Pawan Kalyan: రాజకీయాల్లో పవన్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతానికి ఏపీ రాజకీయాలపై ఫుల్ ఫోకస్ పెట్టారు. దాదాపు అన్ని సినిమాల షూటింగ్ లకు విరామం ప్రకటించారు. హరిహర వీరమల్లు తో పాటు మరో రెండు సినిమాలకు సంబంధించి షూటింగ్ చేయాల్సి ఉంది. ఎన్నికల తరువాతే ఈ సినిమాల చిత్రీకరణ తిరిగి ప్రారంభం కానుంది. అంతవరకు పవన్ ఫోకస్ ఏపీ ఎన్నికలపైనే పెట్టారు. అయితే ఎన్నికల్లో బిజీగా ఉండడంతో ఒక అరుదైన గౌరవాన్ని సైతం వదులుకున్నారు. సున్నితంగా తిరస్కరించారు.
తమిళనాడులోని వేల్స్ యూనివర్సిటీ పవన్ కళ్యాణ్ కి గౌరవ డాక్టరేట్ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఆయన పేరును ఎంపిక చేసింది. పవన్ చేసిన సహాయక, సేవా కార్యక్రమాలను పరిగణలోకి తీసుకొని ఎంపిక చేసినట్లు ప్రకటించింది. జనవరిలో జరగబోయే తమ యూనివర్సిటీ 14వ స్నాతకోత్సవాలకు హాజరై డాక్టరేట్ అందుకోవాలని ఆహ్వానించింది. దీంతో జనసేన శ్రేణుల్లో ఆనందం వెల్లివిరిసింది. తమ అధినేతకు అరుదైన గౌరవం లభించిందని వారు ఎంతగానో సంతోషించారు. కానీ పవర్ స్టార్ మాత్రం సున్నితంగా తిరస్కరించడంతో యూనివర్సిటీ వర్గాలు ఒక్కసారిగా షాక్ కు గురయ్యాయి.
అయితే గౌరవంగా ఈ విషయాన్ని సంబంధిత యూనివర్సిటీ యాజమాన్యానికి తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ ప్రత్యేక లేఖ రాశారు. తనను గౌరవ డాక్టరేట్ కి ఎంపిక చేయడం సంతోషంగా ఉందని పవన్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ డాక్టరేట్ ను ఒక గౌరవంగా భావిస్తున్నానని చెప్పుకొచ్చారు. అయితే తనకంటే గొప్పవారు ఈ సమాజంలో చాలామంది ఉన్నారని.. వారిని గుర్తించి ఈ డాక్టరేట్ ను ప్రధానం చేయాలని కోరారు. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నందున.. రాజకీయాల్లో బిజీగా ఉన్నట్లు తెలిపారు. వేల్స్ యూనివర్సిటీ 14వ స్నాతకోత్సవానికి హాజరు కాలేకపోతున్నట్టు లేఖలో పేర్కొన్నారు. ఇటువంటి అరుదైన అవకాశాలు రావడం చాలా అరుదు అని.. కానీ గౌరవంగా తిరస్కరించడం.. హుందాగా లేఖ రాయడం పవన్ కళ్యాణ్ కు మాత్రమే సాధ్యమని ఆయన అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.