Andhra Pradesh summer holidays : ఏపీలో వేసవి సెలవులు పొడిగించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో.. పాఠశాల పునః ప్రారంభం వాయిదా వేయాలని ఎక్కువ మంది కోరుతున్నారు. దీనిపై బిజెపి శాసనసభ పక్ష నాయకుడు విష్ణుకుమార్ రాజు ప్రభుత్వానికి ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. ఈ నెల 12న పాఠశాలల పునః ప్రారంభాన్ని వాయిదా వేయాలని కోరారు. ఈ మేరకు ఆయన అధికారులకు లేఖ రాశారు. ఏప్రిల్ 24 నుంచి జూన్ 12 వరకు విద్యాసంస్థలకు వేసవి సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. కానీ ఇంకా ఎండ తీవ్రత కొనసాగుతున్న దృష్ట్యా.. పాఠశాలల పునః ప్రారంభాన్ని కొద్ది రోజులపాటు వాయిదా వేయాలని విష్ణు కుమార్ రాజు కోరారు.
* రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ..
ఈ నెల 12న విద్యా సంస్థలు పునః ప్రారంభం కావాలి. అయితే 13 రెండో శనివారం, 14 ఆదివారం కావడంతో 15న కానీ, 17న కానీ పాఠశాలలను రీఓపెనింగ్ చెయ్యాలని విష్ణుకుమార్ రాజు కోరారు. కేవలం పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వానికి విన్నవిస్తున్నట్లు చెప్పారు. పాఠశాలల పునః ప్రారంభానికి ముందే తాగునీరు, మరుగుదొడ్లు, ఫ్యాన్లు, లైట్లు వంటి సదుపాయాలు సరిగా ఉన్నాయో? లేదో? పరిశీలించాలని కూడా కోరారు విష్ణుకుమార్ రాజు. దీనిపై ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కూడా ఇదే డిమాండ్ వస్తోంది. మరోవైపు వర్షాలు జాడ లేకపోవడంతో చల్లటి వాతావరణం అనేది కనిపించడం లేదు. అందుకే తల్లిదండ్రులు ఆందోళనతో ఉన్నారు.
* ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం..
తెలంగాణ ప్రభుత్వం పాఠశాలల ప్రారంభాన్ని వాయిదా వేసింది. వేసవి సెలవులను పొడిగిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 12 నుంచి కాకుండా.. 15 నుంచి స్కూల్స్ రీఓపెన్ అవుతాయని ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 13న రెండో శనివారం, 14 ఆదివారం కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈనెల 12వ తేదీన సెలవు ఇచ్చినందుకు.. దాని బదులు జూలై 11న రెండో శనివారం తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది. అందుకే ఏపీలో కూడా ఆ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఈ నెల 8 నుంచి 10 వరకు పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి స్పాట్ వాల్యూషన్ నిర్వహిస్తున్నారు.
