Home Blog Page 8561

లాక్‌ డౌన్‌ లో అలసత్వం: ఇద్దరు ఐఏఎస్‌ ల సస్పెండ్‌!

భారత్‌ లో కరోనా వైరస్‌ ను కట్టడిచేయడం కోసం దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్‌ డౌన్‌ విధించింది ప్రభుత్వం.ఈ సమయంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరించింది. అయినప్పటికీ వేల సంఖ్యలో కార్మికులు, వలస కూలీలు నగరాల నుంచి తమ సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు రోడ్లపైకి వస్తున్నారు. దీంతో ఢిల్లీలోని పలుప్రాంతాలు ప్రజలతో కిక్కిరిసిపోయాయి.దీనిపై కేంద్రప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ పరిస్థితికి కారణమైన ఢిల్లీ ప్రభుత్వంలోని ఇద్దరు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులను సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకుంది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన మరో ఇద్దరు ఉన్నతాధికారులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. కరోనా వైరస్‌ ను ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అమలుపరచడంలో ఈ అధికారులు అలసత్వం ప్రదర్శించినట్లు తెలుస్తోంది.

ఢిల్లీ రవాణాశాఖ అదనపు ముఖ్యకార్యదర్శితో పాటు ఆర్థికశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీలపై వేటు వేసినట్లు వెల్లడించింది. వీరితోపాటు రాష్ట్ర హోంశాఖ అదనపు ముఖ్యకార్యదర్శి, సీలంపూర్‌ సబ్‌-డివిజినల్‌ మెజిస్ట్రేట్‌లను షోకాజ్‌ నోటీసులు జారీ చేసి వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

జంటనగరాల్లో పార్కులే కూరగాయల మార్కెట్లు!

హైద్రాబాద్, సికింద్రాబాద్ లోని కొన్ని పార్కులను కూరగాయల మార్కెట్లుగా మారుస్తున్నట్లు సమాచారం. కరోనా ప్రభలుతున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 21 రోజుల సంపూర్ణ లాక్ డౌన్ ను అమలుపరుస్తున్నాయి. కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి ప్రజలు గుమి గూడే ప్రాంతాలలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే జంట నగరాలలో పలు పార్కులను కూరగాయ మార్కెట్లుగామారుస్తున్నారు. ఇప్పటికే సికింద్రాబాద్ లోని రైళ్ళను ఐసోలాషన్ వార్డ్స్ గా మార్చిన విషయం తెలిసిందే..

ఆ నేపథ్యంలోనే నాంపల్లి లో ఉన్న ఉప్పల్ స్టేడియంను కూరగాయల మార్కెట్లుగా మారుస్తున్నట్లు జీహెచ్ఎంసీ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ కృష్ణ శేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గోపు సరస్వతి సదానంద్ మాట్లాడుతూ.. స్టేడియంలో కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేయడం వల్ల సామాజిక దూరం పాటిస్తూ కూరగాయలు కొనుగోలు చేయడానికి ప్రజలకు సౌకర్యంగా ఉంటుందన్నారు.

సినీ కార్మికుల కోసం బన్నీ విరాళం

కరోనా వైరస్ భాదితులకు అండగా టాలీవుడ్ ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ చారిటీ కి ఇంకా విరాళాలు వస్తూనే ఉన్నాయి. టి వి స్టార్ చమ్మక్ చంద్ర , డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన చిన్మయి వంటి వారు కూడా తమకు తోచిన రీతిలో సాయం చేస్తూ ముందుకొస్తున్నారు. ఇంకా అనేక మంది ఉడతా భక్తిగా సి సి సి కి అండగా ఆర్ధిక సాయం చేస్తున్నారు.ఇదిలా ఉండగా మెగా ఫ్యామిలీ నుంచి మరోసారి విరాళం చేసేందుకు బన్నీ ముందుకొచ్చాడు.

ఇంతకు ముందు కరోనా విపత్తు కి తన వంతుగా 1 కోటి 25 లక్షలు విరాళంగా ఇచ్చిన అల్లు అర్జున్ ఇప్పుడు తెలుగు సినీ కార్మికుల సంక్షేమం కోసం మరో 20 లక్షలు ఇవ్వడానికి రెడీ అయ్యాడు. దీంతో బన్నీ విరాళం మొత్తం 1కోటి 45 లక్షలు గా లెక్క తేలింది. ఆ లెక్కన మెగా ఫ్యామిలీ వారి టోటల్ విరాళాలు కూడా 5కోట్ల 85 లక్షలు గా తేలింది . helping hands never say no

సీఎం సహాయనిధికి విరాళాల వెల్లువ

తెలంగాణలో కరోనా కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఇప్పటికే లాక్డౌన్ చర్యలు చేపట్టింది. కరోనా మహమ్మరి విషయంలో ప్రభుత్వం పకడ్బంధీ చర్యలు చేపడుతుంది. దీంతో పలువురు ప్రముఖులు తెలంగాణ సహాయనిధికి తమవంతు సహాయం అందించేందుకు ముందుకొస్తున్నారు. సోమవారం ఒక్కరోజే తెలంగాణ సీఎం సహాయనిధికి ఇప్పటివరకు 13కోట్ల విరాళాలు వచ్చినట్లు సమాచారం.

హెటిరో డ్రగ్స్ రూ.5 కోట్ల విరాళం, రూ. 5కోట్ల విలువైన మందులను అందించేందుకు ముందుకొచ్చింది. వాల్యూ ల్యాబ్స్ రూ.5.25 కోట్ల విరాళం, సువెన్ ఫార్మా కోటి రూపాయలు, ఎన్.సి.సి. లిమిటెడ్ కోటి రూపాయలు, శ్రీచైతన్య విద్యాసంస్థలు కోటి రూపాయలు, తెలంగాణ మోటార్ వెహికిల్స్ ఇన్స్ పెక్టర్ అసోసియేషన్ తరపున రూ.1.5 కోట్ల విరాళాలను ప్రకటించారు.

ఇందుకు సంబంధించిన చెక్కులను ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కు పలువురు విరాళాలకు సంబంధించిన చెక్కులను అందజేశారు. వీరిని ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. అదేవిధంగా పెద్దమొత్తంలో సీఎం సహాయనిధికి విరాళాలు ఇచ్చేందుకు ముందుకొస్తున్న దాతలకు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.

కరోనా వల్ల కడసారి చూపు కరువు

విజయవాడ సమీపంలోని కంచికచర్ల లో దారుణం చోటు చేసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి నివారించేందుకు విధించిన లాక్ డౌన్ కారణంగా కన్న తల్లిని చివరి చూపు చూడడానికి కుమార్తెకు అవకాశం లభించలేదు. హృదయ విధారకమైన ఈ సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే కంచికచర్ల కు చెందిన రామతులశమ్మ(80) నిన్న సాయంత్రం అనారోగ్యం తో మృతి చెందింది. ఆమె కుమార్తె గుంటూరు నగరంలోని ఏ.టి అగ్రహారం లో నివాసం ఉంటుంది. తల్లి మరణవార్త విని తల్లడిల్లిపోయిన ఆమె తల్లిని చివరిసారిగా చూసుకునేందుకు రావడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. గుంటూరు పోలీసులు, రెవెన్యూ అధికారులను అనుమతి కోరగా వారు అంగీకరించలేదు.

చేసేది లేక ఆమె బంధువులు స్మార్ట్ ఫోన్ లో వీడియో కాల్ లో కడసారి చూపు చూసుకుంది. తల్లిని చివరిసారిగా చూసుకొని కన్నీరు మున్నీరుగా విలపించింది.

పాకిస్తాన్ లో కరోనా

ప్రపంచం అంతా కరోనా వైరస్ దాటికి విలవిల్లాడి పోతోంది. చైనాలో మొదలైన ఈ మహమ్మారి అమెరికా , ఇటలీ , స్పెయిన్ , ఇరాన్ , దక్షిణ కొరియా, జర్మనీ వంటి దేశాలను వణికిస్తోంది ఇక ఇండియా లో కూడా కరోనా ప్రభావం బాగానే ఉంది అని చెప్పాలి. ఇంతవరకు సుమారు 1100 మందికి పైగా కరోనా బాధితులు లెక్క తేలగా 31 మంది దాకా మరణించారు .ఇదిలా ఉండగా మన దాయాది దేశమైన పాకిస్తాన్ లో కూడా కరోనా వైరస్ ప్రభావం బాగానే ఉంది.

కరోనా దెబ్బకు మన పొరుగున ఉన్న పాకిస్తాన్ లో ఇప్పటివరకు 1603 మంది పాజిటివ్ గా తేలగా 17 మంది మరణించి నట్టు తెలుస్తోంది. మరోవైపు దక్షిణ ఆసియా దేశాల్లో ఒక్క పాకిస్తాన్ లోనే కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. కాగా పాకిస్తాన్ దేశం లో విపత్కర పరిస్థితులు రోజు రోజుకి పెరుగుతున్నప్పటికీ ఆ దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించ లేదు. దాన్ని కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం చేశారు. నిజానికి పాకిస్తాన్ లోని వాస్తవ పరిస్థితులను అక్కడి ప్రభుత్వాలు కప్పి పుచ్చుతున్నాయి. అందులో ఎటువంటి సందేహం అక్కర లేదు .

భీష్ముడి సరసన ‘ధృవ’ తార

రామ్ చరణ్ సరసన ధృవ చిత్రం లో నటించి సూపర్ సక్సెస్ అందుకొన్న రకుల్ ప్రీత్ సింగ్ ఆ తరవాత ఎందుకో వెనుక బడింది. ధృవ చిత్రం అరవాత “విన్నర్ , రా రండోయ్ వేడుక చూద్దాం , స్పై డర్, జయ జానకి నాయక , ఎన్ టి ఆర్ కథానాయకుడు , మన్మధుడు 2 ” వంటి ఆరు చిత్రాలు చేస్తే వాటిలో ఒక్క `రా రండోయ్ వేడుక చూద్దాం ` మాత్రమే యావరేజ్ అయ్యింది . దాంతో అవకాశాలు తగ్గు ముఖం పట్టాయి.

కాగా ఇపుడు ఒక మంచి బ్యానర్లో హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చింది. `భీష్మ’ సినిమా విజయంతో మంచి జోరుమీద ఉన్న నితిన్ ఇపుడు మరోసారి అదే బ్యానర్లో ఇంకో చిత్రానికి కమిట్ అయ్యాడు. కాగా ఈ సినిమాలో కథానాయికగా రకుల్ ప్రీత్ సింగ్ ను ఎంపిక చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం తమిళం లో రెండు , హిందీలో రెండు సినిమాలు చేస్తోంది .

చెర్రీ భామపై కన్నేసిన ఎన్టీఆర్

‘ఆర్ఆర్ఆర్’ మూవీలో మెగాపవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. దర్శక దిగ్గజం రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘ఆర్ఆర్ఆర్’ మూవీని తెరకెక్కిస్తున్న సంగతి తెల్సిందే. ఈ మూవీలో ఎన్టీఆర్ కొమురంభీంగా, అల్లూరి సీతారామరాజుగా రాంచరణ్ కనిపించబోతున్నారు. ఎన్టీఆర్ కు జోడీగా హాలీవుడ్ భామ ఓలివీయా, రాంచరణ్ సరసన బాలీవుడ్ భామ అలియా భట్ నటిస్తున్నారు.

‘ఆర్ఆర్ఆర్’ మూవీ తర్వాత ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్లో మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీలో ఎన్టీఆర్ కు జోడీగా అలియాభట్ ను తీసుకోవాలని త్రివిక్రమ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ కూడా ఈ భామకు తీసుకునే విషయంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ 30వ చిత్రాన్ని హారిక-హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ మూవీ మే నెలలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ మూవీలో తొలుత ఎన్టీఆర్ కు జోడీగా రష్మిక మందన్న, పూజా హెగ్డే పేర్లు ప్రముఖంగా విన్పించాయి. అయితే తాజాగా అలియాభట్ తెరపైకి వచ్చింది.

కరోనా ఎఫెక్ట్ తో ప్రస్తుతం సినిమా షూటింగ్ లన్నీ వాయిదాపడ్డాయి. దీంతో అలియాభట్ ఇంటికే పరిమితమైంది. త్వరలోనే ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్లో పాల్గొననుంది. చెర్రీకి జోడీగా అలియాభట్ కనపించనుంది. ఇందులో చరణ్-అలియాభట్ మధ్య ఓ స్పెషల్ సాంగ్ ను చిత్రీకరించేందుకు రాజమౌళి ప్లాన్ చేసినట్లు తెల్సింది. ప్రస్తుతం అలియాభట్ బాలీవుడ్లో బీజీగా ఉంది. ప్రస్తుతం షూటింగ్ వాయిదాలతో ఆమె కాల్షీట్లు అటూఇటుగా మారే అవకాశం ఉంది. దీంతో ఎన్టీఆర్ మూవీలో ఆమె నటిస్తుందా? లేదా అనేది మాత్రం ఇప్పుడు చెప్పలేం. దీనిపై చిత్రబృందం త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం.

సీసీఎంబీలో రేపటి నుండే క‌రోనా టెస్టులు

భారత దేశంలోనే ప్రతిష్టాకరమైన పరిశోధన సంస్థ హైద‌రాబాద్‌ సీసీఎంబీలో క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల‌కు కేంద్రం గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది. దానితో రేప‌టి నుంచి సీసీఎంబీలో క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌నున్నారు. ప్ర‌తీరోజూ వెయ్యిమందికి ప‌రీక్ష‌లు చేసే సామ‌ర్థ్యం సీసీఎంబీలో ఉన్న‌ది.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న వారికి సీసీఎంబీలో పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాల‌ని గత వారం వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రధాని నరేంద్ర మోదీని కోరడం తెలిసిందే.

ముఖ్య‌మంత్రి విజ్ఞ‌ప్తి మేర‌కు అనుమ‌తులు ఇస్తున్న‌ట్లుగా కేంద్రం ప్ర‌క‌టించింది. కేంద్ర వైద్య పరిశోధన మండలి నుంచి సీసీఎంబీకి ఆదేశాలు జారీ అయ్యాయి. మంగ‌ళ‌వారం నుంచి కరోనా టెస్టులు చేయడానికి సిద్ధమవుతోంది.

గాంధీ ఆసుపత్రి నుంచి సీసీఎంబీకి శాంపిల్స్ పంపించేందుకు ఏర్పాట్లు కూడా ప్రారంభ‌మ‌య్యాయి. ప్రతి రోజూ 800 నుంచి 1000 కరోనా టెస్టులు నిర్వహించే సామర్థ్యంతో సీసీఎంబీ సిద్ధమైందని తెలుస్తోంది.

దేశంలోనే అత్యంత పార‌ద‌ర్శ‌క‌మైన‌ పరిశోధనా సంస్థలో కరోనా పరీక్షలు జరిపితే.. తాత్కాలిక ఉపయోగంతోపాటు పరిశోధనల దిశగా దీర్ఘకాలికంగా ఎంతో ప్ర‌యోజ‌నంగా వుంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ తొలి నుంచి చెబుతున్నారు.

నిత్యావసరాల పర్యవేక్షణకు కమాండ్ కంట్రోలు రూమ్

లాక్‌డౌన్ నేపధ్యంలో ప్రజలకు నిత్యావసర వస్తువులను సరఫరా చేయడంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కమాండ్ కంట్రోలు రూమ్ నుండి నిత్యం పర్యవేక్షిస్తున్నామని ప్రత్యేక అధికారి, మార్కెటింగ్ శాఖ ప్రత్యేక కమీషనర్ పి.ఎస్. ప్రద్యుమ్న తెలిపారు. విజయవాడలో సోమ‌వారం ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోలు రూం వద్ద వివరాలు వెల్లడిస్తూ… కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు లాక్ డౌన్ అమలవుతున్న పరిస్థితులలో ప్రజలకు నిత్యావసర వస్తువుల కొరత రాకుండా చూడటానికి కేంద్ర ప్రభుత్వం చేసిన సూచనల ప్రకారం ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ప్రతినిత్యం సమీక్షిస్తున్నారన్నారు. అందులో భాగంగా ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి కమాండ్ కంట్రోలు రూమును విజయవాడలో ఏర్పాటుచేశామన్నారు. కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో మార్కెటింగ్ కమీషనర్ పి.ఎస్. ప్రద్యుమ్న, చేనేత జౌళి శాఖ సంచాలకులు హిమాన్షు శుక్లా, సీనియర్ ఐపిఎస్ అదికారులు వినీత్ బ్రిజ్ లాల్, హరికృష్ణ, విశాల్ గున్నీ, మార్కెటింగ్ సెక్రటరీ మదుసూదనరెడ్డి తదితరులు అన్ని చర్యలు తీసుకుంటున్నారన్నారు. ప్రతి జిల్లాలో కూడా జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో ఇటువంటి కమాండ్ కంట్రోలు రూములు ఏర్పాటుచేస్తామన్నారు. కమాండ్ కంట్రోల్ రూం నుండి నిత్యావసర వస్తువులను సరఫరా చేస్తున్న వాహనాలకు ఎటువంటి ఆటంకం లేకుండాను, వ్యాపారులు అధిక ధరలకు అమ్మకుండా 24 గంటలు పర్యవేక్షిస్తున్నామన్నారు. సమస్యలు ఫిర్యాదులు తెలియజేయడానికి 1902 టోల్ ఫ్రీ నెంబరును ఏర్పాటుచేశామని ఇది 24/7 పనిచేస్తుందన్నారు. సరకు రవాణా చేస్తున్న వాహనాలకు ఏవైనా సమస్యలు ఎదురైనా, వ్యాపారులు అధిక ధరలకు అమ్ముతున్నా 1902 నెంబరుకు ఫోన్ చేస్తే వాటిని వెంటనే పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఆదివారం వరకు 1563 ఫిర్యాదులు అందాయని వాటిలో 1353 పరిష్కరించామన్నారు. ఆర్టిజిఎ లో వాటి స్టేటస్ ఎప్పటి కప్పుడు చూసుకోవచ్చని తెలిపారు. నిత్యావసర వస్తువులకు సంబంధించిన వాహనాల రాకపోకలలో రాష్ట్రంలోగాని లేదా ఇతర రాష్ట్రాలలోగాని ఏవైనా ఇబ్బందులుంటే తెలియజేస్తే తక్షణం స్పందించి పరిష్కరిస్తామన్నారు.

నిత్యావసర వస్తువులకు సంబంధించిన ఉత్పత్తి మరియు సరఫరా వంటివి నిర్వహిస్తున్న ప్రైవేటు సంస్థలలో పనిచేసే ఉద్యోగులకు రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఈ-పాస్లు ఇస్తామని కావలసినవారు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి వెంటనే జారీచేస్తామన్నారు. జిల్లాస్థాయిలో ధరల నిర్ణయించి మానిటరింగ్ చేయడానికి జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీలను ఏర్పాటుచేస్తున్నామన్నారు. నిర్ణయించిన ధరలకంటే ఎక్కువకు అమ్మకుండా జిల్లాస్థాయి కమిటీలు చూస్తాయన్నారు. రాష్ట్రంలో లాక్ డౌన్ కంటే ముందు 101 రైతు బజార్లు పనిచేస్తుండగా రద్దీని తగ్గించడానికి 350 తాత్కాలిక రైతుబజార్లు, 131 మొబైల్ రైతు బజార్లు ఏర్పాటుచేశామన్నారు. రోజుకు 20 వేల టన్నుల కూరగాయలు రైతుబజార్ల ద్వారా సరఫరా జరుగుతుండగా వాటిలో 20 శాతం డోర్ డెలివరీ ద్వారా ఇస్తున్నామన్నారు. నిత్యావసరాలను కావలసిన వారికి సూపర్ మార్కెట్ల ద్వారా డోర్ డెలివరీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని మునిసిపల్ కమీషనర్లకు ఆదేశాలిచ్చామన్నారు. కిరాణా వర్తకులు కూడా డోర్ డెలివరీకి తమకు అవకాశం కల్పించమని కోరారని కమర్షియల్ టాక్సు డిపార్టుమెంటు ద్వారా ఆదేశాలిస్తామన్నారు. ఈ కార్యకలాపాలన్నీ కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటెయిన్ చెయ్యడం ద్వారానే చెయ్యాలన్నారు. నిత్యావసరాలకు సంబంధించి ఇతర రాష్ట్రాల మార్కెట్లు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకొంటూ ఎప్పటికప్పుడు ఆ అధికారులతో చర్చిస్తున్నామన్నారు. ఉల్లికి మహారాష్ట్రతోను, కడప అనంతపురం జిల్లాల హార్టీకల్చర్‌కు సంబంధించి డిల్లీ అధికారులతో సంప్రదించి సమస్యలు లేకుండా చేశామన్నారు. నిత్యావసర సరుకుల సరఫరాకు ఎలాంటి అవరోధాలు లేకుండా అన్ని చర్యలు తీసుకొంటున్నామని ఆయన పేర్కొన్నారు. ట్రాలీ ఆటోలున్నవారు రైతుబజారులో దరఖాస్తు చేసుకుంటే మొబైల్ రైతు బజారుకు అనుమతినిస్తామని వారు 10 శాతం లాభంతో అమ్ముకోవచ్చన్నారు.

భారీ విరాళం ప్రకటించిన గంగూలీ!


భారతదేశాన్ని భయపెడుతున్న కరోనా వైరస్‌ పై పోరుకు దేశం మొత్తం ఏకమైంది. సామాన్యులు, సెలబ్రిటీలు, క్రికెటర్లు, వ్యాపారవేత్తలు, కంపెనీలు.. ఇలా అందరూ తమకు తోచినంత సాయం ప్రకటిస్తూ ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు. విపత్కర సమయంలో ఏకతాటిపైకి వచ్చి కరోనా మహమ్మారిపై యుద్ధానికి ముందుకొచ్చారు. ఇక, తాజా, మాజీ క్రికెటర్లు అయితే ఈ విషయంలో చాలా స్ఫూర్తిగా నిలుస్తున్నారు. తమకు తోచినంత సాయం ప్రకటిస్తూ మేమున్నామని హామీ ఇచ్చిన గంగూలీ ఈ రోజు భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ తరుపున పీఎం కేర్స్ ఫండ్‌ కు రూ. 51 కోట్ల విరాళం ప్రకటించారు.

అంతేకాకుండా తాను వ్యక్తి గతంగా మరో రూ. 50 లక్షల విలువైన బియ్యాన్ని విరాళంగా ఇచ్చాడు. టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ రూ. 50 లక్షల విరాళం ప్రకటించగా సురేశ్ రైనా రూ. 52 లక్షలు, అజింక్య రహానే రూ. 10 లక్షల సాయం ప్రకటించాడు. టీమిండియా సారథి విరాట్ కోహ్లీ కూడా తన వంతు సాయం అందిస్తానని ముందుకొచ్చాడు. భారత మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ తన ఎంపీల్యాడ్స్ నిధుల నుంచి రూ. 50 లక్షలు ఖర్చు చేస్తున్నట్టు చెప్పారు. 16 ఏళ్ల మహిళా క్రికెటర్ రిచా ఘోష్ లక్ష రూపాయలు ఇచ్చింది. బెంగాల్, ముంబై, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్లు కూడా పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటించాయి.

గుడ్ న్యూస్: వైజాగ్ వ్యక్తికి కరోనా నెగెటివ్!


ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో ఆరు కరోనా కేసులు న‌మోదు కాగా అందులో ఒక కేసు విశాఖ‌ప‌ట్నంలో నమోదయింది. ఈ రోజు ఆ కరోనా సోకిన వ్యక్తి కోలుకున్న ఘ‌ట‌న జిల్లావాసుల‌కు ఊర‌ట‌నిస్తోంది. అందులోనూ అతని వయసు 60 ఏళ్ళు కావడం విశేషం.

మార్చి 14న మ‌దీనా నుంచి విశాఖ‌కు వ‌చ్చిన ఆయ‌నకు క‌రోనా సోకింది. అత‌నికి చికిత్స అందిస్తున్న వైద్యులు మ‌రోసారి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా నెగెటివ్ అని తేలింది. దీంతో అత‌న్ని ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ విష‌యం గురించి టీబీసీడీ ఆసుప‌త్రి సూప‌రింటెండెంట్ డా.విజ‌య్ కుమార్ మాట్లాడుతూ.. “మార్చి 17న క‌రోనా ల‌క్ష‌ణాల‌తో ఓ వృద్ధుడు ఆసుప‌త్రిలో చేరాడు. అత‌నికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా మార్చి19న క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది.

తాజాగా సోమ‌, ఆదివారాలు వ‌రుస‌గా రెండుసార్లు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా నెగెటివ్ అని తేలింది. ప్ర‌స్తుతం అత‌ని ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద”ని పేర్కొన్నారు. కాగా అత‌నికి క‌రోనా ఉంద‌ని తెలియ‌గానే అప్ర‌మ‌త్త‌మైన యంత్రాంగం అత‌డి కుటుంబాన్ని క్వారంటైన్‌ లో ఉండాల‌ని ఆదేశించింది. అత‌ని కుటుంబ స‌భ్యుల‌తోపాటు వారిని క‌లిసిన‌వారికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించింది. అత‌ని ద్వారా ఆమె భార్య‌కు క‌రోనా సోకిన‌ట్లు తేల‌గా మిగ‌తావారికి నెగెటివ్ వ‌చ్చింది.

భారత్ వృద్ధి రేట్ 3.6 శాతంకు పడిపోతుంది

మొత్తం ప్రపంచాన్ని కకావికలం కావిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ ఆర్ధిక మందగమనంకు దారితీస్తున్నట్లు ఇప్పటికే ఐఎంఎఫ్ ప్రకటించింది. దానితో భారత్ ఆర్ధిక వ్యవస్థపై కూడా దుష్ప్రభావం చూపుతున్నది.

అన్ని రంగాలు కుదేలవుతున్న క్రమంలో అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీలు ఇప్పటికే భారత వృద్ధి రేటు అంచనాలు తగ్గించగా, తాజాగా దేశీయ క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీ సైతం వృద్ధి రేటు అంచనాలో భారీ కోత విధించింది. కరోనా ప్రభావంతో 2021 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 3.6 శాతానికి పరిమితమవుతుందని ఇండియా రేటింగ్స్‌ అంచనా వేసింది.

ఏప్రిల్‌ మాసాంతం వరకూ పూర్తి, లేదా పాక్షిక లాక్‌డౌన్‌ కొనసాగుతుందని,మే తర్వాతే ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా పుంజుకుంటాయని పేర్కొంది. ఏప్రిల్‌ 14 వరకూ లాక్‌డౌన్‌ ప్రకటించడం ఆర్థిక కార్యకలాపాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపనుండటంతో ఇండియా రేటింగ్స్‌ భారత వృద్ధి రేటు అంచనాల్లో భారీ కోత విధించింది.

జూన్‌ త్రైమాసంలో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు కేవలం 2.3 శాతంగా ఉంటుందని ఇండియా రేటింగ్స్‌ అంచనా వేసింది. టూరిజం, ఆతిథ్య, పౌరవిమానయాన రంగాలు దాదాపు కుప్పకూలిపోయే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేసింది.
చిన్న వ్యాపారాల్లో నగదు ప్రవాహం తగ్గిపోయిన పరిస్ధితి కనిపిస్తోందని పేర్కొంది.

ఆర్థిక సేవలు, ఐటీ, ఐటీ ఆధారిత రంగాలు మాత్రం మారిన పరిస్ధితులకు అనుగణంగా ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయిస్తున్నాయని పేర్కొంది. ధాన్యం, ఇతర పంటల కొనుగోలులో అవాంతరాలు రైతుల ఆదాయంపై గ్రామీణ డిమాండ్‌పై ప్రభావం చూపుతాయని అంచనా వేసింది.

నిర్మాణ రంగ కార్యకలాపాలు నిలిచిపోవడం రియల్‌ఎస్టేట్‌ రంగం సమస్యలను మరింత పెంచుతాయని పేర్కొంది. ఇక ముడిచమురు ధరలు దిగిరావడం భారత్‌కు కలిసివచ్చే అంశమని వ్యాఖ్యానించింది.

మరోవంక, ఐదు రోజుల సడలింపులతో నాలుగు దశల్లో మూడు లాక్ డౌన్లు అవసరమని కేంబ్రిడ్జ్ పరిశోధనలు చెబుతున్నాయి. మూడు వారాల లాక్ డౌన్ సరిపోదనే ప్రధానంగా నమ్ముతున్నామని, సడలింపులతో కూడిన లాక్ డౌన్ వల్ల క్తిగత నిర్బంధం, కాంట్రాక్ట్ ట్రేసింగ్, క్వారంటైన్ లాంటి నిబంధనలు సమర్ధవంత అమలు సాధ్యమని తద్వారా కేసుల సంఖ్య తగ్గుందని పరిశోధకులు పేర్కొన్నారు. లాక్ డౌన్ 21 రోజులు కాదు, 49 (21+28) రోజులకు పొడిగిండాలని కేంబ్రిడ్జ్ పరిశోధకులు చెబుతున్నారు.

అత్యవసర సేవలలో ఉన్న ప్రవేటు వ్యక్తులకు ఇ-పాస్ లు

కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో లాక్ డౌన్ అమలవుతుండగా అత్యవసర సేవలలో నిమగ్నమై ఉన్న ప్రవేటు వ్యక్తులతో సహా, వ్యవసాయ ఉత్పత్తుల సరఫరా కోసం ప్రభుత్వం కోవిడ్ 19 అత్యవసర పాస్ ను మంజూరు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ విషయానికి సంబంధించి స్పష్టమైన అదేశాలు చేయగా, అధికారులు దీనికి సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. ప్రధానంగా కోవిడ్ -19 అత్యవసర పాస్ ప్రైవేట్ రంగ కర్మాగారాలు, కార్యాలయాలు, సంస్థలలో పనిచేసే ఉద్యోగుల కోసం జారీ చేస్తారు. వ్యవసాయ, సహకార (MKTG II) విభాగం 26.03.2020 తేదీన జారీ చేసిన జిఓ ఆర్ టి నెంబర్ 289 లో జాబితా చేర్చబడిన వస్తు సేవల ఉత్పత్తి, సరఫరాలో నిమగ్నమై ఉన్న వారందరూ ఈ పాస్ పొందేందుకు అర్హులే. పాస్ కోసం సంస్థ యజమాని తనతో సహా ఉద్యోగుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే సంస్థ సిబ్బందిలో ఇరవై శాతం మాత్రమే పని చేయడానికి అర్హులు అయినందున కనిష్టంగా 5, గరిష్టంగా ఇ-పాస్ జారీ నిబంధనలు, షరతులకు లోబడి మంజూరు చేస్తారు.

ఈ పాస్ ల కోసం కరోనా వ్యాధి నివారణ సేవలలో ఉన్న వారంతా దరఖాస్తు చేయనవసరం లేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు, నిర్ణీత సమయంలో (ఉదయం 6 నుండి 11 వరకు) అవసరమైన వస్తువులు, సేవలను కొనుగోలు చేయడానికి వెళుతున్న సాధారణ ప్రజలు, తదనుగుణ వస్తు రవాణా వాహనాలు, వ్యవసాయ, ఉద్యాన, ఆక్వా ఉత్పత్తులను రవాణా చేసే రైతులకు ఈ పాస్ తో పని లేదు. మరోవైపు పాస్ పొందేందుకు సైతం ఎవ్వరూ కార్యాలయాలకు రానవసరం లేదని దీనిని పర్యవేక్షిస్తున్న ప్రత్యేక అధికారి , చేనేత, జౌళి శాఖ సంచాలకులు హిమాన్హు శుక్లా తెలిపారు. మొత్తం ప్రక్రియ ఆన్‌లైన్‌లో పూర్తి చేయవఛ్చని, https://gramawardsachivalayam.ap.gov.in/CVPASSAPP/CV/CVOrganizationRegistration పై క్లిక్ చేయడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. స్పందన పోర్టల్ వెబ్‌లింక్ (https://www.spandana.ap.gov.in/) ద్వారా కూడా పాస్ పొందగలుగుతారన్నారు. జిల్లా కంట్రోల్ సెంటర్ ఛైర్మన్, సంయిక్త కలెక్టర్ దరఖాస్తును పరిశీలించి ఆమోదము, తిరస్కరించే అధికారం కలిగి ఉంటారన్నారు.

నిబంధనలను అనుసరించి ఆమోదం పొందిన పాస్ ను ప్రత్యేక QR కోడ్‌తో SMS ద్వారా ఉద్యోగి మొబైల్ నంబర్ కు పంపుతామని, వెబ్-లింక్ క్లిక్ చేసినప్పుడు QR కోడ్‌తో సహా పాస్ కనిపిస్తుందని వివరించారు. చెక్ పోస్టుల వద్ద ఉన్న పోలీసు సిబ్బందికి క్యూఆర్ కోడ్ రీడర్ అందిస్తామని, తద్వారా పోలీసు అనుమతి లభిస్తుందని పేర్కొన్నారు. భధ్రతా ప్రమాణాల పరంగానూ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నామన్న హిమాన్హు శుక్లా ఈ పాస్ కు పాస్లో ఎన్క్రిప్టెడ్ క్యూఆర్ కోడ్ ఉందని, చెక్ పోస్టులలోని పోలీసు సిబ్బందికి క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయటమే కాక, అత్యవసర పాస్ యొక్క నిజాయితీని ధృవీకరించడానికి మొబైల్ అనువర్తనానికి అనుగుణమైన మెకానిజం ఉందని హిమాన్హు శుక్లా వివరించారు. ఎలాంటి ఫోర్జరీ, దుర్వినియోగంకు అవకాశం లేదన్నారు. పాస్ కోసం దరఖాస్తు చేసిన వారు తమ ఇబ్బందులను నమోదు చేసుకోవడానికి 1902కు పిర్యాధు చేస్తే అవి జాయింట్ కలెక్టర్‌కు దృష్టికి వెళతాయన్నారు.

గజినీ సరసన బుట్టబొమ్మ

అపజయాలే మన విజయానికి మెట్లు అన్న చందంలో కెరీర్ ఆరంభంలో వరుస అపజయాలు ఎదుర్కొన్న పూజా హెగ్డే ఇప్పుడు వరుస విజయాలు దక్కించుకొంటోంది. దరిమిలా ఊపిరి సలపనంత బిజీ గా మారింది. ప్రస్తుతం తెలుగు తెరపై పూజ హెగ్డే హవా నడుస్తోంది. ‘అరవింద సమేత’ ఆ తరవాత `మహర్షి` వంటి విజయాల తర్వాత తన విజయ పరంపర కొనసాగిస్తూ ‘అల వైకుంఠపురంలో’ సినిమాతో ఇండస్ట్రీ హిట్ ని తన ఖాతాలో వేసుకొంది ఈ ఏడాది త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 162 కోట్ల కు పైగా షేర్ సాధించి బాహుబలి 2 చిత్రం తరవాతి స్థానం ఆక్రమించింది.

ప్రస్తుతం బుట్ట బొమ్మ డార్లింగ్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్నపాన్ ఇండియా మూవీ లో నటిస్తోంది. అంతేగాక అఖిల్ అక్కినేని హీరోగా -బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రంలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. కాగా ఈ చిత్రం లో నటించేందుకు హీరో కంటే ఎక్కువ పారితోషకం తీసుకొంది.

అలా ఫుల్ స్వింగ్ లో నడుస్తోన్న బుట్టబొమ్మ కెరీర్ లో మరో సూపర్ ఆఫర్ వెతుక్కొంటూ వచ్చింది. తమిళ టాప్ డైరెక్టర్ లలో ఒకడైన సింగం ఫేమ్ హరి దర్శకత్వంలో నటించే చాన్సు దక్కించు కొంది. ఈ సినిమాలో హీరోగా గజినీ ఫేమ్ సూర్య హీరోగా నటిస్తున్నాడు.

కాగా ఈ చిత్రానికి ” ఆరువ “అని టైటిల్ పెట్టడం జరిగింది. కాగా ఈ చిత్రంలో హీరోయిన్ కి మంచి ప్రాధాన్యత వుంటుందట …ఇంతకీ అరువ అంటే తెలుసా …తెలుగులో పువ్వు లేదా పుష్పం అని అర్ధం వస్తుంది ..

లాక్ డౌన్ ఎఫెక్ట్… వాట్సాప్‌ ప్రియులకు షాక్!

కరోన భయంతో 21 రోజుల సంపూర్ణ లాక్ డౌన్ నేపథ్యంలో… ఇంట్లో ఖాళీగా ఉంటున్న నెటిజన్లు వాట్సాప్‌ స్టేటస్‌ లలో విపరీతంగా వీడియోలు అప్‌ లోడ్‌ చేస్తున్నారు. దీంతో సర్వర్లపై భారం పడి, వర్క్‌ ఫ్రం హో చేసేవారికి, అన్ లైన్ బిసినెస్ చేసే వారికి ఇంటర్నెట్ స్పీడ్ తగ్గిపోయింది. అందువల్ల వాట్సాప్‌ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయం ప్రకారం భారతీయ వినియోగదారులు ఇకపై 16 సెకన్ల కన్నా ఎక్కువ ఉంటే వీడియోలను వాట్సాప్ స్టేటస్ ద్వారా షేర్ చేయలేరు. 15 సెకన్ల వ్యవధి ఉన్న వీడియోలు మాత్రమే అనుమతించబడతాయి. ఈ విషయాన్ని వాబీటాఇన్‌ఫో వెల్లడించింది. ఇది భారతీయులకు మాత్రమే కావడం విశేషం.

లాక్ డౌన్ వల్ల ఇళ్లకే పరిమితమైన వారు నెట్‌ ని అధికంగా వినియోగించడం వల్ల వేగం కూడా తగ్గుతుందని.. ఇతర ముఖ్యమైన పనులు నిర్వహించుకోవడానికి ఇది అడ్డంకిగా మారే అవకాశం ఉండడం కూడా మరో కారణమని తెలుస్తోంది. ఇప్పటికే నెట్‌ వినియోగం పెరగడంతో ప్రముఖ వీడియో స్ట్రీమింగ్‌ సైట్లు, యాప్‌లు నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ వీడియో, యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌ వీడియో స్ట్రీమింగ్‌ క్వాలిటీని తగ్గించిన విషయం తెలిసిందే.

వాట్సాప్ స్టేటస్ లో పలు వీడియోలను, ఫోటోలను షేర్ చేసుకోవచ్చు. వినియోగదారుల నెట్‌వర్క్‌ లో ఉన్న వ్యక్తులకు వీటిని వీక్షించే అవకాశం వుంది. అలాగే ఈ స్టేటస్ లో షేర్ చేసిన ఇమేజ్ లు, జిఫ్స్, లేదా వీడియోలు 24 గంటల తర్వాత ఆటోమేటిగ్గా అదృశ్యమవుతాయి. వాట్సాప్ స్టేటస్ ను ప్రారంభించినపుడు 90 సెకన్ల నుండి మూడు నిమిషాల వీడియోలను అనుమతించింది. ఆ తరువాత, దీన్ని 30 సెకన్లకు తగ్గించింది. భారతదేశంలో 400 మిలియన్లకు పైగా వాట్సాప్ యూజర్లు ఉన్నారు.

సెలబెట్రీల కరోనా సాంగ్.. వైరల్

దేశంలోకి ప్రవేశించిన కరోనా మహమ్మరిని తరిమికొట్టేందుకు కేంద్రం లాక్డౌన్ చేపట్టింది. దీంతో వ్యాపార, వాణిజ్య, తదితర సంస్థలను మూతపడ్డాయి. కరోనా ఎఫెక్ట్ తో సినిమా షూటింగ్ లన్నీ వాయిదాపడ్డాయి. థియేటర్ల మూతపడ్డాయి. దీంతో పలువురు సినీ స్టార్లు సోషల్ మీడియాలో కరోనా నివారణకు తమవంతు బాధ్యతగా అవగాహన కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు టాలీవుడ్ స్టార్లు కరోనాపై సోషల్ మీడియాలో వీడియో సాంగ్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పాట వైరల్ అవుతోంది.

‘వి గోనా ఫైట్ విత్ కరోనా’ అంటూ సాగే పాటను సంగీతాన్ని కోటి అందించాడు. కోటినే ఈ పాటకు ట్యూన్ అందించి అలపించాడు. ఈ వీడియో సాంగ్లో మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సుప్రీమ్ హీరో సాయితేజ్ నటించారు. కరోనాపై అవగాహన కల్పించేలా పలు జాగ్రత్తలను సూచించారు.

సంగీత దర్శకుడు కోటి పాటకు మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వరుణ్ తేజ్, సాయితేజ్ వాళ్ల ఇళ్లలోనే ఉంటూ వీడియోను కవర్ చేయడం విశేషం. వీరందరి విజువల్స్ ను ఆకర్షణీయంగా ఎడిట్ చేసి పాటగా విడుదల చేశారు. దీంతో ఈ కరోనా పాట వైరల్ అవుతోంది. వీడియో రూపంలో కరోనాపై జాగ్రత్తలు సూచించడంపై వీరిందరిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.