
లాక్ డౌన్ మొదట్లో ప్రధాని నరేంద్ర మోదీని పొగడ్తలతో ముంచెత్తడమే కాకుండా ఇటువంటి సమయంలో దేశ ప్రధాని పట్ల దుర్భాషలాడిన వారిపై కేసులు నమోదు చేస్తామని కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు హెచ్చరించారు. అయితే ఆయన అనుకున్నట్లు కేంద్రం నుండి నిధులు రాకపోవడం, పైగా కరోనా టెస్ట్ లు తగ్గించి వైరస్ వ్యాప్తిని కప్పిపుచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని కేంద్రం నిలదీస్తూ ఉండడంతో చికాకు ప్రదర్శిస్తున్నారు.
కేంద్రం ప్రకటించిన ప్యాకేజిలలో సహితం రాష్ట్రానికి నేరుగా నిధులు ఇవ్వకుండా అనేక పథకాలతో లింక్ పెడుతూ ఉండడంతో ఆయన ఆగ్రహం పట్టలేక పోతున్నారు. తాజాగా కేంద్రం సూలు చేస్తున్న సెస్, సర్ చార్జీలతో రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని మండిపడుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న సెస్, సర్‌ఛార్జీలతో ప్రతి ఏడాది తెలంగాణ రూ.3,000 కోట్ల మేర నష్టం వస్తున్నట్లు అంచనా వేశారు. పన్నులపై పన్నులు వసూలు చేయడం అసంబద్దమని అంటూ కేంద్రంపై పోరుకు సిద్దపడుతున్నారు. కేంద్రం వసూలు చేస్తోన్న సెస్ ఓ గోల్‌మాల్ అని ఇటీవల సీఎం కేసీఆర్ ఓ మీడియా సమావేశంలో పేర్కొనడం గమనార్హం.
పైగా, సమాఖ్య ఆర్థిక స్ఫూర్తికి విరుద్ధమని విమర్శలు కురిపిస్తున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 270 ప్రకారం కేంద్ర ప్రభుత్వాలు వసూలు చేస్తున్న వివిధ రకాల సెస్‌లలో రాష్ట్రాలకు వాటా పంచాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉండదు. అయితే రోడ్ సెస్, సర్వశిక్షా అభియాన్ల నుంచి మాత్రం కొంత మొత్తం రాష్ట్రాలకు చేరుతోంది.
1980-81 వరకు మొత్తం టాక్స్ రెవెన్యూలో 2.3 శాతం మాత్రమే సెస్ వసూళ్ళు ఉండేవి. నెమ్మదిగా పెరుగుతూ 15వ ఆర్థిక సంఘం అంచనాల ప్రకారం 2020-21 ఆర్థిక సంవత్సరానికి అవి 17.8 శాతానికి చేరాయి. కేంద్రం అనుసరించాలనుకుంటున్న వన్ నేషన్, వన్ టాక్స్ విధాన స్ఫూర్తికి ఇది పూర్తిగా విరుద్ధమని కేసీఆర్ భావిస్తున్నారు.
అందుకే 15 వ ఆర్థికసంఘం దృష్టికి ఈ విషయాన్ని మరోసారి తీసుకెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. కేంద్రం వసూలు చేసే సెస్, సర్ ఛార్జీల్లో రాష్ట్రాలకు వాటా ఇవ్వాలని డిమాండ్ చేయడానికి సిద్దపడుతున్నారు. అయితే సెస్‌లు, సర్ ఛార్జీల్లో రాష్ట్రాలకు వాటా దక్కాలంటే రాజ్యాంగ సవరణ తప్పనిసరి కాగలదు.
2014-15 ఆర్థిక సంవత్సరం వరకు ఒక రూ.1.15 లక్షల కోట్లుగా ఉన్న సెస్‌లు, సర్ చార్జీల వసూళ్లు ఏకంగా రూ 3.5 లక్షల కోట్లకు పెరిగాయి. అసలు రాష్ట్రాల జాబితాలో ఉన్న అంశాలకు కేంద్రం సెస్ వసూలు చేయడం నిబంధనలకు విరుద్ధమని కేసీఆర్ వాదిస్తున్నారు.