టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వాహనంపై వైసీపీ వర్గీయులు రాళ్లదాడికి దిగడం కలకలం రేపింది. గుంటూరు జిల్లా జి.కొండూరు మండలం కొండపల్లి అటవీప్రాంతంలో అక్రమ మైనింగ్ చేస్తున్నారనే ఆరోపణలపై దేవినేని ఉమా పరిశీలనకు వెళ్లారు.
ఉమా కారును జి.కొండూరు మండలం గడ్డమణుగ గ్రామం వద్ద వైసీపీ వర్గీయులు అడ్డుకున్నారు. వాహనం చుట్టుముట్టి దాడికి దిగారు. రాళ్లదాడిలో కారు అద్దాలు ధ్వంసమైనట్టు సమాచారం.
మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంతకృష్ణప్రసాద్ అనుచరులే దాడికి పాల్పడ్డారని దేవినేని ఉమా ఆరోపించారు. టీడీపీ, వైసీపీ వర్గాలు ఘటనస్థలికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. ఉమా వాహనాన్ని అక్కడి నుంచి తరలించారు. భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపిస్తూ దేవినేని ఉమా జి.కొండూరు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.
ఘటనకు సంబంధించి దేవినేని ఉమాకు చంద్రబాబు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. ఇలాంటి దాడులకు భయపడేది లేదని.. వైసీపీ నేతల అక్రమాలపై పోరాడేందుకు వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
దేవినేని ఉమాపై ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ప్రోద్బలంతోనే వైసీపీ గుండాలు దాడికి పాల్పడ్డారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ అవినీతి, అరాచకాలకు చక్రవడ్డీతో సహా మూల్యం చెల్లిస్తామని హెచ్చరించారు. దేవినేని ఉమాపై జరిగిన దాడి ఘటనలో పోలీసులు ఎవరినీ అరెస్ట్ చేయకపోవడం దుర్మార్గమని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు.