Site icon OkTelugu

Vetlapalem Fire Accident: బాధితులకు కావాల్సింది భరోసా.. బల ప్రదర్శన కాదు!

Vetlapalem Fire Accident

Vetlapalem Fire Accident

Vetlapalem Fire Accident: ఏదైనా ప్రమాదం బాధితులకు అండగా నిలవాలి. సహాయక చర్యల్లో పాల్గొనాలి.. తోచినంత సాయం చేయాలి. అయితే ఈ విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఒక వింత అలవాటు ఉంది. ప్రమాదం జరిగినప్పుడు కనిపించరు… సహాయ చర్యల్లో పాల్గొనరు. అక్కడకు ఒకటి రెండు రోజుల తర్వాత ఘటనా స్థలానికి చేరుకొని అయ్యో.. ప్రభుత్వ సహాయ చర్యలు బాగాలేదు.. ప్రభుత్వ పరిహారం అందలేదు.. వంటి మాటలతో ఎక్కువగా సరిపెడుతుంటారు. అయితే ఇప్పుడు గోదావరి జిల్లాలో బాణసంచా పేలుడుకు సంబంధించి ఘటన నిన్న జరిగింది. ఒక్కరంటే ఒక్క వైసీపీ నేత కూడా అటువైపు కనిపించలేదు. కానీ రేపు భారీ కాన్వాయ్ తో తమ అధినేత జగన్మోహన్ రెడ్డిని వెంటబెట్టుకుని ఘటనా స్థలానికి చేరుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. బాధితులను పరామర్శించేది ఐదు నిమిషాలు మాత్రమే. కానీ షో మాత్రం గంటల వరకు కొనసాగనుంది. అలా తాడేపల్లిలో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: లోకేష్ కు అలా అవకాశం ఇచ్చిన చంద్రబాబు!

* రాజకీయ కోణం తగదు..
ప్రమాదం అనేది చెప్పి రాదు.. అలాగని నిర్లక్ష్యం చేయకూడదు. కానీ నిన్న వేట్లపాలెంలో( vettalapalem) జరిగిన ప్రమాదం దురదృష్టకరం. దానిని రాజకీయ కోణంలో ఎంత మాత్రం చూడకూడదు. అలా చూస్తే దాని కంటే మహా పాపం ఉండదు. ఘటన జరిగి దాదాపు 24 గంటలు అవుతోంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు ఘటనా స్థలానికి వెళ్లారు. బాధితులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం అందించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించారు. అయితే ఏదైనా ఘటన జరిగినప్పుడు గంటల వ్యవధిలో పరామర్శిస్తేనే దానికి బాధ్యత అంటారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీరుబాటుగా రేపు బాధితుల పరామర్శకు వెళ్తున్నారు. అయితే ఆయన పరామర్శలపై అనేక రకాల విమర్శలు ఉన్నాయి. బాధితులతో ఆయన కేవలం ఐదు నిమిషాలు మాత్రమే గడుపుతారు. కానీ దానికోసం చేసే హంగామా మాత్రం గంటల తరబడి సాగుతుంది. రోడ్లను దిగ్బందించడం, వేలాది మందితో బలప్రదర్శనకు దిగడం పరిపాటైన విద్యగా మారింది.

* అటువంటివి చేయకూడదు..
ఏదైనా ప్రమాదం( accident) జరిగినప్పుడు బాధితులను నిశ్శబ్దంగా వెళ్లి సాయం చేయవచ్చు. కానీ భారీ ఎలివేషన్స్ నడుమ సాయం చేస్తుంటారు. విషాద ఘటనల సమయంలో బాధితుల పరామర్శకు వెళ్ళినప్పుడు పూల వర్షాలు, నినాదాలు, రప్పా రప్పా ఫ్లెక్సీల మధ్య యాత్రలు సాగిస్తుంటారు జగన్ మోహన్ రెడ్డి. పరామర్శించే క్రమంలో రాజకీయం చేయడం మాత్రం ఎంత మాత్రం తగదు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి పట్ల ఒక రకమైన విమర్శ ఉంది. నిన్ననే వేట్లపాలెం లో ఘటన జరిగింది. ఆ సమయంలో ఒక్క వైసీపీ నేత కూడా అటువైపు చూడలేదు. అయితే ఇప్పుడు అధినేతను తీసుకొని రేపు బయలుదేరుతున్నారు. ఘటన జరిగినప్పుడు అధికారులు నానా హైరానా పడుతుంటారు. దానికి మించి అన్నట్టు జగన్ పర్యటన సమయంలో ఉంటుంది. అయితే గతంలో జరిగిన ఘటనలను గుణపాఠాలుగా మార్చుకొని.. బాధితులకు ఆర్థిక సాయంతో పాటు భరోసా ఇచ్చే ప్రయత్నం చేయాలి. బలప్రదర్శనకు దిగితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఇష్టపడుతుందేమో కానీ.. సామాన్యులకు కాదన్న విషయాన్ని గుర్తించుకోవాలి.

Exit mobile version