
సీనియర్ నటుడు చలపతిరావు వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుపెట్టిన నటుడు రవిబాబు. మొదట్లో వైవిధ్యమైన పాత్రల్లో నటించిన ఆయన తర్వాత దర్శకుడిగా మారాడు. వైవిధ్యమైన సినిమాలతో టాలీవుడ్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. తొలి చిత్రం ‘అల్లరి’తోనే యూత్ పల్స్ పట్టేసిన రవిబాబు.. అమ్మాయిలు అబ్బాయిలు, సోగ్గాడు, పార్టీ, నచ్చావులే, లడ్డూబాబు, మనసార, నువ్విలా వంటి చిత్రాలతో వినోదాన్ని పంచాడు. ఆపై, అనసూయ, అమరావతి, అవును వంటి హారర్ మూవీస్‌తో ప్రేక్షకులను థ్రిల్ చేశాడు. వైవిధ్యం, కొత్తదనంతో పాటు ప్రయోగాలు చేయడంలో ముందుండే రవిబాబు.. పంది పిల్ల హీరోగా ‘అదుగో’ తీశాడు.
గతేడాది ఆవిరి అనే మరో హారర్ థ్రిల్లర్ తీసిన ఆయన.. మళ్లీ యూత్‌పై దృష్టి పెట్టినట్టున్నాడు. తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ‘క్రష్’ అనే టైటిల్‌తో తన కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. ఈ మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్ విడుదల చేశాడు . ఫ్లయింగ్ ప్రాగ్స్ ప్రొడక్షన్ బ్యానర్‌పై రూపొందుతోంది ఈ సినిమా. పోస్టర్ చూస్తుంటే ఈ చిత్రం యూత్ ఎంటర్‌టైనర్ అని అర్థమవుతోంది. సినిమా పోస్టర్ల విషయంలోనూ తనకంటూ ప్రత్యేకతనూ ఏర్పరచుకున్న రవిబాబు.. ‘క్రష్’ సినిమా ఫస్ట్‌లుక్‌ను కూడా వెరైటీగా డిజైన్ చేశాడు. బాత్‌రూంలో కాళ్లు షేవ్ చేసుకుంటున్న ఓ యువతిని మాస్కులు ధరించిన ముగ్గురు అబ్బాయిలు తలుపు దగ్గర నుంచి గమనిస్తుండడం ఆసక్తి కలిగిస్తుంది. పోస్టర్ పై అన్‌లాక్ 1.0… కింద ఎగ్జిట్ విత్ కేర్ ( జాగ్రత్తగా బయట పడండి) అని రాసి ఉంది. దాంతో, కరోనా వైరస్, లాక్‌డౌన్ బ్యాక్‌డ్రాప్‌లో రవిబాబు కథ రెడీ చేసినట్టు అనిపిస్తోంది.