TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు రాజకీయాలు చేయకూడదు. వాళ్లు ప్రజలు చెల్లించిన టాక్స్ ల ద్వారా జీతాలు తీసుకుంటున్నారు కాబట్టి.. తీసుకుంటున్న జీతాలకు న్యాయం చేయాలి. అంటే ప్రజలకు సేవ చేయాలి. ప్రజల సమస్యలు పరిష్కరించాలి. అధికారంలో ఉన్న ప్రభుత్వం నిర్దేశించిన విధులను నిర్వర్తించాలి.
కొంతమంది ఉద్యోగులు పైవి చేయరు.. కులాలను అడ్డుపెట్టుకొని.. మతాలను అడ్డుపెట్టుకొని వ్యవహారాలను సాగిస్తూ ఉంటారు. ప్రభుత్వం నుంచి దర్జాగా జీతం తీసుకుంటారు. కానీ ఉద్యోగాన్ని పక్కనపెట్టి మిగతావన్నీ చేస్తూనే ఉంటారు. కొన్ని సందర్భాలలో రాజకీయ నాయకులను మించిన రాజకీయాలు చేస్తుంటారు.. అటువంటివారు గత వైసిపి ప్రభుత్వం లో బ్రహ్మాండంగా తమ హవా కొనసాగించారు. పైరవీలు చేసుకున్నారు. కాంట్రాక్టులు పొందారు. ప్రభుత్వ నుంచి జీతాలు తీసుకుంటూనే.. గట్టిగా లంచాలు వసూలు చేశారు.
నాడు వైసీపీ ప్రభుత్వం తాడు బొంగరం లేని కేసులో చంద్రబాబును ఇరికించింది.. అరెస్ట్ చేయించింది. అక్రమంగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టింది. కనీస వసతులు కల్పించకుండా ఇబ్బంది పెట్టింది. అంతేకాదు, ప్రభుత్వానికి తగ్గట్టుగా కొంతమంది ఉద్యోగులు కూడా వైసిపి పాట పాడారు. వైసిపి కార్యకర్తలు కంటే ఎక్కువ రెచ్చిపోయారు. ముఖ్యంగా చంద్రబాబు అరెస్ట్ జరిగినప్పుడు… తిరుమల తిరుపతి దేవస్థానం ఇంజనీరింగ్ విభాగంలో ఏఈఈ స్థాయి వ్యక్తి ఒకరు ఏకంగా మిఠాయిలు పంచిపెట్టారు. చంద్రబాబు పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
చంద్రబాబు మళ్ళీ తిరిగి రారు.. ఇక ఆయన జైల్లోనే మరణిస్తారు. అలా ఆయన గనక చనిపోతే గొర్రెపోతులను కోసి విందు ఇస్తానని బహిరంగంగానే వ్యాఖ్యానించారని తోటి ఉద్యోగుల అప్పట్లో చెప్పుకున్నారు. అటువంటి వ్యక్తికి కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా గట్టి నజరానా ఇచ్చింది. ఏకంగా తిరుమల ఆలయానికి ఆయనను ఏఈఈ గా బదిలీ చేసింది. అసలు ఆయనకు ఈ స్థాయిలో పోస్టింగ్ ఇవ్వడం పట్ల టిడిపి నాయకులతో పాటు.. తిరుమల దేవస్థానం సిబ్బంది సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి అధికారులకు కీలక పోస్టింగులు ఇస్తే ప్రజల్లోకి ఎటువంటి సంకేతాలు వెళ్తాయో టీడీపీ నేతలు ఆలోచించుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది అంతర్గతంగా చర్చించుకుంటున్నారు.
image.png


