
కరోనా.. కరోనా.. కరోనా.. ప్రపంచమంతా కరోనా జపం చేస్తోంది. ఈ మహమ్మరి పేద, ధనిక, చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరిపై ప్రభావం చూపుతోంది. సామాన్యుడి దగ్గరి నుంచి రాజవంశీకుల వరకు ఎవరినీ విడిచిపెట్టడం లేదు. పేద దేశం నుంచి అగ్రరాజ్యం వరకు అన్నిదేశాలకు పాకి విలయతాండవం సృష్టిస్తుంది. తాజాగా లిబియా మాజీ ప్రధాని మృతిచెందడం శోచనీయంగా మారింది.
చైనాలోని వూహాన్లో సోకిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచంలోని అన్ని దేశాలకు పాకింది. కరోనా దాటికి అగ్రరాజ్యంగా గొప్పలుపోతున్న అమెరికా సైతం విలవిలలాడిపోతుంది. ఇక ఇటలీ, స్పెయిన్, బ్రిటన్ దేశాలు కరోనా కేసుల్లో టాప్ ప్లేస్ కోసం నువ్వా.. నేనా అంటూ పరుగెత్తుతున్నాయి. కరోనా కట్టడి చేయడంతో ఈ దేశాలు పూర్తిగా చేతులేత్తేశాయి. నిస్సాహాయతగా ఇతర ప్రపంచ దేశాల సాయం కోరుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 12లక్షల70వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. 69వేలకు పైగా ఈ మహమ్మరితో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. భారత్ తోనూ 4వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.
తాజాగా కరోనా సోకి గత కొన్నిరోజులుగా చికిత్స పొందుతున్న లిబియా మాజీ ప్రధాని మహ్మూద్ జిబ్రిల్ ఆదివారం మృతిచెందారు. కరోనాతో ఆయన మార్చి 27 నుంచి ఈజిప్టులోని ఓ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్నారు. కరోనాతో వల్ల ఆయనకు శ్వాస తీసుకోవడం బాగా కష్టమైపోవడంతో వెంటిలేటర్ పై చికిత్స చేశారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం ఆయన తుదిశ్వాశ విడిచారు. మహ్మూద్ జిబ్రిల్ లిబియాలో సివిల్ వార్ జరుగుతున్న సమయంలో జిబ్రిల్ తాత్కాలిక ప్రధానిగా సుమారు ఏడాదిపాటు పనిచేశారు. కరోనాకు వాక్సిన్ లేకపోవడంతో ఎంత డబ్బు, ఎంత పెద్ద పదవి ఉన్నా ఈ మహమ్మరిని ఎదుర్కొలేకపోతున్నారు.