Telangana assembly : శాసనసభ, శాసనమండలి బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 3 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఉభయసభలు ఆరోజు మధ్యాహ్నం నుంచి మొదలవుతాయి.. నిజానికి డిసెంబర్లో శీతాకాలం సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.. కానీ భారత రాష్ట్ర సమితిని విస్తరించే క్రమంలో సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లడంతో సమావేశాలు జరగలేదు. వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 6, 12, 13 తేదీలలో జరిగాయి.. ఇక నుంచి ఆరు నెలల్లోపు సమావేశాలు నిర్వహించాల్సి ఉంది.. ఈ క్రమంలో ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది.. అందులో వచ్చే నిధులను పరిశీలించి, రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వ ఆలోచనగా ఉంది. అందుకే ఫిబ్రవరి 3 నుంచి సమావేశాలు ప్రారంభించాలని నిర్ణయించింది.

గవర్నర్ ప్రసంగం లేకుండానే
ఈసారి నిర్వహించే సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండానే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.. గత బడ్జెట్ సమావేశాలు కూడా గవర్నర్ ప్రసంగం లేకుండానే జరిగాయి.. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద రాద్ధాంతం జరిగింది.. రాజ్ భవన్, ముఖ్యమంత్రి కార్యాలయం మధ్య వివాదాన్ని రాజేసింది. ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించాల్సి ఉన్నందున… ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి అనుమతి ఇస్తున్నట్టు అప్పట్లో గవర్నర్ వెల్లడించడం గమనార్హం.. కానీ అంతకుముందు సమావేశాలకు కొనసాగింపుగానే బడ్జెట్ సమావేశాలను ప్రారంభిస్తున్నామని, ఈ దృష్ట్యా గవర్నర్ అనుమతి అవసరం లేదని స్పీకర్ సమావేశాలను ప్రారంభించవచ్చంటూ అప్పట్లో ప్రభుత్వ వర్గాలు వివరణ ఇచ్చాయి.
అయితే ఈసారి కూడా అదే ఆనవాయితీ ప్రభుత్వం కొనసాగించే అవకాశం కనిపిస్తోంది.. ఎందుకంటే గవర్నర్, ప్రభుత్వం మధ్య యుద్ధం నడుస్తోంది. భారత రాష్ట్ర సమితి నాయకులు గవర్నర్ ను, లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నారు.. గవర్నర్ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. నిజానికి సమావేశాలను గవర్నర్ ప్రారంభించడం సాంప్రదాయం.. ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. అనంతరం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభ్యులు మాట్లాడతారు.. అయితే ఇలాంటి వ్యవహారం ఏమీ లేకుండానే బడ్జెట్ సమావేశాలను ప్రభుత్వం నిర్వహిస్తుండడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారుతున్నది.