
హైదరాబాద్ అంటే ముందుగా గుర్తుచ్చేది బోనాల పండుగే. లష్కర్ బోనాలు, ఉజ్జయిని మహంకాళి బోనాలకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది ప్రజలు హాజరవుతుంటారు. ఈ ఉత్సవాల్లో పోతురాజులు ఆటలు, శివసత్తుల పూనకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అయితే ఈ ఏడాది ఆ పరిస్థితి ఉండదని ప్రభుత్వ వర్గాలు చెబుతోన్నాయి. ఈసారి భక్తులు లేకుండానే అధికారులు, పూజారులు బృందం అమ్మవారికి బోనాల సమర్పించనున్నారని దేవదాయశాఖ మంత్రి అల్లలో ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు.
బోసిపోనున్న బోనాల పండుగ.
ప్రతీయేటా భాగ్యనగరం రంజాన్, బోనాలు, వినాయక చవితి, బతుకమ్మ సంబరాలతో కళకళలాడుతూ ఉంటుంది. అయితే ఈసారి కరోనా కారణంగా రంజాన్ పండుగ నిరాడబరంగా సాగింది. మసీదుల్లో అలాయ్.. బలాయ్ చేసుకోవాల్సిన ముస్లింలంతా ఈసారి ఇళ్లకే పరిమితం కావాల్సి వచ్చింది. ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకొని రంజాన్ పండుగు చేసుకున్నారు. తాజాగా కరోనా ఎఫెక్ట్ బోనాల పండుగపై పడనుంది. వందల యేళ్లుగా నగరంలో శోభాయానంగా జరుపుకుంటున్న బోనాల పండుగ ఈసారి కళ తప్పేలా కన్పిస్తుంది.
భక్తులు లేకుండానే బోనాలు..
ఈనెల8 నుంచి ఆలయాలు, ప్రార్థన మందిరాలు తెరుచుకోనున్నాయి. దీంతో ఈసారి బోనాల పండుగకు లైన్ క్లియర్ అయిందని అందరూ భావించారు. అయితే ప్రభుత్వం మాత్రం ఈసారి బోనాల పండుగ నిర్వహించడం లేదని స్పష్టం చేసింది. హైదరాబాద్‌లో కరోనా కట్టడిలో లేనందు వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రజలంతా భౌతికదూరం పాటించడం ముఖ్యమని తేల్చిచెప్పారు. అమ్మవార్లకు అధికారులు, 11మంది పూజారులతో కూడిన బృందం బోనాలు సమర్పిస్తారని దేవాదాయ శాఖ మంత్రి తెలిపారు.
ముందస్తు ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం..
జూన్ 23న ఎల్లమ్మ కల్యాణం నిర్వహిస్తారు. 25న గోల్కొండ జగదాంబిక, జులై 12న ఉజ్జయిని మహంకాళి, 19న లాల్ దర్వాజ సింహవాహినికి బోనాలు సమర్పించాల్సి ఉంటుంది. జూన్ 8నుంచి ఆలయాలు తెరుచుకోనుండటంతో అధికారులు తగు ఏర్పాటు చేస్తున్నారు. భక్తులు భౌతికదూరం విధిగా పాటించేలా చర్యలు చేపడుతున్నారు. ఆలయ ప్రాంగణాలను శానిటైజేషన్ చేస్తున్నారు. భక్తులు గుడిలోకి ప్రవేశించే ముందు థర్మల్ స్కీనింగ్ చేస్తారు. లక్షలాది మంది భక్తులు హాజరయ్యే వేడుకలు కావడంతో ప్రభుత్వం కూడా ముందుగానే ఏర్పాట్లు చేస్తుంది. 65ఏళ్లు పైబడినవారు, పదేళ్లలోపు చిన్నారులను ఆలయానికి రావొద్దని ప్రభుత్వం కోరుతుంది.
ఈ ఏడాది కరోనా ప్రభావంతో పరిమిత సంఖ్యలో భక్తులతోనే బోనాల పండుగ నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈమేరకు ఆలయ కమిటీలతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చర్చిస్తున్నట్లు సమాచారం. ఏదిఏమైనా ఈసారి మాత్రం హైదరాబాద్ మహానగరం పండుగలు జరుపుకోలేక కళావిహీనంగా కన్పించనుండటం శోచనీయంగా మారింది.