Union Budget 2023 : జనవరి ముగిసింది అంటే చాలు… దేశంలోని అందరి కళ్ళు కేంద్ర ప్రభుత్వం ప్రకటించే బడ్జెట్ పైనే ఉంటాయి.. ముఖ్యంగా వేతన జీవులు వేయికళ్లతో ఎదురుచూస్తూ ఉంటారు.. గత కొన్ని సంవత్సరాల నుంచి పన్ను చెల్లింపుల విధానంలో శ్లాబులను మారుస్తారని అనుకోవడం, తర్వాత కేంద్రం ఎటువంటి ప్రకటన చేయకపోవడం పరిపాటిగా మారింది.. ఈ విధానాల్లో కొన్ని మార్పులు చేసినప్పటికీ వేతన జీవులకు అంత సంతృప్తి కలగడం లేదు.. ఇలాంటి మినహాయింపులూ చూపించకుండా, ఆదాయాన్నిబట్టి, పన్ను చెల్లించే కొత్త విధానాన్ని 2020 లో ప్రకటించినప్పటికీ దీనిని వినియోగించుకునే వారి సంఖ్య తక్కువే.. ఈసారి బడ్జెట్లో మాత్రం ఆదాయపు పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చే ప్రతిపాదనలు ఉండవచ్చని ఆదాయపు పన్ను నిపుణులు నిపుణులు పేర్కొంటున్నారు. ఈసారైనా నిర్మలమ్మ కరుణిస్తారని వేతన జీవులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

మార్చడం అనివార్యం
ప్రపంచంలో ఏర్పడుతున్న అనుచిత పరిస్థితుల వల్ల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రజల వద్ద నగదు నిల్వ తగ్గుతోంది. వారికి ఉపకరించేలా, ఆదాయపు పన్ను వర్తించే పరిమితిని పెంచడం లేదా పన్ను శ్లాబులను సవరించడం లాంటివి చేయవచ్చు. మినహాయింపులు అవసరం లేని, కొత్త విధానాన్ని, ఆదాయపు పన్ను అధికారులు వేతన జీవులకు అలవాటు చేస్తే బాగుంటుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ విధానంలో ఆదాయపు పన్ను 30 శాతంగా ఉండగా, దీనిని 25 శాతానికి తగ్గించాలనే డిమాండ్ వ్యక్తం అవుతున్నది.
సులభం అయినప్పటికీ
పన్ను చెల్లింపుదారులు పాత లేదా కొత్త పన్ను విధానాలలో ఏదో ఒకటి ఎంచుకునే వీలు ఉంటుంది.. పాత పన్ను విధానంలో వివిధ సెక్షన్ల కింద పన్ను మినహాయింపులు క్లెయిమ్ చేసుకోవచ్చు. కొత్త పన్ను విధానంలో వచ్చిన ఆదాయానికి వర్తించే శ్లాబుల ప్రకారం పన్ను చెల్లిస్తే సరిపోతుంది.. కొత్త విధానంలో పన్ను గణన చాలా సులభమే.. కానీ చాలామంది గృహ రుణం వాయిదాలు, బీమా పాలసీలకు ప్రీమియం చెల్లిస్తూ ఉంటారు.. ఈపీఎఫ్, ట్యూషన్ ఫీజు లాంటివి మినహాయింపు జాబితాలోకి వస్తాయి.. కొత్త పన్నుల విధానంలో ఈ వెసలుబాట్లు లేవు.. దీన్ని ఎంచుకునే వారి సంఖ్య తక్కువగా ఉంది.. ఇక ఏ పన్ను విధానాల్లో ఎంతమంది రిటర్న్ లు దాఖలు చేశారనే సమాచారం ప్రభుత్వం అందుబాటులో ఉంచదు.. కానీ కొత్త పన్ను విధానం వల్ల ఆశించిన ప్రయోజనం నెరవేరలేదని సంగతి అర్థమవుతూనే ఉంది.. దీన్ని మరింత మందికి చేరువ చేసేందుకు ప్రభుత్వం చూస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గృహ రుణం తీసుకొని, పన్ను ఆదా పథకాల్లో మదుపు చేయని వారికి కొత్త పన్ను విధానం వల్ల పన్ను భారం తగ్గితే, చాలామంది దీని వైపే మొగ్గుచూపే అవకాశం కనిపిస్తోంది.