Jagan- Modi: జగన్ పై కేంద్రం ప్రేమకు కారణం ఏంటి?

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల రుణ పరిమితి పై స్పష్టమైన విధానాలతో ముందుకెళ్తోంది. కానీ ఏపీకి మాత్రం మినహాయింపు ఇస్తోంది. వాస్తవానికి అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఏడాదికి రెండుసార్లు మాత్రమే ముందుగా నిర్ణయించిన పరిమితి ప్రకారం అప్పులకు అనుమతి ఇస్తుంది.

Written By: Dharma, Updated On : July 30, 2023 12:14 pm

Jagan- Modi

Follow us on

Jagan- Modi: ఏపీలో జగన్ సర్కార్ పై కేంద్ర ప్రభుత్వం అంతులేని అభిమానాన్ని చూపుతోంది. ముఖ్యంగా అప్పుల విషయంలో మిగతా రాష్ట్రాల కంటే ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. ఎడాపెడా అప్పులు చేసేందుకు అనుమతులు ఇస్తోంది. కార్పొరేషన్ల పేరిట లక్షల కోట్లు అప్పుచేస్తున్నా నియంత్రించడం లేదు. అదే ఇతర రాష్ట్రాల విషయంలో మాత్రం.. కార్పొరేషన్ల పేరిట తీసుకున్న రుణాలను సైతం.. అసలు రుణాలతో లెక్క కడుతోంది.

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల రుణ పరిమితి పై స్పష్టమైన విధానాలతో ముందుకెళ్తోంది. కానీ ఏపీకి మాత్రం మినహాయింపు ఇస్తోంది. వాస్తవానికి అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఏడాదికి రెండుసార్లు మాత్రమే ముందుగా నిర్ణయించిన పరిమితి ప్రకారం అప్పులకు అనుమతి ఇస్తుంది. కానీ నాలుగేళ్ల నుంచి సీఎం జగన్ అడిగిందే తడవు అప్పులకు అనుమతి ఇస్తోంది. ముందస్తు రుణ పరిమితి తో సంబంధం లేకుండా గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది.

రాష్ట్రంలో వివిధ కార్పొరేషన్ల ద్వారా ఏపీ సర్కార్ ఇప్పటివరకు రెండు లక్షల 35 వేల కోట్లు అప్పు చేసింది. కానీ వీటిని రుణ పరిమితిలో లెక్క కట్టలేదు. అనుమతించిన అప్పుల్లో కోత విధించడం లేదు. కానీ కేరళ ప్రభుత్వ విషయంలో మాత్రం కేంద్రం మడత పేచీ వేసింది. కేరళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ బోర్డు ద్వారా కేరళ ప్రభుత్వం 17052 కోట్ల అప్పులు తెచ్చింది. అయితే ఇలా తెచ్చిన మొత్తాన్ని.. కేరళ ప్రభుత్వానికి ఈ ఆర్థిక సంవత్సరంలో ఇచ్చిన అప్పుల అనుమతిలో కోత విధించింది.

జగన్ సర్కార్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించి మరీ అప్పులు చేస్తోంది. ఈ విషయంపై కేంద్రమే పలుమార్లు ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ సైతం రాసింది. రాష్ట్రం స్థాయి, సామర్థ్యం తో పని లేకుండా ఎడాపెడ అప్పులు చేసి రాష్ట్ర భవిష్యత్తును జగన్ సర్కార్ పణంగా పెడుతోంది.