Jagan Delhi Tour
Jagan Delhi Tour: ఏపీ సీఎం జగన్ ఈరోజు ఢిల్లీ వెళ్ళనున్నారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరనున్నారు. రెండు రోజులు పాటు హస్తినలో గడపనున్నారు. చంద్రబాబు అరెస్టు తరువాత తొలిసారిగా జగన్ ఢిల్లీ వెళుతుండడంతో ప్రాధాన్యతాంశంగా మారిపోయింది. ఇందులో రాజకీయ అంశాలు ఏవి లేవని.. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఢిల్లీ వెళ్లి పెద్దలను కలవనున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. కానీ ఇందులో కచ్చితంగా రాజకీయ జెండా ఉందని విపక్షాలు అనుమానిస్తున్నాయి.
సాధారణంగా జగన్ ప్రతినెలా ఢిల్లీ వెళ్తుండేవారు. ఇలా వెళ్లిన క్రమంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం చర్చించినట్లు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసేవారు. అయితే తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈసారి సీఎం జగన్ ఢిల్లీ పర్యటన మాత్రం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్లు ఖరారు అయినట్లు సమాచారం. శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వామపక్ష తీవ్రవాదం పై నిర్వహించే సమావేశానికి సీఎం జగన్ హాజరవుతారు. అనంతరం పలువురు కేంద్ర మంత్రులను సైతం కలవనున్నారు. అటు తర్వాత ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్షాలను కలుస్తారని సమాచారం.
వాస్తవానికి గత నెలలో సీఎం జగన్ ఢిల్లీ టూర్ ఉంటుందని అంతా భావించారు. కానీ వ్యక్తిగత పర్యటన నిమిత్తం పది రోజులు పాటు జగన్ లండన్ వెళ్లారు. ఇంతలో చంద్రబాబు అరెస్ట్ పర్వం ప్రారంభమైంది. అదే నెల 12న జగన్ లండన్ నుంచి ఏపీకి చేరుకున్నారు. తొలుత లండన్ నుంచి నేరుగా ఢిల్లీ వెళ్తారని ప్రచారం జరిగింది. అటు తర్వాత ఏపీ వచ్చి ఒకటి రెండు రోజుల్లో ఢిల్లీ వెళ్తారని సైతం టాక్ నడిచింది. కానీ చంద్రబాబు అరెస్ట్ తర్వాత జగన్ వైఖరి పై కేంద్ర పెద్దలు ఆగ్రహంగా ఉన్నారని ప్రచారం జరిగింది. అందుకే అపాయింట్మెంట్ సైతం ఇవ్వలేదని టిడిపి అనుకూల మీడియా ప్రచారం చేసింది. అయితే అటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు, ఇటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు గత నెల 21 నుంచి27 వరకు కొనసాగాయి. దీంతో జగన్ ఢిల్లీ వెళ్లేందుకు సమయం కుదరలేదు. ప్రస్తుతం ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా అందుబాటులో ఉంటారనే సమాచారం మేరకు జగన్ హస్తి నాకు బయలుదేరి వెళ్లనున్నట్లు వైసిపి వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు ఏపీలో ఖాజా రాజకీయ పరిస్థితులను వివరించేందుకే జగన్ ఢిల్లీ వెళుతున్నట్లు సమాచారం. ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్.. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. కనీసం బిజెపికి సమాచారం ఇవ్వకుండా పొత్తు పెట్టుకున్నారని.. బిజెపి అగ్ర నేతలు ఆగ్రహంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో జగన్ ఢిల్లీ వెళుతూ ఉండడం ప్రాధాన్యతను సంతరించుతుంది. మరోవైపు చంద్రబాబు అరెస్ట్ వెనుక కేంద్ర నాయకత్వం పాత్ర ఉందని ప్రజల్లోకి బలంగా వెళుతుందని.. దీనిని కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్తామని బిజెపి ఏపీ నేతలు నిర్ణయించుకున్నారు. మరోవైపు బిజెపికి చెప్పే పవన్ టిడిపి తో పొత్తు పెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇన్ని పరిణామాల నడుమ జగన్ నేరుగా ప్రధాని, హోం మంత్రులను కలుస్తుండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. జగన్ కలిసిన తర్వాత పరిణామాలు ఎలా మారుతాయో అన్నది చూడాల్సి ఉంది.