Modi- Indira Gandhi
Modi- Indira Gandhi: సాధారణంగా ప్లస్, మైనస్ అనేవి విరుద్ధమైన ఆవేశాలు కలిగి ఉంటాయి. అదే సైన్స్ పరిభాషకు వచ్చేసరికి ఒక్కో ధ్రువానికి ఒక్కో రకమైన శక్తి ఉంటుంది.. వీటిని పరస్పరం అనుసంధానం చేసినప్పుడు ఒక రకమైన సారూప్యత మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇలాగే భిన్న ధ్రువాలుగా కనిపించే వ్యక్తులు మొత్తం ఆ తరహా భావాలను పుణికి పుచ్చుకుంటే… వేరు వేరు రంగులు కలబోసుకున్నప్పటికీ ఒకే తానులో గుడ్డ ముక్కల్లా కనిపిస్తే… అద్భుతం అనిపించకమనదు. పైగా ఇంతటి సహజత్వం ఎలా వచ్చింది అనే ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఉదాహరణకు అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ పనిచేసినప్పుడు రకరకాల అంతర్యుద్ధాలకు కాలు దువ్వాడు. వీటిని ప్రస్తుతం ఉన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అప్పట్లో వ్యతిరేకించాడు. అదేంటో గాని ఆయన అధ్యక్షుడయిన తర్వాత అలాంటి అంతర్యుద్దాలకు మద్దతు ఇస్తున్నాడు. అంతేకాదు ఉక్రెయిన్, రష్యా యుద్ధంలో నేరుగా ఉక్రెయిన్ కు మద్దతు పలుకుతున్నాడు. అంటే అధికారం అనేది ఒక అవకాశం.. దానికోసం నేతలు ఎలాంటి పనయినా చేస్తారు.. ఎలాంటి మాటలయినా మాట్లాడతారు. ప్రజల దృష్టి మళ్లించేందుకు దానికి అత్యంత తెలివిగా ” దేశ ప్రయోజనాలు” అనే మింట్ ఫ్లేవర్ పూస్తారు.
నరేంద్ర మోదీ, ఇందిరా అదే లెక్క
ఇక అమెరికా పక్కన పెట్టి మన దేశం విషయానికి వస్తే మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ, ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విషయాన్ని తీసుకుంటే.. ఇద్దరిలో ఎలాంటి పోలిక ఉన్నట్టు మనకు కనిపించదు. కానీ లోతుగా పరిశీలిస్తే అసలు విషయం అర్థం అవుతుంది. వాస్తవానికి ఇద్దరు భిన్న ధ్రువాలు లాంటి పార్టీలకు చెందినవారు. ఇందిరా గాంధీ తన తండ్రి సోషలిస్టు ఆలోచనల ప్రభావంతో ఇందిరాగాంధీ కొంతకాలం వామపక్ష రాజకీయాల వైపు మొగ్గినట్టు చరిత్ర చెబుతోంది. అయితే అందులో రాజకీయ అవసరం ఎంత? రాజకీయ ఆదర్శంగా దాన్ని స్వీకరించడంలో నిజాయితీ ఎంత? అనే ప్రశ్నలు అప్పట్లో ఉత్పన్నమయ్యాయి. అయితే ఆదర్శం కంటే రాజకీయ అవసరమే ఎక్కువ అని చాలా సందర్భాల్లో తేలింది. ఆదర్శం అనే మెరుగు లేకుండా ఏ రాజకీయమూ ఉండదు. ఉల్లి పొరల్లాగా రాజకీయాల చుట్టూ ఆదర్శాలు అతుక్కుని ఉంటాయి. అయితే ఈ పొరలను ఒక్కొక్కటిగా వెలికి తీసుకుంటూ వెళితే అసలు ఆదర్శాలు మనకు కనిపిస్తాయి. ఇప్పుడు వాటిని ఆదర్శాలు అనేకంటే అవసరాలు అనడం సబబు.
సోషలిజం అంటే ఎక్కడో కాలుతుంది
ఇక నరేంద్రుడి విషయాన్ని ప్రస్తావనకు తీసుకుంటే సోషలిజం అనే పేరు ఎత్తితే ఆయనకు ఎక్కడో కాలుతుంది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నేపథ్యం నుంచే నరేంద్ర మోదీ ఎదిగారు. క్రిస్టియన్లు, ముస్లింలు, కమ్యూనిస్టులు దేశానికి పెద్ద శత్రువులని ఆర్ఎస్ఎస్ అగ్రనేత గోల్వాల్కర్ ఒకప్పుడు సూత్రీకరించారు. ప్రస్తుతం సంఘ్ నుంచి క్రైస్తవుల గురించి అంత కటువైన మాటలు రావడం లేదు. ఇక మిగతా వాటి గురించి బిజెపి, ఆర్ఎస్ఎస్ ధోరణిలో ఎటువంటి మార్పు లేదు. హిందూ సంస్కృతి ఆధారంగా జాతీయ వాదానికి ఒక రూపం ఇచ్చి ప్రపంచ పటంలో భారతదేశాన్ని ఒక ప్రబల శక్తిగా మార్చడం ఆర్ఎస్ఎస్ ఆదర్శాలలో ప్రధానమైనది. ఇక పైకి చెప్పే ఆదర్శాలను పరిగణనకు తీసుకుంటే ఇందిర, మోదీ భిన్న వ్యక్తులు లాగే కనిపిస్తూ ఉంటారు.. అయితే లోతుగా చూస్తే కీలక విషయాల్లో ఇద్దరికీ సారూప్యత కనిపిస్తూ ఉంటుంది. వీరిద్దరు కూడా నెహ్రూ అనంతరం దేశ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపించారు. ఇందిర జీవితం ముగిసిపోయినప్పటికీ.. నరేంద్ర మోదీ ఇంకా చాలా విషయాలలో కలగజేసుకుంటూనే ఉన్నారు.
తిప్పిన మలుపు మామూలుది కాదు
దేశ రాజకీయాలను ఇందిరా గాంధీ కీలకమైన మలుపు తిప్పారు. కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వం రెండింటి పైనా తీవ్రమైన ప్రభావాన్ని కలుగజేశారు.. ఇక భారత రాజకీయాలను లోతుగా పరిశీలించిన పాల్ బ్రాస్ లాంటి నిపుణులు దీని గురించి చాలా విపులంగా వివరించారు. ” ఇందిరా గాంధీ కంటే ముందు కాంగ్రెస్ పార్టీలో ఏకఛత్రాధిపత్యం లేదు. కింది నుంచి పై స్థాయి వరకు ఎంతో కొంత ప్రజాస్వామ్యం కనిపించేది. సొంత బలం ఉన్న నేతలు ప్రతి రాష్ట్రంలోనూ ఉండేవారు. పీసీసీ, సీఎల్పీ నాయకత్వ స్థానాలకు ఎన్నికలు జరిపిన సందర్భాలు చాలా ఉండేవి.” అని ఆయన వివరించారు. ఇక కాంగ్రెస్ పార్టీలో స్థానికంగా ఏర్పడే సమస్యలకు పరిష్కార మార్గాలు కూడా పలు సందర్భాల్లో రాష్ట్రస్థాయి నాయకులే కనుగొనేవారు. అక్కడిదాకా ఎందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో అంతటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ మాటే చెల్లుబాటు కానీ పరిస్థితి ఉండేది. నెహ్రూ తనకు ఇష్టం లేక పోయినప్పటికీ మెజారిటీ అభిప్రాయాలకు విలువ ఇచ్చేవారు. చివరికి అంబేద్కర్ తయారు చేసిన హిందూ కోడ్ బిల్లు విషయంలోనూ నెహ్రూ అదే విధంగా వెనకడుగు వేశారు. నాటి రోజుల్లో ఎన్నికల నిర్వహణ, నిధుల సేకరణ, ప్రచారం అంటి విషయాల్లో స్థానిక నేతలు కీలకపాత్ర పోషించేవారు. నెహ్రూ గతించిన తర్వాత పార్టీలో సమూల మార్పులు చోటుచేసుకున్నాయి.
ఇందిర పవర్ హౌస్ అయ్యారు
ఇందిరా గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఇక కాంగ్రెస్ పార్టీ, ఆమె ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం చెప్పుచేతల్లోకి వెళ్లిపోయింది. ఇందిరా గాంధీ ప్రజలకు తనకు మధ్య బలమైన రాష్ట్రస్థాయి నాయకత్వాన్ని లేకుండా చేశారు. గరీబీ హఠావో, రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయకరణ, రుణ మేళాలు, గుత్తాధిపత్య వ్యాపార నియంత్రణ లాంటి నినాదాలతో తనను తాను దీనజన బాంధవురాలుగా ప్రచారం చేసుకున్నారు. అన్ని స్థాయిల్లో పార్టీ ఎన్నికలకు తిలోదకాలు ఇచ్చి సీల్డ్ కవర్ సంస్కృతి ప్రవేశపెట్టారు. ముఖ్యమంత్రులను ఇష్టం వచ్చినట్టు మార్చారు. ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను ఆర్టికల్ 356 ఆసరాతో కూల్చివేశారు. లైసెన్స్ అండ్ పర్మిట్ రాజ్ ను బలోపేతం చేసి పరిశ్రమలను కట్టడి చేశారు. అంతేకాదు వ్యక్తి పూజను పరాకాష్టకు చేర్చారు. స్వీయ ప్రేమ ( నార్సిజం) అవధులను దాటిపోయింది. వీరవిధేయులతో పార్టీ నిండిపోయింది.. అయితే ఇలాంటి మార్పులు వైరిపక్షం బలోపేతం అయ్యేందుకు ఉపకరించాయి. అలా ఏర్పడిందే భారతీయ జనతా పార్టీ.
నరేంద్రుడు కూడా అలాగే..
ఇక ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా తన కేంద్రంగా అన్ని వ్యవస్థలను మార్చుకున్నారు. ప్రస్తుత పరిస్థితులలో ఇద్దరి మధ్య సారూప్యత కనిపిస్తోంది. అయితే కాంగ్రెస్ కంటే బిజెపి చరిత్ర భిన్నమైంది. అందుకే అది విభిన్న భావజాలాలకు ఎప్పుడు అవకాశం ఇవ్వలేదు. హిందూ సంస్కృతిని వ్యతిరేకించే ఏ భావజాలానికి కూడా ఆర్ఎస్ఎస్ మద్దతు ఇవ్వదు. మత ప్రసక్తే లేని లౌకికవాదం కూడా పరివార్ కు రుచించదు. సర్వమత సమాదరణను. ప్రబోధించే భారత మార్క్ లౌకికవాదం పై కూడా సానుకూలత లేదు. ఈ తరహా లౌకిక వాదాన్ని నిజ స్ఫూర్తితో అంగీకరిస్తే హిందూ ఆధిక్య జాతీయవాదానికి అర్థం ఉండదు. భావజాలంపరంగా ఇందిరకులేని సౌలభ్యం మోదీకి మరింత ఉన్నది. అందుకే మోదీ వ్యక్తి పూజ ఇందిరకు మించిన స్థాయికి చేరుతోంది. అయితే వ్యక్తి పూజ, అధికార కేంద్రీకరణ ఉన్నచోట పార్టీ యంత్రాంగం బలహీనపడటం సర్వసాధారణం. కానీ బిజెపికి ఇంకా ఆ పరిస్థితి రాలేదు. మునుముందు ఇంకా ఆ పరిస్థితి రాదని చెప్పలేం. ఈ క్రమం ఇప్పటికే మొదలైందని కొన్ని కొన్ని సంఘటనలు నిరూపిస్తున్నాయి. కొంత మంది ముఖ్యమంత్రులను మార్చడమే కూడా ఇందుకు ఓ నిదర్శనం. కర్ణాటక ఎన్నికల్లో బిజెపి అధిష్టానం దాదాపుగా స్థానిక నాయకత్వాన్ని పక్కన పెట్టింది. ఇలా చెప్పుకుంటూ పోతే మోదీ తీసుకున్న నిర్ణయాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఒక గాలివానకు వటవృక్షం కూలినట్టు, ఇప్పుడు కర్ణాటక ఓటమి వల్ల మోదీ పడి పోతాడా? లేక ఉత్తుంగ తరంగంలా ఎగిసి పడతాడా? అనేది కాలమే సమాధానం చెప్పాలి.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Modi and indira gandhis impact on indian politics
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com