డిపోల వద్ద సామాజిక దూరం పాటించలేదు. అధికారులు మాత్రం సామాజిక దూరం పాటించేందుకు ముగ్గుతో మార్కింగ్, హాండ్స్ వాష్, తాగునీరు ఇతర ఏర్పాట్లు చేస్తామని చెప్పినా క్షేత్రస్థాయిలో అమలు కాలేదు. కృష్ణా జిల్లాలో జిల్లా కేంద్రమైన మచిలీపట్నం సర్కిల్ పేట డిపోలో ఎండకు తాళలేక వెంట తెచ్చుకున్న సంచిలను కార్డుదారులు క్యూలో పెట్టారు. ఈ రోజు మధ్యాహ్నం వరకూ 15.10 లక్షల మందికి రేషన్ పంపిణీ చేశారు. రాష్ట్రంలో మొత్తం 1.47 కోట్ల కార్డులు ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వ వైఫల్యం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ట్విట్టర్ వేదికగా తప్పుబట్టారు.

విషాదంలో దర్శకుడు సుకుమార్

టాలీవుడ్ దర్శకుడు సుకుమార్ విషాదంలో మునిగిపోయాడు. సుకుమార్ ప్రియమిత్రుడు, తన మేనేజర్ అయిన వి.ఇ.వి.కె.డి.ఎస్. ప్రసాద్‌ మరణించారు. శనివారం మధ్యాహ్నం ప్రసాద్ కు హఠాత్తుగా గుండెపోటు రావడంతో మృతిచెందాడు. విషయం తెలుసుకున్న సుమకుమార్ శోకసంద్రంలో మునిగారు. అయితే ప్రసాద్ గతంలో ‘అమరం అఖిలం ప్రేమ’ అనే సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు.

సుకుమార్ కు ప్రసాద్ అత్యంత సన్నిహితుడు. సుకుమార్ వద్ద మేనేజర్ గా పని చేశారు. దర్శకుడు సుకుమార్ కు ఎప్పుడు నిరాశ కలిగిన ప్రసాద్ తో కొంత సమయం గడుతానని ఎన్నోసార్లు చెప్పారు. ఆయనతో మాట్లాడితే నిరాశ మొత్తం దూరమయ్యేదని చెప్పేవారు. ప్రసాద్ ప్రభావం తన జీవితంపై ఎంతో ఉందని ఆయన పలుమార్లు తెలిపారు.

తనకు ప్రసాద్ మృతి తీరనిలోటని ఆవేదన వ్యక్తం చేశారు. తన జీవితంలో ప్రసాద్ లేనిలోటును ఎవరూ భర్తీ చేయాలంటూ సుకుమార్ వాపోయాడు. ప్రసాద్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రసాద్ కుటుంబానికి తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి అండగా ఉంటానని సుకుమార్ తెలిపారు.

అభిమానులకు నితిన్ సర్ ప్రైజ్ గిప్ట్..

యంగ్ హీరో నితిన్ అభిమానులకు సడన్ సర్ ప్రైజ్ ఇచ్చారు. రేపు(మార్చి 30న) నితిన్ పుట్టిన రోజును పురస్కరించుకొని తన తాజా చిత్రం ‘రంగ్ దే’ మోషన్ పోస్టర్ ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ మూవీలో నితిన్ సరసన కీర్తి సురేష్ నటిస్తుంది. ‘రంగ్ దే’ ట్యాగ్ లైన్ ‘గిమ్మీ సమ్ లవ్’. ఈ మూవీ మోషన్ పోస్టర్‌ను స్లో మోషన్‌లో క్లాసికల్ మ్యూజిక్‌తో రూపొందించారు. ఇందులో హీరో, హీరోయిన్‌ ఫస్ట్ లుక్‌తోపాటు ‘రంగ్ దే’ టైటిల్‌‌ను చూపించారు.

26సెకన్ల నిడివిగల ఈ మోషన్ పోస్టర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది. చిత్రంలో హీరో నితిన్ అర్జున్‌గా, హీరోయిన్ అనుగా కీర్తి సురేష్ కనిపించనున్నట్లు ఈ మోషన్ పోస్టర్లో రివీల్ చేశారు. ఈ మోషన్ పోస్టర్ ఇలా రిలీజైందో లేదో అప్పుడే సుమారు లక్షా30 వేల వ్యూస్ వచ్చాయి. ఇటీవల నితిన్ ‘భీష్మ’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్టందుకున్నాడు. ఈ మూవీలో నితిన్ కు జోడీగా రష్మిక మందన్న నటించింది. వీరిద్దరి జోడీకి ప్రేక్షకులు కలెక్షన్ల వర్షం కురిపించారు.

‘రంగ్ దే’ మూవీని నితిన్ 29వ సినిమాగా తెరకెక్కుతుంది. దర్శకుడు వెంకీ అట్లూరి ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ‘రంగ్ దే’ మూవీని పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇటీవలే ‘రంగ్ దే’ సెట్స్ పైకి వెళ్లింది. దేశంలో లాక్ డౌన్ కారణంగా ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్‌ను నిలివేశారు. అదేవిధంగా దేశంలో కరోనా కారణంగా తన బర్త్ డే వేడుకకు నితిన్ దూరంగా ఉంటున్నాడు. ఏప్రిల్ 16న జరగాల్సిన తన పెళ్లిని వాయిదా వేసుకున్నట్లు సమాచారం.

‘సీసీసీ మనకోసం’కు రవితేజ విరాళం ఎంతంటే?

దేశంలో కరోనా ప్రభావంతో ఇప్పటికే షూటింగ్ వాయిదా పడ్డాయి. థియేటర్ల మూతపడటంతో చిత్రపరిశ్రమ ఇబ్బందులు ఎదుర్కొంటుంది. రోజువారీ షూటింగ్లో పాల్గొనే సినీ కార్మికులకు ఉపాధి దొరకక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో సినీ కార్మికులనే ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ‘సీసీసీ(క‌రోనా క్రైసిస్ చారిటీ) మనకోసం ఏర్పాటైంది. ఇందులో సీని పెద్దలు సభ్యులుగా ఉంటారు. ఈ ఛారిటీ ఆధ్వర్యంలో సినీ కార్మికుల సంక్షేమానికి పలు సంక్షేమ కార్యక్రమాలను చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు విరాళాలు ప్రకటించి దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.

సినీ కార్మికులను ఆదుకునేందుకు మాస్ మహారాజ్ ర‌వితేజ రూ.20ల‌క్ష‌ల విరాళం ప్ర‌క‌టించారు. త‌న వంతుగా సాయంగా ఈ విరాళాన్ని కరోనా క్రైసిస్ చారిటీకి అంద‌జేస్తున్న‌ట్లు త‌న ట్విట్ట‌ర్లో రవితేజ ట్వీట్ చేశారు. ‘ఇవ్వ‌డ‌మ‌నే విష‌యం వ‌చ్చేదాకా తీసుకోవ‌డ‌మ‌నే ప్ర‌యోజ‌నం ఎప్ప‌టికీ పూర్తికాద‌నీ రవితేజ ట్వీట్ చేశారు. ఇది బాధ‌ను కొల‌వ‌డం కాదని.. సినీ కార్మికుల అవ‌స‌రాల‌ను తీర్చ‌డంలో తోడ్పాటు మాత్ర‌మేనని ఆయన పేర్కొన్నారు.

క‌రోనా కట్టడికి ప్రతీఒక్కరు ఇళ్లలోనే ఉండాలని రవితేజ సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న నిబంధనలు ప్రతీఒక్కరు తప్పనిసరిగా పాటించాలన్నారు. కరోనా కట్టడికి స్వీయనియంత్రణే ముఖ్యమన్నారు. వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తూ ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని రవితేజ కోరారు.

హైదరాబాద్‌లో ఎక్కడా రెడ్‌జోన్‌ లేదు

TRS

హైదరాబాద్‌లో ఎక్కడా రెడ్‌జోన్‌ అంటూ లేదని, ఈ విషయమై సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. కరోనా పై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇలాంటివి ప్రజల్లో ఆందోళన కలిగిస్తుందని చెప్పారు.

కరోనా పాజిటివ్‌ కేసులు సంఖ్య పెరగడానికి ప్రధాన కారణం ఒకే కుటుంబంలో ఎక్కువ మందికిసోకడమేనని మంత్రి చెప్పారు. కుత్బుల్లాపూర్‌ ఏరియా నుంచి ఒకే కుటుంబం నుంచి నాలుగు కేసులు నమోదయ్యాయని మంత్రి తెలిపారు. ఎంత మంది కరోనా రోగులు ఉన్నా చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేశామని మంత్రి భరోసా ఇచ్చారు.

కావాల్సిన యంత్ర పరికరాలు అన్ని అందుబాటులో ఉన్నాయని చెబుతూ మరో ఆరు రోజుల్లో గచ్చిబౌలిలో స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో ఆరు ఫ్లోర్‌లు రెడీ అవుతాయని తెలిపారు. ఇందులో 1500 పథకాలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. గాంధీ వైద్యులకు వారి వారి ఏరియాల్లో ప్రజలెవ్వరూ ఇబ్బంది పెట్టొద్దని మంత్రి కోరారు. ఇంటి అద్దెకు ఇచ్చిన వారు ఇబ్బంది పెట్టొద్దని హితవు చెప్పారు.

వైద్యులకు అండగా సమాజంలోని ప్రజలు అందరూ ఉండాలని మంత్రి కోరారు. క్వారంటైన్‌లో ఉన్న వారి సంఖ్య తగ్గుతుందని చెప్తూ ప్రస్తుతం 13వేల మంది ఉన్నారని పేర్కొన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు బాధ్యతగా ఉండాలని మంత్రి హితవు చెప్పారు.

కాగా, ప్రార్ధనా మందిరాల్లోకి వెళ్లి ఇబ్బంది పడొద్దని, ఇంటి దగ్గర ప్రార్ధనలు చేసుకోవాలని మంత్రి సూచించారు. వైద్యులు, ఎయిర్‌పోర్ట్‌లోని స్ర్కీనింగ్‌లో పనిచేసే సిబ్వంది నలుగురికి కరోనా సోకింది. వారి కుటుంబాలకు పరీక్షలు చేస్తున్నట్టుచె ప్పారు. రోగుల దగ్గర పనిచేసే సిబ్బంది ఎప్పటికప్పుడు చెక్‌చేసుకోవాలని మంత్రి సూచించారు.

వైద్య ఆరోగ్యశాఖలో పనిచసే సిబ్బంది షిఫ్ట్‌ల వారీగా విధులు నిర్వహించేలా ఏర్పాటు చేసినట్టుమంత్రి తెలిపారు. వైద్యులకు అవసరమైతే పది రోజులు విధులు, మరో పది రోజులు లీవ్‌ ఇస్తామని తెలిపారు. 65 మంది పాజిటివ్‌ వ్యక్తుల్లో పది మంది రోజగులకు నెగిటివ్‌ వచ్చింది. రేపు మరోసారి పరీక్ష చేసి డిశ్చార్చి చేస్తామని పేరోన్నారు.

24 గంటల్లో 106 పాజిటివ్‌ కేసులు..6 మంది మృతి

Corona death

భారత్‌లో 979 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. గడచిన 24 గంటల్లో కొత్తగా 106 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా..ఆరుగురు మరణించారని వెల్లడించింది. దీంతో కోవిడ్‌-19 కారణంగా ఇప్పటి వరకు దేశంలో మృతిచెందిన వారిసంఖ్య 25కు చేరింది. తాజాగా కోవిడ్‌-19పై కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్‌బులెటిన్‌ విడుదల చేసింది. మృతి చెందినవారిలో ఎక్కువగా మధుమేహ వ్యాధి, బీపీ, కిడ్నీ వ్యాధులు, హృదయ సంబంధ వ్యాధులు ఉన్నట్టు తేలిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు.

తాజాగా జమ్మూకశ్మీర్‌, గుజరాత్‌లో ఒక్కరు చొప్పున మరణించారు. దీంతో మృతుల సంఖ్య జమ్ముకశ్మీర్‌లో రెండుకు, గుజరాత్‌లో ఐదుకు పెరిగింది. అలాగే మహారాష్ట్రలో కొత్తగా మరో 12 కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో అక్కడ బాధితుల సంఖ్య 193కు పెరిగింది. మధ్యప్రదేశ్‌లోనూ కొత్తగా ఐదుగురికి వైరస్‌ సోకినట్లు నిర్ధారించడంతో రాష్ట్రంలో బాధితుల సంఖ్య 39కి చేరింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 86 మంది కోలుకున్నారు.

కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆస్పత్రుల్లో కరోనా బాధితులు, ఇతర రోగులను వేరుచేసే ప్రక్రియ కొనసాగుతోంది. గూడ్సు రైళ్ల ద్వారా ఆహార ధాన్యాలు, చక్కెర, ఉప్పు, పెట్రోలియం, బొగ్గు సరఫరా చేస్తామని కేంద్రం పేర్కొంది. గత 5 రోజుల్లో 1.25 లక్షల వ్యాగన్ల ద్వారా నిత్యావసర వస్తువుల రవాణా జరిగిందని వెల్లడించింది.

కరోనా నివారణ చర్యలపై మార్గదర్శకాల కోసం 10 బృందాలు ఏర్పాటు చేశారు. గత 24 గంటలలో తెలంగాణతో సహా ఆరు రాష్ట్రాల్లో కరోనా మరణాలు నమోదయ్యాయి. భారత్‌లో కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య 867కు చేరుకున్నది. ఐసోలేషన్‌, క్వారంటైన్‌ సౌకర్యాలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.

కరోనా చికిత్సలో పాల్గొంటున్న హెల్త్‌కేర్‌ సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం భీమా ప్రకటించింది. రూ.50లక్షల భీమా కోసం కసరత్తు జరుగుతోంది. ఆయుష్‌ విభాగం నిపుణులతో ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడారు. కరోనాతో చనిపోయిన అందరికి ఇతర తీవ్ర ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. అవసరమైన మాస్క్‌లు, వెంటిలేటర్లు దిగుమతి చేసుకుంటున్నారు.

ఇప్పటి వరకు 34, 931 మంది అనుమానితుల నమూనాలను పరీక్షించారు. దేశవ్యాప్తంగా టెస్టింగ్‌ ల్యాబ్‌ల సంఖ్య పెంచారు. కరోనా నేపథ్యంలో విధులకు హాజరుకాని ఉద్యోగులు, కార్మికులను తొలగించొద్దని కేంద్రం స్పష్టం చేసింది.