Home Blog Page 8560

కెసిఆర్ కీలక నిర్ణయం… వేతనల్లో కోత..!

తెలంగాణలో ఆర్థిక పరిస్థితిపై కరోనా వ్యాప్తి తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో వ్యయాలు, అవసరాలను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం చెల్లిస్తున్న వేతనాలన్నింటిలోనూ కోత విధించాలని కేసీఆర్‌ నిర్ణయించారు.

మార్చి నెల నుంచే కోత వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో వెల్లడించింది. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగుల మొత్తం వేతనంపై( గ్రాస్ సాలరీ) కోత విధించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తుదపరి ఉత్తర్వులు వచ్చే వరకు కోత అమల్లో ఉంటుందని తెలిపింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సోమవారం ప్రగతి భవన్‌లో ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించిన అనంతరం దీనికి ఆమోదం తెలిపారు. ఈ సమయంలో ప్రభుత్వం ముందుచూపుతో, అత్యంత జాగరూకతతో వ్యవహరించాల్సి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. కోతలుపోను మిగిలిన వేతనాలను విడుదల చేయాలని సీఎం ఆదేశించారు.

ప్రభుత్వ ఉద్యోగుల్లో వివిధ కేటగిరీలకు చెందిన వారి జీతాల్లో నుంచి10 శాతం నుంచి 75శాతం వరకు కోత విధిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు

తెలంగాణలో మొత్తం 4,49,516 మంది ఉద్యోగులున్నారు. ఇందులో ప్రభుత్వ, ఒప్పంద ఉద్యోగులు 4,30,674 మంది. 2.5 లక్షల మంది పింఛనుదారులు ఉన్నారు. ఉద్యోగులు, పింఛనర్లకు జీతభత్యాలు, పింఛన్ల కోసం ప్రభుత్వం ప్రతి నెలా రూ.3,500 కోట్ల మేరకు వెచ్చిస్తోంది. తాజా కోత వల్ల ప్రభుత్వానికి రూ.1,700 కోట్ల మేర ఆదా అవుతాయని అంచనా వేస్తున్నారు.

చిన్న నిర్మాతల పెద్ద మనసు

ప్రస్తుతం ఉన్న కరోనా విపత్తు టైంలో తెలుగు సినీ కార్మికులను ఆదుకొనేందుకు మన టాలీవుడ్ అగ్ర తారలు మరియు సినీ పెద్దలు ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ ఛారిటీ (సిసిసి) కి విరాళాలు ఇంకా వస్తూనే ఉన్నాయి. పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్‌ లతో పాటు చిన్న నిర్మాతలు కూడా కరోనా క్రైసిస్ ఛారిటీ (సిసిసి)కు ఉదారంగా విరాళం ఇస్తున్నారు. ఆ క్రమంలో యువ నిర్మాతలు సాహు గారపాటి, హరీష్ పెద్ది కూడా రూ .5 లక్షలు విరాళంగా ప్రకటించారు. కాగా సాహు గారపాటి, హరీష్ పెద్ది ఇద్దరూ కల్సి 2019 లో శివ నిర్వాణ దర్శకత్వంలో “మజిలీ” అనే సినిమా తీశారు. నాగ చైతన్య సమంత కలయికలో వచ్చిన ఈ మజిలీ చిత్రం సూపర్ హిట్ రొమాంటిక్ డ్రామాగా ప్రేక్షకుల మన్ననలు పొందింది. కాగా ఇదే బ్యానర్ లో వీళ్లిద్దరు నిర్మాతలుగా ప్రస్తుతం నాని ‘టక్ జగదీష్;’ అనే సినిమా రాబోతుంది.

కాగా క‌రోనా వ్యాప్తి నిరోధం విష‌యంలో తెలుగు సినీ వర్గాలు చేస్తున్న ఈ సాయం ఎందరికో స్ఫూర్తి గా నిలుస్తోంది. తమకు తోచిన రీతిలో వారు కూడా సాయపడేందుకు ముందుకు వస్తున్నారు. అంతేకాదు మన తెలుగు హీరోలు ప్రజలను చైతన్యం చేసేందుకు వివిధ వీడియోలను కూడా రూపొందించి మీడియా ద్వారా ప్రజల్లోకి వెళ్లేలా చేస్తున్నారు. మొత్తం మీద ఈ విప‌త్క‌ర ప‌రిస్థితిని ఇళ్ల‌ల్లోనే ఉండి స‌మ‌ష్టిగా ఎదుర్కోవాలి అన్న తెలుగు సినీ పరిశ్రమ ఆశయం చాలా గొప్పది అని చెప్పక తప్పదు.

కరోనా కట్టడికి జగన్ సర్కార్ సంచలన నిర్ణయం

దేశంలో కరోనా కట్టడికి కేంద్రం 21రోజుల లాక్డౌన్ చేపట్టింది. దీంతో ఆయా రాష్ట్రా ప్రభుత్వాలు లాక్డౌన్ అమలు చేస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ కరోనా కట్టడిపై సీరియస్ ఫోకస్ పెట్టాయి. అయినప్పటికి రెండు రాష్ట్రాల్లోనూ కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో 40పాజిటివ్ కేసులు నమోదుకాగా ఇద్దరు రికవరీ అయ్యారు.. తెలంగాణలో 77పాజిటివ్ కేసులు నమోదుగా ఆరుగురు మృతిచెందారు. 13రికవరి అయ్యారు.

ఏపీలో ఇవాళ ఒక్కరోజు కొత్తగా 17కరోనా కేసులు నమోదుకావడంతో ఏపీ సర్కార్ అప్రమత్తమైంది. దీంతో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కరోనా కట్టడిపై సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీలోని ప్రయివేట్ ఆసుపత్రులను, మెడికల్ కాలేజీలను కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు వినియోగించుకుంటామని ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి అధికారులను జగన్మోహన్ రెడ్డి కలెక్టర్లకు కట్టబెట్టారు. దీనిపై ఇప్పటికే ఆయన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా బాధితులను గుర్తించేందుకు ఇంటింటికి సర్వే చేపట్టాలని సూచించారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, కర్నూలు నగరాల్లో ప్రతి వార్డుకో డాక్టర్, మున్సిపాలిటీల్లో మూడు వార్డులకో డాక్టర్ నియమించాలని వైద్య ఆరోగ్యశాఖకు ఆదేశాలు జారీ చేశారు.

ఇప్పటివరకు కరోనా కట్టడికి ప్రభుత్వ వైద్యులు మాత్రమే సేవలందిస్తూ వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి తాజా నిర్ణయంతో ప్రైవేట్ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలు తప్పనిసరిగా కరోనా బాధితులకు చికిత్స అందించాల్సి ఉంటుంది. కరోనాపై పోరాటానికి ప్రైవేట్ వైద్యులు దూరంగా ఉండటంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఇలాంటి విపత్కర పరిస్థితులు ప్రైవేట్ వైద్యులు భాగస్వామ్యం అయ్యేలా జగన్ సర్కార్ నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక్తం అవుతోంది. జగన్మోహన్ రెడ్డి కరోనా కట్టడిని సీరియస్ గా తీసుకోవడంతో ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులు కూడా తమ సేవలను అందించేందుకు ముందుకొస్తున్నారు.

ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ ఆసుప్రతులపై తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ సర్కార్ కూడా ఆలోచిస్తుంది. తెలంగాణలోనూ అవసరమైతే ప్రయివేట్ ఆసుపత్రులను భాగస్వామ్యం చేసే అవకాశాలు కన్పిస్తున్నారు. తెలంగాణలో కరోనాను ఎదుర్కొనేందుకు అన్నివిధలా సర్కార్ సన్నద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే కేసీఆర్ ప్రకటించారు. లక్ష కేసులు వచ్చినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధమేనంటూ తెలంగాణ సర్కార్ ప్రకటించింది. కరోనా కట్టడి చేయగలమనే ధీమాను కేసీఆర్ వ్యక్తం చేశారు. ఇలాంటి నేపథ్యంలో ఏపీలో మాదిరిగానే తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకోవడం ఎంతమాత్రం వెనక్కి తగ్గే అవకాశం కన్పించడం లేదు. మొత్తానికి ప్రభుత్వ వైద్యులకుతోడు ప్రైవేట్ వైద్యులు కూడా కరోనా కట్టడికి ముందుకు వస్తుండటంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

కరోనా ఎఫెక్ట్: కేసీఆర్ ఆదేశాలు బేఖాతార్!

కరోనా మహ్మమరిని కట్టడి చేసేందుకు తెలంగాణ సర్కార్ కఠిన చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా సెలవులను ప్రకటించడంతోపాటు లాక్డౌన్ చేపట్టిన సంగతి తెల్సిందే. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల మీడియా సమావేశం నిర్వహించారు. కరోనా కట్టడికి రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులంతా రంగంలోకి దిగాలని ఆదేశించారు. ‘ఏ ఊరి సర్పంచ్.. ఆ ఊరికి కథనాయకుడు కావాలని.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పోరేటర్లు, ఎంపీపీలు, మిగతా ప్రజాప్రతినిధులు వారి పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో రంగంలోకి దిగి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో కొందరు ఒకటి రెండ్రోజులు కరోనా కట్టడికి పనిచేస్తున్నట్లు కన్పించినా.. ఆ తర్వాత ఎక్కడి వేసిన గొంగడి అక్కడే అన్నచందంగా మారిపోయారు.

తెలంగాణలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే 70కిపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఒకట్రోజులు ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధులు కరోనా కట్టడిపై ప్రజల్లో అవగాహన కల్పించినట్లు కన్పించినా ఆ తర్వాత వీరందరూ గ్రౌండ్ లెవల్లో కన్పించడం మానేశారు. కరోనా ఎఫెక్ట్ భయంతోనే వీరందరు ఇళ్లకే పరిమితమయ్యారా? లేక కేసీఆర్ ఆదేశాలను పాటించడం ఇష్టం లేక గ్రౌండ్ లెవల్లో కనిపించడం లేదా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

గ్రామాల్లో మాత్రం కరోనా కట్టడికి ప్రజాప్రతినిధులు కథానాయకుల్లా వ్యవహరిస్తున్నా.. పట్టణాల్లో మాత్రం కథనాయకులు ఎక్కడ కనిపించకపోవడం శోచనీయంగా మారింది. అయితే కొందరు ప్రజాప్రతినిధులు మాత్రం కరోనా కట్టడికి శాయశక్తులా కృషి చేస్తున్నారు. వీరిలో ప్రముఖంగా సిద్ధిపేట ఎమ్మెల్యే, ఆర్థిక మంత్రి హరీష్ రావు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, కేసీఆర్ తనయుడు, ఐటీ మంత్రి కేటీఆర్ పేర్లు విన్పిస్తున్నారు. వీరంతా ఆయా నియోజవర్గాల్లోని ప్రజలకు అవసరమయ్యే అన్ని సదుపాయాలను కల్పిస్తున్నారు. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. కరోనా మహమ్మరిపై అవగాహన కల్పిస్తున్నారు. సోషల్ డిస్టెన్స్ పాటించేలా చర్యలు చేపతున్నారు.

ఇక కేటీఆర్ ఎప్పటికప్పుడు తన ట్వీటర్లో కరోనాపై ట్వీట్లు పెడుతూ ప్రజలను అప్రతమత్తం చేస్తున్నారు. హరీష్ రావు నియోజవర్గంలోనే ఉంటూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కరోనా కట్టడికి వైద్యాధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ తీరిక లేకుండా కరోనా కట్టడికి పోరాడుతున్నారు. వీరితోపాటు కొందరు మాత్రమే అక్కడక్కడ గ్రౌండ్లో లెవల్లో కరోనా కట్టడికి కథానాయకుల్లా వ్యవహరిస్తున్నారు. కాగా మెజార్టీ ప్రజాప్రతినిధులు మాత్రం ఇళ్లకే పరిమితమైనట్లు తెలుస్తోంది. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులు ఇళ్లకే పరిమితమవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై కేసీఆర్ ఎలా రియాక్టవుతారో వేచి చూడాల్సిందే..

చమురు ధరలు తగ్గినా.. భారత్ లో మాత్రం దోపిడీయే!

కరోనా మహమ్మారి వ్యాపించడంతో ప్ర‌పంచ మార్కెట్‌లో చ‌మురు ధ‌ర‌లు దారుణంగా పడిపోతున్నాయి. రికార్డు స్థాయిలో ఏకంగా 18 ఏండ్ల కనిష్టానికి పడిపోయాయి. కానీ లాక్ డౌన్ కారణంగా ఆర్ధికంగా చితికి పోతున్న భారతీయులకు మాత్రం ఈ ప్రయోజనం అందడం లేదు.

కరోనా వైరస్‌ నేపథ్యంలో చమురు ఉత్పత్తులకు డిమాండ్ భారీగానే పడిపోవడంతో అంతర్జాతీయంగా వీటి ధరలు అమాంతంగా క్షీణిస్తున్నాయి. ధరలు పడిపోతున్న ప్రయోజనాలను వినియోగదారులకు అందకుండా భారత ప్రభుత్వం, ఆయిల్ కంపెనీలు కలసి తమ ఆదాయాలను పెంచుకొంటున్నాయి.

చ‌మురు ధ‌రలు త‌గ్గ‌డంతో ఉన్న‌ ప్ర‌యోజ‌నాన్నికేంద్రం విధించిన ఎక్సైజ్‌ సుంకం చెల్లింపుల‌కు దేశీయ చ‌మురు విక్ర‌య కంపెనీలు స‌ర్దుబాటు చేస్తున్నాయి. అంత‌ర్జాతీయ‌ మార్కెట్‌లో ముడి చమురు బ్యారెల్‌ ధర 20 డాలర్లకు పడిపోవ‌డం 2002 నవంబర్ త‌ర్వాత ఇప్పుడే. అయితే దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ నేప‌థ్యంలో పెద్ద‌గా డిమాండ్‌ లేకపోవడంతో ధరలు క్షీణిస్తున్నాయి.

ఇంత ధ‌ర‌లు ప‌త‌న‌మ‌వుతున్న‌భారత్‌లో మాత్రం వరుసగా 14వ రోజు కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. అంతకు ముందు దాదాపు ప్రతి రోజు ధరలను సవరిస్తున్న దేశీయ చమురు కంపెనీలు మార్చ్ 16న చివ‌రిసారి ధ‌ర‌లు స‌వ‌రించాయి. గత రెండు వారాలుగా అటువంటి ప్రయత్నం చేయడం లేదు.

కాగా మాఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.69.59, ముంబయిలో రూ.75.30గా ఉంది. ఢిల్లీలో లీటర్‌ డీజిల్‌ ధర రూ.62.29, ముంబయిలో రూ.65.21గా విక్రయిస్తున్నారు. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.73.97 ఉండ‌గా విజయవాడలో రూ.74.32గా ఉన్నది.

సాధారణంగా ప్రపంచ వ్యాప్తంగా రోజుకు 100 మిలియన్‌ బ్యారెల్స్‌ చమురు వినియోగం ఉంటే… గత కొన్ని వారాలుగా చాలా వ‌ర‌కు త‌గ్గింది. అంతర్జాతీయంగా భారీగా తగ్గుతున్న చమురు ధరలను భారత్‌లో వినియోగదారులకు చేర్చకుండా.. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలపై భారాన్ని మోపడం ఆదాయ వనరుల పట్ల తప్ప ప్రజల పట్ల దృష్టి సారించలేని ప్రభుత్వ ధోరణిని వెల్లడి చేస్తుంది.

కరోనా విపత్తులో బాలయ్య మౌనం వెనుక కారణం ఏంటి ?

కరోనా వైరస్ తో విలవిల్లాడుతున్న సినీ కార్మికుల కోసం సినిమా పరిశ్రమకు చెందిన చిరంజీవి , నాగార్జున , వెంకటేష్ , ప్రభాస్ , మహేష్ బాబు , అల్లు అర్జున్ , రవి తేజ , వరుణ్ తేజ్ , నాగ చైతన్య వంటి స్టార్స్ అంతాముందుకొచ్చి ఆర్ధిక సాయం చేస్తున్నారు . ఇంకా సినీ పరిశ్రమకు చెందిన తమ్మారెడ్డి భరద్వాజ , పరుచూరి వెంకటేశ్వర రావు , డైరెక్టర్ ఎన్ . శంకర్ , కాదంబరి కిరణ్ కుమార్ , ఉత్తేజ్ , జీవిత వంటి వారు ఎందరో తమ వంతుగా సినీ కార్మికుల సంక్షేమం కోసం పాటు పడుతున్నారు. ఇంతమంది ఇన్ని రకాలుగా స్పందిస్తుంటే సినీ పరిశ్రమకు చెందిన అగ్ర నటుడు , బడా సినీ ఫ్యామిలీ కి చెందిన వ్యక్తి అయిన నందమూరి బాలకృష్ణ ఏమాత్రం స్పందించక పోవడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.

మరో వంక బాలయ్య బాబు తన తదుపరి సినిమాల గురించి ఆలోచిస్తూ బిజీగా ఉన్నాడని వార్తలు వినవస్తున్నాయి. అందుకు నిదర్శనం గా హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కి ఫోన్ చేసి ఒక సినిమా చేద్దామని చెప్పినట్టు తెలుస్తోంది. అన్నీ కుదిరితే ఆ సినిమా తానే నిర్మించాలి అనుకొంటున్నట్టు కూడా వినవస్తోంది. రీసెంట్ గా దర్శకుడు అనిల్ రావిపూడి తనకు బాలయ్య బాబు తో గాని మోక్షజ్ఞ తో గాని వర్క్ చేయాలనుంది అనడం ఈ వార్తకు బలాన్నిస్తోంది .

‘ఆర్ ఆర్ ఆర్’ పక్కాగా 2021 జనవరి లోనే వస్తుంది

rrr shooting

కరోనా వైరస్ కారణంగా చిత్ర పరిశ్రమ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. షూటింగ్ లు డిలే అవుతున్నాయి. చాలా సినిమాలు విడుదల తేదీలు మార్చు కొంటున్నాయి. పరిస్థితి చూస్తుంటే సినిమా షూటింగ్ లు ఇప్పట్లో మొదలయ్యేలా లేవు .మరో రెండు నెలలు ఆలస్యం అయ్యేలా వున్నాయి. దీంతో రాజమౌళి సంక్రాంతికి విడుదల చేస్తానని చెప్పిన ఆర్.ఆర్.ఆర్. (రౌద్రం రణం రుధిరం ) సినిమా రిలీజ్ లేట్ అవుతుందని కొందరు ఊహించారు. సినిమా విడుదల వచ్చే వేసవికి ఉండొచ్చు అనుకొన్నారు.

ఇలా ఎవరికి తోచిన విధంగా వారు ` ఆర్ ఆర్ ఆర్ ` సినిమా వాయిదా గురించి మాట్లాడు కొంటుంటే రాజమౌళి వాటిని పట్టించు కోకుండా సినిమా ప్రొమోషన్ మొదలు పెట్టాడు. తద్వారా తన సినిమా అనుకున్న సమయానికి వస్తుందనే సంకేతాలు పంపిస్తున్నాడు. ప్రస్తతం షూటింగ్ కి అంతరాయం రావడంతో గ్రాఫిక్స్ పనులు చేయించుకుంటున్నాడు. ఇప్పటికే 70 శాతం సినిమా పూర్తయింది ఆరు నూరయినా జనవరి 8న ” రౌద్రం రణం రుధిరం” విడుదల ఖాయమని తెలుస్తోంది .

ఏపీలో 40 చేరిన కరోనా బాధితులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల 40కి పెరిగింది. తాజాగా ఒకే రోజు 17 మందికి కరోనా ఉన్నట్లు నిర్ధారణ జరిగింది. వీరంతా ఢిల్లీ నుంచి వచ్చిన వారే. ఢిల్లీలోని నిజాముద్దీన్‌ వద్ద ఈ నెల 15వ తేదీ నుంచి మూడు రోజులపాటు జరిగిన మత ప్రార్థనలకు హాజరైనవారే కావడం విశేషం. ఇప్పటికే అప్రమత్తమైన ఢిల్లీ ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని మూసివేసి, కార్యక్రమం నిర్వహించిన మత పెద్దపై కేసు నమోదు చేశారు. మరోవైపు ఢిల్లీ నుంచి వచ్చిన వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 8 మంది మృతి చెందారు. మృతుల్లో ఏపీకి చెందిన ముగ్గురు, తెలంగాణ వాసులు ఐదుగురు ఉన్నారు. మత సమావేశాలకు ఇరాన్‌, ఇండోనేషియా నుంచి బోధకులు వచ్చారు. 16, 17 తేదీల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ముస్లింలు పాల్గొన్నారు. ఇరు రాష్ట్రాల నుంచి సుమారు 2వేల మంది పాల్గొన్నట్టు సమాచారం. సామూహిక ప్రయాణాలు, బస చేయడంతో అక్కడి నుంచే కరోనా విస్తరించింది. ఈ కార్యక్రమానికి ఆంధ్ర ప్రదేశ్ నుంచి శ్రీకాకుళం మినహా మిగిలిన జిల్లాల నుంచి 369 మంది హాజరయ్యారు. ఒక్క కర్నూలు జిల్లా నుంచే 107 మంది ఢీల్లీ వెళ్లిన వారిలో ఉన్నారు. వీరిలో నలుగురు మాత్రమే ప్రభుత్వ పర్యవేక్షణలో ఐసోలేషన్లో ఉన్నారు. మరోవైపు కరోనా కట్టడి కోసం రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ పకడ్బందీగా అమలవుతోంది.

జిల్లాల వారీగా నమోదైన కేసులు..
అన్నంతపురం 2
విశాఖ 6
కృష్ణా 5
గుంటూరు 9
ప్రకాశం 11
తూర్పుగోదావరి జిల్లా 4
చిత్తూరు 1
కర్నూలు 1
నెల్లూరు 1

చొప్పున బాధితులు చికిత్స పొందుతున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది.

తన వృత్తి ధర్మాన్ని పాటిస్తున్న ‘సినీ నటి’

బాధలో గాని , కష్టంలో గాని ఉన్నపుడే మనలో ఉన్న అసలు మనిషి బయటికి వస్తాడు. ఈ నిజాన్ని ప్రూవ్వ్ చేసే ఘటన ఒకటి ముంబై లో జరిగింది. కరోనా వైరస్ కారణంగా డాక్టర్లు ప్రాణాల్ని పణంగా పెట్టి జనం కోసం పోరాటం సాగిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఒక హిందీ సినీ నటి.. బాధ్యతతో జనం కోసం నర్సు గా మారి సేవ చేయడానికి ముందు కొచ్చింది .
సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ నటించిన ‘ఫ్యాన్’ సినిమా తో పాటు ఈ ఏడాది ఫిబ్రవరిలో వచ్చిన “కాంచలి “చిత్రం లో హీరోయిన్ గా నటించిన షికా మల్హోత్రా ఇపుడు తన అసలి రూపం బయట పెట్టుకొంది. ముంబయిలోని ఓ హాస్పిటల్లో నర్సుగా మారి కరోనా బాధితులకు సేవలు అందిస్తోంది.

ప్రస్తుతం దేశంలో అత్యధిక కరోనా కేసులున్న రాష్ట్రం మహారాష్ట్రనే …. అక్కడ డాక్టర్లు, నర్సుల కొరత తీవ్రంగా ఉంది.అలాంటి అవసరాన్ని గుర్తించిన షికా మల్హోత్రా వెంటనే తన కర్తవ్యాన్ని గుర్తు తెచ్చుకొంది. సినిమాల్లోకి రావడానికి ముందు తాను చేసిన నర్సింగ్ కోర్స్ సమాజానికి ఉపయోగపడాలని భావించింది.వెంటనే ముంబై లోని ఒక ప్రముఖ ఆసుపత్రికి తాను నర్స్ గా సర్వీస్ చేయాలను కొంటున్నానని తెలిపింది. విధుల్లో జేరి నర్స్ గా సేవలందిస్తోంది .

నటి కాకముందు షికా మల్హోత్రా ఢిల్లీలోని వర్ధమాన్ మహవీర్ మెడికల్ కాలేజీలో నర్సింగ్ కోర్స్ లో డిగ్రీ చేసింది. తద్వారా షికా మల్హోత్రాకు నర్సుగా సేవలందించే అర్హత ఉంది. ఇప్పుడు ఈ కష్ట కాలంలో తన చదువుకు న్యాయం చేయాలని, దేశానికి సేవ చేయాలని నిర్ణయించుకుంది. పేషెంట్ల సేవలో షికా మల్హోత్రా విరామం లేకుండా పని చేస్తున్నతీరు ,కమిట్మెంట్ చూసి అందరూ ఆశ్చర్య పోతున్నారట …

నేను సైతం అంటున్న పవన్ కళ్యాణ్

సమాజానికి విపత్తు వచ్చినపుడు రాజకీయాలకు అతీతంగా అందరూ ఒక్క త్రాటిపైకి రావడమే మానవత్వం అనిపించు కొంటుంది. ఆ విషయం లో మిగతావారి సంగతి ఎలా వున్నా పవన్ కళ్యాణ్ మాత్రం తన వంతు ధర్మాన్ని చక్కగా పాటించాడు కరోనా విపత్తు కి సాయంగా తన వంతుగా రూ.2 కోట్ల విరాళం ప్రకటించడమే కాక.. జనాల్లో అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. తాజాగా పవన్ కళ్యాణ్ తమిళ నాడు ప్రభుత్వాన్ని కరోనా వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి సమాచారం ఇచ్చి మేల్కొలపడం విశేషం.

శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం గొలగండి గ్రామం నుంచి చేపల వేట కోసం తమిళనాడు తీరానికి వెళ్లిన 30 మంది మత్స్యకారులు లాక్ డౌన్ వల్ల చెన్నై హార్బర్లో చిక్కుకుపోయారని.పవన్ కళ్యాణ్ కి తెలిసింది వారికి సరైన వసతి, భోజనం లేక వాళ్లంతా ఇబ్బంది పడుతుండటంతో జనసేన నాయకుల ద్వారా ఆ విషయం తెల్సుకొన్నాడు . వెంటనే ఆ విషయాన్ని తమిళనాడు ముఖ్యమంత్రికి తెలియ జేసి వారికి తగిన సదుపాయాలు కల్పించవలసిందిగా కోరాడు .

తమిళంలో కూడా ఈ మెసేజ్ రాయించి తమిళ మీడియా వాళ్లకి చేరవేయడం తో వాళ్ళు అక్కడి అధికారుల దృష్టికి ఈ విషయం తీసుకెళ్లారు. దీంతో చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వాళ్ల ముఖ్య మంత్రి తో ఈ విషయం చర్చించగా తక్షణమే రక్షణ ఏర్పాట్లు జరిగాయి. కాగా తమిళనాడు ముఖ్య మంత్రి పళనిస్వామి ఈ విషయాన్ని తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ కి ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలపడం జరిగింది.

ఈఎంఐ మారటోరియంపై లోపించిన స్పష్టత

కరోనా మహమ్మారి దృష్ట్యా ఈఎంఐల చెల్లింపుపై మూడు నెలల పాటు ఆర్బీఐ విధించిన మారటోరియంపై ప్రజలలో ఇంకా స్పష్టత వ్యక్తం కావడం లేదు. ఇది అందరికి వర్తిస్తుందా లేవలం ఈ సౌలభ్యం కావాలని కోరుకున్న వారికే వర్తిస్తుందా అనే విషయమై కూడా ఇంకా బ్యాంకులు, ఆర్ధిక సంస్థలు స్పష్టత ఇవ్వవలసి ఉంది.

కేవలం ఎస్బీఐ మాత్రమే తమ కస్టమర్లందరి టర్మ్‌ లోన్లు ఆటోమేటిగ్గా మూడు నెలలు వాయిదా పడుతాయని ప్రకటించింది. మారటోరియం తీసుకున్నవారికి మార్చి, ఏప్రిల్‌, మే నెలలకు సంబంధించిన కిస్తీ చెల్లింపుల నుంచి తాత్కాలికంగా మినహాయింపు లభిస్తుంది.

ఈ మూడు నెలల ఈఎంఐలను బ్యాంకులు తిరిగి ఎలా వసూలు చేసుకుంటాయి? అన్నదానిపై సహితం స్పష్టత వెల్లడి కావడం లేదు. ఇది రద్దు కాదని, వాయిదా మాత్రమే అని ఆర్బీఐ ఇప్పటికే స్పష్టం చేసింది. మనం చెల్లించే వాయిదాలలో అసలు మొత్తం కన్నా వడ్డీ మొత్తం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ మూడు నెలల పాటు వాయిదా పడిన మొత్తాలపై కూడా తిరిగి అదనంగా వడ్డీ చెల్లింపు వలసి వస్తుందా ? అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

అలాగే మారటోరియంతో ఈఎంఐ మారబోదని, రుణ కాలపరిమితి మాత్రమే కాస్త పెరుగుతుందని చెబుతున్నారు. ఈ విషయంలో కూడా ఇంకా బ్యాంకులు, ఆర్ధిక సంస్థలు స్పష్టమైన విధానం ప్రకటించలేక పోతున్నాయి. కొత్త నెల ప్రారంభం కాబోతుండటం, ఈఎంఐలు చెల్లించే సమయం ఆసన్నం కావడంతో ఈ విషయమై తక్షణం ఒక నిర్ణయాన్ని ప్రకటించవలసి ఉంది.

ఈఎంఐలు చెల్లించకపోయినా డిఫాల్ట్‌ కాబోమని, మన క్రెడిట్‌ స్కోర్‌కూ వచ్చిన ఇబ్బందేమీ లేదని స్పష్టత ఏర్పడినా, వెసులుబాటు ఉన్న వారు ఏమి చేయాలనే ప్రశ్న తలెత్తుతుంది. ఇప్పుడే చెల్లిస్తే ప్రయోజనమా లేదా ఈ వెసులుబాటును ఉపయోగించుకొంటె ప్రయోగాజనమా అనే సందేశాలు వ్యక్తం అవుతున్నాయి.

వీలున్న వారు ఈఎంఐలను యథాతథంగా చెల్లించుకుంటేనే లాభమని ఆర్ధిక నిపుణులు సూచిస్తున్నారు. అయితే మారటోరియం తీసుకోవాలనుకున్నవారు ఈ మూడు నెలల మొత్తం ఆపడం వల్ల అంతకంటే ఎక్కువ లాభం ఉంటుందా? అన్నదానిపై ఆలోచించుకోవాలని సూచిస్తున్నారు. ఏదిఏమైనా కరోనా ధాటికి ఆదాయం ప్రభావితమైన వారందరికీ ఆర్బీఐ నిర్ణయం మాత్రం గొప్ప ఊరటేనన్న ఖచ్చితంగా చెప్పవచ్చు.

తెలంగాణలో పెరిగిన కరోనా మృతుల సంఖ్య

తెలంగాణలో కరోనా మృతుల సంఖ్య ఒక్కసారిగా ఆరుకు పెరిగింది. వీరంతా కూడా ఢిల్లీలోని మర్కజ్ లో ప్రార్థన కోసం వెళ్లినవారే కావడంతో భయాందోళన నెలకొంది. దీంతో తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. ఢిల్లీ వెళ్లి ప్రార్థనల్లో పాల్గొని తిరిగొచ్చిన వారు తమ వివరాలను వెల్లడించాలని తెలంగాణ సీఎంఓ కోరింది. వీరందరికీ ఉచితంగా పరీక్షలు, వైద్యం చేయిస్తామని ప్రకటించింది.

ఇప్పటివరకు రాష్ట్రంలో ఆరుగురు కరోనాతో ప్రాణాలు విడిచారు. గాంధీ ఆసుపత్రిలోలో ఇద్దరు, గ్లోబల్ ఆసుపత్రిలో ఒకరు, నిజామాబాద్‌లో ఒకరు, గద్వాలలో ఒకరు మృతిచెందారు. దీంతో మృతుల కుటుంబ సభ్యులు, వారితో కాంటాక్ట్ వున్నవారిని క్వారంటైన్లో ఉంచాలని తెలంగాణ ప్రభుత్వం కలెక్టర్లను ఇప్పటికే ఆదేశించింది. మృతుల్లో పాతబస్తీకి చెందిన జర్నలిస్ట్, ఓ మహిళ ఉన్నట్లు గుర్తించారు.

మార్చి 13నుంచి 15తేదీల్లో ఢిల్లీలో నిర్వహించిన ఈ ప్రార్థనల్లో 2000 మంది వరకు పాల్గొన్నట్లు సమాచారం. ఈ ప్రార్థనల్లో థాయ్‌లాండ్, ఇండోనేసియా, మలేసియా, కిజికిస్థాన్ తదితర దేశాలకు చెందినవారు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ నుంచి 280మంది ఈ ప్రార్థనల కోసం ఢిల్లీ వెళ్లినట్లు సమాచారం. హైదరాబాద్ నుంచి 186మంది, నిర్మల్ నుంచి 11, ఆదిలాబాద్ నుంచి 10, నిజామాబాద్ నుంచి 18, మెదక్ నుంచి 26, రంగారెడ్డి నెంయి 15, ఖమ్మం నుంచి 15, వరంగల్ నుంచి 25, నల్గొండ నుంచి 21, కరీంనగర్ నుంచి 17, భైంసా 11మంది వెళ్లినట్లు తెలుస్తోంది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల నుంచి 500మంది వరకు పాల్గొన్నట్లు సమాచారం. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి.

సల్మాన్ ఖాన్ ఇంట విషాదం

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సల్మాన్ మేనల్లుడు అబ్దుల్లా ఖాన్‌(38) హఠాన్మరణం చెందాడు. గడిచిన కొంతకాలంగా అబ్దుల్లా ఖాన్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈక్రమంలోనే ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో అబ్దుల్లా చికిత్స పొందుతున్నాడు. సోమవారం రాత్రి పరిస్థితి విషమించడంతో అబ్దుల్లా ఖాన్ తుదిశ్వాస విడిచారు.

https://www.instagram.com/p/B-Xk-VcFX-f/

అబ్దుల్లా మృతి విషాయాన్ని సల్మాన్‌ ధృవీకరిస్తూ ‘ఎల్లప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాం’ ట్వీటర్లో పోస్టు చేశాడు. అబ్దుల్లాతో గతంలో దిగిన ఫొటోను ట్వీటర్లో పోస్టుచేసి అభిమానులతో ఈ విషయాన్ని పంచుకున్నాడు. అబ్దుల్లా మృతివార్త తెలుసుకున్న పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాడీ బిల్డర్‌ అయిన అబ్దుల్లా, సల్మాన్‌‌‌తో కలిసి ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. నిత్యం వీరిద్దరు జిమ్‌కు కలిసి వెళ్లేవారు. అబ్దుల్లా మృతితో సల్మాన్ ఖాన్ కన్నీటి పర్యంతమయ్యాడు.

సరిహద్దులు దాటిన పవన్ మంచితనం!

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో 21 రోజుల సంపూర్ణ లాక్ డౌన్ విధించారు. దింతో శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొంత మంది జాలర్లు, ఇతరులు చెన్నై హార్బర్‌ లో చిక్కుకున్నారు. వాళ్లకు సరైన ఆహార సదుపాయాలు లేని పరిస్థితి ఏర్పడింది. దీన్ని గుర్తించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్… వారిని ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ… తమిళంలో… తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి… ట్విట్టర్‌ లో లేఖ రాశారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రాంతాలతో సంబంధం లేకుండా పేదవాళ్లందర్నీ ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

పవన్ ట్వీట్ పై స్పందించిన తమిళనాడు ప్రభుత్వం వెంటనే చెన్నైలోని శ్రీకాకుళం జాలర్లకు ఈ రోజు నుంచి ఆహారం వసతి సదుపాయాలు ఏర్పాటు చేస్తోంది. ఇదే విషయాన్ని పళని స్వామి తన ట్విట్టర్ అకౌంట్‌ లో తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్… కృతజ్ఞతలు తెలుపుతూ మరో ట్వీట్ చేశారు.

ఇలా ఏపీ ప్రభుత్వం జాలర్లను ఆదుకోవట్లేదనే ఉత్తుత్తి విమర్శలు చెయ్యకుండా… పవన్ కళ్యాణ్… తనే స్వయంగా వారిని కాపాడేందుకు ప్రయత్నించడంతో… జనసేన శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.

ఆకలితో చనిపోతున్న వలస కార్మికులు

వలస కార్మికులు ఎవరిని కదలనీయవద్దని, వారెక్కడ ఉన్నారో అక్కడనే వారికి వసతి, భోజన సదుపాయాలు కల్పించామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించినా వారి పరిస్థితులలో పెద్దగా మార్పు కనబడటం లేదు. సుదూర ప్రాంతాలలో ఆకలితో అలమటించడం కన్నా, సొంత ఉరికి వెళ్లి, కాలో గంజో తాగుతూ ప్రాణం నిలబెట్టుకుందామని గ్రామాల బాట పట్టిన పలువురు దారిలోనే మృతు వాత పడుతున్నారు.

ఎటువంటి రవాణా సదుపాయాలు లేకపోవడంతో కాలి నడకనే సుదూర ప్రాంతం వెళ్ళవలసి వస్తున్నది. దానితో దారిలోని తిండి దొరకకా, కరోనా వైరస్ కాకుండా ఆకలితో పలువురు చనిపోతున్నారు. మీడియా కధనాల ప్రకారం ఇప్పటికి కనీసం 22 మంది చనిపోయారు. ముంబై నుంచి వందల మంది కార్మికులు 600 కి.మీ దూరంలోని కర్ణాటకకు ప్రయాణమయ్యారు.

దేశవ్యాప్తంగా లక్షల మంది వలసజీవులు రోడ్లపై కాలినడకన సొంతూళ్లకు బయలుదేరారు. ఈ దృశ్యం 1947లో దేశ విభజన సమయంలో జరిగిన వలసలను గుర్తుచేస్తున్నదని పలువురు చెప్తున్నారు. చాలామంది ఆహారం దొరుకక, నడువలేక అనారోగ్యంబారిన పడుతున్నారు.

కాగా, వలస కూలీలపై రసాయనాలు స్ప్రే చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కేంద్రం ఆదేశాలు ఇవ్వడమే గాని, అవసరమైన వనరులు సమకూర్చక పోవడంతో రాష్ట్ర ప్రభుత్వాలు సహితం చేతులు ఎత్తేస్తున్నాయి.‘ఎక్కడివాళ్లు అక్కడే ఉండాలని ప్రభుత్వం చెప్తున్నది. కానీ.. తినడానికి తిండి కూడా లేనప్పుడు ఇక్కడుండి ఏం చేయాలి? మా పిల్లల్ని ఎలా బతికించుకోవాలి’ అని వాపోతున్నారు.

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వలస కార్మికుల కోసం రూ 100 కోట్ల ప్యాకేజి ప్రకటించారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే 170కు పైగా శిబిరాలను వారికోసం ఏర్పాటు చేశారు. కానీ కేంద్రం ఏమి చేస్తున్నదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ముఖ్యంగా వలస కార్మికుల కోసం వేయి బస్సు లను పంపమన్న ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పై ఈ సందర్భంగా బీహార్ ప్రభుత్వం మండిపడుతున్నది. ఆయన వైఖరి కారణంగా ఆ ప్రభుత్వం ఒక విధంగా బలవంతంగా బీహార్ కు చెందిన కార్మికులను నెట్టి వేస్తున్నట్లు ఆరోపిస్తున్నది.

మరోవంక, కరోనా వైరస్ కన్నా కార్మికుల వలసే పెద్ద సమస్యగా తయారైందని, ఈ పరిస్థితుల్లో వలసలను నివారించడానికి ఏయే చర్యలు తీసుకుంటున్నారో మంగళవారానికి నివేదిక ఇవ్వాలని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని సోమవారం కోరింది.

రోగి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఎం.ఎన్.ఓ

మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళ పట్ల ఎం.ఎన్. ఓ అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే కృష్ణాజిల్లా చల్లపల్లి ప్రాంతానికి చెందిన నాగరాణి (26) రెండు రోజుల కిందట కాలిన గాయాలతో మచిలీపట్నంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతుంది.

వార్డులో ఒంటరిగా ఉన్న నాగరాణి చూసి విచక్షణా జ్ఞానం కోల్పోయిన ఎం.ఎన్.ఓ (మేల్ నర్సింగ్ ఆక్సిలరీ) వెంకటేశ్వరరావు ఆమెపై అసభ్యంగా ప్రవర్తించాడని కుటుంబ సభ్యులు ఆసుపత్రి సూపరిండెంట్ కు ఫిర్యాదు చేశారు. సంఘటన జరిగిన తరువాత నాగరాణి భర్త సురేష్ ఆసుపత్రి సూపరింటెండెంట్ సూచన మేరకు మేల్ నర్సింగ్ ఆక్సిలరీ వెంకటేశ్వరరావుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎం.ఎం.ఓ వెంకటేశ్వరరావును పోలీసులు సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు.

ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత …

కరోనా ఎఫెక్ట్ ప్రభుత్వ ఉద్యోగులను తాకింది. రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన సడలింపులతో ఊపిరి పీల్చుకున్న ఉద్యోగులకు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు షాకింగ్ న్యూస్ ప్రకటనకు సిద్ధమయ్యాయి. దేశవ్యాప్తంగా అమలులో ఉన్న లాక్‌ డౌన్‌లో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించింది. రెవిన్యూ పూర్తిగా నిలిచిపోయింది. కరోనా సహాయ చర్యల కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోంది. రెండు రాష్ట్ర ప్రభుత్వాల ఖజానాలు ఖాళీ అయ్యాయి. దీంతో కీలక నిర్ణయం దిశగా రెండు ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయి. ఏపీ తెలంగాణలోని దాదాపు 14 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల్లో మూడు శాఖల మినహా మిగిలినవారికి పరిస్థితి అదుపులోకి వచ్చేవరకు వేతనాల్లో కోత విధించే దిశగా తుది కసరత్తు జరుగుతోంది.

నిలిచిపోయిన ప్రభుత్వ ఆదాయం:

కరోనా ఎఫెక్ట్‌తో ఏపీలో ప్రభుత్వ ఆదాయం పూర్తిగా నిలిచిపోయింది. ఇప్పటికే ఎక్సైజ్ ఆదాయం తగ్గిపోవడంతో పాటుగా లాక్‌డౌన్ కారణంగా ప్రతినెలా ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే రెవిన్యూ, మైనింగ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, రవాణా శాఖలు పూర్తిగా స్తంభించాయి. దీంతో ప్రభుత్వ ఖజానా ఖాళీగా కనిపిస్తోంది. ధనిక రాష్ట్రంగా చెప్పుకునే తెలంగాణలోనూ ఎక్సైజ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్‌ ద్వారానే ఎక్కువ ఆదాయం సమకూరుతోంది. రెండు రాష్ట్రాల్లో పెట్రోల్ ఉత్పత్తుల ద్వారా వచ్చే పన్నులు అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి.
ఉద్యోగుల జీతాల్లో కోత:

ఇదే సమయంలో రెండు రాష్ట్రాల్లోనూ తెల్ల కార్డు దారులకు నగదు రూపేణా ఆర్థికసాయం ప్రకటించారు. ఏపీలో బియ్యం, కందిపప్పు ఉచితంగా ఇస్తున్నారు. దీంతో పాటు కరోనా నివారణ చర్యల కోసం రెండు ప్రభుత్వాల మీద అదనపు భారం పడింది. కేంద్రం పరిస్థితి దాదాపు ఇదేవిధంగా ఉండటం, కొత్త రుణాలు వచ్చే అవకాశం లేకపోవడం, కేంద్ర పన్నుల వాటాలో ఆదాయం కూడా రెండు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని అల్లకల్లోలం చేస్తున్నాయి. దీంతో ప్రభుత్వంలో భాగంగా చెప్పుకునే ఉద్యోగుల వేతనాల్లో కోత విధించక తప్పని పరిస్థితి ఏర్పడింది.
ప్రజాప్రతినిధులకు కట్:

ఇక ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు సైతం ఈనెల జీతాలు ఇవ్వకూడదని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్ణయించినట్లు సమాచారం. ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఏటా వేతనాలు, పెన్షన్ల రూపంలో దాదాపు 2700 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నారు. ప్రస్తుత గడ్డు కాలంలో వేతనాలపైన 30శాతం మేరా కోత విధించే అవకాశం కనిపిస్తోంది. దీనిపైన ఉద్యోగ సంఘాల నేతలతో మాట్లాడేందుకు ప్రభుత్వం సమాయాత్తమవుతోంది. అయితే కరోనా సేవల్లో నిమగ్నమైన వైద్య ఆరోగ్యశాఖ పోలీస్, మున్సిపల్ సిబ్బందికి మాత్రం పూర్తి వేతనాలు ఇవ్వాలనేది ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తోంది. ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ అన్ని రకాల రుణాల చెల్లింపుల పైనా మూడు నెలల మారిటోరియం విధించడంతో ఉద్యోగులకు కొంత వెసులుబాటు కలిగింది. దాన్ని ప్రస్తుత పరిస్థితుల్లో సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వాలు భావిస్తున్నాయి.
మూడు నెలల పాటు;

కష్టకాలంలో ఉన్న ఈసమయంలో ప్రభుత్వంలో భాగస్వాములైన ఉద్యోగులు సైతం సహకరించాలనే పిలుపుతో ఈ నిర్ణయం అమలు దిశగా తుది చర్చలు జరుగుతున్నాయి. మూడు నెలల పాటు ఇదే రకంగా వేతనాల్లో కోత ఆ తర్వాత కోత విధించిన సొమ్మును దశలవారీగా చెల్లింపులు చేసే విధంగా ప్రభుత్వాల వద్ద ప్రతిపాదనలు సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం. పెన్షనర్ల విషయంలో మాత్రం ఎటువంటి మినహాయింపులు లేకుండానే చెల్లింపులు జరిగే అవకాశం కనిపిస్తోంది.