కెసిఆర్ కి ఒక కోరిక ఎప్పట్నుంచో బలంగా వుంది. దేశరాజకీయాల్లో తన ప్రతిభ చూపించాలని. నిన్న మాట్లాడింది మొదటిసారికాదు. ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు ఇలా మాట్లాడటం వెనక్కు తగ్గటం తెలిసిందే. మార్చి2018లో ఏకంగా ఫెడరల్ ఫ్రంట్ పెడుతున్నట్లు ప్రకటన కూడా చేసాడు. నవీన్ పట్నాయక్, మమతా బెనర్జీలతో సమావేశాలు కూడా నిర్వహించాడు. అదే కెసిఆర్ జనవరి 2019 లో మమత బెనర్జీ నిర్వహించిన మోడీ వ్యతిరేక ర్యాలీకి డుమ్మా కొట్టాడు. మాటలు కోటలు దాటటం చేతలు చతికలపడటం కెసిఆర్ విషయంలో సర్వ సాధారణమే. అవసరాన్ని బట్టి మాటలు మార్చటం కెసిఆర్ కి వెన్నతో పెట్టిన విద్య. డిసెంబర్ రెండవ వారంలో హైదరాబాద్ లో ప్రాంతీయ పార్టీల సమావేశం పెడతాడంట. ఈమాట జిహెచ్ఎంసి ఎన్నికలయిన తర్వాత ఉంటుందా అంటే ఏమో చెప్పలేము. చంద్రబాబు నాయుడు కూడా ఇంతకన్నా ఎక్కువగానే లోక్ సభ ఎన్నికలముందు ప్రగల్భాలు పలికాడు. ఎన్నికలైన తర్వాత తప్పు చేసానని నాలుక కరుచుకున్నాడు. మరి కెసిఆర్ మాట నమ్మేదెట్లా? 2019 జనవరి కోల్ కతా మమత బెనర్జీ ర్యాలికి కెసిఆర్, నవీన్ పట్నాయక్ తప్ప అందరూ హాజరయ్యారు. మరి ఆరోజు మొహం ఎందుకు చాటేసాడో అందరి నాయకులకు చెప్పి ఆ తర్వాత సమావేశం నిర్వహిస్తే బాగుంటుంది.
అసలు మోడీ వ్యతిరేక ప్రాంతీయ ఫ్రంట్ సాధ్యమేనా?
ఒకసారి బెంగుళూర్లో, ఇంకొకసారి కోల్ కతాలో, మరోసారి డిల్లీలో ఇంతకుముందు సమావేశాలు లోక్ సభ ఎన్నికలకు ముందు జరిగాయి. ఏమయింది అభాసుపాలవటం తప్ప. అసలు వీటిమధ్య పొంతన ఏది? బెంగాల్ లో సిపిఎం టిఎంసి ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది, కేరళలో సిపిఎం కాంగ్రెస్ మధ్య అదే పరిస్థితి. కాంగ్రెస్ లేని ప్రాంతీయ ఫ్రంట్ సాధ్యమేనా? మరి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులే ఒకతాటి మీదకు రాకపోతే దేశం మొత్తాన్ని ఎలా ఒక గూటికి చేరుస్తారు. కెసిఆర్ మాట్లాడానని చెబుతున్న ముఖ్యమంత్రులు, ప్రతిపక్షనాయకుల జాబితాలో జగన్ మోహన్ రెడ్డి లేకపోవటం ఆశ్చర్యంగా వుంది. ఎక్కడోవున్న పిన్నరాయి విజయన్ తో మాట్లాడిన కెసిఆర్ పక్క రాష్ట్రంలో,అందునా సోదర తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడినట్లు ప్రకటించక పోవటం ఏ విధంగా అర్ధం చేసుకోవాలి? ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికెగిరిందన్న సామెత అతికినట్లు సరిపోతుంది. ఇంతకుముందు ఈ ప్రయోగం ఎన్నోసార్లు జరిగింది. ఇది మొదటి ప్రయత్నమూ కాదు, చివరదీ కాదు. ఈ ప్రయోగాలు జరుగుతూనే వుంటాయి. ముందు నాయకుడు/నాయకురాలు ఎవరో తేల్చుకుంటే ఆ తర్వాత ఈ ఫ్రంట్ బతికి బట్ట కడుతుంది. మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, కెసిఆర్ ఎవరు ఈ ఫ్రంట్ కి సారధ్యం వహిస్తారు?
నిజం చెప్పాలంటే ఈ అతుకుల బొంత నిలబడేదికాదని గత అనుభవం చెబుతుంది. దేశ రాజకీయాల్ని శాసించాలంటే ఇంకో జాతీయ పార్టీ రావాలి. అలా అయితేనే మోడీని ఎదుర్కోగలరు? అంతేగాని ఒక రాష్ట్రానికే పరిమితమైన పార్టీలు ఒక కూటమిగా ఏర్పడినంత మాత్రాన ప్రత్యామ్నాయం కాజాలదు. మీకన్నా ముందుగా మమతా బెనర్జీ,అరవింద్ కేజ్రివాల్ ఈ కూటమిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, ఎన్నో ప్రయోగాలు చేసారు. కోరికలుండటం వేరు, సాధించటం వేరు. ఒక జాతీయ పార్టీ వుండి దానికి సఖ్యతగా మిగతా పార్టీలు వుంటేనే ఎప్పటికైనా ఆ ఫ్రంట్ ఆచరణలో నిలబడుతుంది. అంతేగాని అన్ని ప్రాంతీయపార్టీలు కలిసి కూటమి పెట్టినా అది ఎన్నాళ్ళు నిలుస్తుందో చెప్పలేము. ఒకవేళ నిలిచినా లోక్ సభ ఎన్నికలు వచ్చేసరికి ప్రజలు అతుకులబొంత కూటమిని ఆమోదించరు. ప్రజలు చాలా తెలివిగా ఓటు వేస్తున్నారని అనుభవం చెబుతుంది. లోక్ సభకి ఒకరకంగా, రాష్ట్ర అసెంబ్లీకి వేరే రకంగా ఓట్లు వేస్తున్నారు. కాబట్టి నిజంగా మోడీని ఎదుర్కొని నిలబడాలంటే మీరందరూ ఒకపార్టీగా ఏర్పడండి. అదొక్కటే మార్గం. అంతేగాని మీ పీఠం కిందకు నీళ్ళో చ్చినప్పుడు మోడీని అది చేస్తాము, ఇది చేస్తామూ అంటే ప్రజలను తక్కువగా అంచనా వేసినట్లే.
ముందుగా ఏకీకృత విధానం అవసరం
కెసిఆర్ చెప్పిన కారణాలు ఏమిటి? రైతాంగ వ్యతిరేక విధానాలు తీసుకుంటున్నారని. దీనిపై ఒక విధానపత్రాన్ని తయారుచేయాలి. కేవలం మోడీ ప్రభుత్వ వ్యతిరేకత ఒక్కటే సరిపోదు. అలాగే ప్రభుత్వరంగ సంస్థల్ని ప్రైవేటీకరించటంపై కూడా. పారిశ్రామిక సంస్థల్ని ఆకర్షించటానికి రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి 2013 భూసేకరణ చట్టాన్ని సవరించిన సంగతి మరచిపోవద్దు. అందులో మీరుకూడా వున్నారు. అలాగే 2014 లో అధికారంలోకి వచ్చినప్పుడు వాగ్దానం చేసిన మూతబడిన పరిశ్రమల్ని ఎందుకు తిరిగి తెరవలేదు? ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాంతాడంత అవుతుంది. నదుల అనుసంధానంపై ప్రాంతీయ పార్టీలన్నీ ఒకమాట మీద ఉంటాయా? చైనాని ఎదుర్కోలేకపోయారని నోటి దురద తీర్చుకున్నారు. మరి మీరు కూటమిలో కోరుకుంటున్న సిపిఎంని మీ పంధాపై ఒప్పించగలరా? అయినా ఒక బాధ్యతాయుత స్థానంలో వుండి దేశ రక్షణ అంశంలో లూజు టాక్ చేయటం తగునా కెసిఆర్ గారూ? రాహుల్ గాంధీ మాట్లాడింది మీరు మాట్లాడింది ఒకటిగానే వుంది. ఎవరో రచ్చబండ మీద కూర్చొని రంకేలేసుకున్నట్లు వుంది మీరు చైనాపై మాట్లాడింది. ఒవైసీ మీకు మంచి మిత్రుడు పార్టనర్ కదా మరి మిగతా ప్రాంతీయ పార్టీలను కూడా ఒవైసీ మితృత్వంపై ఒప్పించగలరా? ఇలా చెప్పుకుంటూ పోతే దీనికి ముగింపు వుండదు. కాబట్టి ముందుగా విధానాలపై స్థూల అవగాహన రాకుండా కూటమి కట్టినంత మాత్రాన అది మనజాలదు.
జిహెచ్ఎంసి ఎన్నికలు ఇలా నిర్వహించే మీరు దేశ రాజకీయాల్ని నడపగలరా?
జిహెచ్ఎంసి ఎన్నికలు ఇంత దారుణంగా రసాభాస చేసిన మీరు దేశానికి ఆదర్శం ఎలా అవుతారు? ఒకవైపు వరదసాయం కోసం ప్రజలు బారులు తీరివుంటే వాళ్ళ బాధలు ఒదిలిపెట్టి ముందస్తు ఎన్నికలకు వెళ్ళటానికి మీకు మనసెలా వచ్చింది కెసిఆర్ గారూ? ప్రజల భాదలు తీరిన తర్వాత ఎన్నికలు పెట్టి ఉండొచ్చు కదా. అంత తొందర దేనికి? ఇంకా మూడు నెల్ల టైముంది కదా. వరదసాయాన్ని ఇంత రసాబాస చేసిన ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదు. ముందుగా తెరాస కార్యకర్తల్ని పెట్టి నడిపించారు. అది విఫలమైన తర్వాత మీ సేవ పేరుతో రోజుల తరబడి క్యూ లలో నిలబెట్టారు. ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ పేరుతో వాళ్ళ నోట్లో మట్టి కొట్టారు. అదేమంటే బిజెపి నాయకుడు బండి సంజయ్ ఆపమన్నాడని చెప్పి స్వయానా ముఖ్యమంత్రే అబద్ధం చెబితే ఎలా? ఆయన నేను రాయలేదని చెబుతున్నాడు కదా తిరిగి పునరుద్ధరించమని చెబుతారా? చెప్పలేరు. ఎందుకంటే మొత్తం ప్రక్రియను రసాబాస చేసి ఇప్పుడు దాన్ని ఎలా ముగించాలో తెలియక ఎన్నికల వంకతో ఆపేశారనేది అసలు నిజం. ఇదేదో కలిసివస్తుందని ఓట్లు దండుకోవచ్చని మొదలుపెట్టి చివరకు తమ మెడ మీదకే తెచ్చుకున్నారు. ఇదే ఇప్పుడు కెసిఆర్ కి శాపం అయ్యింది.
ఒక తప్పును కప్పిపుచ్చుకోవటానికి ఇంకో తప్పు చేస్తున్నారు. చివరకి సమస్యని పక్కదోవ పట్టించటానికి దేశవ్యాప్త ప్రాంతీయ ఫ్రంట్ అని ప్రచారం మొదలుపెట్టారు. ఇంకా లోక్ సభ సాధారణ ఎన్నికలకి మూడున్నర సంవత్సరాల టైముంది. ముందు ఈలోపల మీ పీఠం కదలకుండా చూసుకోండి. కెసిఆర్ గారూ అన్ని రోజులు మనవి కాదు. మీకు అయిదు సంవత్సరాలు పరిపాలన చేయమని అధికారం ఇచ్చారు. అది ఒదిలిపెట్టి ఎప్పుడో జరిగే లోక్ సభ ఎన్నికల గురించి అతిగా మాట్లాడుకోవటం వికటిస్తుందేమో ఆలోచించండి. ముందు ఈ జిహెచ్ఎంసి ఎన్నికలనుంచి ఎలా బయటపడాలో ఆలోచించండి,తర్వాత దేశ రాజకీయాల్ని గురించి తీరికగా మాట్లాడుకోవచ్చు.
An Independent Editor, Trend Stetting Analyst.
Read MoreWeb Title: Is kcr regional parties front carry any weight
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com