https://oktelugu.com/

Mangoes: అమెరికా నుంచి ఆఫ్రికా దాకా.. మామిడి పండ్లంటే ఓ ఎమోషన్.. వీడియో వైరల్

మన దేశంలో మహారాష్ట్ర నుంచి మొదలు పెడితే ఆంధ్రప్రదేశ్ వరకు మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. ఉత్తర భారతదేశం మీద ఇస్తే మిగతా ప్రాంతాలు మొత్తం మామిడి తోటలకు ఆలవాలంగా ఉన్నాయి. ముఖ్యంగా నూజివీడు ప్రాంతంలో పండే మామిడి పండ్లకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : May 31, 2024 / 11:42 AM IST

    Mangoes

    Follow us on

    Mangoes: మండు వేసవి కాలంలో.. మిట్ట మధ్యాహ్నం పెరుగన్నంలో మామిడి పండు తింటే అదో ఆనందం. సాయంత్రం పూట ఇంటిల్లిపాది కూర్చుని రసాలను ఆస్వాదిస్తుంటే అదో సంతోషం. ఉదయం పూట దొంగ చాటుగా బాగా పండిన బంగినపల్లి ముక్కను నోట కరుచుకుని తింటే అదో ఉత్సాహం.. ఇలా సందర్భాలు మారుతాయి కానీ.. మామిడిపండు రుచి మారదు. ఆ తీపి, ఆ మధురంలో తేడా రాదు. అందుకే నూటికి నూరు శాతం మామిడి పండ్లంటే చెవి కోసుకుంటారు. ఆ సీజన్ వస్తే ఆవురావు మంటూ ఎదురు చూస్తుంటారు.. మామిడి పండ్లను తినాలని తెగ తాపత్రయపడుతుంటారు..

    ఇక మన దేశంలో మహారాష్ట్ర నుంచి మొదలు పెడితే ఆంధ్రప్రదేశ్ వరకు మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. ఉత్తర భారతదేశం మీద ఇస్తే మిగతా ప్రాంతాలు మొత్తం మామిడి తోటలకు ఆలవాలంగా ఉన్నాయి. ముఖ్యంగా నూజివీడు ప్రాంతంలో పండే మామిడి పండ్లకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఇవి ఇతర దేశాలకు కూడా ఎగుమతి అవుతుంటాయి. బంగినపల్లి, తోతాపురి, ఆల్ఫాన్సా, ఇమమ్ పసంద్, రసాలు వంటి మామిడి పండ్లకు మనదేశంలోనే కాదు ఇతర దేశాల్లోనూ విపరీతమైన డిమాండ్ ఉంటుంది. సీజన్లో వందల కోట్ల విలువైన మామిడి పండ్లు ఇతర దేశాలకు ఎగుమతి అవుతూ ఉంటాయి. మన దేశం నుంచి మామిడి పండ్లను దిగుమతి చేసుకునే దేశాలలో అమెరికా ముందు వరుసలో ఉంటుంది. ఎందుకంటే అమెరికా ప్రాంతంలో మామిడి పండ్లు పండేందుకు అనువైన వాతావరణం ఉండదు. పైగా అమెరికాలో భారతీయులు ఎక్కువగా ఉంటారు. అందులోనూ కొన్ని ప్రాంతాలలో తెలుగు వాళ్ళే అధికంగా ఉంటారు. ఉద్యోగం, వ్యాపారం, చదువు వంటి వాటి నిమిత్తం ఆ ప్రాంతానికి వెళ్ళినవారు అక్కడే స్థిరపడుతున్నారు.

    ఇక ప్రస్తుతం మామిడిపండ్ల సీజన్ కావడంతో.. మన దేశం నుంచి అమెరికాకు ప్రత్యేకమైన కార్గో విమానాల ద్వారా ఎగుమతి అయ్యాయి. అక్కడికి ఎగుమతయిన మామిడి పండ్లను కొనుగోలు చేసేందుకు అమెరికాలో స్థిరపడిన తెలుగు వాళ్ళు బారులు తీరారు. దాదాపు కిలోమీటర్ల కొద్దీ క్యూలో నిలుచున్నారు. వాళ్ళని చూస్తుంటే తిరుమల లో శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తుల లాగా కనిపిస్తున్నారు. ఒక్కో మామిడిపండ్ల బాక్స్ ఖరీదు 100 డాలర్ల వరకు పలుకుతోందట. మామిడిపండ్ల కోసం బారులు తీరిన భారతీయులు, అందులోనూ తెలుగు వాళ్లను చూపుతూ.. ఓ నెటిజన్ తీసిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే ఈ వీడియో లక్షల్లో వ్యూస్ నమోదు చేసుకుంది. ” మామిడిపండు అంటే ఒక ఎమోషన్. దానికోసం భారతీయులు ఎంతదూరమైనా వెళ్తారు. ఎంతైనా ఖర్చు పెడతారని” వీడియోను చూసిన నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.