Home Blog Page 8475

నారీ.. నారీ.. నడుమ రాకేష్ మాస్టర్..!


హీరోయిన్, బీజేపీ నాయకురాలు మాధవీలత, శ్రీరెడ్డి బాటలో నడుస్తున్నారు. రాకేష్ మాస్టర్ గతంలో వివాదస్పద నటి శ్రీరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో అప్పట్లో ఒకరిపై ఒకరు సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోసుకున్నారు. అప్పట్లో ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ శ్రీరెడ్డి అతడికి లీగల్ నోటీసులు కూడా పంపించింది. తాజాగా మాధవీలత కూడా రాకేష్ మాస్టర్ కు లీగల్ నోటీసులు పంపించేందుకు సిద్ధమవుతోంది. గత కొద్దిరోజులుగా రాకేష్ మాస్టర్ తనపై చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు ఎంతో బాధించాయని మాధవీలత తెలిపింది. ఆయన సోషల్ మీడియా వేదికగా తనకు క్షమాపణ చెప్పాలని లేకుంటే అతడిపై పరువు నష్టం కేసు వేస్తానని మాధవీలత ఫైరవుతోంది.

గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో రాకేష్ మాస్టర్ చేస్తున్న వ్యాఖ్యలు వైరల్ అవుతోన్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలోని సీనిపెద్దలు, ప్రముఖులపై కొన్నిరోజులుగా రాకేష్ మాస్టర్ ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆయన వీడియోలు వైరల్ కావడంతో ఇండస్ట్రీలో అతడి ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ తదితర సెలబ్రెటీలపై ఆయన వ్యక్తిగతగా దూషిస్తూ మాట్లాడటంతో వారి ఫ్యాన్స్ అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెల్సిందే. అయితే ఇటీవల శ్రీరెడ్డి, మాధవీలతపై కూడా దుర్భాషలాడటంతో వారిద్దరు లీగల్ ఫైట్ కు సిద్ధమయ్యారు. ఇప్పటికే శ్రీరెడ్డి అతడికి లీగల్ నోటీసులు పంపించింది. కాగా మాధవీలత కూడా అతడిపై పరువు నష్టం కేసు వేసేందుకు సిద్ధమవుతుంది. ఆయన తనకు క్షమాపణ చెప్పాలని లేకుంటే ఆయనతో లీగల్ గా తేల్చుకునేందుకు సిద్ధమేనంటూ స్పష్టం చేసింది. శ్రీరెడ్డి, మాధవీలత లీగల్ నోటీసులపై రాకేష్ మాస్టర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే..! వీరిద్దరు లీగల్ ఫైట్ తో ఏకమవడంతో అతడి పరిస్థితి నారీ.. నారీ.. నడుమ రాకేష్ మాస్టర్ అన్నట్లుగా మారింది.

మహానాడులో 14 తీర్మానాలు..!


తెలుగుదేశం పార్టీ డిజిటల్ మహానాడు కార్యక్రమం కొద్దిసేపటి క్రితం ప్రారంభయయ్యింది. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి టీడీపీ అధినేత చంద్రబాబు కార్యక్రమాన్ని ప్రారంభించారు. చంద్రబాబు సహా ముఖ్య నేతలు చాలా తక్కువ సంఖ్యలో పార్టీ కార్యాలయం నుంచి మహానాడులో పాల్గొటుండగా మిగిలిన వారంతా వారి వారి ప్రాంతాల నుంచి జూమ్ యాప్ లో లాగిన్ అయ్యి మహానాడులో పాల్గొననున్నారు. టీడీపీ ఏర్పడిన అనంతరం ఈ విధంగా మహానాడు నిర్వహించుకోవడం ఇదే తొలిసారి. నేడు, రేపు రెండు రోజుల పాటు ఈ మహానాడు జరగనుంది.

ఈ ఏడాది మహానాడుకు ఒక ప్రత్యేక ఉందని అధినేత చంద్రబాబు తెలిపారు. మొత్తం 14 వేల మంది నాయకులు, కార్యకర్తలు పాల్గొబోతున్నారని, 14 రాజకీయ తీర్మానాలు ఈ సమావేశాల్లో చేయనున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. సాంకేతిక పరిజ్ఞానం ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపిస్తున్నదనే తన విశ్వాసమని, డిజిటల్ మహానాడు ఇటువంటి దేనని చెప్పారు. మహానాడులో రెండు రోజుల్లో చర్చించాల్సిన అంశాలపై ముందుగా రూపొందించిన షెడ్యూల్ ప్రకారం చర్చలు ప్రారంభమయ్యాయి. పలువురు నాయకులు వారికి కేటాయించిన అంశాలపై ప్రసంగిస్తున్నారు.

తెలంగాణపైకి దూసుకొస్తున్న మిడతల దండు!

మహారాష్ట్ర నుండి గంటకు 12-15 కి.మీ. వేగంతో మిడతల దండు తెలంగాణపైకి దూసుకొస్తోందని వ్యవసాయ శాఖ కార్యదర్శి బి.జనార్దన్‌ రెడ్డి తెలిపారు. ఇప్పటికే కరోనాతో దేశం మొత్తం అతలాకుతలం అవుతుండగా.. మిడతల ముప్పు ఇప్పుడు తీవ్ర నష్టాన్ని కలిగిస్తోంది. ఉత్తరాదిలో పంటలను నాశనం చేసిన మిడతలు ఇప్పుడు తెలంగాణ వైపు వస్తున్నాయి. మహారాష్ట్ర నుండి మిడతల దండు తెలంగాణకు చేరుకునే అవకాశం ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ అప్రమత్తమైంది. మహారాష్ట్రలోని అమరావతి ప్రాంతంలో మిడతల దండును నియంత్రిస్తున్నట్లు అక్కడి అధికారులు తెలిపారని, అక్కడ నియంత్రణలోకి రాకపోతే అవి తెలంగాణకు వచ్చే అవకాశం ఉందని బి.జనార్దన్‌రెడ్డి తెలిపారు. మహారాష్ట్ర సరిహద్దు జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, భూపాలపల్లి, నిర్మల్‌ లలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయా జిల్లాల కలెక్టర్లు జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

మిడతల దండు గంటకు 12-15 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుందని, ఇవి చెట్ల మీద ఆవాసం ఏర్పరుచుకొని పంటలకు భారీ నష్టం కలిగిస్తాయని చెప్పారు. ఆఫ్రికా దేశాల నుంచి పాకిస్తాన్ మీదుగా రాజస్థాన్‌ లోకి మిడతలు చేరాయని.. గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, మహారాష్ట్రలకు విస్తరించి.. ఇప్పుడు రాష్ట్రంలోకి వచ్చే ప్రమాదం ఉందని వివరించారు.

మెగా ఫ్యామిలీలో విషాదం


మెగాపవర్ స్టార్ రాంచరణ్ భార్య, మెగా కోడలు ఉపాసన పుట్టింట్లో విషాదం నెలకొంది. బుధవారం ఉదయం ఉపాసన తాతయ్య కామినేని ఉమాపతిరావు(92) బుధవారం తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా ఉపాసన తన తాతయ్యను మిస్సవుతున్నానంటూ తన ట్వీటర్లో పోస్టు చేసింది. తాతయ్య కె.ఉమాపతి రావు (జూన్ 15, 1928-మే 27,2020) గొప్ప విలువలు, నిస్వార్థం, మానవతా మూర్తి అని కొనియాడారు. ఆయనకు హస్య చతురత కూడా ఎక్కువేనని గుర్తుచేసుకున్నారు. అంతేకాకుండా ఆయన ఊర్దూలో గొప్ప రచనలు చేశారని తెలిపారు. ఆయన రచనల గురించి ప్రత్యేక్కంగా చెప్పనక్కర్లేదని పేర్కొన్నారు.

నిజామాబాద్ లోని దోమకొండకు చెందిన ఉమాపతిరావు ఐఏఎస్ ఆఫీసర్ గా విధులు నిర్వహించారు. టీటీడీ తొలి ఈవోగా బాధ్యతలు చేపట్టారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. తాతయ్య తనకిచ్చిన స్ఫూర్తిని ఎల్లప్పుడు తలుచుకుంటానని ఆమె భావోద్వేగానికి గురయ్యారు. తాతయ్య ఆత్మకు శాంతి చేకూరాలంటూ ట్వీట్ చేశారు. దీంతో మెగా అభిమానులకు ఉపాసన తాతయ్య ఆత్మకు శాంతి చేకూరాలని కామెంట్లు పెడుతున్నారు. ఉపాసన కూడా తన తాతయ్యలాగే పేదవారికి వీలైనంత వరకు సాయం చేస్తూ అందరినీ మన్నలను పొందుతుంటారు. ఉమాపతిరావు కుటుంబానికి నెటిజన్లు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు.

https://www.instagram.com/p/CArWJ-ejrWc/

కేంద్రంపై మరో ఫిర్యాదుకు కేసీఆర్ సిద్ధం..


లాక్ డౌన్ మొదట్లో ప్రధాని నరేంద్ర మోదీని పొగడ్తలతో ముంచెత్తడమే కాకుండా ఇటువంటి సమయంలో దేశ ప్రధాని పట్ల దుర్భాషలాడిన వారిపై కేసులు నమోదు చేస్తామని కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు హెచ్చరించారు. అయితే ఆయన అనుకున్నట్లు కేంద్రం నుండి నిధులు రాకపోవడం, పైగా కరోనా టెస్ట్ లు తగ్గించి వైరస్ వ్యాప్తిని కప్పిపుచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని కేంద్రం నిలదీస్తూ ఉండడంతో చికాకు ప్రదర్శిస్తున్నారు.

కేంద్రం ప్రకటించిన ప్యాకేజిలలో సహితం రాష్ట్రానికి నేరుగా నిధులు ఇవ్వకుండా అనేక పథకాలతో లింక్ పెడుతూ ఉండడంతో ఆయన ఆగ్రహం పట్టలేక పోతున్నారు. తాజాగా కేంద్రం సూలు చేస్తున్న సెస్, సర్ చార్జీలతో రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని మండిపడుతున్నారు.

కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న సెస్, సర్‌ఛార్జీలతో ప్రతి ఏడాది తెలంగాణ రూ.3,000 కోట్ల మేర నష్టం వస్తున్నట్లు అంచనా వేశారు. పన్నులపై పన్నులు వసూలు చేయడం అసంబద్దమని అంటూ కేంద్రంపై పోరుకు సిద్దపడుతున్నారు. కేంద్రం వసూలు చేస్తోన్న సెస్ ఓ గోల్‌మాల్ అని ఇటీవల సీఎం కేసీఆర్ ఓ మీడియా సమావేశంలో పేర్కొనడం గమనార్హం.

పైగా, సమాఖ్య ఆర్థిక స్ఫూర్తికి విరుద్ధమని విమర్శలు కురిపిస్తున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 270 ప్రకారం కేంద్ర ప్రభుత్వాలు వసూలు చేస్తున్న వివిధ రకాల సెస్‌లలో రాష్ట్రాలకు వాటా పంచాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉండదు. అయితే రోడ్ సెస్, సర్వశిక్షా అభియాన్ల నుంచి మాత్రం కొంత మొత్తం రాష్ట్రాలకు చేరుతోంది.

1980-81 వరకు మొత్తం టాక్స్ రెవెన్యూలో 2.3 శాతం మాత్రమే సెస్ వసూళ్ళు ఉండేవి. నెమ్మదిగా పెరుగుతూ 15వ ఆర్థిక సంఘం అంచనాల ప్రకారం 2020-21 ఆర్థిక సంవత్సరానికి అవి 17.8 శాతానికి చేరాయి. కేంద్రం అనుసరించాలనుకుంటున్న వన్ నేషన్, వన్ టాక్స్ విధాన స్ఫూర్తికి ఇది పూర్తిగా విరుద్ధమని కేసీఆర్ భావిస్తున్నారు.

అందుకే 15 వ ఆర్థికసంఘం దృష్టికి ఈ విషయాన్ని మరోసారి తీసుకెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. కేంద్రం వసూలు చేసే సెస్, సర్ ఛార్జీల్లో రాష్ట్రాలకు వాటా ఇవ్వాలని డిమాండ్ చేయడానికి సిద్దపడుతున్నారు. అయితే సెస్‌లు, సర్ ఛార్జీల్లో రాష్ట్రాలకు వాటా దక్కాలంటే రాజ్యాంగ సవరణ తప్పనిసరి కాగలదు.

2014-15 ఆర్థిక సంవత్సరం వరకు ఒక రూ.1.15 లక్షల కోట్లుగా ఉన్న సెస్‌లు, సర్ చార్జీల వసూళ్లు ఏకంగా రూ 3.5 లక్షల కోట్లకు పెరిగాయి. అసలు రాష్ట్రాల జాబితాలో ఉన్న అంశాలకు కేంద్రం సెస్ వసూలు చేయడం నిబంధనలకు విరుద్ధమని కేసీఆర్ వాదిస్తున్నారు.

‘శ్రామిక్ స్పెషల్’ రైళ్లపై కేరళ మండిపాటు


వలస కూలీలను తరలించడానికి నడుపుతున్న “శ్రామిక్ స్పెషల్” రైళ్ల తీరుతెన్నులపై మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాలు తెలపగా తాజాగా కేరళ ప్రభుత్వం కూడా చేరింది. ముందస్తుగా సమాచారం ఇవ్వకుండా తమ రాష్ట్రానికి ఆ రైళ్లను పంపడం పట్ల సీఎం పినరాయి విజయన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై ఆయన ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ వ్రాసారు.

దీనిపై తాజాగా కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్ కూడా స్పందిస్తూ కరోనా వైరస్ కు కేరళ సూపర్ స్ప్రెడర్ లా మారాలని రైల్వేస్ కోరుకుంటోందని ధ్వజమెత్తారు. ‘గత వారం ముంబై నుంచి ఓ రైలు వచ్చింది. ఆ రైలు జర్నీ ప్రారంభమైన తర్వాతే అది వస్తోందన్న విషయం మాకు తెలిసింది.

పైగా, ఆ రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణీకులతో అత్యధికులకు పాస్ లు లేవు. మహమ్మారి చెలరేగుతున్న ఈ రైలులో ఇది అరాచకం. రైల్వేలు కేరళను వైరస్ సూపర్ స్ప్రెడర్ గా చేయాలనుకుంటోంది. అరవడం ఆపి.. బాధ్యతగా ప్రవర్తించండి. కనీసం రైళ్లను ట్రాక్ చేయడానికైనా యత్నంచండి అంటూ ఆయన కేంద్రానికి హితవు చెబుతూ ట్వీట్ చేశారు.

మహారాష్ట్ర నుంచి ఎంత మంది, ఎప్పుడు వస్తున్నారనే దానికి సంబంధించి కనీసం తమకు జాబితే ఇస్తే అందుకు అవసరమైన స్క్రీనింగ్, హోం క్వారంటైన్ లాంటి ఏర్పాట్లను చేసుండే వాళ్లమని సీఎం విజయన్ తెలిపారు. కేరళలో కరోనా కేసుల సంఖ్య 896 గా నమోదైంది. ఇటీవలే మహారాష్ట్ర నుంచి తిరిగొచ్చిన వారిలో 72 మందికి పాజిటివ్ గా తేలింది.

మరోవంక, ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సహితం శ్రామిక్ రైళ్ల తీరుపై తప్పుబడుతూ ట్వీట్ చేశారు. కనీసం 40 రైళ్లు తమ గమ్య స్థానానికి కాకుండా 100 కిమీ కు దూరం వెళ్లిపోయాయని పేర్కొన్నారు. చాల రైళ్లు కనీసం 20 గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయని, వాటిల్లో ప్రయాణికులకు ఆహార సదుపాయం కూడా లేదని చెప్పుకొచ్చారు.

రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తమ పార్టీకి నిధుల సేకరణ నుండి రైళ్ల నడవడికపై దృష్టి సారించాలని హితవు చెప్పారు. సొంత ఉరుకు పంపమని అలజడి చేస్తున్న వలస కార్మికులను శిక్షించాలని అనుకొంటున్నారా అంటూ ప్రశ్నించారు.

రాముడి గెటప్ లో సూపర్ స్టార్.. పోస్టర్ వైరల్..


సోషల్ మీడియాలో నిత్యం సూపర్ స్టార్ సంబంధించి ఏదో ఒక న్యూస్ వైరల్ అవుతూనే ఉంటుంది. లాక్డౌన్ కారణంగా షూటింగులు వాయిదాపడటంతో మహేష్ బాబు ఇంటికే పరిమితమయ్యారు. కలిసొచ్చిన ఈ సమయాన్ని ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంట్లో మహేష్ చేసే సరదా సంఘటనలను మహేష్ భార్య నమ్రత ప్రతీరోజు సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటోంది. మహేష్ కూడా తన ఇన్ స్ట్రాలో ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే పిక్స్ పోస్టు చేస్తుంటాడు. మహేష్-నమ్రత, మహేష్-సితార, మహేష్-గౌతమ్ అల్లరికి సంబంధించిన విషయాలు ఇప్పటికే లాక్డౌన్ కాలంలో చాలానే వచ్చాయి. ఇవన్నీ కూడా మహేష్ ఫ్యాన్స్ ను బాగా అలరించాయి.

తాజాగా మహేష్ కు సంబంధించిన ఓ పిక్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. మహేష్ బాబును ఎప్పుడు చూడని గెటప్ లో.. అది కూడా పౌరాణిక పాత్రలో కన్పించి అందరినీ సర్ ప్రైజ్ చేశాడు. రాముడి గెటప్ లో మహేష్ బాబు కన్పించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఓ అభిమాని మహేష్ బాబును రాముడి పాత్రలో ఊహించి తీర్చిదిద్దని పోస్టర్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. మహేష్ బాబు ప్రస్తుతం దర్శకుడు పరశురామ్ తో ఓ మూవీ చేయనున్నాడు. దర్శకుడు రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత మహేష్ బాబుతో ఓ మూవీ చేయనున్నట్లు రాజమౌళి ఇటీవలే ప్రకటించాడు.

‘ఆర్ఆర్ఆర్’ తర్వాత దర్శక దిగ్గజం రాజమౌళి భారీ బడ్జెట్లో ‘రామాయణం’ మూవీ తీయనున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్లో నిర్మిస్తారని ఫిల్మ్ నగర్లో టాక్ విన్పిస్తుంది. ఈ ప్రచారం నేపథ్యంలో ఓ అభిమాని మహేష్ ను రాముడి గెటప్ లో ఊహిస్తూ పోస్టర్ ను రూపొందించాడు. రాముడి గెటప్ లో ప్రిన్స్ మహేష్ బాబు అద్భుతంగా ఉన్నారు. దీంతో ఈ పోస్టర్ ను మహేష్ బాబు ప్యాన్స్ షేర్ చేస్తున్నారు. దీంతో ఈ పిక్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.

ఎల్జీ పాలిమర్స్‌లో ప్రమాదం జరగడానికి కారణాలు ఇవే..!


ఎల్జీ పాలిమర్స్‌లో ఈ నెల మొదటి వారంలో విషవాయువు లీక్ అయి 12 మంది మృతి చెందడానికి దారితీసిన సంఘటన అనుకోకుండా జరిగిన ప్రమాదం కాదని, బాధ్యత గల అధికారులు `ప్యాకేజి’ తనిఖీలతో భద్రతా ప్రమాణాలను పట్టించుకోకుండా కొంపముంచారని ఏపీ ప్రభుత్వం నీయమించిన ఉన్నతస్థాయి అధికారుల కమిటీ నిర్ధారించింది.

సీనియర్ ఐఎఎస్ అధికారి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ అధ్యక్షతన ఏర్పాటైన హై పవర్‌ కమిటీ ఫ్యాక్టరీస్‌, కాలుష్య నియంత్రణ మండలి, అగ్నిమాపక విభాగాల నుంచి సరైన తనిఖీ విధానాలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తేల్చిచెప్పింది. పైగా, వాళ్లంతా ఏమి జరుగుతుందో చెబుతున్నారే తప్ప, బాధ్యతగల అధికారులుగా పనిచేయలేదని మండి పడింది.

వీరికి ఆ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులతోపాటు ఆ ప్రాంత ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత కూడా ఉందని, కానీ అందుతున్న ‘ప్యాకేజీ’లతో వాటిని విస్మరించారని ఆరోపించింది. వీరి నిర్వాకం కారణంగానే ఎల్జీ పాలిమర్స్‌ కంటే ముందు విశాఖ జిల్లాలో గత ఆరు నెలల్లో పలు ప్రమాదాలు జరిగి 40 మంది వరకు మృతి చెందారని ఈ సందర్భంగా వెల్లడించింది. వీటిపై కూడా విచారణలు జరిపించి నిజం నిగ్గు తేల్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.

ఎల్జీ పొలిమెర్స్ లో ప్రమాణాల మేరకు అర్హత గల వ్యక్తులు లేనేలేరని తేల్చి చెప్పింది. సంస్థలో కాంపిటెంట్‌ సూపర్‌వైజర్‌ గా ముంబై సెంట్రల్‌ ల్యాబ్‌ ఇనిస్టిట్యూట్‌ సర్టిఫై చేసిన వ్యక్తే ఉండవలసి ఉండగా లేరు. అట్లాగే ఇండస్ట్రియల్‌ హైజీన్‌లో నిష్ణాతులైన మెడికల్‌ ఆఫీసర్‌ ఉండి యాంటీడోట్స్‌ జాగ్రత్త చేయాల్సి ఉండగా, అది కూడా అమలు చేయలేదని కమిటీ తెలిపింది.

అసలు భద్రతాపరమైన సన్నద్ధత గురించి ఫ్యాక్టరీ యాజమాన్యం గాని, బాధ్యులైన అధికారులు గాని ఏమాత్రం పట్టించుకోవడం లేదని చెబుతూ గత పదేళ్లలో ఒక్కసారి కూడా ఎల్జీ పాలిమర్స్‌ వెంకటాపురంలో మాక్‌ డ్రిల్‌ నిర్వహించలేదని ఈ కమిటీ తేల్చి చెప్పింది.

విశాఖపట్నంలో ప్రభుత్వ సంస్థలైన హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, గెయిల్‌, నేవీ వంటివి మాక్‌ డ్రిల్స్‌ నిర్వహిస్తుండగా, కోరమండల్‌ ఇంటర్నేషనల్‌, ఆంధ్రా పెట్రో కెమికల్స్‌, ఎల్జీ పాలిమర్స్‌ వంటివి కూడా ఆ పని చేయడం లేదని వెల్లడించింది.

ఎల్జీ పాలిమర్స్‌ లో ప్రమాదం జరగడానికి డిప్యూటీ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ (డీసీఐ) విశాఖపట్నం అధికారి కేబీఎస్‌ ప్రసాద్‌ నిర్లక్ష్యమే కారణమని నీరబ్ కుమార్ ప్రసాద్ కమిటీ నిగ్గు తేల్చింది. రసాయన పరిశ్రమలను ఎలా నడపాలో, ఎమర్జెన్సీ ప్లాన్‌లు ఎలా రూపొందించాలో, మాక్‌డ్రిల్స్‌ ఎలా నిర్వహించాలో తెలియని వ్యక్తిని నిబంధనలకు విరుద్ధంగా నియమించారని కమిటీ తప్పుపట్టింది.

డిసిఐ ప్రతి ఏటా ఫ్యాక్టరీలో భద్రతా పర పరిస్థితులపై తనిఖీ చేయవలసి ఉండగా నాలుగేళ్ల క్రితం ఒక సారి తనిఖీ చేసిన ప్రసాద్ నివేదికను సమర్పించని లేదని విస్మయం వ్యక్తం చేసింది. ఆ తర్వాత రెండేళ్లు ఎవ్వరు చేయలేదని, గత ఏడాది ప్రసాద్ తిరిగి చేసినా అసంపూర్తిగా నివేదిక ఇచ్చారని అంటూ కమిటీ వివరించింది.

హైదరాబాద్ లో కరోనా కట్టడిలో సమన్వయ లోపం


గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా కేసుల సంఖ్య నానాటికి పెరుగుతున్నా కట్టడిలో అధికారుల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తున్నది. జీహెచ్‌‌ఎంసీ, మెడికల్‌‌, పోలీస్ శాఖల తీరు ఎవరికి వారే అన్నట్టుగా సాగుతోంది.

కంటెయిన్మెంట్ల నిర్వహణలోని అధికారులు తీవ్రంగా వైఫల్యం చెందుతున్నారు. గ్రేటర్‌‌లో కేసులు భారీగా పెరుగుతుండగా, కట్టడిపై ఫోకస్ చేయడంలో అధికారులు విఫలం అవుతున్నారు. పాజిటివ్‌‌ కేసు నమోదైన చోట కంటెయిన్మెంట్‌‌ జోన్లు ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంటున్నారు. గడువు ముగిశాక ఎత్తేస్తున్నారు.

మొన్నటిదాకా ఉన్న కంటెయిన్మెంట్‌‌ జోన్ల స్వరూపం కాస్త హోం క్వారంటెయిన్ గా మారింది. ఒకటి, రెండు ఇండ్లకు మాత్రమే బారికేడ్లు పెట్టి రాకపోకలు బంద్ పెడుతున్నారు. స్థానికులు బయట తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు.

వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఉన్నతాధికారులు సమీక్షలు అయితే నిత్యం జరుగుతూనే ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో లో మాత్రం నిర్ణయాలు పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. లోపాలను పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం గ్రేటర్‌‌ పరిధిలో 100 వరకు హోమ్‌‌ క్వారంటెయిన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. అవి ఎక్కడెక్కడున్నాయో కూడా అధికారులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు.

హోం క్వారంటెయిన్లో ఉన్న వాళ్లు బయట తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. ఉల్లంఘనలకు బాధ్యత వహించాల్సిన అధికారులు ఒక శాఖపై మరొకరు నెట్టేసుకుంటున్నారు. వారి బాధ్యత ఎవ్వరితో అన్న విషయమై స్పష్టత కనబడటం లేదు.

కంటెయిన్మెంట్‌‌ జోన్లలో కొత్త కేసులు నమోదవడం లేదని, ఆంక్షలు సడలిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న వాటి వివరాలు మాత్రం చెప్పడం లేదు.

జూన్ లోనూ నగదు, బియ్యం పంపిణీకి ఆదేశాలు!

Free Ration in Telangana

 

Free Ration in Telangana

కరోనా వ్యాప్తి నేపథ్యంలో గత రెండు నెలలుగా లాక్‌ డౌన్ కొనసాగుతోంది. ఈ లాక్ డౌన్ వల్ల పేదలు, వలస కూలీలు ఆకలితో ఆలమటించకూడదన్న లక్ష్యంతో సిఎం కేసీఆర్ తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ. 1500 చొప్పున నగదు, ప్రతి వ్యక్తికి 12 కిలోల చొప్పున బియ్యం పంపిణి చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా జూన్ నెలలోనూ పేదలకు ఉచిత నగదు, బియ్యం పంపిణీ కొనసాగించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఈ మేరకు పౌరసరఫరాల శాఖకు ఇప్పటికే మౌఖిక ఆదేశాలు జారీ చేశారని తెలుస్తోంది.

 

రాష్ట్రంలో మొత్తం 87.55 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. వారికి ఏప్రిల్, మే నెలలో ఉచితంగా నగదు పంపిణీతో పాటు బియ్యం అందజేసింది. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ కార్డు లింక్ అయిన వారికి గత నెలలో 74.07 లక్షల మంది కుటుంబాలకు, ఈ నెలలో 74.35 లక్షల మంది కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా రూ.1500 నగదుతో పాటు బియ్యం పంపిణీ చేసింది. దీని కోసం ప్రతి నెలా రాష్ట్ర ప్రభుత్వం రూ.2500 కోట్లను వెచ్చించింది. కాగా రాష్ట్రంలో నాలుగవ విడత లాక్‌ డౌన్ ఈ నెల 31వ తేదీ నాటితో ముగియనుంది. అయినప్పటికీ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య ఆశించిన స్థాయిలో తగ్గడం లేదు. పైగా జిహెచ్‌ఎంసి పరిధిలోని జిల్లాల్లో కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. దీని ప్రభావం పొరుగు జిల్లాలోనూ కనిపిస్తోంది.

 

అలాగే వలస కూలీలు కూడా మన రాష్ట్రానికి పెద్దసంఖ్యలో వస్తున్నారు. వారి వల్ల కూడా కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మరోసారి లాక్‌ డౌన్‌ ను పొడగించే అవకాశాలు అధికంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ లాక్‌ డౌన్ కారణంగా ఇప్పటికే పేదలు పలు రకాల ఆర్ధిక ఇబ్బందులతో అల్లాడుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని సిఎం కెసిఆర్ మరోసారి వారిని ఆదుకోవాలని నిర్ణయించారు. జూన్ నెలలో కూడా లబ్దిదారులందరికి ఉచితంగా బియ్యం, నగదు ఇవ్వాలని సిఎం ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. దీనిపై బుధవారం జరిగే ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.

ప్రమాద ఘంటికలు మోగిస్తున్న కరోనా


భారత్‌లో నాలుగో విడత లాక్ డౌన్ మరో నాలుగు రోజులలో ముగుస్తుంది. ఇప్పటికే చాలావరకు సడలింపులు ఇచ్చారు. మరిన్ని ఇవ్వడానికి సిద్దపడుతున్నారు. కానీ రోజు రోజుకు ఈ వైరస్ తీవ్రరూపం దాలుస్తోంది. రోజులు గడిచేకొద్దీ కేసుల నమోదు సంఖ్యలో భారీ పెరుగుదల కనిపిస్తూ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.

ఇప్పుడు ఈ వైరస్ తీవ్రంగా ఉన్న టాప్ 10 దేశాలలో ఒకటిగా భారత్ చోటు సంపాదించింది. మంగళవారం నాటికి దేశంలో 1,45,380 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా, 4,167 మంది వైరస్‌ భారిన పడి మృతిచెందారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. 24 గంటల వ్యవధిలో 6,535 కేసులు నమోదు కాగా, 146 మంది మృత్యువాత పడ్డారని తెలిపింది.

సోమవారం నాటికి భారత్‌ కరోనా మహమ్మారితో తీవ్రంగా ప్రభావితమైన టాప్‌ 10 దేశాల జాబితాలో చేరింది. అదే రోజువారీగా నమోదవుతున్న కేసుల పెరుగుదలను పరిగణనలోకి తీసుకుంటే భారత్‌ నాలుగో స్థానంలో ఉంది. రోజువారీగా భారత్‌ కంటే ఎక్కువ కేసులు వస్తున్న దేశాల్లో భారత్‌ కంటే అమెరికా, బ్రెజిల్‌, రష్యాలు ముందున్నాయి.

దీన్ని బట్టి చూస్తుంటే లాక్‌డౌన్‌ ఆంక్షలను సడలించిన తర్వాత దేశంలో కరోనా జడలు విప్పిన విషయం స్పష్టమౌతోంది. అప్పటివరకూ 2, 3, 4 వేల మధ్య నమోదవుతున్న కేసులు ఇటీవల వారం రోజులుగా మరింత తీవ్రమై 5, 6 వేలకు పైగా నిర్దారణ అవుతుండడం గమనార్హం.

దేశంలో కరోనా యాక్టివ్‌ కేసులు 80,722కు పెరగ్గా, రికవరీ అయిన వారి సంఖ్య 60,490 గా ఉదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. కరోనా బాధితుల్లో కోలుకుంటున్న వారి శాతం 41.61కు చేరిందని మంత్రిత్వశాఖకు చెందిన సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. గ్లోబల్ రికవరీ రేటు కూడా దాదాపు అదే విధంగా ఉండడం గమనార్హం. మే 25 నాటికి ప్రపంచవ్యాప్తంగా కరోనా భారిన పడిన వారిలో 41.84 శాతం మంది కోలుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

మహారాష్ట్రలో కరోనా పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయి. దేశంలో చోటుచేసుకున్న కరోనా మరణాల్లో 1,695 మరణాలతో ఆ రాష్ట్రం మొదటిస్థానంలో ఉంది. తరువాతి స్థానాల్లో గుజరాత్‌ (888), మధ్యప్రదేశ్ ‌(300), పశ్చిమబెంగాల్‌ (278), ఢిల్లీ (276)లు ఉన్నాయి. మిగిలిన రాష్ట్రాల్లో రెండు, మూడు అంకెల్లో ఉన్న మరణాల సంఖ్య కేరళలో నాలుగ్గా ఉంది.

దాదాపు 70 శాతం మేర మరణాలు బాధితులకు ఉన్న సహ అనారోగ్యాల కారణంగా సంభవించాయని మంత్రిత్వశాఖ వెబ్‌సైట్‌ పేర్కొంది. ఇక కేసుల నమోదు గణాంకాలను పరిశీలిస్తే మహరాష్ట్రలో అధిక స్థాయిలో 52,667 పాజిటివ్‌ కేసులు తేలగా ఆ సంఖ్య తమిళనాడులో 17,082, గుజరాత్‌లో 14,460, ఢిల్లీలో 14,053, రాజస్థాన్‌లో 7,300, మధ్యప్రదేశ్‌లో 6,859, ఉత్తరప్రదేశ్‌లో 6,532గా ఉంది.

తెలంగాణ‌లో 2 వేలకు చేరువ‌లో క‌రోనా కేసులు


తెలంగాణ‌లో క‌రోనా వైరస్ రోజు రోజుకీ విజృంభిస్తోంది. రాష్ట్రంలో క‌రోనా కేసుల సంఖ్య 2 వేల‌కు చేరువైంది. గ‌డిచిన 24 గంట‌ల్లో భారీగా 71 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం క‌రోనా కేసులు 1991కి చేరాయి.

మంగ‌ళ‌వారం రాత్రి 8 గంట‌ల‌కు రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన రోజువారీ బులిటెన్ ప్రకారం అత్య‌ధికంగా జీహెచ్ఎంసీ ప‌రిధిలో 38 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. రంగారెడ్డి జిల్లాలో 7, మేడ్చ‌ల్ 6, సూర్యాపేట్, వికారాబాద్, న‌ల్ల‌గొండ‌, నారాయ‌ణపేట్ జిల్లాల్లో ఒక్కొక్క‌టి చొప్పున కొత్త కేసులు వ‌చ్చాయి. అలాగే 12 మంది వ‌ల‌స కార్మికుల‌కు, ఇటీవ‌ల విదేశాల నుంచి తిరిగొచ్చిన న‌లుగురికి పాజిటివ్ వ‌చ్చింది.

గ‌డిచిన 24 గంట‌ల్లో భారీగా క‌రోనా పేషెంట్లు రివ‌క‌రీ అయ్యారు. ఒక్క రోజులో 120 మంది కోలుకుని ఇంటికి వెళ్లారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1284కు చేరింది. ఇవాళ కొత్త‌గా ఒక క‌రోనా పేషెంట్ మ‌ర‌ణించ‌డంతో మొత్తం మృతుల సంఖ్య 57కు పెరిగింది. ప్ర‌స్తుతం ఆస్ప‌త్రుల్లో 650 మంది చికిత్స పొందుతున్నారు.

కాగా, కొద్ది వారాలుగా కొత్త కేసులు లేని మేడ్చ‌ల్, సూర్యాపేట్, వికారాబాద్, న‌ల్ల‌గొండ‌, నారాయ‌ణ పేట్ జిల్లాల్లో మ‌ళ్లీ క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో గ‌డిచిన 14 రోజులుగా కొత్త కేసులు న‌మోదు కాని జిల్లాల సంఖ్య 21కి త‌గ్గింది.

ఆస్తులుపై శ్వేతపత్రం విడుదల చేయండి..!


టిటిడి ఆస్తుల వేలంపై ప్రభుత్వం వెనక్కి తగ్గిన ఆ నిర్ణయం వల్ల తలెత్తిన సమస్యలు తగ్గడం లేదు. దేవాలయాల ఆస్తుల పరిరక్షణకు ఎప్పటికైనా చర్యలు చేపట్టాలని ప్రభుత్వంపై వత్తిడి పెరిగింది. బీజేపీ జనసేన పార్టీలు మంగళవారం ఉపవాస దీక్షలు కొనసాగించాయి. ఆస్తుల వేలం తాత్కాలికంగా మాత్రమే నిలుపుదల ఇది సమస్యకు పరిష్కారం కాదని ఆ పార్టీల న్యాయకులు అంటున్నారు. ఏ దేవాలయ ఆస్తుల విక్రయానికి అవకాశం లేకుండా ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇది ఇలా ఉండగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి స్వామి పరిపూర్ణానంద బహిరంగ లేఖ రాశారు. టిటిడి ఆస్తుల వేలం నిలిపినందుకు కృతజ్ఞతలు తెలిపారు. భక్తులు ఆందోళనకు రాకముందే సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. ఇప్పటిదాకా పని చేసిన ముఖ్యమంత్రులు దేవాలయాలకు హిందువులకు ఒరగబెట్టింది ఏమీ లేదని పేర్కొన్నారు. వారి నిర్వాకం వల్లే 5 లక్షల కోట్ల పంట భూములు లెక్కలేని ఆభరణాలు దోపిడీ జరిగాయని పరిపూర్ణానంద అన్నారు. దేవాలయ ఆస్తులుపై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

లోకేష్ ను ఇలా ఆడుకుంటున్నారు..!


రాజకీయ ప్రత్యర్థులను ఎలాగైనా సరే అభాసుపాలు చేయాలని చూస్తుంటాయి ప్రత్యర్థి పార్టీలు. ఆ పార్టీలకు కావాల్సింది అవకాశం మాత్రమే. అలాంటి అవకాశం కోసం చూస్తున్న వైసీపీ తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు లోకేష్ ను టార్గెట్ చేసింది. ఆయనపై సోషల్ మీడియాలో ఓ ప్రచారాన్ని చేస్తోంది. అదేంటంటే..

‘ప్రధాన ప్రతిపక్ష నాయకుడి కొడుకుకు కరోనా సోకింది.’ అని సోషల్ మీడియాలో ఆడేసుకుంటోంది. ఎంతో ఫేమస్ లీడర్, మాజీ సీఎం అయిన ప్రతిపక్ష నేత ఇప్పుడు కొడుకును క్వారంటైన్ లో ఉండడం చూసి తల్లడిల్లి పోతున్నారని చెబుతోంది. తన కొడుకు యోగ క్షేమాల గురించి ఒకటే ఆందోళన పడుతున్నారని ప్రచారం చేస్తోంది. ఈ ప్రచారం వెనుక ఆరాతీస్తే పెద్ద కథే బయటపడింది.

*వైసీపీ ప్రచారమిదీ..
ప్రధాన ప్రతిపక్ష నాయకుడి కొడుకు ఇటీవల జనంలో బాగా తిరిగాడు. ఎక్కడెక్కడో రాజకీయం చేశాడు. రాష్ట్రంలో బాగా కరోనా ప్రబలడంతో ఏ విధంగా వచ్చిందో తెలియదు కానీ లక్షణాలు బయటపడ్డాయి. వెంటనే టెస్ట్ చేయగా కరోనా అని తేలింది. దీంతో క్వారంటైన్ లోకి తరలించారు. ప్రస్తుతం ప్రతిపక్ష నేతకు దూరంగా క్వారంటైన్ లో కొడుకు చికిత్స పొందుతున్నాడు.

*టీడీపీ నేతల్లో ఆందోళన
అయితే ఈ ప్రతిపక్ష నేత అనగానే మన చంద్రబాబా అని అందరూ ఆరాతీశారు. ఆయన కొడుకు లోకేష్ గురించి అని గాబారా పడ్డారు తెలుగు తమ్ముళ్లు. ఎందుకంటే దానికి రీజన్ ఉంది. ఇటీవలే ఏపీలో అడుగుపెట్టారు చంద్రబాబు, లోకేష్. వారిని టీడీపీ నేతలు చుట్టుముట్టి తెగ హడావుడి చేశారు.

*చంద్రబాబు, లోకేష్ రాకతో వైసీపీ ప్లాన్
ఇటీవలే తాజాగా రెండు నెలల లాక్ డౌన్ అనంతరం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ పక్కరాష్ట్రం నుంచి తన సొంత రాష్ట్రానికి వచ్చారు.. మంది మార్బలంతో ఎంట్రీలోనే అదరగొట్టారు. దండయాత్రలా ఈ పర్యటన సాగింది. లాక్ డౌన్ నిబంధనలు గాలికి వదిలి.. కరోనా వ్యాపిస్తుందన్న కనీస సృహ లేకుండా మోటార్ సైకిల్ ర్యాలీలు .. నాయకులతో సామాజిక దూరం పాటించకుండా బాబు కలిసిపోవడాలు చేశారు. ఈ వీడియోలు వైరల్ అయ్యాయి. ఇలా తిరిగితే కరోనా వ్యాపించడా అని విమర్శలు వచ్చాయి.

*అసలు విషయం ఇదీ..
అయితే ఇదంతా వేరే విషయం.. కరోనా చంద్రబాబుకు, లోకేష్ కు ఈ ర్యాలీతో వస్తుందో లేదో తెలియదు కానీ.. రాజస్థాన్ లో మాత్రం వచ్చింది. ఇలానే చంద్రబాబులా జనంలోకి వెళ్లిన రాజస్థాన్ మాజీ సీఎం, ప్రధాన ప్రతిపక్ష నాయకురాలు వసుంధరా రాజే కుమారుడికి కరోనా వచ్చింది. దీంతో ఆమె కొడుకును క్వారంటైన్ కు తరలించారు. ఇప్పుడు చికిత్స కూడా పొందుతున్నాడు.

*రాజస్థాన్ ప్రతిపక్ష నేత కుమారుడికి కరోనా..
ప్రధాన ప్రతిపక్షనేత కుమారుడు అనగానే అందరూ లోకేష్ ను తలుచుకున్నారు. ఎందుకంటే ఏపీలో వీళ్లు చేసిన హడావుడికే లోకేషే అందరికీ గుర్తుకొచ్చాడు. కానీ అసలు కరోనా వచ్చింది లోకేష్ కు కాదు.. రాజస్థాన్ ప్రతిపక్ష నేత కుమారుడికి తాజాగా పాజిటివ్ అని తేలింది. దీంతో అతడిని క్వారంటైన్ లో ఉంచి చికిత్స చేస్తున్నారు. ఈ వార్తను ‘ప్రధాన ప్రతిపక్ష నాయకుడి కొడుకుకు కరోనా సోకింది.’ అని వైసీపీ వైరల్ చేసి లోకేష్ కే సోకిందనేలా తెగ ప్రచారం చేశాయి. టీడీపీ శ్రేణులను బెదరగొట్టాయి. అదన్న మాట సంగతి.. ఈ వార్త తెలియడంతో రాజకీయ నాయకులు కూడా జర జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని పలువురు సూచిస్తున్నారు.

పక్షం రోజుల్లోనే మరో లక్ష కేసులు?

Corona cases in India

దేశంలో కరోనా వ్యాప్తి రోజురోజుకూ విజృంభిస్తూనే ఉంది. గతంలో లక్ష కేసులు నమోదు కావడానికి 64 రోజులు సమయం పట్టింది. గడచిన వారం రోజుల్లోనే దేశంలో దాదాపు 45వేల పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. ఈ లెక్కన మరో 7 లేదా 8 రోజుల్లోనే 60వేల కేసులు నమోదయ్యే అవకశాలు ఉన్నాయి అంటే మరో లక్ష కేసులు నమోదు కావడానికి పెట్టె సమయం 15 రోజులే కావడం గమనార్హం. లాక్‌ డౌన్‌ ఆంక్షలు సడలించిన తర్వాత దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గత ఐదు రోజులుగా దేశంలో నిత్యం ఆరు వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి.

గడిచిన 24 గంటల్లో దేశంలో 6,535 కేసులు నమోదు కాగా, 146 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. దేశంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,45,380కు చేరింది. వీరిలో 60,490 మంది కోలుకోగా.. 80,722 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక మరణాల సంఖ్య మొత్తం 4,167కి చేరుకున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు.

దేశంలో రికవరిరేటు 41.61శాతంగాను, మరణాల రేటు 2.87శాతంగా ఉన్నట్టు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా మరణాలరేటు ఒక లక్ష జనాభాకు 4.4గా నమోదవుతుండగా, భారత్‌ లో లక్ష జనాభాలో 0.3గా నమోదవుతుందని చెప్పారు. ప్రపంచంతో పోలిస్తే.. మన దేశంలో చాలా తక్కువగా ఉందన్నారు. సరైన సమయంలో లాక్‌ డౌన్‌ నిర్ణయం తీసుకోవటంవల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. వలసకార్మికులు పెద్దఎత్తున తిరిగిరావటంతో అసోం కూడా వైరస్‌ వేగంగా పెరుగుతున్న రాష్ట్రాల సరసన చేరింది. మహారాష్ట్రలో వైరస్‌ తీవ్రత ఆందోళనకరస్థాయిలో ఉండగా తమిళనాడు, దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకు ఈ మహమ్మారి తీవ్రత పెరుగుతున్నది.

మహారాష్ట్రలో కరోనా పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయి. దేశంలో చోటుచేసుకఁన్న కరోనా మరణాల్లో 1,695 మరణాలతో ఆ రాష్ట్రం మొదటిస్థానంలో ఉంది. తరువాతి స్థానాల్లో గుజరాత్‌(888), మధ్యప్రదేశ్‌(300), పశ్చిమబెంగాల్‌(278), ఢిల్లీ(276)లు ఉన్నాయి. మిగిలిన రాష్ట్రాల్లో రెండు, మూడు అంకెల్లో ఉన్న మరణాల సంఖ్య కేరళలో నాలుగ్గా ఉంది.

కేసుల నమోదు గణాంకాలను పరిశీలిస్తే మహరాష్ట్రలో అధిక స్థాయిలో 52,667 పాజిటివ్‌ కేసులు తేలగా., ఆ సంఖ్య తమిళనాడులో 17,082, గుజరాత్‌ లో 14,460, ఢిల్లీలో 14,053, రాజస్థాన్‌ లో 7,300, మధ్యప్రదేశ్‌ లో 6,859, ఉత్తరప్రదేశ్‌ లో 6,532గా ఉంది.

జగన్ కి మత గండం

జగన్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చి ఒక సంవత్సరం పూర్తి అయ్యింది. ఈ సంవత్సరం లో తన ఎన్నికల వాగ్దానం నవరత్నాలు అమలుచేయటం లో మంచి పురోగతిని కనబడ్చాడనే చెప్పాలి. కొత్తగా అధికారం చేపట్టినా అతి త్వరలోనే అధికార యంత్రాంగం పై పట్టు సంపాదించటమే కాకుండా విధానపరంగా తనదైన ముద్ర వేసుకోగలిగాడు. తను తీసుకున్న సంక్షేమ కార్యక్రమాలు అందరినీ ముక్కున వేలేసుకొనేటట్లు చేశాయి. ఒక్క సంవత్సరం లో 40 వేల కోట్ల రూపాయలు మూడున్నర కోట్ల మందికి లబ్దిచేకూర్చటాన్ని అభినందించాల్సిందే. అలాగే గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ ఓ విన్నూత్న విప్లవమనే చెప్పాలి. ఎన్టీఆర్ మండల వ్యవస్థ తో పరిపాలనను ప్రజల దగ్గరికి చేరిస్తే, జగన్ సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థలతో పరిపాలన ను ప్రజల ముంగిటకే తెచ్చాడని చెప్పొచ్చు. దానితోపాటు మద్యపాన నియంత్రణ కూడా పేద ప్రజలకి , ముఖ్యంగా గృహిణులకు ఎంతో మంచి చేసిందని చెప్పొచ్చు.

అయితే దీనితోపాటు కొన్ని నిర్ణయాల్లో తొందరపాటు కూడా కొట్టొచ్చినట్లు కనబడుతుంది. కొంత సంయమనం పాటించాల్సిన అవసరం, అనుభవజ్ఞుల సలహాలు అవసరం. అందునా మీడియా పూర్తిగా వైరి వైఖరి తీసుకున్న సందర్భంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా వుంది. ముఖ్యంగా రాజధాని తరలింపు వ్యవహారం లో తన దుందుడుకు వైఖరి మరింత సమస్యలు తెచ్చిపెట్టుకున్నట్లయ్యింది. ఇకనైనా తన పంధా మార్చుకోకపోతే ముందు ముందు మరింత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం వుంది. ముఖ్యంగా న్యాయస్థానం లో పడుతున్న మొట్టికాయలు ప్రభుత్వ ప్రతిష్ట కు భంగం కలిగిస్తాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే ఇప్పుడు తలెత్తిన సమస్య అతి సున్నితమైనది.మత పరంగా ప్రజల మనోభావాలు దెబ్బతింటే అది మొదలుకే మోసం వస్తుంది.

జగన్ ప్రభుత్వం పై హిందూమత వ్యతిరేక ఆరోపణలు 

ఇదే అన్నింటి కన్నా అతి పెద్ద ప్రతికూల సమస్య. దీనికి కారణం లేకపోలేదు. వై ఎస్ ఆర్ కుటుంబం మొదట్నుంచీ క్రైస్తవ విశ్వాసాలు కలిగివుంది. ఇందులో రహస్యమేమీ లేదు. ఎవరైనా వై ఎస్ ఆర్ సమాధి ని దర్శిస్తే ఇది ఇంకా పూర్తిగా అర్ధమవుతుంది. ఆయన సమాధి దగ్గర అన్నీ బైబులు సూక్తులే రాసి వుంటాయి. దాన్ని తప్పు పట్టాల్సిందేమీ లేదు. ఎవరి విశ్వాసాలు వారివి. కాకపోతే వీటిని రాజకీయాలకు వాడుకోకూడదు. కానీ జరిగిందేమిటి? 2014 ఎన్నికల్లో వై ఎస్ ఆర్ సతీమణి విజయలక్ష్మి ఒక చేత్తో బైబులు పట్టుకొని ప్రచారం చేయటం ప్రజలందరూ గమనించారు. వాస్తవానికి అలా చేసివుండాల్సింది కాదు. ఆవిడ నమ్మకం వ్యక్తిగతం. అది ఎన్నికల్లో వాడుకోకూడదు. అయితే మన దేశం లో అందరూ , అన్ని మతాల వాళ్ళు చేస్తున్న పనే అది. ఎన్నికల కమీషన్ దీనిపై ఎప్పుడూ మెతక వైఖరినే అవలంబించింది. ఈ ప్రస్తావన ఎందుకు చెప్పాల్సివచ్చిందంటే అది చట్ట పరమా లేక చట్ట వ్యతిరేకమా అనేది కాదిక్కడ, జగన్ కుటుంబం క్రైస్తవ కుటుంబం అనేది ప్రజల మనస్సులో బలంగా వుంది. మాములుగా అయితే అదో పెద్ద అంశం కాదు. కాకపోతే సమాజం లో ఏదైనా మత సమస్య ఎదురైనప్పుడు, అది ప్రభుత్వ నిర్ణయాలతో ముడి పడినప్పుడు పాలకుడి విశ్వాసాలు కూడా చర్చనీయాంశమవుతాయి. ఇప్పుడు అదే జరిగింది.

తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారాలు ఎప్పుడూ వార్తల్లో వుంటూనే వుంటాయి. ఇంతకుముందు చంద్రబాబు హయం లో కూడా సదావర్తి భూములు పెద్ద వివాదాస్పద అంశం అయ్యింది. అలాగే అప్పుడు పుట్టా సుధాకర్ యాదవ్ చైర్మన్ అయినప్పుడు తను క్రైస్తవుడని పెద్ద వివాదం చెలరేగింది. అలాగే వై వి సుబ్బారెడ్డి ని జగన్ చైర్మన్ గా నియమించినప్పుడూ ఇవే ఆరోపణలొచ్చాయి. ప్రజలకి ఈ విధంగా సందేహాలు రావటానికి కారణాలు లేకపోలేదు. అసలు ఆంధ్రా లో ఎవరు హిందువో ఎవరు క్రైస్తవో తెలుసుకోవటం కష్టం. ప్రభుత్వ రికార్డుల్లో వుండే దానికి , వ్యక్తిగతంగా ఆచరించే దానికి పొంతన లేదు. ఇదే అసలైన కారణం. ఆంధ్రాలో 2011 జనాభా లెక్కల ప్రకారం క్రైస్తవులు రెండు శాతం కూడా లేరు. కానీ వాస్తవానికి షుమారు 20 శాతం పైనే వుండొచ్చని ఒక అంచనా. ఈ వాస్తవమే ప్రజలకి సందేహం కలగటానికి కారణం. ఉదాహరణకు ఈ రోజు జగన్ ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన లో కరోనా మహమ్మారి నేపధ్యం లో పూజారులకు, ఇమాంలకు, పాస్తర్లకు 5 వేల రూపాయల చొప్పున ఇచ్చినట్లు ఘనంగా ప్రకటించుకున్నారు. అందులో ఇచ్చిన వివరాలు ఆశ్చర్యంగా వున్నాయి. 90 శాతం జనాభా    వున్న హిందూ మత పూజారులు 33వేల 8 వందలయితే, 2 శాతం జనాభా కూడా లేని ( అధికారికంగా ) క్రైస్తవ పాస్టర్లు 30 వేలు వుండటం ఆశ్చర్యంగా వుంది. అదే 5 శాతం వున్న ఇస్లాం ఇమాంలు, మౌజం లు 13 వేల 6 వందలు వున్నారు. అంటే జనాభా తో పొంతనలేకుండా ఈ లెక్కలు ఉండటమే ఆంధ్రా సామాజిక పరిస్థితి ని , ప్రభుత్వ పక్షపాతాన్ని తెలియజేస్తుంది. హిందువులకు ఈ ప్రకటన మరింత కోపాన్ని తెప్పిస్తుందనటంలో సందేహం లేదు. ఎలావుందంటే పాస్టర్లకి, ఇమాం లకి ఇస్తూ మొక్కుబడిగా పూజారులకి ఇచ్చినట్లుగా వుంది. ఇటువంటి విషయాల్లో జగన్ ప్రభుత్వం మరింత లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకొని వుంటే బాగుండేది.

మత మార్పిడులు ఇటీవలికాలం లో ముమ్మరం 

ఇకపోతే వై ఎస్ ఆర్ కుటుంబం వరకొచ్చేసరికి వాళ్ళు వ్యక్తిగతంగా క్రైస్తవులు కావటం తో ఇంకా అనుమానాలు బలపడటానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఈ  ప్రభుత్వం క్రైస్తవాన్ని ప్రోత్సహిస్తుందనీ, హిందువులకు వ్యతిరేకంగా పనిచేస్తుందనీ ప్రజల్లో ఒక వర్గం బలంగా నమ్ముతుంది. దానికి భౌతిక పరిస్థితులు అనుకూలంగా వున్నాయి. ఈ సంవత్సరం లో మత మార్పిడులు పెరగటానికి ప్రభుత్వ అండదండలే కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాస్టర్లు పెద్దఎత్తున మత ప్రచారం చేస్తూ హిందువుల్ని మతమార్పిడి చేస్తున్నారనేది ఆరోపణ. విదేశీ నిధులతో ఈ కార్యక్రమం ఆంధ్రలో పెద్దఎత్తున జరుగుతుందని తెలుస్తుంది. ఇప్పటికే దళితులూ, ఆదివాసులూ దాదాపు అందరూ క్రైస్తవం లోకి మారారు. ఇప్పుడు మిగతా హిందువులను మతం మార్చే కార్యక్రమం ముమ్మరంగా జరుగుతుందని తెలుస్తుంది. జగన్ ప్రత్యక్షంగా ప్రోత్సహించిన దాఖలాలు లేకపోయినా తన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కార్యక్రమం ముమ్మరం కావటం గమనార్హం. ఈ నేపధ్యం లోనే టిటిడి సంఘటన ను చూడాల్సివుంది. వాస్తవానికి ఇలా ఆస్తులు అమ్మటం ఎప్పటినుంచో జరుగుతుంది. అయితే అప్పుడెవరూ ఈ వ్యవహారాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పటి ఈ 50 ఆస్తుల అమ్మకం టిడిపి ప్రభుత్వ హయాం లోనే మొదలయ్యింది. అయినా ఇందాక చెప్పినట్లు ప్రజల్లో వై ఎస్ ఆర్ కుటుంబం క్రైస్తవులనే ముద్ర వుండటం సమస్య మరింత ఉద్రిక్తతకు దారితీసింది. భూముల అమ్మకాన్ని వాయిదా వేయటం తో ప్రస్తుతానికి ఉద్రిక్తతలు చల్లారినా ఇది ఎప్పటికీ సున్నిత సమస్యే.

జగన్ ప్రభుత్వం హిందువుల్లో మరింత విశ్వాసం కలిగించాలి 

దానితోపాటు ఇటీవలి కాలంలో హిందువుల్లో జాగరూకత పెరిగింది. ప్రభుత్వాలు అన్ని మతాలను సమానంగా చూడటం లేదని, మెజారిటీ మతస్థులైన హిందువులపై వివక్ష కొనసాగుతుందని భావిస్తున్నారు. దేవాలయాల విషయమే తీసుకుందాం. ఇస్లాం, క్రైస్తవ ప్రార్ధనా మందిరాలపై ప్రభుత్వ ఆధిపత్యం లేనప్పుడు హిందూ దేవాలయాలపై ఎందుకుండాలని ప్రశ్నిస్తున్నారు. ఇది పూర్తిగా కొట్టిపారేయలేము. ప్రస్తుతం దీనిపై సుప్రీం కోర్టు లో విచారణ జరుగుతుంది. ఈ జాగరూకతే ఇప్పుడు భూముల అమ్మకం లో కూడా వ్యక్తమవుతుంది.

జగన్ మాత్రం ఈ విషయాల్లో హిందువుల్లో మరింత విశ్వాసం కల్గించే చర్యలు చేపట్టాల్సి వుంది. నిష్పక్షపాతం గా ఉండటమే కాదు , వున్నట్లు కనిపించాల్సిన అవసరం కూడా వుంది. దీనికి ఒక్కటే పరిష్కారం. మత మార్పిడుల నిషేధం పై కఠిన చట్టం తీసుకురావాల్సి వుంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఇటువంటి చట్టం అమలులో వుంది. ఈ చర్య హిందువుల్లో విశ్వాసం కలిగిస్తుంది. కెసిఆర్ ఎంత హిందూ ఆచారాలు నిష్టగా పాటించినా ఒవైసీ ని వెనకేసుకు రావటం తో ఆ గండం తనకెప్పుడూ ఉంటుందని ఆ విషయం లో మరింత జాగ్రత్తగా వుండాలని ఈ కాలమ్స్ లో ఇంతకుముందే హెచ్చరించటం జరిగింది. అలాగే జగన్ స్వతహాగా క్రైస్తవుడు కావటం తో మెజారిటీ హిందువులు మత విషయాల్లో తనపై కొంత సందేహంగా ఆలోచించటం సహజం. అందుకే ఆ గండం తనకెప్పుడూ వుంటుంది. అది అడ్డురాకుండా చూసుకోవాల్సిన భాద్యత జగన్ కి నిరంతరం వుంది. ఎప్పటికైనా తన రాజకీయ ఉనికి కి ప్రమాదం వుందంటే అది ఈ గండం నుంచేనని గ్రహించాలి.

భానుడు తాకిడితో వర్ష సూచన!

గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భానుడు తాకిడి అధికంగా వుంది. దీంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే సూచన ఉందన్నారు. సంగారెడ్డి, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉంది.

రానున్న 24 గంటల్లో దక్షిణ బంగాళాఖాతం, అండమాన్‌ సముద్ర తీరం ఆనుకొని బంగాళాఖాతం మధ్య ప్రాంతాల్లోని.. మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఇంటీరియర్‌ తమిళనాడు వరకు తెలంగాణ, రాయలసీమ మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగనుంది.