LokSabha Elections
LokSabha Elections: భారత పార్లమెంటు ఎన్నికలు తుది అంకానికి చేరుకున్నాయి. 543 స్థానాలకు ఏడు విడతల్లో ఎన్నికలు నిర్వహించేలా ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఏప్రిల్ 18న తొలి విడత ఎన్నికలు జరుగగా, తుది విడత పోలింగ్ జూన్ 1న జరుగనుంది.
57 స్థానాలకు పోలింగ్..
ఏడో విడత ఎన్నిల ప్రచారం గురువారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. చివరి దశలో ఏడు రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతంలో 57 లోక్ సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగనుంది. బీహార్ (8), హిమాచల్ ప్రదేశ్(4), జార్ఖండ్(3), ఒడిశా(6), పంజాబ్(13), ఉత్తర ప్రదేశ్(13), పశ్చిమ బెంగాల్(9) రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుంది. చండీగఢ్‌లోనూ పోలింగ్ జరగనుంది. వీటితోపాటు ఒడిశాలో 42 అసెంబ్లీ స్థానాలకూ అదేరోజు ఓటింగ్ జరగనుంది. ఇప్పటి వరకు ఆరు విడతల్లో 486 స్థానాలకు పోలింగ్ ముగిసింది.
తుది విడత బరిలో ప్రముఖులు..
ఇక చివరి విడత పోలింగ్ జరిగే వారిలో పలు కీలక నియోజకవర్గాలు ఉన్నాయి. వారణాసి నుంచి ప్రధాని మోదీ, మండి నుంచి బీజేపీ అభ్యర్థిగా సినిమా హీరోయిన్ కంగనా రనౌత్, హామిపూర్ నుంచి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, గోరక్‌పూర్ నుంచి నటుడు రవికిషన్, డైమండ్ హార్బర్ నుంచి మమతా బెనన్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పోటీ చేస్తున్నారు.
సాయంత్రం ఎగ్జిట్ పోల్ ఫలితాలు..
ఇదిలా ఉండగా సుదీర్ఘంగా సాగిన పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ జూన్1న ముగియనుంది. దీంతో సాయంత్రం 6:30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఇప్పటికే కొన్ని సంస్థల ఎగ్జిట్ పోల్ ఫలితాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కానీ వాటిని ఆయా సంస్థలు ధ్రువీకరించడం లేదు. తుది విడత పోలింగ్ ముగిసే వరకు ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించొద్దని ఈసీ ఆదేశించడంతో పలు సర్వే సంస్థలు శనివారం ఎగ్జిట్ పోల్ ఫలితాలు ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి. లోక్‌సభతోపాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు సంబంధించి ప్రముఖ మీడియా/ ప్రైవేటు సంస్థలు సాయంత్రం 6.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్ ఫలితాలు ప్రకటించనున్నాయి. ఇక తుది ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి.