Telangana Liberation Day
Telangana Liberation Day: “నవయుగంబున నాజీ వృత్తుల
నగ్న నృత్యమింకెన్నాళ్లు?
పోలీసు అండను దౌర్జన్యాలు
పోషణ పొందేదెన్నాళ్లు?
దమననీతితో దౌర్జన్యాలకు
దాగిలిమూతలింకెన్నాళ్లు?
కంచెయే చేను మేయుచుండగా
కాచకుండుటింకెన్నాళ్లు?”
.. అంటూ నిజాం పాలనలోని దుర్మార్గాలను నిలదీశారు కాళోజీ. దశాబ్దాల బానిస సంకెళ్లను తెంచేందుకు సంస్థానం ప్రజలు కత్తుల వంతెనలపై కవాతు చేశారు. హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసేందుకు అంగీకరించని నిజాం మొండితనం, ఖాసిం రజ్వీ సారథ్యంలోని రజాకార్ల దుర్మార్గాలపై సమరభేరి మోగించారు. జాతీయ పార్టీలతోపాటు అనేక ప్రజా సంఘాల అలుపెరగని పోరాటానికి భారత సైనిక చర్య తోడయింది. 1948 సెప్టెంబరు 13న భారత సైన్యం హైదరాబాద్ సంస్థానంపై యుద్ధభేరి మోగించింది. కేవలం ఐదు రోజుల్లోనే నిజాం, రజాకార్ల సేనల్ని ఓడించి, సెప్టెంబరు 17న హైదరాబాద్ సంస్థానానికి నిజాం నుంచి స్వేచ్ఛ కల్పించింది.
1724లో నిజాం ఉల్ ముల్క్ అసఫ్ ఝా ను ఏర్పాటు చేశాడు
సిరిసంపదల సంస్థానం దక్కన్ పీఠభూమి అంతటా విస్తరించి ఉన్న హైదరాబాద్ రాష్ట్రాన్ని మొగలాయుల పాలన అంతరించిన వెంటనే 1724లో నిజాం ఉల్ ముల్క్ అసఫ్ ఝా ఏర్పాటు చేశారు. దేశంలోని సంస్థానాల్లో హైదరాబాద్ సంస్థానమే సిరిసంపదలతో తులతూగుతూ ఉండేది. 2,14,000 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న హైదరాబాద్ సంస్థానం జనాభా కోటీ 63 లక్షలు. సంస్థానానికి సొంత సైన్యం, విమాన సర్వీసులు, రైల్వే, టెలి కమ్యూనికేషన్ వ్యవస్థ ఉండేది. సొంత కరెన్సీ, రేడియో వ్యవస్థ కూడా ఉండేదంటే సంస్థానం వైభవాన్ని అర్థం చేసుకోవచ్చు. నిజాం ఉస్మాన్ అలీఖాన్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా పేరొందాడు. పూర్వీకుల నుంచి వచ్చిన కోట్ల విలువ చేసే రత్నాలు, ఆభరణాలతోపాటు ఏటా పన్నులు, భరణాల రూపంలో కోట్ల రూపాయలు వచ్చి పడేవి. సంస్థానంలో హిందువులు అధిక సంఖ్యలో ఉన్నా అన్ని రంగాల్లో ముస్లింలది పైచేయిగా ఉండేది.
భారత ప్రభుత్వం విశ్వ ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది
శతాబ్దాల బ్రిటిష్ పాలన నుంచి భారతదేశానికి స్వాతంత్య్రం లభించిన మధుర క్షణాలవి. భారతదేశంతో ఉంటారో లేక పాకిస్థాన్‌తో కలుస్తారో తేల్చుకోవలసిందిగా దేశవ్యాప్తంగా ఉన్న 565 సంస్థానాలను ప్రభుత్వం కోరింది. ఎవరితో విలీనం కాకుండా స్వతంత్ర రాజ్యంగా ఉండాలని నిజాం నిర్ణయించాడు. దాంతో, యావత్ భారతావని స్వేచ్ఛా పవనాలతో పులకించిపోతుండగా హైదరాబాద్ సంస్థానంలో మాత్రం నిర్వేదం అలముకుంది. నిజాంకు నచ్చచెప్పేందుకు భారత ప్రభుత్వం విశ్వ ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఖాసిం రజ్వీ సారథ్యంలోని రజాకార్ల దండును నమ్ముకుని భారత ప్రభుత్వానికే నిజాం సవాలు విసిరాడు. పాకిస్థాన్‌తో చేతులు కలిపే ప్రయత్నం చేశాడు. ఫలితంగా, సంస్థానంలోని కోటిన్నరకుపైగా ప్రజలు 1947 ఆగస్టు 15 నుంచి 13 మాసాలపాటు ప్రత్యక్ష నరకాన్ని అనుభవించారు.
భారత ప్రభుత్వానికి తలవంచి..
సంస్థానాన్ని కాపాడుకునేందుకు నిజాం శతవిధాలా ప్రయత్నించాడు. హైదరాబాద్ సంస్థానాన్ని కామన్‌వెల్త్ దేశాల్లో ఒకదానిగా పరిగణించాలని బ్రిటిష్ ప్రభుత్వాన్ని కోరాడు. ఫలితం లేకపోయింది. భారత ప్రభుత్వం నుంచి ఒత్తిడి పెరగటంతో ఐక్య రాజ్య సమితి జోక్యం చేసుకునేలా చొరవ చూపాలంటూ అప్పటి అమెరికా అధ్యక్షుడు హెన్రీ ట్రూమన్‌ను ఆశ్రయించాడు.
మత ఘర్షణలు
అదే సమయంలో, సంస్థానం మత ఘర్షణలతో అట్టుడకడం ప్రారంభమైంది. అధిక సంఖ్యలో ఉన్న హిందువులు తన ప్రభుత్వాన్ని పడగొడతారనే భయంతో తీవ్రవాద ఉద్యమనేత ఖాసిం రజ్వీని ఆశ్రయించాడు నిజాం. రజాకార్ల పేరిట రజ్వీ రెండు లక్షల మంది సుశిక్షితులైన సైనికుల్ని తయారు చేశాడు. రజాకార్ అంటే జీతం లేకుండా పనిచేసే స్వచ్ఛంద సేవకుడు. కానీ, రజ్వీ రజాకార్లు హిందువులపై దాడులు చేసి, ఆస్తుల్ని ధ్వంసం చేశారు. వారి దురాగతాలకు సుమారు 150 గ్రామాల్లో విధ్వంస కాండ జరిగింది. ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. నిజాం సైనికులతోపాటు రజాకార్లు పెట్టే బాధలు భరించలేక ప్రజలు నిజాం సేనలను, రజాకార్లను ఎదిరించారు. రాచి రంపాన పెడుతున్న హిందూ, ముస్లిం పెత్తందార్లపై భారత కమ్యూనిస్టు పార్టీ, ఆంధ్ర మహాసభ అండతో సంస్థానం ప్రజలు సమర శంఖం పూరించారు. నిజాంకు వ్యతిరేకంగా ఉద్యమ స్ఫూర్తిని రగిలించడంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కీలకపాత్ర పోషించింది. కాంగ్రె్‌సతోపాటు పలు ప్రజా సంఘాలు నిజాంకు వ్యతిరేకంగా సమర శంఖం పూరించాయి. 1947 డిసెంబరు 4న ఆర్యసమాజ్ సభ్యుడు నారాయణరావు పవార్ బాంబు దాడి చేసి నిజాంను అంతమొందించేందుకు విఫలయత్నం చేశాడు. హైదరాబాద్ సంస్థానంలో అత్యధిక సంఖ్యాకులు భారతదేశంలో విలీనం కావాలని కోరుకుంటున్నా.. తన వైఖరిపై అన్ని వర్గాల్లో నిరసన పెల్లుబుకుతున్నా నిజాం మాత్రం మొండిగా వ్యవహరించసాగాడు.
పాక్ ను సమర్తించేందుకు..
భవిష్యత్తులో భారతదేశంపై పాకిస్థాన్ యుద్ధానికి దిగితే పాక్‌ను సమర్థించేందుకు నిజాం సన్నాహాలు చేసుకుంటున్నాడని కూడా ప్రభుత్వానికి సమాచారం అందింది. హైదరాబాద్ సంస్థానం భారత ప్రభుత్వ గుండెలపై రాచపుండులా మారిందని, శస్త్ర చికిత్స ద్వారా మాత్రమే దాన్ని తొలగించడం సాధ్యమని అప్పటి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ నిర్ణయించారు. 1948 సెప్టెంబరు 13న భారత సైన్యం హైదరాబాద్ సంస్థానంపై యుద్ధభేరి మోగించింది. ఐదు రోజులపాటు భీకరంగా జరిగిన సమరంలో నిజాం, రజాకార్ల సేనలు మట్టికరిచాయి. ఎంతో ప్రాణ నష్టం సంభవించింది. సెప్టెంబరు 17న నిజాం తన ఓటమిని అంగీకరించాడు. రజ్వీని భద్రతా దళాలు అరెస్టు చేశాయి. సెప్టెంబరు 17 సాయంత్రం 4 గంటలకు సికింద్రాబాద్‌లోని పెరేడ్ గ్రౌండ్స్‌లో నిజాం సేనల లొంగుబాటు లాంఛనంగా జరిగింది. భారత సైన్యాన్ని అభినందించేందుకు వేలాదిగా ప్రజలు తరలి వచ్చారు. చిన్నారుల నుంచి పెద్దల దాకా ప్రతి ఒక్కరూ త్రివర్ణ పతాకాన్ని చేతబూని భారత సైన్యానికి అభినందనలు తెలిపారు. హైదరాబాద్ సంస్థానానికి విమోచన లభించింది. కోటిన్నర మందికి పైగా ప్రజలకు స్వేచ్ఛ లభించింది.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Memories of freedom fighters on september 17 telangana liberation day
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com