
మహారాష్ట్ర నుండి గంటకు 12-15 కి.మీ. వేగంతో మిడతల దండు తెలంగాణపైకి దూసుకొస్తోందని వ్యవసాయ శాఖ కార్యదర్శి బి.జనార్దన్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే కరోనాతో దేశం మొత్తం అతలాకుతలం అవుతుండగా.. మిడతల ముప్పు ఇప్పుడు తీవ్ర నష్టాన్ని కలిగిస్తోంది. ఉత్తరాదిలో పంటలను నాశనం చేసిన మిడతలు ఇప్పుడు తెలంగాణ వైపు వస్తున్నాయి. మహారాష్ట్ర నుండి మిడతల దండు తెలంగాణకు చేరుకునే అవకాశం ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ అప్రమత్తమైంది. మహారాష్ట్రలోని అమరావతి ప్రాంతంలో మిడతల దండును నియంత్రిస్తున్నట్లు అక్కడి అధికారులు తెలిపారని, అక్కడ నియంత్రణలోకి రాకపోతే అవి తెలంగాణకు వచ్చే అవకాశం ఉందని బి.జనార్దన్‌రెడ్డి తెలిపారు. మహారాష్ట్ర సరిహద్దు జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, భూపాలపల్లి, నిర్మల్ లలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయా జిల్లాల కలెక్టర్లు జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
మిడతల దండు గంటకు 12-15 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుందని, ఇవి చెట్ల మీద ఆవాసం ఏర్పరుచుకొని పంటలకు భారీ నష్టం కలిగిస్తాయని చెప్పారు. ఆఫ్రికా దేశాల నుంచి పాకిస్తాన్ మీదుగా రాజస్థాన్ లోకి మిడతలు చేరాయని.. గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్రలకు విస్తరించి.. ఇప్పుడు రాష్ట్రంలోకి వచ్చే ప్రమాదం ఉందని వివరించారు.