Home Blog Page 8476

కరోనా టెస్టులపై హైకోర్టు అసంతృప్తి!

High court

తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కరోనా టెస్టుల విషయంపై హైకోర్టు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. మృతదేహాలకు కరోనా పరీక్షలు అవసరం లేదన్న ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. ‘హైరిస్క్ అవకాశాలున్న వారికి ఎందుకు పరీక్షలు చేయడం లేదు?. ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఎందుకు తక్కువ టెస్టులు చేస్తున్నారు?. మార్చి 11 నుంచి ఇప్పటి వరకు చేసిన పరీక్షల వివరాలన్నీ సమర్పించాలి. కరోనా పరీక్షలపై కేంద్రం రెండు సార్లు రాసిన లేఖలు సమర్పించాలి. కరోనా రక్షణ కిట్లు ఎన్ని ఆస్పత్రుల్లో.. ఎంత మంది వైద్య సిబ్బందికి ఇచ్చారో… జూన్‌ 4లోగా నివేదిక ఇవ్వాలి’’ అని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

ఆకట్టుకుంటున్న ‘భానుమతి-రామకృష్ణ’ ట్రైలర్


30ఏళ్లు పైబడిన యువతీ యువకుల మధ్య ప్రేమ.. అనే కొత్త తరహా కాన్సెప్ట్ తో ‘భానుమతి-రామకృష్ణ’ వెబ్ ఫిల్మ్ తెరకెక్కుతోంది. ఇప్పటివరకు టీనేజీ అబ్బాయి, అమ్మాయిల లవ్ స్టోరీలు అనేకం వచ్చాయి. అలాగే అబ్బాయి అమ్మాయి వెంటపడటం లాంటి రోటీన్ ప్రేమ కథలు వచ్చాయి. వీటికి భిన్నంగా తొలిసారి 30ఏళ్లు పైబడిన ఇద్దరి యువతీ యువకుల ప్రేమ కథాంశంతో ఓ మూవీ రాబోతుంది. టాలీవుడ్లో గతంలో ‘మల్లీశ్వరీ’ మూవీలో విక్టరీ వెంకటేష్ పెళ్లికానీ ప్రసాద్ గా అలరించాడు. ఈ మూవీలో మాత్రం అమ్మాయికి 30ఏళ్లు దాటి పెళ్లికాకుండా కన్పిస్తుంది. తనకు 30ఏళ్లు అని ఎవరైనా గుర్తుచేస్తే ఎదుటివాళ్లపై ఉక్రోషం చూపిస్తుంటోంది. ఆమె ఫ్రస్టేషన్ ప్రేక్షకులను వినోదాన్ని పంచుతోంది.

తాజాగా ఈ మూవీకి సంబంధించి ట్రైలర్ రిలీజ్ అయింది. 3.09నిమిషాల నిడివితో ఉన్న ఈ ట్రైలర్ ఆద్యంతం అందరినీ ఆకట్టుకుంటోంది. ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని అంశాన్ని డైరెక్టర్ శ్రీకాంత్ నాగోతి ఎంచుకున్నాడు. ఈ మూవీలో అందాల రాక్షసి ఫేం హీరో నవీన్ చంద్ర, సలోని లుత్రా కీలక పాత్రలో నటిస్తున్నారు. నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్, కృషి ప్రొడక్షన్స్ బ్యాన్సర్లో యశ్వంత్ మలుకుట్ల ఈ మూవీని నిర్మిస్తున్నాడు. ఆద్యంతం ఎంటటైన్మెంట్ పంచుతూ ఈ మూవీ ట్రైలర్ సాగింది. నెటిజిన్ల నుంచి ఈ ట్రైలర్ కు విశేష స్పందన లభిస్తుంది. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని విషయాలు త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని చిత్రబృందం ప్రకటించింది.

https://www.youtube.com/watch?v=d9L-6-FBOd4

సల్మాన్ పాడిన హిందూ-ముస్లిం సాంగ్ వైరల్..


బాలీవుడ్ కండలవీరుడు ప్రతీయేటా రంజాన్ సందర్భంగా అభిమానులకు ఏదో ఒక సినిమా అప్డేట్ ఇస్తూనే ఉంటారు. ఈసారి దేశంలో లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగులు వాయిదా పడటంతో అలాంటి అప్డేట్ కుదరలేదు. అయినప్పటికీ సల్మాన్ అభిమానులను నిరాశపర్చలేదు. ఈద్ కానుకగా ‘భాయ్ భాయ్’ టైటిల్ తో వీడియో సాంగ్ ను రిలీజ్ చేశాడు. జాతి సమైక్యత చాటేలా ఈ వీడియో సాంగ్ ను రూపొందారు. ప్రస్తుతం ఈ పాట అందరి మన్నలను పొందుతోంది. లాక్డౌన్ కారణంగా సల్మాన్ తన ఫామ్ హౌజ్ కే పరిమిమయ్యాడు. ఫామ్ హౌజ్ లోనే ఉంటూ ‘ప్యార్ కరోనా’, ‘తెరే బినా’ పాటలను ఇప్పటికే రిలీజ్ చేశాడు.

తాజాగా ముస్లింల అతిపెద్ద పండుగ రంజాన్ ను పురస్కరించుకొని సల్మాన్ ఖాన్ ‘భాయ్.. భాయ్’ సాంగ్ రిలీజ్ చేసి అందరికీ ఈద్ శుభాకాంక్షలు తెలిపారు. సల్మాన్ ఖాన్ ఈ పాటను రుహాన్ అర్షద్‌తో కలిసి పాడాడు. ఈ పాటకు సాజిద్ వాజిద్ సంగీతం అందించగా సల్మాన్ ఖాన్, డానిష్ సబ్రి సాహిత్యం అందించారు. ర్యాప్ సాహిత్యాన్ని రుహాన్ అర్షద్ రాశారు. ‘యారో హమ్ తయార్ హై.. అప్పీ హై త్యోహార్ హై.. అంటూ సాగే పాటలో హిందూ, ముస్లిం భాయ్ భాయ్.. క్యాబోల్తే మియా భాయ్.. హిందూ ముస్లిం భాయ్ భాయ్, క్యాబోల్తే హిందూ బాయ్ అంటూ సల్మాన్ హుషారుగా పాడారు. మధ్య మధ్యలో సల్మాన్ అదిరిపోయేలా చిన్న స్టెప్పులు వేసి అభిమానులను అలరించాడు. ఈద్ సినిమా రిలీజు చేయలేకపోవడంతో ఈ వీడియో సాంగ్ అందిస్తున్నట్లు సల్మాన్ తెలిపాడు. అందరిలో సోదరభావం, ఐక్యతకు పెంచేలా ఈ సాంగ్ ఉండటంతో ప్రతీఒక్కరు సల్మాన్ భాయ్ ను ప్రశంసిస్తున్నారు. ఈ పాటను ప్రతీఒక్కరూ షేర్ చేస్తుండటంతో ట్రెండింగ్లో దూసుకెళుతుంది.

కొత్త పద్దతిలో చేనేత కార్మికులకు కేటీఆర్ సాయం!

Ktr

Ktr
తెలంగాణ మంత్రి కేటీఆర్ కొత్త పద్దతిలో చేనేత కార్మికులకు సహాయం చేస్తున్నారు. వారు తయారు చేసిన మాస్కులను కొనే విధంగా ట్విట్టర్ వేదికగా చేనేత మాస్కుల్ని ప్రమోట్ చేసారు. దీంతో వారి మాస్కులను డిమాండ్ పెరుగుతుంది. చేనేత కార్మికుల మస్కులు రీయూజబుల్ మాస్కులు. అంటే ఈ మాస్కుల్ని ఎన్నిసార్లైనా ఉతికి వాడుకోవచ్చు. ధర కూడా చాలా తక్కువ. డబుల్ లేయర్డ్ మాస్క్ ధర రూ.20 మాత్రమే. పోచంపల్లి ఇక్కత్, కలంకారి ఫ్యాబ్రిక్ మాస్క్ ధర రూ.40. ప్రస్తుతం మార్కెట్‌ లో ఎక్కువగా సింగిల్ యూజ్ మాస్కులే లభిస్తున్నాయి. అంటే మాస్కును ఒకసారి మాత్రమే వాడిపారెయ్యాల్సి ఉంటుంది. కానీ రోజూ మాస్క్ ధరించాలి కాబట్టి సింగిల్ యూజ్ మాస్కులకు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అదే రీయూజబుల్ అంటే మళ్లీ వాడుకోవడానికి వీలుండే మాస్కులు అయితే రోజూ ఉతికి ఎక్కువ రోజులు ఉపయోగించొచ్చు. చేనేత మాస్కులు ధర కూడా తక్కువ కాబట్టి ప్రజలు ఎక్కువగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. తెలంగాణ చేనేత మాస్కుల్ని మంత్రి కేటీఆర్ ప్రమోట్ చేస్తున్నారు. భారతదేశంలోని చేనేత కార్మికులకు చేయూతగా నిలవాలని పిలుపునిస్తున్నారు.

దేవాదాయ ఆస్తుల విషయంలో పరిధి దాటుతున్నారు..!


దేవాలయాల ఆస్తుల పరిరక్షణ, హిందూ ధర్మ పరిరక్షణ, టీటీడీ భూముల అమ్మకానికి వ్యతిరేకంగా బీజేపీ, జనసేన పిలుపు మేరకు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉపవాస దీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు. ఉపవాస దీక్షలో భాగంగా గుంటూరు లోని తన నివాసం వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ దీక్ష చేశారు. ఈ సందర్భంగా కన్నా మీడియాతో మాట్లాడుతూ జగన్ సీఎం అయినప్పటి నుంచి రాష్ట్రంలో హిందూ ధర్మానికి, మతానికి ప్రమాదం ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో మత మార్పిడులు, దేవాలయ భూముల విషయంలో కానీ ప్రభుత్వం తన పరిధిని దాటి ముందుకు వెళ్తోందన్నారు.

మంగళగిరి, అన్నవరం ఆలయ భూములను తీసుకునే యత్నం చేసినా ఆందోళనతో వెనక్కి తగ్గారని చెప్పారు. ఇపుడు ఏకంగా తిరుమల వెంకన్న భూములకు ఎసరు పెట్టారని, దానికి ఎప్పుడో చేసిన తీర్మానం ప్రాతిపదిక చేసుకున్నారని తెలిపారు. ధార్మిక సంస్థలు ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయని చెప్పారు. బిజెపి, జనసేన దీనిపై పోరాటానికి పిలుపు నిచ్చాయన్నారు.

టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి మాత్రం భూముల అమ్మకానికి కేవలం రోడ్ మ్యాప్ ఇచ్చామని చెప్పారని తెలిపారు. సుబ్బారెడ్డి ప్రతి పక్షంలో ఉన్నప్పుడు ఆలయ భూముల రక్షణ విషయంలో చాలా మాట్లాడారని తెలిపారు. వైకాపా పార్టీ అనేది మోసపూరితంగా ఏర్పడిన పార్టీ అని విమర్శించారు. ప్రభుత్వం నిన్న ఇచ్చిన జీవో నాలుక గీసుకునేందుకు పనికిరాదన్నారు. రద్దు చేయమన్నది ఒక జీవో, ప్రభుత్వం నిలుపుదల చేసింది మరో జీవో అని చెప్పారు. టిటిడి భూముల విషయంలో 888 జీవోకి పూర్తిగా వ్యతిరేకంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని తెలిపారు. దేవుడిని కూడా మోసం చేయాలనే ఆలోచన మీకు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన ప్రతి పని ప్రజలను మోసం చేసేదిగా ఉందని చెప్పారు. ప్రభుత్వం టీటీడీ భూముల అమ్మకానికి వ్యతిరేకం కాదని స్పష్టమవుతోందన్నారు. కేవలం ప్రజలను మబ్యపెట్టేందుకే నిన్నటి జీవో ఇచ్చారని తెలిపారు. జిల్లాల్లో మూడో జాయింట్ కలెక్టర్లను నియమించే సమయంలో 9వ అంశంగా దేవాలయాల భూములు అని పెట్టారని, దీనిపై చాలా అనుమానాలు ఉన్నాయన్నారు. ప్రభుత్వ కార్యకలాపాలకు దేవాదాయ భూములు వాడుకుంటారని అనుమానాలు ఉన్నాయని తెలిపారు.

కరోనాను అడ్డు పెట్టుకొని సింహాచలం భూములను ఆక్రమించుకుంటున్నారని తెలిపారు. ఆలయ భూముల్లో అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సింహాచలం భూములు కాపాడాలని కోరారు. ప్రభత్వం నుంచి టీటీడీ ఆస్తులను రక్షించేందుకు అందరూ ముందుకు రావాలి సూచించారు. ఈ ఉపవాస దీక్షలో మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, గుంటూరు పార్లమెంట్ అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ, జనసేన నాయకులు బోనబోయిన శ్రీనివాస యాదవ్,కల్యాణం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

కొత్త పద్దతిలో రైతును రాజుని చేస్తాం:కేటిఆర్

నియంత్రిత పంటల సాగుతో దేశంలో వ్యవసాయానికి నవశకం రానుంది అని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. మద్దతు ధరల లేని పంటలను వేయొద్దని సీఎం చెబుతున్నారు. మద్దతు ధర వచ్చే సాగు చేస్తే రైతులు బాగుపడతారన్నదే సీఎం ఆకాంక్ష. రైతును రాజు చేయాలన్నదే సీఎం కేసీఆర్‌ ధ్యేయమని కేటీఆర్‌ స్పష్టం చేశారు. గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ. ప్రగతి గ్రామంలో కొనుగోలు  కేంద్రం ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేస్తున్నాం అని కేటీఆర్‌ తెలిపారు.

కరోనా కారణంగా లాక్ డౌన్ నేపథ్యంలో మార్చి, ఏప్రిల్‌ నెలల్లో తెలంగాణ ఆదాయం 95 శాతం తగ్గింది. ఇంత సంక్షోభంలోనూ రైతులకు రూ. 1,200 కోట్ల రుణమాఫీ చేశామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రులు కేటీఆర్‌, నిరంజన్‌ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా రాచర్ల బొప్పాపూర్‌ లో ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్‌ ప్రసంగించారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ రైతులు అనేక కష్టాలు పడ్డారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత వ్యవసాయం ఎట్లా ఉందో రైతులందరికీ తెలుసు అని కేటీఆర్‌ అన్నారు. ఇవాళ రైతులకు పెట్టుబడికి, విత్తనాలకు, ఎరువులకు, నీళ్లకు కరెంట్‌ కు కొదవ లేదు. సీఎం కేసీఆర్‌ కృషితో ఎండకాలంలోనూ చెరువులన్నీ మత్తడి దుంకుతున్నాయి.  రైతులు నిర్భయంగా సేద్యం చేసుకునేందుకు అన్ని రకాల వసతులు కల్పించామన్నారు. ఎరువులు, విత్తనాలు అందించేందుకు సీఎం ఆర్థిక చేయూత అందించారు. రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్‌ అందిస్తున్నామని తెలిపారు.  వానాకాలం సాగు కోసం నిధులు అందజేశాం. ఎరువులు, విత్తనాలు ముందస్తుగా తీసుకొచ్చి రైతులు వరుసల్లో నిలబడకుండా చేశామన్నారు.  సిరిసిల్ల జిల్లాలో 2.5 లక్షల ఎకరాలకు కాల్వల ద్వారా నీరు అందిస్తాం. దసరా వరకు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం. పిల్ల కాల్వల ఏర్పాటుకు గ్రామాల్లో పదెకరాలు భూమి పోతుంది. ఒక్కో గ్రామంలో పది మంది రైతులు భూమి కోల్పోతే వందమంది రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు.

స్టైలీష్ స్టార్ ను లైన్లో పెట్టిన ‘సైరా’ డైరెక్టర్..


టాలీవుడ్లో సురేందర్ రెడ్డికి స్టైలీష్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు ఉంది. చిరంజీవితో సినిమాలు చేసేందుకు ఎంతోమంది దర్శకులు క్యూ కడుతుండగా ఆయనే స్వయంగా సురేందర్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చాడు . డైరెక్షన్లో సురేందర్ రెడ్డి ప్రతిభ చూసిన మెగాస్టార్ చిరంజీవి తన డ్రిమ్ ప్రాజెక్టును తెరకెక్కించే బాధ్యతను అప్పగించారు. తొలిసారిగా మెగాస్టార్ చిరంజీవి-దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబోలో ‘సైరా’ చిత్రం తెరకెక్కింది. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవితాధారంగా ‘సైరా నర్సింహారెడ్డి’ చిత్రాన్ని నిర్మించారు. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్లో మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ప్యాన్ ఇండియా మూవీగా మూవీని తీర్చిదిద్దారు.‘సైరా’ తెలుగులో భారీ విజయం సాధించింది. అయితే మిగతా చోట్ల అనుకున్నంత కలెక్షన్లు సాధించలేక నిరాశ పరిచింది. అయినప్పటికీ ఈ సినిమాను సురేందర్ రెడ్డి తీర్చిదిద్దిన తీరుపై ప్రశంసలు దక్కాయి. ‘సైరా’ నర్సింహారెడ్డి పాత్రలో చిరంజీవి పరాకాయ ప్రవేశం చేశారు. ఈ మూవీలో చిరంజీవి సరసన మిల్కి బ్యూటీ తమన్నా, సౌత్ క్వీన్ నయనతార నటించారు. విజయ్ సేతుపతి, జగపతి బాబు ముఖ్యపాత్రల్లో నటించారు.

ఈ మూవీ తర్వాత సురేందర్ రెడ్డి చాలా గ్యాప్ తీసుకొని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. లాక్డౌన్ సమయంలో తన నెక్ట్ మూవీపై ప్లాన్ చేసుకున్నాడు. గతంలో తనకు ‘రేసుగుర్రం’ కథను అందించిన వక్కంతం వంశీతో చర్చించి ఓ పవర్ ఫుల్ స్క్రీప్ట్ పూర్తి చేసినట్లు సమాచారం. ఈ కథను స్టైలీస్ స్టార్ అల్లు అర్జున్ కు విన్పించగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాలీవుడ్ టాక్ విన్పిస్తుంది. ప్రస్తుతం అల్లు అర్జున్-దర్శకుడు సుకుమార్ తో కలిసి ‘పుష్ప’ మూవీ కోసం పని చేస్తున్నారు. ఈ మూవీ పూర్తయ్యాక సురేందర్ రెడ్డి దర్శకత్వంతో తెరకెక్కించబోయే మూవీలో అల్లు అర్జున్ నటిస్తాడని ప్రచారం జరుగుతోంది. గతంలోనూ సురేందర్-అల్లు అర్జున్ కాంబినేషన్లో ‘రేసుగుర్రం’ మూవీ వచ్చింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. అన్నివర్గాల ప్రజలను ‘రేసుగుర్రం’ మూవీ అలరించి సంచలన విజయం సాధించింది. తాజాగా మరోసారి ‘రేసుగుర్రం’ కాంబినేషన్ సెట్టవడంపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

సమ్మర్ సీజనంతా ‘కరోనా’ సినిమానే..!

దేశంలోకి చైనా వైరస్ ఎంట్రీ ఇవ్వడంతో కేంద్రం లాక్డౌన్ విధించిన సంగతి తెల్సిందే. ప్రస్తుతం లాక్డౌన్ 4.0 కొనసాగుతోంది. మే 31వరకు లాక్డౌన్ కొనసాగనుంది. లాక్డౌన్ కారణంగా పేద, మధ్యతరగతి ప్రజలు, వలస కూలీలు అనేక ఇబ్బందులు పడ్డారు. వలస కూలీలు బాధలు వర్ణాణాతీతం. అయితే లాక్డౌన్ 3.0లో కేంద్రం సడలింపులు ఇవ్వడంతో ఒక్కో రంగం ఇప్పుడే పనులను ప్రారంభించేందుకు సిద్ధమవుతుంది. లాక్డౌన్ కారణంగా అత్యధిక నష్టపరిశ్రమ ఏదైనా ఉందంటే అది చిత్ర పరిశ్రమే. గత రెండునెలలుగా సినిమా షూటింగులు వాయిదా పడటంతో థియేటర్లు మూతపడ్డాయి. దీంతో ఈ రంగాన్నే నమ్ముకొని జీవిస్తున్న వేలాది మంది కార్మికులు ఉపాధిని కొల్పోయారు. అయితే తాజాగా టాలీవుడ్ పెద్దలు షూటింగులు ప్రారంభమయ్యేలా చొరవ చూపడంతో రెండు తెలుగు రాష్ట్రాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జూన్ రెండో వారం నుంచి షూటింగులు ప్రారంభం కానుంది. దీంతో టాలీవుడ్లో కొత్త సినిమాల సందడి మొదలు కానుంది.

ఇదిలా ఉంటే లాక్డౌన్ కారణంగా సినిమా బిజినెస్ దారుణంగా పడిపోయింది. ప్రతీయేటా వేసవి సెలవులను దృష్టిలో ఉంచుకొని పెద్ద సంఖ్యలో సినిమాలను రిలీజ్ చేసేందుకు దర్శక, నిర్మాతలు ప్లాన్ చేస్తుంటారు. అయితే ఈసారి చైనా వైరస్ కారణంగా సమ్మర్ బిజినెస్ అంతా నిల్ అయింది. రెండు నెలలు థియేటర్లు మూతపడ్డాయి. ప్రస్తుతానికి సినిమా షూటింగులు ప్రారంభమైనప్పటికీ థియేటర్లు మాత్రం ఇప్పట్లో తెరుచుకునే అవకాశాలు కన్పించడం లేదు. ఆగస్టు నాటికి థియేటర్ల రీ ఓపెనింగ్ పై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీంతో థియేటర్ల యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. అయితే ఈ సమ్మర్ ను క్యాష్ చేసుకోవాలని చాలా మంది నిర్మాతలు చూశారు. కానీ ఈ సమ్మర్ వారందరికీ పీడకలేనే మిగిల్చింది.

ఈ వేసవి కానుకగా నాని, సుధీర్ బాబు కలిసి నటించిన ‘వీ’. పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ వకీల్ సాబ్. యాంకర్ ప్రదీప్ నటించిన 30రోజుల్లో ప్రేమించటం ఎలా?. రాజ్ తరుణ్-ఒరేయ్ బుజ్జిగా. అనుష్క- నిశ్శబ్ధం. వైష్ణవ్ తేజ్ డబ్యూ మూవీ-ఉప్పెన. రాజశేఖర్-అర్జున. శర్వానంద్- శ్రీకారం. రామ్-రెడ్. సాయిధరమ్ తేజ్-సోలో బ్రతుకే సో బెటరూ. రవితేజ-క్రాక్. తమిళ్ విజయ్-మాస్టర్ మూవీలను రిలీజు చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేసుకున్నారు. అయితే సడెన్ గా దేశంలో లాక్డౌన్ విధించడంతో ఈ సినిమాలన్నీ వాయిదా పడ్డాయి. మొత్తంగా 2020 సమ్మర్ సీజన్ సినిమా ఇండస్ట్రీకి ఏమాత్రం కలిసి రాలేదనే చెప్పొచ్చు. ఈ సినిమాలు ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తాయో వేచి చూడాల్సిందే..!

టీడీపీలో పెను సంక్షోభం: వైసీపీలోకి 7గురు టీడీపీ ఎమ్మెల్యేలు?


ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు కావడమంటే ఇదే.. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష వైసీపీ ఎమ్మెల్యేలను లాగడమే పనిగా పెట్టుకున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. పలువురు వైసీపీ ఎమ్మెల్యేలను లాగి మంత్రి పదవులు కూడా కట్టబెట్టారు. కానీ వైసీపీ అధినేత, సీఎం జగన్ మాత్రం రాజకీయ విలువలకు కట్టుబడి ఇన్నాళ్లు టీడీపీ ఎమ్మెల్యేలను నేరుగా చేర్చుకోలేదు. కానీ ఇప్పుడు గంపగుత్తగా టీడీపీ ఎమ్మెల్యేలను చేర్చుకొని అసెంబ్లీలో టీడీపీని వైసీపీలోకి విలీనం దిశగా అడుగులు వేస్తున్నట్టు పరిస్థితులు కనిపిస్తున్నాయి..

*ఏడుగురు టీడీపీ ఎమ్మెల్యేలు జంపేనా?
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవమైన ‘మహానాడు’కు ముందే చంద్రబాబుకు భారీ షాక్ తగలడం ఖాయంగా కనిపిస్తోంది. ఏపీ రాజకీయాల్లో పెను ప్రకంపనలు రాబోతున్నాయి. ప్రతిపక్ష టీడీపీ పునాదులు కదలబోతున్నాయి. ఇన్నాళ్లు పక్కరాష్ట్రంలో ఉన్న చంద్రబాబుకు దిమ్మదిరిగే షాక్ ను టీడీపీ ఎమ్మెల్యేలు ఇవ్వబోతున్నారట. ఈ మేరకు ధ్రవపరుస్తున్నాయి వైసీపీ సన్నిహిత వర్గాలు. తాజాగా వారి నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈరోజు సాయంత్రం సీఎం జగన్ సమక్షంలో ఏడుగురు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరబోతున్నారట.. ఇదే జరిగితే రాష్ట్ర రాజకీయాల్లోనే టీడీపీలో పెను సంక్షోభం చోటుచేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

*మంత్రి బాలినేని మంత్రాంగం?
టీడీపీ నుంచి వైసీపీలోకి ఏడుగురు ఎమ్మెల్యేలు చేరడానికి రంగం సిద్ధమైనట్లు రాజకీయా వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఈ మేరకు రంగం కూడా సిద్ధమైనట్టు సమాచారం. ఈ విషయంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కీలకంగా వ్యవహరిస్తున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈరోజు ఒంగోలులోని మంత్రి బాలినేని నివాసంలో తెదేపా ఎమ్మెల్యేలు అనగాని సత్య ప్రసాద్, ఏలూరి సాంబశివరావులు భేటి కావడం ఈ రాజకీయ ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది. వీరితోపాటు మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలు వైసీపీలో చేరేందుకు రెడీ అయ్యారని ప్రస్తుతం చర్చలు సాగుతున్నట్టు వార్తలు లీక్ అవుతున్నాయి.

*గొట్టిపాటి కూడా అదే వైసీపీలోకేనా?
అద్దంకికి చెందిన మరో ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్ కూడా వైయస్ఆర్సిలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని ఒక చర్చ కూడా ఉంది. ప్రకాశం జిల్లాలో తన ప్రధాన వ్యాపారమైన మైనింగ్ వ్యాపార కార్యకలాపాలలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగాలని.. అందుకోసమే వైసీపీలో చేరబోతున్నాడని తెలుస్తోంది.

*కోరికలు తీరిస్తే కండువా పసుపు మార్చడమే..
ఏడుగురు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరడానికి రెడీ అయ్యారని.. వారంతా తమ కోరికలు, వైసీపీలో ప్రాధాన్యంపై చర్చిస్తున్నట్టు సమాచారం. ఈ చర్చలు ఓ కొలిక్కి వచ్చాయని కాసేపట్లో తాడేపల్లి బయలుదేరి సాయంత్రం లోపు సీఎం జగన్ సమక్షంలో తెదేపా ఎమ్మెల్యేలు వైసీపీలో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే గనుక నిజమైతే ఏపీ రాజకీయాలే షేక్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.

*ఇప్పటికే ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు దూరం
ఇప్పటికే, ముగ్గురు టిడిపి ఎమ్మెల్యేలు – గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, గుంటూరు (పశ్చిమ) ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావు, చీరాల ఎమ్మెల్యే కరణం బలరామ కృష్ణ మూర్తి – వైయస్ఆర్సికి విధేయతగా ఉన్నారు. టీడీపీని వదిలి వైసీపీకి మద్దతు తెలిపారు. వారు అధికారికంగా టిడిపికి రాజీనామా చేసి వైయస్ఆర్సిలో చేరలేదు, కానీ వారు తమ అసెంబ్లీ సభ్యత్వాన్ని కోల్పోకుండా ఉండటానికి జగన్ ప్రభుత్వానికి మాత్రమే తమ మద్దతును అందించారు.

*అసెంబ్లీలో వైసీపీలోకి టీడీపీ విలీనమేనా?
టీడీపీ నుంచి ఏడుగురు ఎమ్మెల్యేలు కనుక చేరితే అసెంబ్లీలో టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా పోయి టీడీపీ మొత్తం పార్టీ వైసీపీలో విలీనం అవుతుంది. ఇదే జరిగితే టీడీపీ కి అంతకంటే అవమానం మరోటి ఉండదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

–నరేశ్ ఎన్నం

ఏపీ శాసనమండలి కార్యదర్శిపై ధిక్కార పిటిషన్


ఆంధ్ర ప్రదేశ్ శాసన మండలి కార్యదర్శిగా అదనపు బాధ్యతలు వహిస్తున్న శాసనసభ కార్యదర్శిపై ధిక్కార పిటిషన్ ఏపీ హై కోర్ట్ నేడు విచారణకు స్వీకరించింది. టిడిపి ఎమ్యెల్సీ దీపక్ రెడ్డి వేసిన పిటీషన్ ను విచారించిన హై కోర్ట్ ప్రభుత్వ సమాధానం కోసం వాయిదా వేసింది.

మూడు రాజధానులకు అనుకూలంగా వైసీపీ సర్కారు తీసుకొచ్చిన రెండు బిల్లులను.. శాసన మండలి ఛైర్మన్‌గా తనకున్న విచక్షణాధికారంతో సెలక్ట్ కమిటీకి పంపాలని షరీఫ్ నిర్ణయించిన విషయం తెలిసిందే.

వాదనల అనంతరం ప్రభుత్వం తరఫున అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మండలి కార్యదర్శికి నోటీసులు పంపించింది. తదుపరి విచారణ వచ్చే నెల 22కి వాయిదా వేసింది.

శాసన మండలి చైర్మన్ సర్వాధికారి అని, ఆయన ఆదేశాలను పాటించాల్సి ఉంటుందని పిటిషన్‌లో దీపక్ రెడ్డి తెలిపారు. విశేష అధికారాలనుపయోగించి సెలక్ట్ కమిటీ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేస్తే మండలి కార్యదర్శి వాటిని పక్కన పెట్టేశారని పిటిషన్‌లో ఉటంకించారు.

ఆంధ్రప్రదేశ్ రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ సవరణ బిల్లు వ్యవహారంపై సెలక్ట్ కమిటీ ఏర్పాటు చేయాలని మండలి చేసిన తీర్మానం మేరకు చైర్మన్ పంపిన ఆదేశాన్ని మండలి కార్యదర్శి ఖాతరు చేయలేదని అందులో దీపక్ రెడ్డి ఆరోపించారు.

బిల్లుల పరిశీలనకు 8 మందితో సెలక్ట్ కమిటీ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ శాసన మండలి తీర్మానించినా కమిటీ ఏర్పాటు చేయలేదని దీపక్ రెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. శాసనమండలి కార్యదర్శి అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహిస్తూ నిబంధనలను పాటించడం లేదని పేర్కొన్నారు.

క్విడ్‌ ప్రొకో కింద మండలి కార్యదర్శి పదవీ కాలాన్ని పొడిగించారని తెలిపారు. ప్రతివాదులుగా మండలి కార్యదర్శి, ప్రభుత్వం, సహాయ కార్యదర్శి పేర్లను దీపక్ రెడ్డి తన పిటిషన్‌లో చేర్చారు.

ఏపీ ప్రభుత్వం దివాళా తీసిందా..!


రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూముల అమ్మకానికి వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్ పై విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం కీలకమైన వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం దివాళా తీసిందా అని ప్రభుత్వం తరుపు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. ఆస్తులు అమ్ముకోవడంతోనే ప్రభుత్వం నడపటం, రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తున్నారా అని ప్రశ్నించింది. ఏపీ పేద రాష్ట్రమేమి కాదని, వేల కిలో మీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉన్న రాష్ట్రంలో ప్రజలు ధనవంతులుగా ఉంటే ప్రభుత్వం పేదరికంలో ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

బిల్డ్ ఏపీ పథకం పేరుతో ప్రభుత్వం తొలివిడతగా గుంటూరు, విశాఖ నగరాల్లో ఉన్న విలువైన ఆస్తులు అమ్మకానికి పెట్టింది. ఈ నిధులతో బిల్ట్ ఏపీలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని పేర్కొంది. ఈ విషయాన్ని సవాలు చేస్తూ ఏపీ హైకోర్టులో దాఖలైన పిటీషన్‌ను హైకోర్టు ధర్మాసనం మంగళవారం విచారించింది. లాక్ డౌన్ అమల్లో ఉంటే ఇంత అర్జెంటుగా వేలానికి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించింది.

ప్రజా ప్రయోజన వ్యాజ్యానికి సంబంధించి ఇచ్చే ఉత్తర్వులకు లోబడి ఆక్షన్ జరపాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అయితే, ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేసేందుకు సమయం కావాలని అడ్వకేట్ జనరల్ కోరడంతో ఈ మేరకు తదుపరి విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు టిటిడి నిరర్ధక ఆస్తుల వేలంపై గుంటూరుకు చెందిన సురేశ్ బాబు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

ఆండ్రియా అడవిలో ఏం చేసిందంటే..


ఆండ్రియా జెరెమియా గుర్తుందిగా. ప్లే బ్యాక్ సింగర్ నుంచి హీరోయిన్అవతారం ఎత్తిన ఈ బ్యూటీ సౌత్ ఇండస్ట్రీలో దూసుకెళ్తోంది. జూ.ఎన్టీఆర్ రాఖీ సినిమాలో సూపర్ హిట్ ‘జర జరా’ పాట పాడిన ఆండ్రియా… తడాఖా సినిమాతో తెలుగులో తెరంగేట్రం చేసింది. విశ్వరూపం సినిమాలో కమల్ హాసన్‌ సరసన నటించి పేరుతెచ్చుకున్న ఆమె మరెన్నో సినిమాల్లో మెప్పించింది. సింగర్గా కూడా బిజీగానే ఉన్న ఆమె.. తమిళ యువ సంగీత దర్శకుడు అనిరుధ్‌తో ప్రేమలో వార్తల్లోకి వచ్చింది. వీరిద్దరి ఏకాంత ఫొటోలు అప్పట్లో హల్‌చల్‌ చేశాయి. అయితే, ఈ మధ్య సినిమాలపై దృష్టి పెట్టిన ఆండ్రియా ఫుల్ బిజీగా మారింది. తమిళ్‌లో ఇప్పుడు ఐదు చిత్రాల్లో నటిస్తోందామె.

ఈ మధ్యే దాదాపు 40 రోజుల పాటు ఆమె ఆడవిలో గడిపించింది. సినిమాలతో ఇంత బిజీగా ఉన్న ఆండ్రియా.. అడవికి వెళ్లాల్సిన అవసరం ఏముందంటారా?. ఇంకెందుకు షూటింగ్ కోసమే. అటవీ నేపథ్యంలో సాగే ఓ సాహాస చిత్రంలో ఆమె నటిస్తోంది. ఆ మూవీ పేరు ‘కా’. దాని షూటింగ్‌ దాదాపు అడవిలోనే జరిగింది. అందుకోసం ఆండ్రియాతో పాటు చిత్ర యూనిట్ 40 రోజుల పాటు ఓ కారడవిలో జరిగిన చిత్రీకరణలో పాల్గొన్నారు. ‘కా’ అంటే అడవి అని అర్థం. ఈ సినిమాలో ఆండ్రియా వైల్డ్‌ లైఫ్ ఫొటోగ్రాఫర్ పాత్రలో నటిస్తోంది. అడవిలో ఫొటోలు తీస్తుండగా ఆమె ఓ నేరాన్ని చూస్తారని, ఆ తర్వాత ఏం జరిగిందనే విషయమే చిత్ర కథాంశం అని దర్శకుడు నాంజిల్ చెబుతున్నాడు. ఆండ్రియా కెరీర్తో పాటు కోలీవుడ్‌లోనే ఈ చిత్రం ప్రత్యేకంగా నిలిచిపోతుందని నమ్మకంగా చెబుతున్నాడు.

నీ గురించి నాకు తెలుసు బుజ్జి.. అంటున్న శ్రీరెడ్డి


బిగ్ బాస్ బ్యూటీ నందిని రాయ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్ పై పలు వ్యాఖ్యలు చేసింది. ఇందులో అమ్మాయిలే తప్పు అన్న రీతిలో నందిని రాయ్ వ్యాఖ్యలు ఉండటంతో తీవ్ర దుమారం రేగింది. నందిని రాయ్ వ్యాఖ్యలు ఒకసారి పరిశీలిస్తే.. క్యాస్టింగ్ కౌచ్ అనేది ఒక్క సినిమా ఇండస్ట్రీకే పరిమితం కాదని.. ఇది అన్నిరంగంల్లోనూ ఉందని చెప్పింది. మిగతా ఇండస్ట్రీలతో పొలిస్తే ఒకరకంగా చిత్రసీమనే బెటరని సెలవిచ్చింది. అయితే తనకు సినిమా పరిశ్రమలో ఇలాంటి అనుభవాలు ఎదురుకాలేదని చెప్పింది. తన ఫ్రెండ్స్ ఐటీ ఇండస్ట్రీలో ఉన్నారని వారి చెప్పే కొన్ని విషయాలు వింటుంటే ఒకరకంగా సినిమా ఇండస్ట్రీనే బెటర్ అని స్టేట్మెంట్ ఇచ్చింది. అంతేకాదు అమ్మాయిలైనా.. హీరోయిన్లు అయినా ‘నో’ అని చెబితే ఎవరూ ఏం చేయలేరని.. ‘నో’ అన్నాక బలవంతం చేసే పరిస్థితులు ఉండవని చెప్పింది. ఇదంతా అమ్మాయిలు వ్యవహరించే తీరుపై ఆధారపడి ఉంటుందని నందిని రాయ్ చెప్పింది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యారు.

టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్ కు వ్యతిరేకంగా శ్రీరెడ్డి గతంలో గళం విప్పింది. అర్ధనగ్న ప్రదర్శన చేసి అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెల్సిందే. వీలుచిక్కినప్పుడల్లా ఇండస్ట్రీలోని బాగోతాలను బహిర్గతం చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. టాలీవుడ్లో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావని చెప్పింది. అదేవిధంగా అవకాశాల కోసం వెళ్లిన వారిపట్ల కొందరు కమ్మిట్మెంట్ పేరిట వేధింపులు చేస్తారని ఆరోపించింది. ఈనేపథ్యంలో ఇటీవల నందిని రాయ్ క్యాస్టింగ్ కౌచ్ విషయంలో చేసిన వ్యాఖ్యలపై శ్రీరెడ్డి తనదైన శైలిలో స్పందించింది. ‘ఓ అమ్మాయి పని కోసం వెళ్లింది.. అలాంటప్పుడు సెక్స్ కావాలని ఎవరైనా అడిగితే అది క్యాస్టింగ్ కౌచ్ అవుతుంది నందిని.. కానీ మనమే డైరెక్ట్ గా ఆఫర్ చేస్తే అది క్యాస్టింగ్ కౌచ్ కాదు.. నీ గురించి నాకు బాగా తెలుసు.. నువ్వు నా స్నేహితురాలివి.. అది మరిచిపోకు బుజ్జి..’ అంటూ శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ అకౌంట్లో పోస్టు చేసింది. ప్రస్తుతం శ్రీరెడ్డి చేసిన పోస్టు నెట్టింట్ల వైరల్ అవుతోంది. శ్రీరెడ్డి ఒక్క పోస్టుతో నందిని రాయ్ ను క్లీన్ బోల్డ్ చేసిందని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై నందిని రాయ్ ఎలా రియాక్టవుతుందో వేచి చూడాల్సిందే.

రోజాకు సొంత పార్టీలోనే అసమ్మతి..


వైసిపిలో `ఫైర్ బ్రాండ్’ నేతగా పేరొందిన ప్రముఖ సినీ నటి, నగిరి ఎమ్యెల్యే ఆర్ కె రోజా ఇప్పుడు సొంత పార్టీ నేతలపైననే ఎక్కువగా మండిపడుతున్నారు. ఆమె వరుసగా రెండోసారి గెలుపొందిన నగిరి నియోజకవర్గంలోనే ఆమెకు సొంత పార్టీ వారే ఎసరు పెట్టె ప్రయత్నం చేస్తున్నారు.

తాజాగా చిత్తూర్ జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి తనకు తెలుపకుండా తన నియోజకవర్గంలో పర్యటించడం పట్ల ఆమె అసహనం వ్యక్తం చేశారు.

స్థానిక ఎమ్మెల్యే అయిన రోజాకు సమాచారం ఇవ్వకుండా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి పుత్తూరులో పర్యటించారు. ఈ విషయం తెలిసిన నగరి ఎమ్మెల్యే రోజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు చెప్పకుండా తన నియోజకవర్గంలో ఎలా పర్యటిస్తారని ఆమె ప్రశ్నించారు.

డిప్యూటీ సీఎం నారాయణస్వామి, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, జిల్లా కలెక్టర్ భరత్ నారాయణ్ గుప్తా పుత్తూరులో ఆకస్మికంగా పర్యటించారు. పుత్తూరులోని అంబేద్కర్ సంఘం తరపున దళితులకు కల్యాణ మంటప స్థల సేకరణ కోసం ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలోని ఖాళీ భూమిని పరిశీలించారు.

తాను నియోజకవర్గంలోనే అందుబాటులో ఉన్నా కూడా తనను పట్టించుకోకుండా ప్రోటోకాల్ ఉల్లంఘించారని రోజా ఆరోపించారు. తనను రాజకీయంగా పక్కకు నెట్టడం కోసమే సొంత పార్టీలోని నియోజకవర్గానికి చెందిన తన ప్రత్యర్థులే కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నట్లు ఇదివరలో సహితం పలు సార్లు ఆమె ఆగ్రవేశాలు వ్యక్తం చేయడం తెలిసిందే.

నగరి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న ఒక గ్రూపునకు మాత్రమే నారాయణస్వామి మంత్రినా అంటూ రోజా నిలదీశారు. అంటే తన నియోజకవర్గంలోనే సొంత పార్టీలో బలమైన వర్గాలు తనను వ్యతిరేకిస్తున్నట్లు ఆమె అంగీకరించినట్లు అయింది.

పోతిరెడ్డిపాడుపై జగన్ క్లారిటీ!

pothireddypadu

గత కొన్ని రోజుల పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ పై తెలుగు రాష్ట్రాల మధ్య నలుగుతున్న అంశంపై ఏపీ సీం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. 881 అడుగులు ఉన్నప్పుడే 44 వేల క్యూసెక్కులు తీసుకోగలమని ఆయన తెలిపారు. 854 అడుగుల్లో ఉంటే కేవలం 7వేల క్యూసెక్కులు మాత్రమే తీసుకోగలమని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో రాయలసీమ కరువు ఎలా తీర్చాలి ? అని ఆయన వ్యాఖ్యానించారు. 800 అడుగుల నీటిమట్టం ఉన్నప్పుడు తెలంగాణ నీళ్లు తీసుకెళ్తోందని సీఎం జగన్… అదే 800 అడుగుల వద్ద మాకు కేటాయించిన నీళ్లను తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇలా తీసుకోవడం వల్ల ఎవరికీ నష్టం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. అప్పుడే రెండు రాష్ట్రాలకు సమన్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘మన పాలన–మీ సూచన’ కార్యక్రమంలో భాగంగా వ్యవసాయం, అనుబంధ రంగాలపై జరిగిన సమీక్షలో ఏపీ సీఎం జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఎల్జీ పాలిమర్స్‌కు ఈసారి సుప్రీం లో చుక్కెదురు

విశాఖపట్నంలో భద్రతా ప్రమాణాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో గ్యాస్ లీక్ జరిగి 12 మంది మరణానికి, వందలాదిమంది తీవ్ర అనారోగ్యాలకు గురికావడానికి కారణమైన దక్షిణ కొరియాకు చెందిన ఎల్జీ పాలిమర్స్‌కు ఈ సారి సుప్రీం కోర్ట్ లో మరోసారి చుక్కెదురైంది.

ఫ్యాక్టరీని సీజ్‌ చేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టును ఎల్జీ పాలిమర్స్ ఆశ్రయించింది. ఎల్జీ పాలిమర్స్ ప్లాంట్‌లోకి వెళ్లేందుకు అనుమతివ్వాలంటూ ఆ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు మంగ‌ళ‌వారం విచార‌ణ జ‌రిపింది.

ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఎల్జీ పాలిమర్స్‌ సంస్థ ప్రతినిధులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్లాంట్‌ లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా అత్యవసరంగా వెళ్లేందుకు అనుమతివ్వాలని విజ్ఞప్తి చేశారు. విచార‌ణ కోసం నియ‌మించిన ఏడు కమిటీల్లో దేనికి హాజరుకావాలో అర్థం కాని పరిస్థితి నెలకొందని పిటిషన్‌లో పేర్కొంది.

ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలపై జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. దీని పై ఏపీ హైకోర్టుతో పాటు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దర్యాప్తు చేస్తున్నాయని ఈ సమయంలో తాము విచారణ జరపలేమని స్పష్టం చేసింది. హైకోర్టు, ఎన్జీటీలో విచార‌ణ ముగిసిన త‌ర్వాతే సుప్రీం కు రావాల‌ని స్పష్టం చేసింది.

ఏ వాదనలనైనా హైకోర్టు, ఎన్జీటీ ముందే వినిపించాలని ఎల్జీని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఎల్జీ పాలిమర్స్‌ను సీజ్‌ చేయాలని హైకోర్టు ఏకపక్షంగా ఆదేశించిందని కంపెనీ తరపు న్యాయవాది ముకుల్‌ రోహత్గి వాదనలు వినిపించారు. ముకుల్ వాదనలను ధర్మాసనం తోసిపుచ్చుతూ తాజా ఆదేశాలు జారీ చేసింది.

అంతకు ముందు రూ 50 కోట్లు డిపాజిట్ చేయమని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశంపై కూడా సుప్రీం కోర్ట్ జోక్యం చేసుకోవడానికి నిరాకరించడం తెలిసిందే.