Ex Minister Mallareddy : జగదీష్ రెడ్డి పై వేటు వేయాలని ఇప్పటికే మంత్రి సీతక్క సభ దృష్టికి తీసుకెళ్లారు. ఎథిక్స్ కమిటీ దీనిపై దృష్టి సారించాలని ఆమె కోరారు. బుధవారం సాయంత్రం ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లిన నేపథ్యంలో గురువారం శాసనసభకు రాలేదు. గురువారం శాసనసభలో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పలు అంశాలపై మాట్లాడారు.. రీజినల్ రింగ్ రోడ్డుతో పాటు, హైదరాబాదును మరింతగా విస్తరించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నది. ఇందులో భాగంగా శివారు గ్రామాలను కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కలపడానికి సిద్ధమవుతోంది. ఈ గ్రామాలు మేడ్చల్ రంగారెడ్డి జిల్లా పరిధిలో ఎక్కువగా ఉన్నాయి. ఈ నియోజకవర్గానికి మల్లారెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మేడ్చల్ నియోజకవర్గంలోని గ్రామాలు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం జరిగితే.. అప్పుడిక అక్కడ సర్పంచ్, ఎంపిటిసి ఎన్నికలు జరపడానికి అవకాశం ఉండదు. అక్కడి కేవలం కార్పొరేటర్లు మాత్రమే ఉంటారు. అందువల్లే ప్రభుత్వం ఈ ప్రతిపాదనను విరమించుకోవాలని మల్లారెడ్డి శాసనసభ వేదికగా కోరారు. ” ఇప్పుడిప్పుడే నా నియోజకవర్గం అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికీ నా నియోజకవర్గ పరిధిలోని చాలా గ్రామాలలో గ్రామీణ వాతావరణం నెలకొంది. ఇంకా పెంకుటిల్లు కనిపిస్తున్నాయి. చాలామందికి సరైన బాత్ రూం లు కూడా లేవు. అలాంటప్పుడు ప్రభుత్వం ఆ గ్రామాలలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం చేస్తే.. పన్నులు పెరుగుతాయి. హైదరాబాదులోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ తరహాలోనే ఇక్కడ కూడా పన్నులు వసూలు చేస్తారు. ఇలా వసూలు చేసిన డబ్బుతో బంజరా హిల్స్, జూబ్లీహిల్స్ లో మాత్రమే అభివృద్ధి పనులు చేపడతారు. అప్పుడు మా ప్రాంతాలు అభివృద్ధికి దూరమవుతాయని” మల్లారెడ్డి వ్యాఖ్యానించారు.
Also Read : తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం: స్పీకర్‌పై జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలతో వాగ్వాదం
హైదరాబాద్ ను నాశనం చేశారు
“హైదరాబాదులోని స్థిరాస్తి వ్యాపారం ఒకప్పుడు ఒక రేంజ్ లో ఉండేది. దేశంలోనే ఎక్కువ వ్యాపారం ఇక్కడ జరుగుతుండేది. గృహాలు, వెంచర్లు భారీగా ఏర్పాటయ్యేవి. వాటిని కొనుగోలు చేయడానికి చాలామంది పోటీ పడుతూ ఉండేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. హైడ్రా అనే వ్యవస్థను స్థిరపైకి తీసుకొచ్చి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మొత్తాన్ని నాశనం చేశారు. రాత్రికి రాత్రి నోటీసులు ఇచ్చి.. శుక్రవారం సాయంత్రం కూల కొడుతున్నారు. శనివారం, ఆదివారం కోర్టులకు సెలవు కాబట్టి.. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. ఏవైనా ఆక్రమణలు చేసి ఉంటే.. వారికి ప్రభుత్వం నోటీసులు ఇస్తే బాగుంటుంది. అలాకాకుండా రాత్రికి రాత్రే కూల కొట్టడం ఎంతవరకు న్యాయం.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ను హైడ్రా సర్వనాశనం చేసింది. ఇప్పటికైనా ప్రభుత్వం కాస్త వెనుకడుగు వేస్తే బాగుంటుందని” మల్లారెడ్డి కోరారు. హైడ్రా గురించి మాట్లాడుతున్నప్పుడు మల్లారెడ్డి దాదాపు ఏడ్చినంత పని చేశారు. అంతేకాదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రా మల్లారెడ్డికి సంబంధించిన కాలేజీలలో కొన్ని నిర్మాణాలను పడగొట్టింది. అందువల్లే మల్లారెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేశారని అసెంబ్లీ లాబీలో గుసగుసలు వినిపించాయి.
Also Read : తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు గులాబీ బాస్.. గంట ముందుగానే అసెంబ్లీకి రాక..