Vijayasai Reddy: వైఎస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీలో ఒక వెలుగు వెలిగారు విజయసాయిరెడ్డి. జగన్మోహన్ రెడ్డిని రాజకీయాల్లోకి రాక ముందు నుంచే అనుసరించారు. రాజకీయాల్లోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి కేసుల బారిన పడ్డారు. అవే కేసుల్లో విజయసాయి రెడ్డి సైతం అరెస్టయ్యారు. జగన్ తో పాటు జైల్లో ఉన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టడంలో కూడా విజయసాయిరెడ్డి పాత్ర ఉంది. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు జగన్మోహన్ రెడ్డికి మించి కష్టపడ్డారు విజయసాయిరెడ్డి. అటువంటి విజయసాయిరెడ్డి ఉన్నఫలంగా పార్టీకి దూరమయ్యారు. పార్టీతో పాటు రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. వ్యవసాయం చేసుకుంటానని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులతో చేతులు కలిపారు అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఆయన కదలికలు అలానే ఉన్నాయి.
Also Read: మీ సేవలు చాలు.. మాజీ మంత్రికి తేల్చి చెప్పిన జగన్!
* అప్పట్లో వెనక్కి.. విజయసాయిరెడ్డి( Vijaya Sai Reddy) బిజెపిలో చేరుతారని ప్రచారం జరిగింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సమయంలో ప్రముఖంగా ఇదే మాట వినిపించింది. అయితే అప్పటికప్పుడు బిజెపిలో చేరితే తప్పుడు సంకేతాలు వెళ్తాయని విజయసాయిరెడ్డి వెనక్కి తగ్గినట్లు సమాచారం. అయితే తాజాగా ఆయన బిజెపిలోకి వెళ్తారని.. బిజెపి ద్వారా రాజ్యసభ పదవి దక్కించుకుంటారని.. ఆయన ఖాళీ చేసిన పదవిని ఆయనతోనే భర్తీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. దీనికి అనుగుణంగానే ప్రకటనలు వచ్చాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడం ద్వారా విజయసాయిరెడ్డి ప్రత్యర్థులకు దగ్గరవుతున్నారు. మొన్న ఆ మధ్యన లిక్కర్ స్కాం పై సంచలన వ్యాఖ్యలు చేశారు విజయసాయిరెడ్డి. అవసరం అనుకుంటే ఆధారాలతో సహా ఇస్తానని అప్పట్లో వ్యాఖ్యానించారు. అయితే అది వ్యూహాత్మకంగా కూటమి వైపు అడుగులేస్తున్నట్లు అని తేలిపోయింది.
* చంద్రబాబు నుంచి అభ్యంతరాలు..
అయితే విజయసాయిరెడ్డి బిజెపిలో( BJP) చేరేందుకు టిడిపి అడ్డంకిగా నిలిచిందన్న టాక్ ఉంది. చంద్రబాబు నుంచి అభ్యంతరాలు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అందుకే కేంద్ర పెద్దలు చంద్రబాబుతో చర్చలు జరిపి విజయసాయిరెడ్డి విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటారని సమాచారం. విజయసాయిరెడ్డిని బిజెపిలో చేర్చుకోవడం ద్వారా వైసీపీకి చెక్ పెట్టొచ్చని.. గత ప్రభుత్వంలోని కొన్ని కీలక కుంభకోణాల విషయంలో ఆధారాలు లభించేలా విజయసాయిరెడ్డి సహకరిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే విజయసాయిరెడ్డి కాకినాడ సిపోర్టు వాటాల బదిలీ, లిక్కర్ స్కాం విషయంలో సంచలన విషయాలను బయటపెట్టారు. అప్పట్లోనే టిడిపి లైన్లో విజయసాయిరెడ్డి మాట్లాడుతున్నట్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అనుమానించారు. ఇటీవల కాలంలో లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తు వేగవంతం కావడం, నిందితులు తప్పించుకునే మార్గాలు అన్వేషిస్తుండడంతో విజయసాయి రెడ్డికి ప్రాధాన్యం పెరిగింది.
* టిడిపి నుంచి అందని సంకేతాలు..
అయితే గతంలో విజయసాయిరెడ్డి వ్యవహరించిన వైఖరి కారణంగా టిడిపి( TDP ) నుంచి ఇంకా ఎలాంటి సంకేతాలు రావడం లేదని తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉండే సమయంలో టిడిపి అధినేత చంద్రబాబుపై విజయసాయిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భాలే అధికం. అటువంటి వ్యక్తి కూటమిలోకి వస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని భయపడుతున్నట్లు సమాచారం. కానీ విజయసాయిరెడ్డి విషయంలో బిజెపి పెద్దలు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మొత్తం పరిణామాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కలవరపాటుకు గురిచేస్తున్నాయి. విజయసాయిరెడ్డి బిజెపిలో చేరితే మాత్రం భారీ వ్యూహంతోనేనని తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.