Kodi kathi Case: ఏపీలో కోడికత్తి కేసు మరోసారి తెరపైకి వచ్చింది,. నాడు విపక్ష నేతగా ఉన్న జగన్ పై విశాఖ విమానాశ్రయంలో శ్రీనివాస్ అనే యువకుడు కోడికత్తితో దాడిచేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన సంచలనం రేకెత్తించింది. ఘటనకు పాల్పడిన యువకుడు గత నాలుగేళ్లుగా రిమాండ్ ఖైదిగా ఉన్నాడు. అయితే అడపాదడపా రాజకీయ వ్యంగ్యోక్తులకు కోడికత్తి ఘటన పరిమితమైంది. దాదాపు దీనిని మరిచిపోతున్న వేళ ఇటీవల మళ్లీ అనూహ్యంగా తెరపైకి వచ్చింది. శ్రీనివాస్ తల్లి సావిత్రి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణకు లేఖరాయడంతో మరోసారి తెరపైకి వచ్చింది. దీంతో కీలక మలుపు చోటుచేసుకుంది. తన కుమారుడు నాలుగేళ్లుగా రిమాండ్ లో మగ్గుతున్నాడని.. నరకయాతన అనుభవిస్తున్నాడని.. మోక్షం కలిగించాలని సీజేకు రాసిన లేఖలో తల్లి సావిత్రి పేర్కొన్నారు. ఈ విషయంలో న్యాయస్థానం కానీ.. ఎన్ఐఏ కానీ సరైన రీతిలో స్పందించడం లేదని చెప్పారు. కేవలం మూడు నెలల పాటు బెయిలిచ్చి.. మళ్లీ జైలుకు తరలించారని.. అందుకే విడుదల చేసేలా ఆదేశాలివ్వాలని అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తికి విన్నవించారు. దీంతో ఇదో హాట్ టాపిక్ గా మారింది. నాడు విపక్ష నేతగా ఉన్న జగన్ పై శ్రీనివాస్ కోడి కత్తితో దాడి చేశారు. జగన్ సీఎం అయ్యారు. మూడు సంవత్సరాల పదవీ కాలం పూర్తి చేసుకున్నారు. అయినా కోడికత్తి కేసును పట్టించుకున్న దాఖలాలు లేవు. కొలిక్కి తెచ్చే ప్రయత్నాలు చేయలేదు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

విశాఖ ఎయిర్ పోర్టులో దాడి..
నాడు విపక్ష నేతగా జగన్ ఏపీలో పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రతీ శుక్రవారం ఆయన సీబీఐ కోర్టులో అప్పట్లో హాజరయ్యేవారు. సరిగ్గా విజయనగరం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న సమయంలో కోర్టు విచారణకు 2018 అక్టోబరు 25న హైదరాబాద్ వెళ్లేందుకు సన్నద్ధమయ్యారు. విశాఖ విమానాశ్రయానికి వచ్చేసరికి శ్రీనివాస్ అనే యువకుడు కోడి పందాల సమయంలో కోడికి కట్టేకత్తితో దాడిచేశాడు. అయితే ప్రమాదం నుంచి తప్పించుకున్న జగన్ కు గాయాలయ్యాయి. ఈ ఘటన పెను సంచలనంగా మారింది. అయితే ఈ ఘటనకు పాల్పడింది అప్పటి అధికార టీడీపీయేనని వైసీపీ నేతలు ఆరోపించగా.. ఎన్నికల్లో ప్రజల సానుభూతి పొందేందుకు వైసీపీయే ఘటన జరిపించిందని టీడీపీ నేతలు ఆరోపించారు. అటు తరువాత జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. కానీ అసలు అటువంటి ఘటనేదీ జరగలేదన్నట్టు కోడికత్తి కేసును పట్టించుకోవడం మానేసింది. అయితే ఇన్నాళ్లకు తల్లి ఏకంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడంతో మరోసారి వెలుగులోకి వచ్చింది.

ఏబీ వ్యాఖ్యలు వెనుక…
అయితే ఈ ఘటనను ఉటంకిస్తూ ఏపీ ఇంటలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆయనపై వరుసగా సస్పెన్షన్ వేటు వేస్తున్న సంగతి తెలిసిందే. కోర్టులు స్పష్టమైన ఆదేశాలు జారీచేస్తున్నా..రకరకాల కారణాలు చూపుతూ ప్రాధాన్యత లేని పోస్టుల్లో నియమించింది. అది కూడా మూన్నాళ్ల ముచ్చగా మిగిలింది. ఈ నేపథ్యంలో వెంకటేశ్వరరావు నాటి కోడికత్తి ఘటనను గుర్గు చేసుకున్నారు. నాడు కోడికత్తి ఘటన తరువాత రాష్ట్రంలో విధ్వంసాలకు పాల్పడడానికి చూశారని.. దానిని అడ్డుకున్నందునే తనపై పగ పట్టారని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో బాధిత యువకుడి తల్లి లేఖ బయటపడడం విశేషం. అయితే దీనిపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎటువంటి ఆదేశాలిస్తారో చూడాలి మరీ.
Also Read:Central Government- Power Reform: విద్యుత్ సంస్కరణలో కేంద్రం మున్ముందుకే