Raghunandan Rao - BRS
Raghunandan Rao – BRS: పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిపై తీవ్ర ఆరోపణలు, జాతీయ నాయకులపై విమర్శలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు బీఆర్ఎస్కు దగ్గరవుతున్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది రాజకీయవర్గాల నుంచి. తెలంగాణ రాష్ట్ర రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ విషయంలో అంచనాలు తలక్రిందులు అవుతున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు కారణమో లేక సొంత పార్టీలో ఐక్యత లేకపోవడమో కానీ బీజేపీ పరిస్థితి దారుణంగా తయారైంది. జితేందర్ రెడ్డి, ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, రఘునందన్‌రావు ఇలా ఒక్కొక్కరిగా తమ అసంతృప్తి గళం వినిపిస్తున్నారు. ఒకానొక సమయంలో వీరంతా అధికార బీఆర్ఎస్లో లేదా కాంగ్రెస్‌లో చేరుతారనే చర్చ నడుస్తుంది. తానేం తక్కువ కాదంటూ ప్రెస్ మీట్ పెట్టి మరి పార్టీ నాయకత్వ తీరుపై రఘునందన్‌రావు ఆరోపణలు చేశారు.
బీఆర్ఎస్కు చేరువు..
ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే రఘునందన్‌రావు బీఆర్ఎస్కు దగ్గరవుతున్నారా అనే విషయంపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టిన రఘునందన్‌రావు కేసీఆర్‌పై మాత్రం ఎలాంటి విమర్శలు చేయలేదు. కేసీఆర్ తన గురువు అని గతంలో చెప్పిన రఘునందన్‌రావు ఆయనపై విమర్శలు చేసిన దాఖలాలు లేవు. తాజా రాజకీయపరిణామాల నేపథ్యంలో రఘునందన్ అడుగులు బీఆర్ఎస్ వైపు పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇద్దరి కారణంగా బీజేపీలోకి..
అలాగే ఉమ్మడి మెదక్‌కు చెందిన ఆ ఇద్దరు నేతల కారణంగా రఘునందన్‌రావు పదేళ్ల క్రితం బీజేపీలో చేరారు. ఆ తరువాత తన వాక్చాతుర్యంతో ఫైర్ బ్రాండ్ గా పేరుపొందారు. కానీ అతనికి బీజేపీలో సరైన ప్రాధాన్యత దక్కలేదు. దీనితో ఆయన చూపు అధికార బీఆర్ఎస్వైపు పడ్డట్లు తెలుస్తుంది. అయితే కేటీఆర్ , హరీశ్ రావులపై విమర్శలు గుప్పించే రఘునందన్‌రావు తన గురువు కేసీఆర్ పై ఎలాంటి విమర్శలు చేయలేదు. తాజాగా ఆయన సొంత పార్టీ నేతలపై చేసిన ఆరోపణలు కూడా బీజేపీకి దూరమయ్యేలా అలాగే అధికార పార్టీకి దగ్గరయ్యే వ్యూహంతోనే చేశారన్న టాక్ రాజకీయ వర్గాల్లో కొనసాగుతుంది.
అడ్డుకుంటున్న కీలక మంత్రి..
అయితే రఘునందన్‌రావు రాకను అధికార పార్టీకి చెందిన కీలక మంత్రి అడ్డుకుంటున్నారని సమాచారం. కానీ కేసీఆర్ రంగంలోకి దిగితే ఎప్పుడు ఎలాంటి పరిణామాలైన చోటు చేసుకోవచ్చు. గతంలో బీజేపీలో ఉన్న పరిస్థితి ప్రస్తుతం లేదనేది నమ్మలేని నిజం. అంతేగాక మరికొన్ని నెలల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఉండగా నాయకులు తమ భవిష్యత్తుపై దృష్టి సారించారు. అందుకే అప్పటివరకు సైలెంట్‌గా ఉన్నరఘునందన్ ఒక్కసారిగా తనలో ఉన్న అసంతృప్తిని వ్యక్తం చేశారు.
మెదక్ ఎంపీగా బరిలో..
రఘునందన్ చేరికకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీచేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈమేరకు సంద్రింపులు కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే అధిష్టానంపై తాను చేసినట్లు చెబుతున్న ఆరోపణలను రఘునందన్ ఖండించారు. తాను అనని మాటలను అన్నట్లు మీడియాలో ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. అధిష్టానంపై తాను ఎప్పుడూ విమర్శలు చేయనని తెలిపారు. పార్టీ సిద్దాంతానికి కట్టుబడే కార్యకర్తనని చెప్పుకొచ్చారు.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Raghunandan rao into brs medak mp ticket confirmed
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com