Donald Trump: కోర్టులో ట్రంప్‌కు చుక్కెదురు.. శృంగార తార కేసులో దోషే!

దోషిగా తేలడంతో ట్రంప్‌ జైలుకు వెళ్తాడా అన్న ప్రశ్న అందరిలో తలెత్తుతోంది. దీనికి కచ్చితమైన సమాధానం మాత్రం ఎవరూ చెప్పడం లేదు. జూలై 11న ఆయనకు కోర్టు శిక్ష ఖరారు చేయనుంది.

Written By: Raj Shekar, Updated On : May 31, 2024 11:18 am

Donald Trump

Follow us on

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలకు కొన్ని నెలల ముందు.. ఆ దేశ మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డోనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) కు కోర్టులో చుక్కెదురైంది. శృంగార తార స్టార్మీ డేనియల్‌తో అక్రమ సంబంధం కేసులో ఆయనపై నమోదైన అన్ని ఆరోపణలు రుజువైనట్లు న్యూయార్క్‌ కోర్టు తేల్చింది. దాదాపు 34 అంశాల్లో ఆయనను దోషిగా నిర్ధారించింది. ఇలా ఓ కేసులో దోషిగా తేలిన అమెరికా తొలి మాజీ అధ్యక్షుడు ట్రంపే కావడం గమనార్హం. ఈ ఏడాది చివరన జరుగనున్న అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌.. ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్‌తో తలపడనున్నారు. మరో ఐదు నెలల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ తరుణంలో కోర్టు తీర్పు వెలువడడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇవీ ఆరోపణలు..
స్టార్మీ డేనియల్‌తో ట్రంప్‌ గతంలో ఏకాంతంగా గడిపారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో దీనిపై ఆమె నోరు విప్పకుండా ట్రంప్‌ పెద్దమొత్తంలో డబ్బు ముట్టజెప్పారని అభియోగాల్లో పేర్కొన్నారు. తన న్యాయవాది ద్వారా ఆమెకు సొమ్ము ఇప్పించారని తెలిపారు. ప్రచార కార్యక్రమాల కోసం అందిన విరాళాల నుంచి ఆ మొత్తాన్ని ఖర్చు చేశారని పేర్కొన్నారు. అందుకోసం బిజిఎస్‌ రికార్డులన్నీ తారుమారు చేశారన్నది ప్రధాన ఆరోపణ. ఇలా 32 అంశాల్లో ట్రంప్‌పై అభియోగాలు నమోదయ్యాయి. సుదీర్ఘ విచారణ తర్వాత అవన్నీ నిజమేనని తాజాగా క ఓర్టు తేల్చింది. ట్రంప్‌తో అక్రమ సంబంధం వాస్తవమేనని స్టార్మీ డేనియల్స్‌ స్వయంగా కోర్టులో వాగ్మూలం ఇచ్చింది.

జైలు శిక్ష తప్పదా..
దోషిగా తేలడంతో ట్రంప్‌ జైలుకు వెళ్తాడా అన్న ప్రశ్న అందరిలో తలెత్తుతోంది. దీనికి కచ్చితమైన సమాధానం మాత్రం ఎవరూ చెప్పడం లేదు. జూలై 11న ఆయనకు కోర్టు శిక్ష ఖరారు చేయనుంది. బిజినెస్‌ రికార్డుల తారుమారు చేయడమనేది న్యూయార్క్‌లో తక్కువ తీవ్రత ఉన్న నేరంగా పరిగణిస్తారు. గరిష్టంగా నాలుగేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. దీనిపై పూర్తి విచక్షణాధికారం న్యాయమూర్తిదే. కచ్చితంగా జైలు శిక్ష విధిస్తారని కూడా చెప్పలేము . అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. జరిమానాతో వదిలేసే అవకాశం కూడా ఉంటుంది. ఇంతకన్నా తీవ్రమైన మూడు కేసుల్లోనూ ట్రంప్‌ అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. అవేవీ ఎన్నికల ముందు విచారణకు వచ్చే అవకావం లేదని న్యాయవాదులు తెలిపారు.

ఎన్నిలపై ప్రభావం ఉండదు..
భారత దేశంలో రెండేళ్లకు మించి జైలుశిక్ష పడితే ఆ నేత ఎన్నికల్లో పోటీకి అనర్హుడు. ఎన్నికైన తర్వాత జైలు శిక్ష పడినా అతని పదవి రద్దవుతుంది. ఇటీవల కాంగ్రెస్‌ అగ్రనేతకు గుజరాత్‌ కోర్టు రెండేళ్ల జైలుశిక్ష విధించడంతో అతని ఎంపీ పదవి రద్దు చేస్తూ పార్లమెంటు సెక్రెటరీ నోటిఫికేషన్‌ జారీ చేశారు. అయితే సుప్రీం కోర్టు గుజరాత్‌ కోర్టు తీర్పుపై స్టే ఇవ్వడంతో సభ్యత్వం పునరుద్ధరించారు. ఇక అమెరికాలో ఆ దేశ మాజీ అధ్యక్షుడి నేరం రుజువైంది. ఈ నేపథ్యంలో అధ్యక్ష ఎన్నికల్లో అతడు పోటీ చేస్తాడా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అతని అభ్యర్థిత్వంపై తీర్పు ప్రభావం ఉండదని న్యాయ నిపుణులు తెలిపారు. నేరారోపణలు రుజువైతే ఎన్నికల్లో పోటీ నుంచి వైదొలగాలనే నిబంధన ఏదీ లేదని వెల్లడించారు. 1920లో ఓ సోషలిస్టు నేత జైలులో ఉండే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారని గుర్తు చేశారు. తాజాగా ట్రంప్‌ సైతం యథావిధిగా ప్రచారం కొనసాగించొచ్చని వెల్లడించారు. గృహనిర్బంధం విధిస్తే వర్చువల్‌గా ప్రచారం నిర్వహించే అవకాశ ఉంటుందని ఆయన కోడలు, రిపబ్లికన్‌ నేషనల్‌ కమిటీ కో చైర్‌ లారా ట్రంప్‌ వెల్లడించారు.

అప్పీల్‌కు అవకాశం..
ట్రంప్‌కు కోర్టు శిక్ష ఖరారు చేసిన తర్వాత ఆయనను దోషిగా తేలుస్తూ ఇచిచన తీర్పుపై ట్రంప్‌ పై కోర్టులో అప్పీల్‌ చేసుకోవచ్చు. అందుకోసం ఆయన న్యాయవాదుల బృందం ఇప్పటికే పనులు మొదలు పెట్టింది.