వలస కార్మికులు ఎవరిని కదలనీయవద్దని, వారెక్కడ ఉన్నారో అక్కడనే వారికి వసతి, భోజన సదుపాయాలు కల్పించామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించినా వారి పరిస్థితులలో పెద్దగా మార్పు కనబడటం లేదు. సుదూర ప్రాంతాలలో ఆకలితో అలమటించడం కన్నా, సొంత ఉరికి వెళ్లి, కాలో గంజో తాగుతూ ప్రాణం నిలబెట్టుకుందామని గ్రామాల బాట పట్టిన పలువురు దారిలోనే మృతు వాత పడుతున్నారు.
ఎటువంటి రవాణా సదుపాయాలు లేకపోవడంతో కాలి నడకనే సుదూర ప్రాంతం వెళ్ళవలసి వస్తున్నది. దానితో దారిలోని తిండి దొరకకా, కరోనా వైరస్ కాకుండా ఆకలితో పలువురు చనిపోతున్నారు. మీడియా కధనాల ప్రకారం ఇప్పటికి కనీసం 22 మంది చనిపోయారు. ముంబై నుంచి వందల మంది కార్మికులు 600 కి.మీ దూరంలోని కర్ణాటకకు ప్రయాణమయ్యారు.
దేశవ్యాప్తంగా లక్షల మంది వలసజీవులు రోడ్లపై కాలినడకన సొంతూళ్లకు బయలుదేరారు. ఈ దృశ్యం 1947లో దేశ విభజన సమయంలో జరిగిన వలసలను గుర్తుచేస్తున్నదని పలువురు చెప్తున్నారు. చాలామంది ఆహారం దొరుకక, నడువలేక అనారోగ్యంబారిన పడుతున్నారు.
కాగా, వలస కూలీలపై రసాయనాలు స్ప్రే చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కేంద్రం ఆదేశాలు ఇవ్వడమే గాని, అవసరమైన వనరులు సమకూర్చక పోవడంతో రాష్ట్ర ప్రభుత్వాలు సహితం చేతులు ఎత్తేస్తున్నాయి.‘ఎక్కడివాళ్లు అక్కడే ఉండాలని ప్రభుత్వం చెప్తున్నది. కానీ.. తినడానికి తిండి కూడా లేనప్పుడు ఇక్కడుండి ఏం చేయాలి? మా పిల్లల్ని ఎలా బతికించుకోవాలి’ అని వాపోతున్నారు.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వలస కార్మికుల కోసం రూ 100 కోట్ల ప్యాకేజి ప్రకటించారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే 170కు పైగా శిబిరాలను వారికోసం ఏర్పాటు చేశారు. కానీ కేంద్రం ఏమి చేస్తున్నదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ముఖ్యంగా వలస కార్మికుల కోసం వేయి బస్సు లను పంపమన్న ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పై ఈ సందర్భంగా బీహార్ ప్రభుత్వం మండిపడుతున్నది. ఆయన వైఖరి కారణంగా ఆ ప్రభుత్వం ఒక విధంగా బలవంతంగా బీహార్ కు చెందిన కార్మికులను నెట్టి వేస్తున్నట్లు ఆరోపిస్తున్నది.
మరోవంక, కరోనా వైరస్ కన్నా కార్మికుల వలసే పెద్ద సమస్యగా తయారైందని, ఈ పరిస్థితుల్లో వలసలను నివారించడానికి ఏయే చర్యలు తీసుకుంటున్నారో మంగళవారానికి నివేదిక ఇవ్వాలని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని సోమవారం కోరింది.