Restaurant Among Graves: ఏ మనిషి కూడా ఏన్నేళ్లు బతికినా సరే చావడం ఖాయం. చచ్చిన తర్వాత శవాన్ని తగలబెట్టడం కూడా ఖాయమే. మనిషి పుట్టుకను గొప్పగా భావించే మన సమాజంలో.. చావును మాత్రం హృదయ విధారకంగా చూస్తుంటారు. చనిపోయిన వారిని స్మశాన వాటికలలో దహనం చేస్తుంటారు. కొన్ని మతాల ఆచారాల ప్రకారం శవాలను ఖననం చేస్తుంటారు. అయితే ఇటువంటి ప్రదేశాల పక్కన ఉండాలని ఎవరూ అనుకోరు. ఈ ప్రదేశాల మీద ప్రజలకు భయం ఉంటుంది. చెడు అభిప్రాయం కూడా ఉంటుంది.
పైగా మన పూర్వికులు స్మశాన వాటికల గురించి వణుకు కలిగించే ఉదాహరణలతో చెబుతూ ఉంటారు. అక్కడ ఇతర శక్తులు ఉంటాయని.. అవన్నీ కూడా మనుషులను వేధిస్తుంటాయని అంటుంటారు. దీంతో ఆ ప్రాంతాలకు వెళ్లాలంటేనే చాలామంది భయపడుతుంటారు. కొందరైతే వాటి చుట్టుపక్కలకు రాత్రిపూట కన్నెత్తి చూసేందుకు కూడా ఇష్టపడరు. కానీ ఈ కథనంలో మాత్రం సమాధుల మధ్యనే ఒక హోటల్ ఉంది. పైగా అక్కడ గట్టిగానే లావాదేవీలు జరుగుతున్నాయి. జనాలు కూడా అక్కడ కూర్చొని తినడానికి విపరీతంగా ఇష్టపడుతున్నారు.
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో న్యూ లక్కీ పేరుతో ఒక రెస్టారెంట్ ఉంది. ఈ రెస్టారెంట్ గురించి తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోవడం మీ వంతు అవుతుంది. ఎందుకంటే ఇక్కడ సమాధుల మధ్య టేబుల్స్ ఉంటాయి. ఈ సమాధులు దాదాపు 16వ శతాబ్దానికి చెందినవి. ఇవి సూఫీ సాధువులకు చెందిన సమాధులని ఇక్కడి వారు నమ్ముతుంటారు. ఈ ప్రాంతంలో కృష్ణన్ కుట్టి అనే వ్యక్తి హోటల్ నిర్మిస్తున్నప్పుడు ఈ సమాధులు బయటపడ్డాయి. అయితే వాటిని అతడు తొలగించలేదు. పైగా చుట్టూ ఇనుప గ్రిల్స్ ఏర్పాటు చేశాడు. అప్పటినుంచి హోటల్ నడుపుతూనే ఉన్నాడు.
మొదట్లో సమాధులను చూసి భయపడ్డారు. ఆ తర్వాత ఇదేదో వింతగా ఉందని పర్యాటకులు రావడం మొదలుపెట్టారు. ప్రతిరోజు ఇక్కడ టీ, టిఫిన్లు, భోజనం, స్నాక్స్ విక్రయాలు జరుగుతూ ఉంటాయి. భారీగానే కస్టమర్లు వస్తుంటారు. వారంతా కూడా ఇక్కడ ప్రశాంతంగా తిని వెళుతుంటారు. అయితే ఆ సమాధులను చూసి కొంతమంది వాటి వెనుక ఉన్న విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటే.. మరికొందరేమో వాటి పక్కన నిలబడి ఫోటోలు దిగుతుంటారు. ఏదేమైనప్పటికీ సమాధుల మధ్య కూర్చొని తినడం ఒక రకంగా వింతే. కాకపోతే ఈ సమాధులే కృష్ణన్ కుట్టి హోటల్ కు ప్రత్యేకత తీసుకొచ్చాయి.