Home Blog Page 154

'జైలర్ 2' లో హృతిక్ రోషన్.. ఫ్యాన్స్ కి ఊహించని ట్విస్ట్ ఇచ్చిన డైరెక్టర్..

Jailer 2 Hrithik Roshan
Jailer 2 Hrithik Roshan

Hrithik Roshan in Jailer 2: సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్ లో ఎంతో ప్రత్యేకమైన చిత్రం ‘జైలర్’. నేటి తరం ఆడియన్స్ లో రజినీకాంత్ రేంజ్ ఏంటో తెలియజేసేలా చేసిన చిత్రమిది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 650 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అప్పటి వరకు వరుస ఫ్లాప్స్ లో ఉన్నటువంటి రజినీకాంత్ కి, ఈ సినిమా ఇచ్చిన కిక్ సాధారమైనది కాదు. అలాంటి సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ అంటే కచితంగా ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉండడం సహజం. ‘జైలర్ 2’ కి ప్రస్తుతం ఎవ్వరూ ఊహించనంత క్రేజ్ ఉంది. కోలీవుడ్ సినీ ఇండస్ట్రీ కి ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క వెయ్యి కోట్ల గ్రాస్ సినిమా కూడా లేదు, ‘జైలర్ 2’ మొట్టమొదటి వెయ్యి కోట్ల సినిమాగా నిలుస్తుందని అభిమానులు బలమైన నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అయ్యి చాలా రోజులే అయ్యింది.

అయితే ఈ సినిమాలో అతిథి పాత్రకు సంబంధించి సోషల్ మీడియా లో వచ్చిన రూమర్స్ ని గత కొంతకాలంగా మనమంతా చూస్తూనే ఉన్నాం. ముందుగా నందమూరి బాలకృష్ణ ఈ చిత్రం లో గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నాడని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది , ఆ తర్వాత బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ ఆ పాత్రలో నటించబోతున్నాడని వార్తలు వచ్చాయి. ఇవి రెండు సరిపోవు అన్నట్టు , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు కూడా కొన్ని రోజులు బలంగా వినిపించింది. వీళ్ళెవ్వరూ కూడా ఈ పాత్రలో నటించడానికి ఒప్పుకోలేదు, అయితే ఇప్పుడు ఈ పాత్రని బాలీవుడ్ సూపర్ స్టార్స్ లో ఒకరినే హృతిక్ రోషన్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు లేటెస్ట్ గా బలంగా వినిపిస్తున్న వార్త.

గతం లో హిందీ లో రజినీకాంత్ హీరో గా నటించిన ‘భగవాన్ దాదా’ అనే సినిమాలో హృతిక్ రోషన్ చైల్డ్ ఆర్టిస్ట్ పాత్రలో నటించాడు. 1986 వ సంవత్సరం లో విడుదలైన ఈ సినిమా పెద్ద హిట్ అయ్యింది. మళ్లీ వీళ్లిద్దరు సూపర్ స్టార్ స్టేటస్ కి వచ్చిన తర్వాత కలిసి నటించబోతున్నారు. అయితే ఇంతమంది సూపర్ స్టార్స్ ఎందుకు ఆ పాత్రని రిజెక్ట్ చేశారు ?, హృతిక్ రోషన్ అది ఆలోచించకుండా ఈ పాత్రలో నటించడానికి ఎలా ఒప్పుకున్నాడు అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. రీసెంట్ గానే హృతిక్ రోషన్ ఎపిసోడ్స్ కి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేశాడట డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్. ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

టీఎంసీ అంతర్దానం.. కాంగ్రెస్ పార్టీలో విలీనం.. పాపం మమతకు ఎంత గతి పట్టింది

TMC merger with Congress

TMC merger with Congress: ఒక్క ఓటమి.. ఒకే ఒక్క ఓటమి మమతా బెనర్జీకి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసింది. తను ఓడిపోవడం మాత్రమే కాదు.. 15 సంవత్సరాలుగా పరిపాలించిన తన పార్టీ కూడా ఓడిపోవడంతో ఆమె పరిస్థితి దారుణంగా మారిపోయింది. ఇండియా కూటమిని లీడ్ చేసే స్థాయి నుంచి సోనియా చెప్పు చేతుల్లోకి వెళ్లే స్థాయికి మమత దిగజారిపోయింది.

ఇటీవల ఇండియా కూటమి మీటింగ్ జరిగింది. ఒకప్పుడు ఇండియా కూటమి మీటింగ్ జరిగితే మమతకు అగ్రస్థానం ఇచ్చేవారు. మమతకు విపరీతమైన గౌరవం ఇచ్చేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పైగా మమత మీద కుళ్ళు జోకులు వేశారు. అంతేకాదు మొన్నటికి మొన్న మీ అల్లుడి మీద గుడ్లతో దాడి చేశారు కదా.. అతనికి ఏమైనా గాయాలయ్యాయా.. ఇదిగో ఇలా మమతను టీజ్ చేశారు కాంగ్రెస్, ఇతర పార్టీల నాయకులు. వారి మాటలకు మమత బెనర్జీ తీవ్రంగా నొచ్చుకుంది. ఏం చేయాలో తెలియక మౌనంగా ఉండిపోయింది. మమత మౌనాన్ని ఆసరాగా తీసుకున్న కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఏకంగా ఆమె రాజకీయ భవితవ్యానికే స్కెచ్ వేశారు.

పశ్చిమ బెంగాల్లో ఇప్పట్లో టి ఎం సి అధికారులకు వచ్చే అవకాశాలు లేవు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు కూడా లేవు. ఆమె మేనల్లుడు మీద ప్రజలు దాడులు చేస్తున్నారు. మంత్రులను కూడా వదిలిపెట్టడం లేదు. ఎమ్మెల్యేలు ఇప్పటికే తిరుగుబాటు చేయడం మొదలుపెట్టారు. రిత బ్రత బెనర్జీ వేరే కుంపటి పెట్టాడు. ఎమ్మెల్యేలు మొత్తం ఇప్పుడు అతడి చేతిలో ఉన్నారు. ఈ లెక్కన మమత పరిస్థితి దారుణంగా ఉంది. ఇదే అదునుగా కాంగ్రెస్ పార్టీ సోనియాగాంధీ మమత ముందు ఒక ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో టీఎంసీని విలీనం చేయాలని సూచించినట్టు సమాచారం. అయితే దీనిపై మమత కొంత సమయం కావాలని కోరినట్టు తెలుస్తోంది.. బిజెపి నుంచి వస్తున్న ఒత్తిళ్ళ నుంచి తట్టుకోవాలంటే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం తప్ప మరో మార్గం లేదని మమతకు సోనియాగాంధీ సూచించినట్టు తెలుస్తోంది.. కాగా అభిషేక్ బెనర్జీ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీతో భేటీ కావడం.. ఈ విలీనం వ్యవహారానికి బలం చేకూర్చుతోంది.

సరిగ్గా 28 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీతోనే కొనసాగిన ఆమె.. సరిగా 1998లో కాంగ్రెస్ పార్టీతో విభేదించింది. ఆ తర్వాత టీఎంసీ పార్టీని ఏర్పాటు చేసింది.. బెంగాల్ రాష్ట్రంలో వరుసగా మూడుసార్లు గెలిచి అధికారాన్ని దక్కించుకుంది. కాగా, ఈ విలీనం పట్ల టీఎంసీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. గతంలో దారుణం చేసిన పార్టీలోకి ఎలా వెళ్లిపోతామని మండిపడుతున్నారు. సోనియాగాంధీ ఆఫర్ ఇచ్చిన అంతమాత్రాన ఆ పార్టీలో చేరేది లేదని టీఎంసీ కార్యకర్తలు అంటున్నారు. మరి దీనిపై మమత ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది.

సీబీఎస్ఈ లోపాలను ఎత్తి చూపాడు.. చివరికి ఇతడి పరిస్థితి ఏమైందంటే..

Nisarg Adhikari CBSE
Nisarg Adhikari CBSE

Nisarg Adhikari CBSE: మనం సాధారణంగా ప్రభుత్వ వెబ్ సైట్ లకు అత్యంత పట్టిష్టమైన ఫైర్ వాల్స్ ఉంటాయి కాబట్టి.. అందులో ఎటువంటి లోపాలూ ఉండవని అనుకుంటాం. అవి అత్యంత పటిష్టంగా పనిచేస్తాయనుకుంటాం. పైగా కఠినమైన నిబంధనల వల్ల మనం ప్రభుత్వ సైట్ల జోలికి వెళ్లే సాహసం చేయం.. కానీ ఓ 19 సంవత్సరాల బాలుడు మాత్రం ఈ పని చేశాడు.

ఇటీవల సీబీఎస్ఈ మార్కుల అప్లోడ్ విధానంలో చోటు చేసుకున్న లోపాలను నిసర్గ అధికారి అనే యువకుడు బయటపెట్టాడు. భద్రతా లోపాలను కూడా అతడు వివరించాడు. అతడు బయటపెట్టిన తీరు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. అనేకమంది ప్రముఖులు.. నెటిజన్ల నుంచి ప్రశంసలు కూడా అందుకున్నాడు. ఇతడి ప్రతిభను ఐఐటి కాన్పూర్ ప్రత్యేకంగా గుర్తించింది. అంతేకాదు ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ.. సైబర్ డిఫెన్స్ పరిశోధన కేంద్రం C3iHub లో ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ (OSINT) , అండ్ థ్రెట్ ఇంటలిజెన్స్ ఇంజనీర్ గా ఉద్యోగం కల్పించింది.

నిసర్గ ఒక సాధారణ సైబర్ రీసెర్చర్. తన ప్రతిభతో దేశంలోనే హై ఎండ్ సైబర్ సెక్యూరిటీ పరిశోధనా కేంద్రంలో ఉద్యోగం సాధించడం మామూలు విషయం కాదు..C3iHub అనేది కాన్పూర్లో అతిపెద్ద సైబర్ సెక్యూరిటీ పరిశోధన కేంద్రం.. అక్కడ యూనివర్సిటీ క్యాంపస్ లోనే ఇది పని చేస్తూ ఉంటుంది.. సైబర్ దాడులు.. డేటా ప్రొటెక్షన్.. హ్యాకింగ్ లాంటి అంశాలపై ఇక్కడ ప్రతిరోజు పరిశోధనలు సాగుతూ ఉంటాయి.. నిసర్గకు ఇక్కడ క్లాస్ లు.. బోధనలోనే కాకుండా.. రిసర్చ్ వింగ్ లో కూడా ఉంటాడు. గవర్నమెంట్.. బ్యాంకింగ్.. డిఫెన్స్ సిస్టం వంటి వాటికి డిజిటల్ ప్రొటెక్షన్ ఎప్పటికప్పుడు మెరుగుపరచడం.. సైబర్ అటాక్స్ నుంచి ముందుగానే రక్షణ కల్పించడం వంటివి ఇతడి విధి.. ఈ డిపార్ట్మెంట్లో పని చేసే వారికి నెలకు 50 నుంచి 1.2 లక్షల వరకు వేతనం ఇస్తూ ఉంటారు. అయితే నిసర్గ విషయంలో ప్యాకేజీ వేరే విధంగా ఉంటుంది. అతడికి ప్రతి నెలకు దాదాపు మూడు లక్షల వరకు ఇచ్చే అవకాశం కల్పిస్తోంది.

నేటి కాలంలో సైబర్ దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. హ్యాకర్లు కొత్త కొత్త విధానాలలో దాడులు చేస్తున్నారు. ఇలాంటి అప్పుడు నిత్యం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. డేటా చోరీలు.. బెదిరింపులు వంటివి ఇటీవల కాలంలో పెరిగిపోతున్నాయి. అందువల్లే నైపుణ్యం ఉన్న యంగ్ ఎక్స్పర్ట్స్ కు డిమాండ్ ఉంది. ప్రభుత్వ విభాగాలలో లోపాలను ఎత్తిచూపిన వారికి అవకాశాలు కూడా కల్పిస్తున్నారు. నిసర్గ కూడా అలానే అవకాశం దక్కించుకొని.. ఏకంగా ఈ స్థాయికి దాకా ఎదిగాడు.

అక్కడ 'శంకర్'..ఇక్కడ 'పూరి జగన్నాథ్'.. ఇద్దరికీ ఇంతటి దారుణమైన పరిస్థితి వచ్చిందేంటి..

Shankar and Puri Jagannadh
Shankar and Puri Jagannadh

Shankar and Puri Jagannadh: ఒకప్పుడు ఇండియన్ సినిమా షేక్ చేసిన దర్శకులు , ఇప్పుడు కనీసం ఒక యావరేజ్ సినిమాని డెలివరీ చేయడానికి కూడా ఇబ్బంది పడుతుండడం చూసి , అభిమానులు బోరుమని ఏడుస్తున్నారు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై అపజయం అనేదే ఎరుగని డైరెక్టర్ శంకర్ , ఇప్పుడు వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో , చేతిలో ఒక్క సినిమా కూడా లేని పరిస్థితి వస్తుందని ఎవరైనా ఊహించారా?, కానీ అది జరిగింది. ఒకప్పుడు సౌత్ లో ప్రతీ సూపర్ స్టార్ కి శంకర్ తో కలిసి ఒక్క సినిమా అయినా చెయ్యాలి అనే కోరిక ఉండేది. కోలీవుడ్ నుండి రజినీకాంత్ తర్వాత బిగ్గెస్ట్ బ్రాండ్ శంకర్ సొంతం. అలాంటి డైరెక్టర్ నేడు యావరేజ్ సినిమాలను కూడా అందించలేని పరిస్థితి కి వచ్చాడు. ఇక అదే స్థాయి ఉన్నటువంటి పూరి జగన్నాథ్ గురించి కూడా మాట్లాడుకోవాలి . ఒకే మూసలో వెళ్తున్న కమర్షియల్ సినిమా ఫార్మటు ని మార్చేసిన క్రేజీ డైరెక్టర్ ఆయన. టాలీవుడ్ లోని స్టార్ హీరోలందరితో కలిసి సినిమాలు చేసి , హీరోయిజానికి సరికొత్త నిర్వచనం తెలిపాడు.

పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు , ఎన్టీఆర్ , రామ్ చరణ్ , అల్లు అర్జున్ , ప్రభాస్ ఇలాంటి స్టార్ హీరోలందరిని డిఫరెంట్ హీరోయిజమ్స్ తో ఆడియన్స్ కి ప్రెజెంట్ చేసి , వాళ్ళని బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ గా మలిచాడు పూరీజగన్నాథ్. అలాంటి డైరెక్టర్ ఇప్పుడు తీస్తున్న చీప్ సినిమాలు చూస్తుంటే కన్నీళ్లు పెట్టుకోవడం ఒక్కటే తక్కువ. వీళ్లిద్దరి రేంజ్ ఇలా పడిపోవడానికి కారణం రైటింగ్. శంకర్ కి గతం లో సుజాత అనే రైటర్ ఉండేవారు. ఆయన సినిమాలకు రచన మొత్తం సుజాత నే చేసేవారు . ఆమె చనిపోయిన తర్వాత శంకర్ సినిమాల్లో కంటెంట్ పవర్ లేకుండా పోయింది. డైరెక్షన్ పరంగా , టేకింగ్ పరంగా శంకర్ ఇప్పటికే తోపే, కానీ ఆయన నుండి సరైన కథ రావాలి అంతే. పూరి జగన్నాథ్ పరిస్థితి కూడా ఇంతే.

ఈయన ఇప్పటికీ తన అద్భుతమైన దర్శకత్వ ప్రతిభ తో పోకిరి లాంటి సినిమాలు తీయగలడు. కానీ ఒకప్పుడు ఆయన కలం లో ఉండే రైటింగ్ పవర్ ఇప్పుడు బాగా తగ్గిపోయింది. ఆ కారణం చేతనే వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ వస్తున్నాయి. వీళ్లిద్దరు వేరే రైటర్స్ ని నమ్ముకొని , కేవలం దర్శకత్వం మీద మాత్రమే ఫోకస్ చేస్తే , భవిష్యత్తులో భారీ కం బ్యాక్ ఇవ్వొచ్చు. పూరి జగన్నాథ్ నుండి వచ్చిన చివరి బెస్ట్ చిత్రం టెంపర్. ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథని అందించాడు. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మరోసారి ఆయన అలాంటి టాలెంటెడ్ రైటర్స్ తో పని చేస్తే కచ్చితంగా కం బ్యాక్ ఇవ్వగలడు , శంకర్ కూడా అంతే, వీళ్లిద్దరు ఎప్పుడు కం బ్యాక్ ఇస్తారో?, ఇస్తే ఎన్ని రికార్డ్స్ బద్దలు అవ్వంవుతుందో చూడాలి.

భారత నౌకపై అమెరికా దాడి.. ముగ్గురు సెయిలర్లు బలి!

US Military Attack
US Military Attack

US attack on Indian ship: ఒమన్‌ తీరంలో MT Settebello అనే నౌకపై అమెరికా జరిపిన దాడిలో ముగ్గురు భారతీయ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని అధికారికంగా నిర్ధారించింది. ఈ ఘటన భారతీయ సముద్ర బలగాలు, ముఖ్యంగా విదేశీ నౌకలపై పనిచేసే సెయిలర్ల భద్రతపై తీవ్ర ఆందోళన కలిగించింది.

అమెరికా దాడి..
అమెరికా దాడి చేసిన సమయంలో MT Settebello నౌకలో 24 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. వీరిలో 21 మందిని రక్షించగా, ముగ్గురు మృతి చెందారు. ఈ దాడి ఒమన్‌ తీరంలో జరిగిందని, అమెరికా నౌకాదళం ద్వారా నిర్వహించబడిందని కేంద్రం ప్రకటించింది. ఘటన తర్వాత రక్షణ కార్యకలాపాలు వేగంగా నడిచి, మిగిలిన సిబ్బందిని సురక్షితంగా తరలించారు.మృతులు డెక్‌ క్యాడెట్‌ ఆదిత్య శర్మ, ఇంజిన్‌ ఫిట్టర్‌ శివానంద్, చీఫ్‌ ఇంజినీర్‌ పట్నాల సురేశ్‌గా గుర్తించారు. ఈ ముగ్గురు యువ సెయిలర్లు విదేశీ నౌకలపై పనిచేస్తూ, కుటుంబాలను ఆదుకునేవారు.

మరో షిప్‌పై కూడా దాడి..
తాజాగా ఒమన్‌ తీరంలోనే MT Jalveer అనే మరో నౌకపై కూడా దాడి జరిగింది. ఈ షిప్‌లో కూడా భారతీయ సెయిలర్లు ఉన్నట్లు సమాచారం. వరుసగా జరుగుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ప్రాంతంలో సముద్ర మార్గాలు ఎంతో సున్నితంగా మారాయని, భారతీయ సిబ్బంది భద్రతకు ప్రమాదం ఏర్పడుతోందని స్పష్టం అవుతోంది.

ప్రమాదంలో భారతీయ సెయిలర్ల భద్రత ..
భారతదేశం ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో సముద్ర సిబ్బందిని అందించే దేశాల్లో ఒకటి. వేలాది మంది భారతీయులు విదేశీ నౌకలపై పనిచేసి, దేశానికి విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదిస్తున్నారు. అయితే, ఒమన్, ఎర్ర సముద్రం, అడెన్‌ గల్ఫ్‌ వంటి ప్రాంతాల్లో జరుగుతున్న వరుస దాడులు వారి జీవితాలను ప్రమాదంలోకి తీసుకెళ్తున్నాయి. భారత ప్రభుత్వం త్వరగా దౌత్యపరమైన చర్యలు తీసుకోవాలి. మృతుల కుటుంబాలకు తగిన పరిహారం, గాయపడిన వారికి వైద్య సహాయం, మిగిలిన సిబ్బంది సురక్షితంగా తిరిగి రావడానికి అన్ని విధాలా సహాయం అందించాలి. అంతేకాకుండా, భారతీయ సెయిలర్లు పనిచేసే నౌకల భద్రత కోసం అంతర్జాతీయ స్థాయిలో ఒప్పందాలు, రక్షణ ఏర్పాట్లు చేయాలి. MT Jalveer పై జరిగిన తాజా దాడి ఈ సమస్య ఒక్కటి కాదని, వరుసగా జరుగుతున్న ప్రమాదాలను సూచిస్తోంది. భారత ప్రభుత్వం ఈ ప్రాంతంలోని తన సెయిలర్ల భద్రత కోసం మరింత చురుకుగా వ్యవహరించాలి.

ఈ దుర్ఘటన భారతదేశం తన సముద్ర సిబ్బందిని ఎంత గౌరవంగా చూస్తుందో, వారి భద్రతను ఎంత ప్రాధాన్యతగా తీసుకుంటుందో పరీక్షించే సమయం. మృతుల కుటుంబాలకు హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తూ, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి.

లిక్కర్ కుంభకోణంలో అసలు కోణాన్ని ఈడీ పట్టేసింది.. అందుకే రాజ్ కేసిరెడ్డి అరెస్ట్.. తర్వాత టార్గెట్ అతడే

Raj Kesireddy arrest
Raj Kesireddy arrest

Raj Kesireddy arrest: ఏపీలో వైసిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్ర ప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ పరిధిలో కుంభకోణం జరిగింది. వేల కోట్ల అక్రమ వ్యవహారం ఐదు సంవత్సరాలపాటు దర్జాగా సాగిపోయింది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం కుంభకోణం మీద ప్రధానంగా దృష్టి సారించింది.. ఏకంగా కేంద్ర దర్యాప్తు సంస్థకు సమాచారం అందించింది. దీంతో కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ ఇందులోకి ప్రవేశించింది. ఆ తర్వాత కీలక ఆధారాలు సేకరించి.. చర్యలు తీసుకుంటున్నది.

మద్యం కుంభకోణంలో కేంద్ర దర్యాప్తు సంస్థ రాజ్ కే సి రెడ్డి ని అరెస్ట్ చేసింది. ఇతడు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి ప్రభుత్వానికి ఐటీ సలహాదారుగా వ్యవహరించారు. గతంలోనే రాష్ట్ర ప్రత్యేక దర్యాప్తు బృందం ఇతడిని అరెస్ట్ చేసింది. ఏడాది పాటు జైల్లో ఉంచింది. ఇటీవల ఇతడు బెయిల్ మీద బయటకు వచ్చాడు. మళ్లీ ఇప్పుడు మనీలాండరింగ్ వ్యవహారంలో కీలక ఆధారాలు సేకరించిన కేంద్ర దర్యాప్తు బృందం.. ఇతడిని అరెస్ట్ చేసింది.

లిక్కర్ వ్యవహారంలో హైదరాబాద్.. ఆంధ్రప్రదేశ్లోని 10 ప్రాంతాలలో కేంద్ర దర్యాప్తు బృందాలు భారీగా సోదాలు నిర్వహిస్తున్నాయి. రాజ్ కేసిరెడ్డి హైదరాబాదులోని నానక్ రామ్ గూడ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. కేవలం ఇతరు మాత్రమే కాదు వైసిపి అధికారంలో ఉన్నప్పుడు మంత్రులుగా వ్యవహరించిన కారుమూరు నాగేశ్వరరావు.. అతడి కుమారుడు సునీల్.. వాసుదేవ రెడ్డి ఇంట్లో కూడా అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

నాడు మద్యం వ్యవహారంలో ఏకంగా 349 కోట్ల వరకు అక్రమాలకు పాల్పడ్డారని.. ఆ డబ్బులను మొత్తం పేరు, ఊరు లేని కంపెనీలకు తరలించాలని.. అనంతరం వాటిని స్థిరాస్థిరంగంలో పెట్టుబడిగా పెట్టారని కేంద్ర దర్యాప్తు సంస్థ అభియోగాలు మోపింది. ఢిల్లీ కేంద్రంగా కారకాల కొనసాగిస్తున్న సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్ అనే కంపెనీని వాడుకొని.. దాని వెనక రాజ్.. సిండికేట్ వ్యాపారులు 95 శాతానికి పైగా లాభాలను హవాలా మార్గంలో.. మనీలాండరింగ్ మార్గాలలో భారీగా స్థిరాస్థిరంగంలో పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తోంది. ఓల్ వీక్.. ఆరోయో.. ఈజీ లోడ్ వంటి డమ్మీ కంపెనీలను ఏర్పాటు చేసి.. భారీగా నిధులను అందులోకి పంపించినట్లు తెలుస్తోంది.

ఈ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు దాదాపు ఏడు గంటల పాటు సుదీర్ఘ విచారణ సాగించారు. అనంతరం నాటి ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేయడంతో.. ఈ వ్యవహారం మరో మలుపు తీసుకుంది. రాజ్ కేసిరెడ్డి గురించి విజయసా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అతడే సూత్రధారి అంటూ ఆరోపించారు. నాడు జగన్ సూచనలు చేయడంతో సజ్జల శ్రీధర్ రెడ్డికి 100 కోట్ల వరకు సర్దుబాటు చేయాల్సి వచ్చిందని విజయసాయిరెడ్డి ఏకంగా ఈడి అధికారులకు వాంగ్మూలం ఇచ్చారు. అది వైసిపి కి భారీ దెబ్బగా మారింది.

ఈ మద్యం వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు అధికారులు 441 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేశారు. అంతేకాదు వారి నుంచి స్వాధీనం చేసుకున్న డిజిటల్ డేటా ప్రకారం జగన్మోహన్ రెడ్డికి తదుపరి నోటీసులు ఇస్తారని తెలుస్తోంది. ప్రభుత్వ అధికారాన్ని దుర్వినియోగం చేసి డిస్ట్రీలరీల నుంచి దాదాపు 3500 కోట్ల లంచాలు వసూలు చేశారని సమాచారం. అయితే హవాలా.. ఇతర లావాదేవీల వ్యవహారాలను కేంద్ర దర్యాప్తు సంస్థ బద్దలు కొట్టడంతో ఈ స్కాం వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఇప్పుడు భయపడిపోతున్నట్టు తెలుస్తోంది.

రాజ్ కేసిరెడ్డిని విచారిస్తే మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తాయి. లిక్కర్ వ్యాపారానికి సంబంధించి జే బ్రాండ్ పేరుతో నాసిరకమైన మద్యాన్ని విక్రయించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రాణాలతో ఆడుకున్నారు. ఇలా సంపాదించిన డబ్బుతో అక్రమ వ్యాపారాలు చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు ఇస్తున్న లీకుల ప్రకారం త్వరలోనే జగన్మోహన్ రెడ్డికి నోటీసులు అందే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

టైటిల్‌ ఫైట్‌.. టీఆర్‌ఎస్‌ కోసం బీఆర్‌ఎస్‌ ఫిర్యాదు!

TRS title fight
TRS title fight

TRS title fight: తెలంగాణ రాజకీయాల్లో టీఆర్‌ఎస్‌ అనే మూడు అక్షరాలు ఇప్పటికీ భావోద్వేగాన్ని, చారిత్రక వారసత్వాన్ని కలిగి ఉన్నాయి. ఆ పేరును తమకు కేటాయించాలని అనేక పార్టీలు ఎన్నికల సంఘం (ఈసీ) ముందు పోటీ పడుతుండగా, బీఆర్‌ఎస్‌ నేతలు ఆ పేరు ఎవరికీ ఇవ్వకూడదని ఫిర్యాదు చేశారు. ఇది కేవలం పేరు వివాదం కాదు. ఇది తెలంగాణ ఉద్యమ వారసత్వం ఎవరి చేతుల్లో ఉండాలి, ఓటర్ల ముందు గుర్తింపు ఎలా ఉండాలి అనే ప్రశ్నను లేవనెత్తుతోంది. 2022లో టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చుకున్నారు. దీంతో టీఆర్‌ఎస్‌ ఖాళీగా ఉంది. ఆ పేరు కోసం కొత్త పార్టీలు పోటీ పడుతున్నాయి. ఇందులో కల్వకుంట్ల కవిత నేతృత్వంలోని ‘తెలంగాణ రక్షణ సేన’ ప్రముఖంగా ఉంది. ఆ పార్టీ పేరు ప్రకటనపై 600కి పైగా అభ్యంతరాలు వచ్చాయి.

అసాధారణ వ్యతిరేకత..
బీఆర్‌ఎస్‌ మద్దతుదారులు, తెలంగాణ ఉద్యమకారులు, సామాన్య ప్రజల నుంచి ఈసీకి ఫిర్యాదులు వచ్చాయి. దీంతో కవిత పార్టీ నేతలు త్వరలో ఎన్నికల సంఘాన్ని నేరుగా కలిసి తమ వాదనను వినిపించనున్నారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మహారాష్ట్రలోని సోలాపూర్‌ కేంద్రంగా పనిచేస్తున్న ‘తెలంగాణ రాష్ట్ర సామాజిక సేన’ కూడా టీఆర్‌ఎస్‌ పేరును తమకు కేటాయించాలని ఈసీని ఆశ్రయించింది. తెలంగాణ బయటి నుంచి వచ్చిన ఈ ప్రయత్నం, టీఆర్‌ఎస్‌ పేరు కేవలం తెలంగాణలోనే కాకుండా, సరిహద్దు ప్రాంతాల్లోని తెలుగు మాట్లాడే ప్రజల్లో కూడా గుర్తింపు కలిగి ఉందని చెబుతోంది.

పేరు ఎందుకు ఇంత ప్రాముఖ్యత..
భారతీయ రాజకీయాల్లో పార్టీ పేరు కేవలం ఒక లేబుల్‌ కాదు. అది ఓటర్ల మనసుల్లో నిలిచిపోయిన బ్రాండ్‌. టీఆర్‌ఎస్‌ పేరు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంతో ముడిపడి ఉంది. ఆ ఉద్యమంలో పాల్గొన్న లక్షలాది మంది ప్రజలకు ఇది గౌరవం, గుర్తు. కొత్త పార్టీ ఆ పేరును ఉపయోగించుకుంటే, ఓటర్లు సులభంగా ఆకర్షితులవుతారు. అదే సమయంలో, బీఆర్‌ఎస్‌ తన పాత పేరును రక్షించుకోవాలనుకుంటోంది. పేరు మార్చుకున్న తర్వాత కూడా, ప్రజలు ఇంకా బీఆర్‌ఎస్‌ను టీఆర్‌ఎస్‌గానే గుర్తిస్తున్నారు.

ఈసీ ముందు సవాళ్లు
ఎన్నికల సంఘం ఈ వివాదంలో కీలక పాత్ర పోషించాలి. పార్టీల నమోదు నిబంధనల ప్రకారం, ఇప్పటికే ఉన్న పార్టీ పేరుకు సమీపంలో ఉన్న పేర్లను అనుమతించకూడదు. ఆఖ ఫిర్యాదు, కవిత పార్టీపై వచ్చిన వందలాది అభ్యంతరాలు, మహారాష్ట్ర పార్టీ కోరిక ఇవన్నీ ఈసీ ముందు ఉన్నాయి. ఈసీ ఒకవేళ కవిత పార్టీకి టీఆర్‌ఎస్‌ పేరు ఇస్తే, బీఆర్‌ఎస్‌ మద్దతుదారుల్లో అసంతృప్తి పెరగవచ్చు. ఒకవేళ నిరాకరిస్తే, కొత్త పార్టీలు ‘‘వారసత్వం అడ్డుకుంటున్నారు’’ అనే ఆరోపణలు చేయవచ్చు. రెండు వైపులా రాజకీయ లాభనష్టాలు ఉన్నాయి. అందుకే ఈసీ త్వరగా, పారదర్శకంగా నిర్ణయం తీసుకోవాలి. అన్ని పార్టీలను పిలిచి విన్నపాలు విని, స్పష్టమైన కారణాలతో తీర్పు ఇవ్వాలి.

ఎన్నికల సంఘం న్యాయబద్ధంగా, నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే, ఈ వివాదం తెలంగాణ రాజకీయాల్లో మరింత పరిపక్వతను తీసుకురావచ్చు. లేకపోతే, ఇది మరిన్ని గందరగోళాలకు దారితీసే ప్రమాదం ఉంది. టీఆర్‌ఎస్‌ పేరు ఎవరిది అనేది న్యాయస్థానాలు లేదా ఎన్నికల సంఘం నిర్ణయించాలి. కానీ ఆ పేరు వెనుక ఉన్న తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ఆశలు ఎవరూ దోచుకోకూడదు. అది మాత్రం తెలంగాణ ప్రజలే నిర్ణయించాలి.

'పెద్ది ' మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు..'దేవర', 'ఓజీ' లు మాత్రమే కాదు.. ఏకంగా #RRR కూడా అవుట్..

Peddi 2 Weeks Worldwide Collections
Peddi 2 Weeks Worldwide Collections

Peddi First Week Collections: ‘పెద్ది’ జోరు బాక్స్ ఆఫీస్ వద్ద ఇప్పటికీ ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ , నార్త్ ఇండియా మార్కెట్స్ లో ఈ సినిమా డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది కానీ , తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇండస్ట్రీ హిట్ సినిమాకు ఏ రేంజ్ వసూళ్లు వస్తాయో , అదే రేంజ్ వసూళ్లు నమోదు అవుతున్నాయి. దేవర , ఓజీ చిత్రాలను మాత్రమే కాదు , ఏకంగా #RRR రికార్డ్స్ ని కూడా ఈ సినిమా అనేక ప్రాంతాల్లో బద్దలుకొట్టి సంచలనం సృష్టించింది. డైరెక్టర్ బుచ్చి బాబు స్క్రీన్ ప్లే విషయం లో కాస్త తడబాటు పడినప్పటికీ కూడా, రామ్ చరణ్ అద్భుతమైన నటన తో ఈ సినిమాని వేరే లెవెల్ కి తీసుకెళ్లడం ఆడియన్స్ కి తెగ నచ్చేసింది. అందుకే ఈ చిత్రానికి ఈ స్థాయి వసూళ్లు నమోదు అవుతున్నాయి. 7 వ రోజున ఈ చిత్రానికి దాదాపుగా తెలుగు రాష్ట్రాల నుండి 4 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు నమోదు అయ్యాయి. మొదటి సోమవారం కూడా ఈ స్థాయి వసూళ్లు నమోదు అవ్వడం కష్టమైన ఈరోజుల్లో , 7 వ రోజున కూడా ఈ రేంజ్ వసూళ్లు రాబట్టడాన్ని చూస్తుంటే , ఈ సినిమా ఏ రేంజ్ సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతుందో అర్థం చేసుకోవచ్చు.

వారం రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ప్రాంతాల వారీగా ఎంత షేర్ వసూళ్లు వచ్చింది?, బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని లాభాల్లోకి అడుగుపెట్టాలంటే ఇంకా ఎంత వసూళ్లను రాబట్టాలి అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. ముందుగా నైజాం ప్రాంతం గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. మొదటి నుండి ఈ ప్రాంతం లో ఇలాంటి జానర్ సినిమాలకు ఆదరణ కాస్త తక్కువే. అయినప్పటికీ కూడా ఈ చిత్రానికి కేవలం మొదటి వారం లోనే 46 కోట్ల 58 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఉత్తరాంధ్ర లో కూడా ఈ సినిమా జోరు ఏ మాత్రం తగ్గలేదు. కేవలం వారం రోజుల్లోనే 18 కోట్ల 33 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఈ ప్రాంతం లో బ్రేక్ ఈవెన్ మార్కుని కూడా అందుకుంది ఈ చిత్రం. ఇక సీడెడ్ ప్రాంతం విషయానికి వస్తే , వారం రోజుల్లో ఇక్కడ 17 కోట్ల 58 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.

అదే విధంగా ఈస్ట్ గోదావరి నుండి 10 కోట్ల 86 లక్షలు , వెస్ట్ గోదావరి నుండి 7 కోట్ల 64 లక్షలు , గుంటూరు నుండి 11 కోట్ల 14 లక్షలు, కృష్ణా జిల్లా నుండి 8 కోట్ల 67 లక్షలు, నెల్లూరు జిల్లా నుండి 4 కోట్ల 91 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది ఈ చిత్రం. ఓవరాల్ గా ఈ చిత్రానికి 125 కోట్ల 71 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , 186 కోట్ల 60 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు తెలుగు రాష్ట్రాల నుండి వచ్చాయి. అదే విధంగా కర్ణాటక ప్రాంతం నుండి 12 కోట్ల 55 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు ఈ చిత్రానికి రాగా, తమిళనాడు + కేరళ నుండి 2 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 9 కోట్ల 45 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, ఓవర్సీస్ నుండి 21 కోట్ల 10 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి 170 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు , 282 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడానికి మరో 49 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది.

అవినీతి అధికారులారా.. అడ్డంగా సంపాదించి కాలర్ ఎగరేయకండి.. పైవాడు చూస్తున్నాడు..

Corruption
Corruption

Corruption: కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు విపరీతంగా తనిఖీలు చేస్తున్నారు. సమాచారం రావడం ఆలస్యం.. అన్ని ఆధారాలు సేకరించి అవినీతి అధికారుల భరతం పడుతున్నారు. ఏసీబీ అధికారులు చేస్తున్న దాడుల్లో చాలామంది అవినీతి అధికారులు దొరికిపోతున్నారు. వారిని చట్ట ప్రకారం జైలుకు పంపిస్తున్నారు.. ఇంత జరుగుతున్నప్పటికీ అవినీతి అధికారులు మారడం లేదు. పైగా వారి సంపాదన వందల కోట్లను కూడా దాటిపోతుంది. చివరికి ఏసీబీ అధికారులకు ప్రత్యేకంగా నోట్ల ను లెక్కించడానికి యంత్రాలు కావలసి వస్తోంది.

కొన్ని సందర్భాలలో ఏసీబీ అధికారులు ఫిర్యాదులు లేకుండానే.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోకుండానే.. అవినీతి అధికారుల భరతం పడుతున్నారు. ఇటీవల రహదారులు భవనాల శాఖ చీఫ్ ఇంజనీర్ మోహన్ నాయక్ విషయంలో కూడా ఏసీబీ అధికారులు అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు. భారీగా డబ్బు సంపాదించి.. ఒక్క ఆధారం కూడా లేకుండా చేసి.. కాలర్ ఎగరేసిన మోహన్ నాయక్ కు అధికారులు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. వాస్తవానికి ఏసీబీ అధికారులు అతడి ఇంటికి వెళ్ళగానే ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఎటువంటి కంప్లైంట్లు లేకుండా నా ఇంటికి ఎందుకు వచ్చారని అతడు ప్రశ్నిస్తే.. లెక్కలతో సహా చెప్పి చుక్కలు చూపించారు అధికారులు.

మోహన్ నాయక్ ఆర్ అండ్ బి లో రీసెర్చ్ ఆఫీసర్ గా 1995లో చేరాడు. ఇన్ని సంవత్సరాల అనుభవంలో అతడు చీఫ్ ఇంజనీర్ దాకా వెళ్ళాడు. అయితే ఏసీబీ అధికారులు అతని మీద కేసు నమోదు చేసే వరకు ఆదాయం 3.94 కోట్లు ఉంది. అయితే కుటుంబ సభ్యుల ఖర్చులను దాదాపు మూడు కోట్ల 89 లక్షలు గా అధికారులు గుర్తించారు. ఆయనకు సేవింగ్స్ ద్వారా మిగిలినవి కేవలం నాలుగు లక్షల 43000 మాత్రమే. ప్రాథమిక విచారణలో మోహన్ నాయక్ ఆస్తులను అధికారులు 7.90 కోట్లుగా గుర్తించారు. ఇందులో సేవింగ్స్ ను పక్కన పెడితే ఏడు కోట్ల 86 లక్షల ఆస్తులను ఆయన అక్రమంగా వెనకేసినట్టు తెలుస్తోంది. 30 సంవత్సరాల పాటు ఆయన ఈ డిపార్ట్మెంట్లో పని చేస్తున్నారు. చట్టబద్ధంగా అతడికి ఉండాల్సిన సేవింగ్స్ కంటే అదనంగా 7.86 కోట్ల ఆస్తులు సంపాదించడంతో ఏసీబీ అధికారులకు అనుమానం వచ్చింది. తనకు వస్తున్న రాబడి కంటే దాదాపు 177 రెట్లు అక్రమంగా మోహన్ నాయక్ సంపాదించినట్టు ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు.

మోహన్ నాయక్ ఇంట్లో తనిఖీలు చేస్తున్నప్పుడు పోలీసులకు దిమ్మతిరిగిపోయే ఆస్తులు కనిపించాయి. బహిరంగ మార్కెట్లో వాటికి ఏకంగా 200 కోట్ల వరకు విలువ ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. మోహన్ నాయక్ సేవింగ్స్ మీద దృష్టి పెట్టిన పోలీసులకు అనుమానాలు రావడంతో దర్యాప్తు మొదలుపెట్టారు. దీంతో మోహన్ నాయక్ బాధితులు ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చారు. అతని వసూళ్ల వ్యవహారాన్ని పోలీసులకు వివరించారు. దీంతో మోహన్ నాయక్ అవినీతి చిట్టా బయటికి వచ్చింది. అతని వసూళ్ల పుట్ట పగిలిపోయింది. ఏకంగా 200 కోట్ల వరకు అక్రమ ఆస్తులను సంపాదించాడు అంటే మోహన్ దందా ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

'ధురంధర్' డైరెక్టర్ తో రెబల్ స్టార్ ప్రభాస్... స్టోరీ లైన్ వింటే గూస్ బంప్స్..

Prabhas movie with Dhurandhar director
Prabhas movie with Dhurandhar director

Prabhas movie with Dhurandhar director: ‘ధురంధర్’ సిరీస్ లాంటి వెండితెర అద్భుతాన్ని ఆవిష్కరించిన డైరెక్టర్ ఆదిత్య డర్ కి పాన్ ఇండియా లెవెల్ లో ప్రస్తుతం మామూలు రేంజ్ క్రేజ్ లేదని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. ఆయన తో సినిమాలు చేసేందుకు పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరోలు తమ పీఆర్ టీమ్స్ ద్వారా చాలా గట్టి ప్రయత్నాలే చేశాడు . ఒక స్టార్ హీరో అయితే ‘ధురంధర్ 2’ విడుదలైనప్పటి నుండి ఆదిత్య డర్ చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్నాడట. కానీ తన కథకు సరిపోయే హీరో విషయం లో ఆదిత్య డర్ ఏ మాత్రం వెనుకడుగు వేయడానికి ఇష్టం చూపించడం లేదు. అందుకే ఆయన ఆ హీరో తో సినిమా చేసేందుకు ఆసక్తి చూపించడం లేదట. మరో పక్క ఆదిత్య డర్ కి ఒక టాలీవుడ్ హీరో తో పని చెయ్యాలని చాలా గట్టి కోరిక ఉందట.

ఆ టాలీవుడ్ స్టార్ హీరో మరెవరో కాదు , రెబల్ స్టార్ ప్రభాస్. ఒక భారీ హిట్ కొట్టగానే , ప్రతీ డైరెక్టర్ తమ తదుపరి చిత్రం ప్రభాస్ తో చెయ్యాలని అనుకుంటారు. ఎందుకంటే ఆయన బాక్స్ ఆఫీస్ స్టామినా అలాంటిది మరి. ఫ్లాప్ సినిమాతో కూడా వందల కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టే సత్తా ప్రస్తుతం ఇండియా లో ప్రభాస్ కి తప్ప మరెవరికి ఉంది చెప్పండి. అందుకే టాప్ డైరెక్టర్స్ ఆయనతో సినిమాలు చేయడానికి క్యూలు కడుతున్నారు. ఇప్పుడు ఆదిత్య డర్ కూడా ప్రభాస్ కోసం ఒక పవర్ ఫుల్ స్క్రిప్ట్ ని రెడీ చేశాడట . త్వరలోనే ఈ స్క్రిప్ట్ ని ఆయన ప్రభాస్ కి వినిపించబోతున్నట్టు సమాచారం. ఆదిత్య డర్ సాధ్యమైత వరకు కథలను యదార్ధ ఘటనలకు సంబంధించినవే తీసుకుంటాడు. ప్రభాస్ తో కూడా అలాంటి అన్ టోల్డ్ స్టోరీ నే చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడట .

మరి ఆ ఆసక్తికరమైన అన్ టోల్డ్ స్టోరీ ఏమిటి అనేది తెలియాలంటే , కొన్ని రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతం ఆదిత్య డర్ తన తదుపరి చిత్రాన్ని రణవీర్ సింగ్ తోనే చెయ్యాలని చూస్తున్నాడు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అధికారిక ప్రకటన బయటకు రానుంది. ఈ సినిమా తర్వాత వెంటనే ప్రభాస్ తో ఆయన మరో సినిమా ప్రారంభించబోతున్నాడు. ధురంధర్ సిరీస్ లాంటి భారీ నిడివి ఉన్న సినిమాలను కేవలం నాలుగు నెలల్లోనే పూర్తి చేసిన ఆదిత్య డర్ కి , ప్రభాస్ తో ఒక సినిమాని మూడు నెలల్లోపు పూర్తి చేయడం పెద్ద విషయమేమి కాదు , చూడాలి మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ రాబోయే రోజుల్లో ఎలాంటి అద్భుతాలు నెలకొల్పబోతుంది అనేది.

మామిడి పండ్లు తింటే చనిపోతారా..

Eating Mangoes
Eating Mangoes

Eating Mangoes: ఆమధ్య ముంబైలో పుచ్చకాయ తిన్న తర్వాత ఒక కుటుంబంలో నలుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆ తర్వాత ఊపిరి ఆడక చనిపోయారు. పుచ్చకాయ తినడానికి అంటే ముందు వారు మటన్ బిర్యానీ తిన్నారు. మటన్ బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ ఆరగించారు. పుచ్చకాయ తిన్న తర్వాత వారు చనిపోవడంతో దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. కొందరు వైద్యులు అయితే పుచ్చకాయను రాత్రిపూట తింటే చనిపోతారని రకరకాల ఊహాగానాలను వ్యాప్తి చేశారు. దీంతో దేశవ్యాప్తంగా పుచ్చకాయల కొనుగోలు తగ్గిపోయాయి. ఆ తర్వాత విచారణ నిర్వహిస్తే అందులో క్రిమిసంహారక పదార్థాలు కలిపారని వార్తలు వచ్చాయి. దీంతో పుచ్చకాయ తినడం వల్ల వారు చనిపోలేదని.. అందులో విష ప్రయోగం జరిగిందని అందువల్ల చనిపోయారని తేలింది.

మన హైదరాబాదులో మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కా చెల్లెలు చనిపోయారు. హైదరాబాద్ నగర పరిధిలోని నారాయణగూడ పోలీస్ స్టేషన్లో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనలో భువనేశ్వరి (17) అనే బాలిక ముందుగా చనిపోయింది.. ఆమె సోదరి సంధ్య (10) మంగళవారం కన్ను మూసింది. చనిపోయిన ఇద్దరు కూడా కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ నగరం. బీదర్ ప్రాంతానికి చెందిన వై జి నాథ్, తన భార్య ఇందుమతితో కలిసి ఉపాధి నిమిత్తం హైదరాబాద్ వచ్చాడు. ఇక్కడ విటల్ వాడి అనే ప్రాంతంలో జీవిస్తున్నాడు. వై జి నాథ్ దంపతులకు నలుగురు కుమార్తెలు. వీరి కుటుంబానికి రేణుకానే బంధువు ఉంది. ఇటీవల వీరిని చూసేందుకు వస్తూ ఉండగా నారాయణగూడ లోని జలమండలి కార్యాలయం దగ్గర మామిడి పండ్లను కొనుగోలు చేసింది. ఆ మామిడి పండ్లను ఇందుమతి, ఆమె నలుగురు కుమార్తెలు తిన్నారు. ఆదివారం ఐదుగురు వాంతులు చేసుకున్నారు. దీంతో వారిని కవాడిగూడలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భువనేశ్వరి కన్నుమూసింది. మంగళవారం చిన్న కుమార్తె సంధ్య కన్ను మూసింది. మిగిలిన వారి ఆరోగ్యం నిలకడగా ఉంది.

ఈ ఘటనపై వృద్ధుల కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మామిడి పండ్లు తిన్న తర్వాత ఒక్కసారిగా వాంతులు చేసుకున్నారని.. అస్వస్థతకు గురయ్యారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు ఆ మామిడి పండ్ల నమూనాలు సేకరించారు. వాటిని పరీక్షల నిమిత్తం పంపించారు. వచ్చిన వివరాల ఆధారంగా అసలు నిజాలు బయటపెడతామని అధికారులు అంటున్నారు.

కెసిఆర్ బస్సు మీద.. కేటీఆర్ రోడ్డు మీద.. చివరికి గులాబీ పార్టీ పరిస్థితి ఇలా మారింది

KCR and KTR
KCR and KTR

KCR and KTR: సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారత రాష్ట్ర సమితిగా మారిపోయింది. జాతీయ పార్టీగా ఎదిగేందుకు కలలు కన్నది. ఆంధ్ర ప్రదేశ్లో శాఖను కూడా ఏర్పాటు చేసింది. తోట చంద్రశేఖర్ ను అధ్యక్షుడిని చేసింది. ఏపీలో కార్యాలయం కూడా ప్రారంభించింది. అంతేకాదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కొనుగోలు చేయడానికి కూడా సింగరేణి ముందు వరుసలో నిలిపింది. ఇలా ఎన్నో చేసింది. కానీ సొంత రాష్ట్రంలోని గెలవలేకపోయింది. అంతేకాదు.. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు పంజాబ్, బీహార్, ఢిల్లీ వంటి రాష్ట్రాలలో కేసీఆర్ పర్యటించారు. అక్కడి రైతులకు చెక్కులు కూడా ఇచ్చారు. ఇలా ఎన్నో రకాలుగా జాతీయ వాదాన్ని ఆయన వినిపించారు.

చివరికి కెసిఆర్ భారత రాష్ట్ర సమితి భారతదేశంలో అధికారంలోకి రాలేకపోయింది. సొంత రాష్ట్రమైన తెలంగాణలో పట్టు నిలుపుకోలేకపోయింది. అంతేకాదు పార్లమెంటు ఎన్నికల్లో సున్నా స్థానాలకు పరిమితం అయిపోయింది. రాజకీయంగా తీవ్రమైన ఒడిదుడులను ఎదుర్కొంటున్నది. మరోవైపు పార్టీ నుంచి కవిత వెళ్లిపోయింది. గులాబి పార్టీకి బలంగా ఉన్న తెలంగాణ పేరును తన పార్టీకి పెట్టుకుంది. అటు తెలంగాణ వాదాన్ని దూరం చేసుకోవడం.. జాతీయ రాజకీయాల మోజులో పడి ఇష్టానుసారంగా వ్యవహరించడంతో కెసిఆర్ పరిస్థితి దారుణంగా మారింది.

2027 ఎన్నికల్లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి గులాబీ పార్టీ మీద ఉంది. ఈ నేపథ్యంలోనే పార్టీ అధినేత కేసిఆర్ సరికొత్త నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆయన ఇప్పుడు పాదయాత్ర చేసే అవకాశం లేదు. అప్పట్లో తెలంగాణ మూమెంట్ సాగుతున్నప్పుడు ఆయన కొద్ది రోజులపాటు పాదయాత్ర చేశారు. అయితే ఇప్పుడు పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది కాబట్టి వయసు రీత్యా ఆయన పాదయాత్ర చేసే అవకాశం లేదు.

వ్యవసాయ క్షేత్రానికి పరిమితమైన ఆయన ఇప్పుడు బస్సు యాత్ర చేస్తారని తెలుస్తోంది. కార్యకర్తలను ఏకతాటి పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలబృతం చేసేందుకు బస్సు యాత్ర చేపట్టబోతున్నారు. దీనికోసం రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. మన వైపు కేటీఆర్ కూడా పాదయాత్ర చేస్తారని సమాచారం. పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లేందుకు కేటీఆర్ సిద్ధమవుతున్నారు.

అటు తండ్రి.. ఇటు కొడుకు రెండు వ్యూహాలతో ఒకేసారి జనంలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ యాత్రలకు సంబంధించి త్వరలోనే పూర్తిస్థాయి షెడ్యూల్ వస్తుందని సమాచారం. ఇప్పటికే పార్టీలోని కీలక నాయకులకు కేసిఆర్.. కేటీఆర్ వర్తమానం పంపారని.. కొద్దిరోజులుగా దీని గురించి చర్చలు జరుగుతున్నాయని.. సమాచారం. ఇటీవల కేటీఆర్ మలేషియా వెళ్లారు. అక్కడ జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు.. గతంలో కూడా కేటీఆర్ తన పాదయాత్ర గురించి బయటకు చెప్పేశారు. ఈ నేపథ్యంలో ఏకంగా కెసిఆర్ నుంచి మీడియాకు లీకులు వస్తున్న నేపథ్యంలో.. కచ్చితంగా పాదయాత్ర.. బస్సు యాత్ర ఉంటుందని తెలుస్తోంది.

స్లమ్ డాగ్ vs మహేంద్రగిరి వారాహి... రెండు టీజర్స్ లో ఎక్కువ క్రేజ్ వచ్చిన సినిమా ఏది..?

Slum Dog vs Mahendragiri Varahi
Slum Dog vs Mahendragiri Varahi

Slum Dog vs Mahendragiri Varahi: పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా చేస్తున్న ‘స్లమ్ డాగ్’ సినిమాకు సంబంధించిన టీజర్ గత రెండు రోజుల క్రితం రిలీజ్ అయింది. అయితే ఈ టీజర్ కి ప్రేక్షకుల్లో విశేషమైన స్పందన వస్తుంది. కొన్నిచోట్ల పూరీ మార్కు మిస్సయిందనే వార్తలు వినిపిస్తున్నప్పటికి పూరి కొత్తగా ట్రై చేశాడు. కాబట్టి ఇది బాగానే ఉంది అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. పూరి కంబ్యాక్ ఇవ్వాల్సిన అవసరమైతే ఉంది. కాబట్టి ఈ సినిమాతో ఒకసారి డిఫరెంట్ ప్రయత్నమైతే చేస్తున్నట్టుగా తెలుస్తుంది…ఇక దీంతో ఆయన ఎంతవరకు సక్సెస్ అవుతాడనే విషయం తెలియదు కానీ మొత్తానికైతే స్లమ్ డాగ్ సినిమాతో తను కంబ్యాక్ ఇవ్వడం పక్క అంటూ కొంత మంది కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా ఆయన్ని ఏ రేంజ్ కి తీసుకెళ్తుందనే దానికోసమే ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే అక్కినేని సుమంత్ హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో ‘మహేంద్రగిరి వారాహి’ అనే సినిమా తెరకెక్కుతుంది.

ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ పాపులారిటిని సంపాదించుకోవాలనే ప్రయత్నంలో తను ఉన్నాడు… ఇక ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కూడా గత రెండు రోజుల క్రితం రిలీజ్ అయింది. సస్పెన్స్ మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తుంది. ఈ సినిమాతో సుమంత్ మరోసారి భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోబోతున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి…

ఇక ఇప్పుడు పూరి విజయ్ సేతుపతి తో స్లమ్ డాగ్ సినిమాకి సుమంత్ – సంతోష్ జాగర్లపూడి చేస్తున్న ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా టీజర్ లో ఏ సినిమా టీజర్ కి ఎక్కువ క్రేజ్ దక్కింది. అనే దాని మీదనే ఇప్పుడు కీలకమైన చర్చలు నడుస్తున్నాయి.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారమైతే ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా టీజర్ కే ఎక్కువ క్రేజ్ దక్కింది. ఎందుకంటే అది సస్పెన్స్ మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కింది. అలాగే టీజర్ లోనే సినిమా కథని కూడా పరిచయం చేయడంతో సినిమా ఏదో ఇంట్రెస్టింగ్ గా సాగుతుందనే ఒక క్యూరియాసిటి అయితే ప్రేక్షకుల్లో కలుగుతుంది. కాబట్టి ఈ సినిమా టీజర్ కి భారీ రెస్పాన్స్ వస్తుంది…

వారణాసి విషయంలో లైట్ తీసుకుంటున్న టాప్ ఆర్టిస్టులు..

Top artists ignoring Varanasi
Top artists ignoring Varanasi

Top artists ignoring Varanasi: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. 1500 కోట్లతో తెరకెక్కుతున్న ఈ సినిమా విషయంలో ప్రతి ఒక్కరు చాలా క్లారిటి గా ఉంటున్నారు. ముఖ్యంగా రాజమౌళి ప్రతి విషయాన్ని చాలా క్లియర్ కట్ గా చూసుకుంటూ ఎక్కడా కూడా సినిమాకి డ్యామేజ్ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇక ఈ సినిమాలో నటించే కొంతమంది నటీనటులు మాత్రం సినిమాను లైట్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ సినిమాలో నటించాలా వద్దా? రాజమౌళి పెట్టే కండిషన్స్ కి ఒప్పుకొని సినిమాలో ఎన్ని రోజులు పాటు తమ డేట్స్ ని బ్లాక్ చేయాలి అనే ఉద్దేశ్యంతోనే కొంతమంది ఆర్టిస్టులు అయితే భావిస్తున్నారట. ముఖ్యంగా ఈ సినిమా కోసం వివిధ భాషల్లో ఉన్న ప్రముఖ ఆర్టిస్టులను భాగం చేయాలని రాజమౌళి చూస్తున్నాడు.

కొంతమందికి రాజమౌళి సినిమాలో అవకాశాలు వస్తే చాలు అనుకుంటుంటే, ఛాన్స్ దక్కిన వాళ్ళు మాత్రం ఆయన పెట్టే కండిషన్స్ తో సినిమాని చేయాలా వద్దా అనే డైలోమాలో ఉంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా రాజమౌళి సినిమాలో నటిస్తే ఆ ఆర్టిస్టులకు ఉండే క్రేజ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. వాళ్లకి వచ్చే పేరు కూడా బాగా పెరిగిపోతుంది. అలాగే చాలా సినిమాల్లో అవకాశాలు కూడా దక్కుతాయి. కాబట్టి చాలామంది అతని సినిమాలో నటించడానికి ఆసక్తి చూపిస్తారు.

తద్వారా వాళ్ళు ఇంతటి కష్టాలు అయినా సరే భరించాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే కొంతమంది మలయాళం ఆర్టిస్టులను సైతం ఇందులో భాగం చేయాలని చూస్తే వాళ్లు రాజమౌళి పెట్టే కండిషన్స్ కి నో చెప్పినట్టుగా తెలుస్తుంది…

ఫహద్ ఫజిల్ ను ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ కోసం అడిగారట. ఫహద్ ఫజిల్ రాజమౌళి పెట్టే కండిషన్స్, ఎక్కువ డేట్స్ ని బ్లాక్ చేయడం అవన్నీ నచ్చక తను ఆ సినిమా చేయనని చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక ఇందులో ఎంత వరకు నిజం ఉంది అనే విషయం తెలియదు. కానీ మొత్తానికైతే ఫిలింనగర్ సర్కిల్లో ఈ వార్త హల్చల్ చేస్తుంది…

రాత్రి తొందరగా నిద్ర పట్టాలా... అయితే యూఎస్ మిలటరీ ట్రిక్ ఫాలో అవ్వండి!

US military sleep trick
US military sleep trick

US military sleep trick: నేటి వేగవంతమైన జీవనశైలిలో చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. పనిఒత్తిడి, ఆర్థిక సమస్యలు, కుటుంబ బాధ్యతలు, మొబైల్ ఫోన్ల అధిక వినియోగం వంటి కారణాల వల్ల రాత్రి వేళల్లో నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్నారు. అయితే కొందరు ఆరోగ్య నిపుణులు త్వరగా నిద్రలోకి జారుకునేందుకు ఒక ప్రత్యేక శ్వాస వ్యాయామాన్ని సూచిస్తున్నారు. దీనినే చాలామంది ‘మిలటరీ స్లీప్ ట్రిక్’గా పిలుస్తారు. దీనిని పాటించి వారు తొందరగా నిద్రపోతారు. ఈ ట్రిక్ ఎలా ఉంటుందంటే?

ఈ పద్ధతిలో భాగంగా మొదట ప్రశాంతంగా మంచంపై పడుకుని శరీరాన్ని పూర్తిగా రిలాక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత నాలుగు సెకన్ల పాటు మెల్లగా శ్వాసను లోపలికి తీసుకోవాలి. అనంతరం ఏడు సెకన్ల పాటు శ్వాసను ఆపి ఉంచాలి. తర్వాత ఎనిమిది సెకన్ల వ్యవధిలో నెమ్మదిగా గాలిని బయటకు వదలాలి. ఈ ప్రక్రియను కొన్ని సార్లు పునరావృతం చేయడం ద్వారా శరీరం, మనసు రెండూ ప్రశాంత స్థితికి చేరుకుంటాయని నిపుణులు చెబుతున్నారు.

ఏడు సెకన్ల పాటు శ్వాసను నిలిపి ఉంచడం వల్ల శరీరంలో ఆక్సిజన్ వినియోగం మెరుగుపడుతుందని, మెదడుకు ప్రశాంతత కలుగుతుంది. అలాగే ఒత్తిడికి కారణమయ్యే హార్మోన్ల ప్రభావం తగ్గి, ఆందోళన క్రమంగా తగ్గే అవకాశం ఉంటుంది. దీంతో మనసు ప్రశాంతంగా మారి నిద్రకు అనుకూలమైన పరిస్థితి ఏర్పడుతుంది.

ఈ శ్వాస విధానాన్ని అనుసరించే ముందు రోజంతా ఎదురైన సమస్యలు, ఆందోళనలు, పనిభారం వంటి ఆలోచనలను కొంతసేపు పక్కన పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. నిద్రకు ముందు మనసును ప్రశాంతంగా ఉంచడం కూడా ఈ పద్ధతి విజయవంతంగా పనిచేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

కొందరు చెబుతున్న సమాచారం ప్రకారం.. అమెరికా మిలటరీ సిబ్బంది కూడా ఇలాంటి రిలాక్సేషన్, శ్వాస పద్ధతులను ఉపయోగిస్తారని చెబుతారు. క్లిష్టమైన పరిస్థితుల్లోనూ తక్కువ సమయంలో విశ్రాంతి తీసుకుని తిరిగి విధులకు సిద్ధం కావడానికి ఇవి సహాయపడతాయని అంటారు. అయితే దీనిపై వివిధ రూపాల్లో సమాచారం ఉన్నప్పటికీ, వ్యక్తిగతంగా ఫలితాలు మారవచ్చు.

అయితే నిద్రలేమి సమస్య తరచుగా కొనసాగితే కేవలం ఈ ట్రిక్‌పైనే ఆధారపడకుండా వైద్యులను సంప్రదించడం మంచిది. సరైన నిద్ర అలవాట్లు, సమయానికి నిద్రపోవడం, కాఫీన్ తగ్గించడం, స్క్రీన్ టైమ్ నియంత్రించడం వంటి చర్యలతో పాటు ఈ శ్వాస వ్యాయామాన్ని అనుసరిస్తే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది.

ఈ కార్లపై భారీ ఆఫర్లు.. ఏకంగా రూ.80 వేల వరకు డిస్కౌంట్లు..

Renault June Offers 2026
Renault June Offers 2026

Renault June Offers 2026: భారతీయ కార్ల మార్కెట్లో అమ్మకాలను మరింత పెంచుకునే లక్ష్యంతో ప్రముఖ ఫ్రెంచ్ కార్ల కంపెనీ Renault ఈ జూన్ నెలకు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. కంపెనీకి చెందిన పాపులర్ మోడళ్లైన Renault Kiger, Renault Triber, Renault Kwid కార్లపై గరిష్టంగా రూ.80,000 వరకు డిస్కౌంట్లు, బెనిఫిట్స్ అందిస్తోంది. ఈ ఆఫర్లలో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ బెనిఫిట్స్, లాయల్టీ రివార్డ్స్, కార్పొరేట్ డిస్కౌంట్లు ఉన్నాయి. ఆ ఆఫర్ల వివరాల్లోకి వెళితె..

కైగర్‌పై అత్యధిక ప్రయోజనాలు
రెనాల్ట్ కైగర్ కొనుగోలు చేసే కస్టమర్లకు ఈ నెలలో అత్యధికంగా రూ.80,000 వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఇందులో రూ.40,000 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ.25,000 వరకు ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బెనిఫిట్, రూ.15,000 వరకు లాయల్టీ బోనస్ ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో కార్పొరేట్ కస్టమర్లకు అదనపు డిస్కౌంట్లు కూడా వర్తిస్తాయి. అయితే బేస్ వేరియంట్లపై ఈ ప్రయోజనాలు పరిమితంగా ఉండే అవకాశం ఉంది. ఈ కారు ధర ప్రస్తుతం రూ.5.81 లక్షల నుంచి రూ. 10.34 లక్షల వరకు విక్రయిస్తున్నారు.

ట్రైబర్‌పై రూ.60,000 వరకు ఆఫర్లు
ఏడు సీట్ల సామర్థ్యం కలిగిన ట్రైబర్‌పై కూడా కంపెనీ ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది. ఎంపిక చేసిన వేరియంట్లపై గరిష్టంగా రూ.60,000 వరకు బెనిఫిట్స్ లభిస్తున్నాయి. పాత స్టాక్ వాహనాలపై రూ.35,000 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ.25,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ అందుబాటులో ఉంది. అదనంగా కార్పొరేట్, లాయల్టీ , రిఫరల్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు.దీనిని రూ.5.81 లక్షల ప్రారంభం నుంచి విక్రయిస్తున్నారు.

క్విడ్ కొనుగోలుదారులకు ప్రత్యేక తగ్గింపులు:
బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్ క్విడ్‌పై కూడా రెనాల్ట్ మంచి ఆఫర్లను ప్రకటించింది. ఈ కారుపై గరిష్టంగా రూ.55,000 వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఇందులో రూ.20,000 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ.25,000 వరకు ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బెనిఫిట్, రూ.10,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్ ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల కస్టమర్లకు అదనపు ప్రయోజనాలు కూడా లభించే అవకాశం ఉంది.ఈ కారు ధర ప్రస్తుతం రూ. 4.30 లక్షల నుంచి రూ. 5.88 లక్షల వరకు విక్రయిస్తున్నారు.

స్క్రాపేజ్, లాయల్టీ బోనస్‌లతో మరింత లాభం:
ఇప్పటికే రెనాల్ట్ వాహనం కలిగి ఉన్న కస్టమర్లు లాయల్టీ బోనస్ పొందవచ్చు. అలాగే పాత వాహనాన్ని స్క్రాప్ చేసి కొత్త కారు కొనుగోలు చేసే వారికి ప్రత్యేక స్క్రాపేజ్ బెనిఫిట్స్ అందిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. కొన్నివేరియంట్లపై 0 శాతం వడ్డీ ఫైనాన్స్ స్కీమ్ కూడా అందుబాటులో ఉంది.

ఈ ప్రత్యేక ఆఫర్లు జూన్ నెల మధ్య వరకు లేదా జూన్ 30 వరకు డీలర్‌షిప్ ఆధారంగా అందుబాటులో ఉండొచ్చని సమాచారం. అయితే నగరం, డీలర్ స్టాక్, వేరియంట్‌ను బట్టి డిస్కౌంట్ మొత్తాలు మారే అవకాశం ఉంది. కాబట్టి కారు కొనుగోలు చేయాలనుకునేవారు సమీప రెనాల్ట్ షోరూమ్‌ను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవడం మంచిది.

పాక్‌ చీటింగ్‌ గేమ్‌.. పీవోకే స్వతంత్రం వెనుక చీకటి!

Pakistan Occupied Kashmir Autonomy Reality
Pakistan Occupied Kashmir Autonomy Reality

Pakistan Occupied Kashmir Autonomy Reality: పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీవోకే) గురించి చాలామందికి ఒక ప్రశ్న తరచూ వస్తుంది. అక్కడ ప్రత్యేక అధ్యక్షుడు, ప్రధానమంత్రి, శాసనసభ, న్యాయవ్యవస్థ, మంత్రివర్గం, జెండా, తాత్కాలిక రాజ్యాంగం ఎందుకు ఉన్నాయి? ఇవి నిజంగా స్వయం ప్రతిపత్తిని సూచిస్తాయా? లేదా ఇవి కేవలం బాహ్య ప్రదర్శన మాత్రమేనా? ఈ ప్రశ్నలు ఇటీవలి ఆందోళనల నేపథ్యంలో మరింత స్పష్టంగా ఎదురవుతున్నాయి.

అధికారికంగానే పేరు..
పాకిస్థాన్‌ ఈ ప్రాంతాన్ని ‘‘ఆజాద్‌ జమ్మూ అండ్‌ కశ్మీర్‌’’ అని అధికారికంగా సంబోధిస్తుంది. ఇక్కడ అధ్యక్షుడు రాజ్యాంగపరమైన అధిపతిగా, ప్రధానమంత్రి కార్యనిర్వాహక అధిపతిగా వ్యవహరిస్తారని చెబుతారు. శాసనసభ, న్యాయస్థానాలు, మంత్రిమండలి, ప్రత్యేక జెండా వంటి నిర్మాణాలు ఉన్నాయి. బయటి నుంచి చూస్తే ఇది స్వతంత్రంగా లేదా స్వయం నిర్ణయాధికారంతో నడిచే ప్రాంతంలా కనిపిస్తుంది.

భారత్‌లో విలీనం..
1947లో భారత విభజన తర్వాత జమ్మూ కశ్మీర్‌ సంస్థానం భారతదేశంలో విలీనమైంది. దీంతో జరిగిన మొదటి యుద్ధం ముగిసే సమయానికి కొంత భూభాగం పాకిస్తాన్‌ నియంత్రణలో మిగిలింది. పాకిస్తాన్‌ ఆ ప్రాంతాన్ని తన సాధారణ ప్రావిన్సుల్లో కలపలేదు. మొత్తం కశ్మీర్‌పై తన హక్కును అంతర్జాతీయంగా కొనసాగించాలని అనుకుంది. అందుకే ఆ ప్రాంతాన్ని ప్రత్యేకంగా చూపించే విధానాన్ని అనుసరించింది.

కరాచీ ఒప్పందం…
1949లో కరాచీ ఒప్పందం ద్వారా రక్షణ, విదేశాంగ విధానం, సమాచార వ్యవస్థలు వంటి కీలక అధికారాలను పాకిస్తాన్‌ తన వద్దే ఉంచుకుంది. 1974లో తాత్కాలిక రాజ్యాంగం అమల్లోకి తెచ్చి అధ్యక్షుడు, ప్రధానమంత్రి, శాసనసభ వంటి సంస్థలను ఏర్పాటు చేసింది. అయితే ఈ రాజ్యాంగం ప్రకారం కూడా ప్రధాన నిర్ణయాలు ఇస్లామాబాద్‌ అనుమతితోనే తీసుకోవాలి. వాస్తవ పరిపాలన, నియంత్రణ స్వరూపంరక్షణ, విదేశాంగం, ఆర్థిక విధానాలు, వ్యూహాత్మక విషయాలు అన్నీ పాకిస్థాన్‌ కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. పీవోకే పరిపాలనలో పాకిస్తాన్‌ నుంచి పంపిన అధికారులు ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. శాసనసభలో కొన్ని స్థానాలు పాకిస్తాన్‌లో ఉన్న కశ్మీరీ శరణార్థుల కోసం రిజర్వ్‌ చేయబడ్డాయి. ఇది స్థానిక రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేస్తుంది.

విధేయతే ప్రమాణం..
శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే నాయకులు, న్యాయమూర్తులు, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు కశ్మీర్‌ను పాకిస్తాన్‌లో విలీనం చేయాలనే వాదనకు మద్దతు ఇస్తామని తప్పనిసరిగా ప్రమాణం చేయాలి. దీంతో భిన్న అభిప్రాయాలు, ప్రత్యామ్నాయ రాజకీయ ఆలోచనలకు అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.

భారత్‌ స్థిరమైన వైఖరి..
భారత్‌ ఈ మొత్తం ప్రాంతం తన అంతర్భాగమని, 1947 నుంచి పాకిస్తాన్‌ అక్రమ ఆక్రమణలో ఉందని స్పష్టంగా పేర్కొంటుంది. స్థానిక సంస్థలు ఉన్నప్పటికీ అవి నిజమైన స్వతంత్రతను సూచించవని, అవి పాకిస్తాన్‌ నియంత్రణలోనే పనిచేస్తున్నాయని భారత్‌ అభిప్రాయం. ఈ వ్యవస్థలు ప్రపంచానికి స్వయం ప్రతిపత్తి చూపించడానికి సృష్టించినవని భారత్‌ వాదిస్తుంది.

బయటికి కనిపించే అధ్యక్షుడు, ప్రధానమంత్రి, శాసనసభ వంటి నిర్మాణాలు ఉన్నప్పటికీ, రక్షణ, విదేశాంగం, కీలక నిర్ణయాలు అన్నీ ఇస్లామాబాద్‌లోనే తీసుకోబడుతున్నాయి. ఈ వ్యవస్థ మొత్తం పాకిస్తాన్‌ రిమోట్‌ కంట్రోల్‌లోనే నడుస్తుంది.