
ప్రముఖ సినీ నటి విజయశాంతి ఇప్పుడు కాంగ్రెస్ లో ప్రముఖ నాయకురాలు. తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ గా వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల అనంతరం ఆమె కాంగ్రెస్ లో క్రియాశీలకంగా లేకపోయినా ముఖ్యమంత్రి కేసీఆర్ పై పదునైన వాఖ్యాలను సోషల్ మీడియాలో చేస్తూ తరచూ తన ఉనికి చాటుకొంటున్నారు.
అదే విధంగా ఆమె ఇప్పుడు మరోసారి కేసీఆర్ లక్ష్యంగా సోషల్ మీడియా లో పోస్ట్ పెట్టారు. అయితే ఈ పర్యాయం కాంగ్రెస్ కు ప్రధాన రాజకీయ ప్రత్యర్థి అయినా ప్రధాని నరేంద్ర మోదీని అవహేళన చేస్తూ మాట్లాడిన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసిపై చర్య తీసుకోమంది డిమాండ్ చేశారు.
కరోనా వైరస్ పై పోరాటంలో భాగంగా ఆదివారం రాత్రి తొమ్మిది నిముషాల సేపు దీపాలు నిలిపివేసి మరో దీపం వెలిగించమని దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు ఇచ్చారు. వెంటనే ఈ పిలుపును కాంగ్రెస్ నేతలు తూర్పుర బట్టారు. కరోనా వ్యతిరేక పోరాటంలో చేయవలసిన పనులు చేయకుండా ప్రచారం కోసం చేస్తున్నారంటూ మండి పడ్డారు.
అదే తరహాలో ఒవైసి సహితం ఇటువంటి పిలుపు ఇవ్వడం ద్వారా దేశాన్ని ఒక ఈవెంట్ మానేజ్మెంట్ వ్యవస్థగా మార్చివేస్తున్నారని ప్రధాని మోదీపై విరుచుకు పడ్డారు. ప్రధానిని అంత మాట అన్నందుకు సహజంగానే బీజేపీ నాయకులు కన్నెర్ర చేశారు. ఒవైసీని ఖండిస్తూ. నిందిస్తూ ప్రకటనలు చేశారు. సోషల్ మీడియా లో పెద్ద ప్రచారం నడిపారు.
అయితే దీపాలు వెలిగించే సమయం కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు తీరికగా మేల్కొన్న విజయశాంతి ప్రధానిని అవహేళన చేస్తూ మాట్లాడిన ఓవైసీపై చర్య తీసుకోవాలని కేసీఆర్ ను డిమాండ్ చేశారు.
ప్రధాని పిలుపుపై ఎవరైనా అవహేళనగా మాట్లాడితే కేసులు పెట్టాలని సీఎం కేసీఆర్ గతంలో ఆదేశించిన విషయాన్ని గుర్తు చేస్తూ.. ఇప్పుడెలాంటి చర్యలు ఉంటాయని ఆమె పశ్నించారు. సామాన్యుడికి ఒక న్యాయం అసదుద్దీన్‌కు ఒక న్యాయమన్న చందంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తుందా? అనే విషయంపై సీఎం స్పష్టత ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారని అంటూ ధ్వజమెత్తారు.
“దీపాన్ని ఆరాధించే దేశంలో అత్యధిక ప్రజల మనోభావాలకు సంబంధించిన దీప ప్రజ్వలన కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా సమర్థించారు” అంటూ ఆమె ఆ పోస్ట్ లో పేర్కొనడం గమనిస్తే ఆమె పరోక్షంగా కాంగ్రెస్ నేతలకు కూడా చురకలు పెట్టిన్నట్లు స్పష్టం అవుతుంది.
విజయశాంతి బిజెపి ద్వారానే రాజకీయ ప్రయాణం ప్రారంభించారు. గతంలో వాజపేయి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ పార్టీలో చేరి, మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలిగా కూడాపనిచేశారు. బిజెపి ఎన్నికల ప్రచారంలో క్రియాశీలకంగా పాల్గొంటూ వాజపేయి, అద్వానీ వంటి వార్లకు సన్నిహితంగా వ్యవహరించారు.
అయితే తెలంగాణ అంశంపై బిజెపిని విడిపోవడం, సొంతంగా పార్టీ పెట్టుకోవడం, తర్వాత టి ఆర్ ఎస్ లో చేరి ఎంపీ కావడం, తర్వాత కాంగ్రెస్ లో చేరడం చేశారు. చాలాకాలంగా ఆమె బీజేపీలోకి రావచ్చని ఊహాగానాలు జరుగుతున్నాయి. ఇప్పట్లో రాష్ట్రంలో గాని, కేంద్రంలో గాని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేకపోవడంతో బిజెపి వైపు చూస్తున్నట్లు కధనాలు వెలువడుతున్నాయి.
తాజాగా కరోనా వైరస్ గురించి ఆమె ఇస్తున్న ప్రకటనలు సహితం అటువంటి అభిప్రాయాన్ని బలపరుస్తున్నాయి.