Chandrababu- YCP MLAs: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. పట్టుమని రెండేళ్ల వ్యవధి కూడా లేదు. దీనికితోడు సీఎం జగన్ ముందస్తుకు వెళతారని ఊహాగానాలు వెలువడుతున్నాయి. అటు అధికార పక్షంతో పాటు ఇటు విపక్షాలు కూడా దూకుడు పెంచాయి. అయితే అధికార పార్టీలో ఈ సారి చాలా మంది టిక్కెట్ విషయంలో మొండిచేయి చూపనున్నారని తెలుస్తోంది. పార్టీ తాజా వ్యూహకర్త రుషిరాజ్ సింగ్ సర్వేలో చాలామంది ఎమ్మెల్యేలు వెనుకబడినట్టు తెలుస్తోంది. గతంలో రెండు సర్వేలో చాలామంది ఎమ్మెల్యేలు పాసు మార్కుకు దూరంగా ఉండిపోయారు. అటువంటి వారికి అధినేత జగన్ క్లాసు పీకారు. గ్రాఫ్ పెంచుకోకపోతే మాత్రం మార్చేస్తానంటూ హెచ్చరికలు పంపారు. అయితే మరోసారి సర్వే చేసినా ఫలితం రాకపోవడంతో సదరు ఎమ్మెల్యేలకు ముఖం మీదే చెప్పేందుకు జగన్ సిద్ధపడుతున్నారు. అటువంటి వారంతా నైరాశ్యంలోకి వెళ్లిపోయారు. ఎందుకొచ్చింది గొడవ అంటూ పక్క పార్టీల వైపు చూస్తున్నారు. కొంతమంది టీడీపీ అధినేత చంద్రబాబుకు టచ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ముందస్తుగా కర్చీఫ్ వేసుకుంటున్నారు. చంద్రబాబు మాత్రం ఎవరికీ ఎటువంటి హామీ ఇవ్వడం లేదని తెలుస్తోంది. కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ సీనియర్ల ద్వారా చంద్రబాబును అప్రోచ్ అవుతున్నట్టు సమాచారం. ఇప్పటికే ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ ను కలిశారు. ఇప్పుడు చంద్రబాబుతో కొంతమంది టచ్ లో ఉన్నారని తెలియడంతో అధికార పార్టీలో కలకలం రేపుతోంది.
అధినేత హెచ్చరికలతో..
వైసీపీ అధినేత జగన్ తన గ్రాఫ్ బాగుందని.. ఎమ్మెల్యేల గ్రాఫే బాగోలేదంటూ గత కొన్ని నెలలుగా చెబుతూ వస్తున్నారు. మీ గ్రాఫ్ పెంచుకోకపోతే మాత్రం మార్చేస్తానని హెచ్చరికలు పంపుతున్నాయి. అయితే అభివృద్ధి పనులు అంటూ లేకపోతే మా గ్రాఫ్ ఎలా పెరుగుతుందని ఎమ్మెల్యేలుప్రశ్నిస్తున్నారు. సంక్షేమ పథకాలకు లక్షల కోట్లు అప్పులు తెచ్చి ఖర్చు పెడుతున్నారని.. కానీ తాము కోరిన పనులను మాత్రం పెండింగ్ లో పెడుతుండడంతో తమను ప్రజలు ఎలా గుర్తిస్తారని నిలదీస్తున్నారు. నియోజకవర్గానికి రూ.12 కోట్లు మంజూరు చేస్తామని ప్రకటించి నెలలు గడుస్తున్నా ఇంతవరకూ అందించలేదన్నారు. నిధుల విడుదలలో కూడా వివక్ష చూపుతున్నారని.. పరపతి ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలకు నిధులు అధిక శాతం కేటాయిస్తున్నారని…సీఎం సొంత ప్రాంతానికి నిధులు మంజూరు చేస్తున్నారని గుర్తుచేస్తున్నారు. సీఎంను సమావేశాల్లో చూడడమే కానీ.. నేరుగా కలిసే చాన్స్ ఇవ్వడం లేదని చెబుతున్నారు. తప్పులు మీరుచేసి దానికి మూల్యం మాపై తోయడం భావ్యమా అని ప్రశ్నిస్తున్నారు. నిధులు లేక ప్రజల దగ్గరకు వెళ్లలేకపోతున్నామని.. అటు అధినేత కూడా తమ బాధను గుర్తించడం లేదన్నారు. అందుకే పార్టీలో కొనసాగాలంటే భయం వేస్తోందని..అందుకే పక్కచూపులు అధికమయ్యాయని అధికార పార్టీలో టాక్ నడుస్తోంది.
వైసీపీ నుంచి భారీగా వలసలు…
ఎన్నికలు సమీపించే కొలదీ అధికార పార్టీ నుంచి భారీ స్థాయిలో వలసలు ఉండే అవకాశముంది. గడిచిన ఎన్నికల్లో టీడీపీ నుంచి వైసీపీలోకి భారీగా వలసలు సాగాయి. అన్ని ప్రాంతాల నుంచి కీలక నాయకులు క్యూ కట్టారు. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎక్కువ మంది వైసీపీలో ఇమడలేకపోయారు. పదవులు దక్కక చాలా మంది కీనుక వహించారు. పొలిటికల్ గా సైలెంట్ అయ్యారు. అదును కోసం ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా గతంలో టీటీపీలో పనిచేసిన నాయకులు సొంత గూటికి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు జనసేనలోకి కూడా వెళ్లేందుకు చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారు. అధినేత హెచ్చరికలతో చాలామందిలోఅభద్రతా భావం నెలకొంది. మరోవైపు అధికార పార్టీలో విభేదాలు కూడా వలసలకు ఒక కారణం. ఎమ్మెల్యే స్థాయిలో అటుంచితే ద్వితీయ శ్రేణి నాయకత్వం సైతం పార్టీ మారేందుకు ఎదురుచూస్తోంది. గత ఎన్నికల ముందు వైసీపీ రకరకాలుగా ఎరవేసి చాలామంది నాయకులను పార్టీలో చేర్చుకుంది. ఏళ్ల తరబడి వ్యతిరేకించుకున్న నేతలు సైతం వైసీపీ గూటికి చేరారు. గత మూడేళ్లుగా అక్కడ ఇమడలేకపోతున్నారు. అటు అధిష్టానం కూడా ఒక వర్గానికే ప్రాధాన్యిత ఇస్తూ వస్తోంది. దీంతో రెండో వర్గం పార్టీ మారేందుకు నిర్ణయించుకుంది. అయితే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇతరత్రా విషయాల్లో ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కొద్దిరోజులు వేచి చూడాలని భావిస్తున్నారు.
చేరికలపై అచీతూచీ నిర్ణయం…
అయితే పార్టీల్లో చేరికల విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు అచీతూచీ వ్యవహరిస్తున్నారు. గతంలో టిక్కెట్ల కేటాయింపు, అభ్యర్థుల ప్రకటన విషయంలో చంద్రబాబు నాన్చుడు ధోరణితో ఉండేవారు. కానీ ఈ ఎన్నికల్లో మాత్రం పంథాను మార్చుకున్నారు. ముందుగానే అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. 175 నియోజకవర్గాలకుగాను.. ఇప్పటికే 70 నియోజకవర్గాల్లో అభ్యర్థుల విషయంలో ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే వైసీపీ నుంచి కొందరు టచ్ లోకి వచ్చినా వారికి ఎటువంటి అభయం ఇవ్వడం లేదు. చూద్దామంటూ వాయిదా వేస్తున్నారు. అటు పవన్ కూడా వైసీపీ నుంచి చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. పొత్తుల వ్యవహారం తేలక దృష్టిపెట్టనున్నట్టు జనసేన వర్గాలు చెబుతున్నాయి.
Also Read:
Pawan Kalyan- Akira Nandan: షాకింగ్ : అకీరాతో నాకు సంబంధం లేదని పవన్ నిజంగానే అన్నారా ?