CM Jagan: నిజంగా జగన్ కు ఆ విషయంలో లోటే

గత ఎన్నికల్లో జగన్ తల్లి విజయమ్మ, సోదరి షర్మిల ఊరువాడా ప్రచారం చేశారు. బై బై బాబు అంటూ షర్మిల చేసిన ప్రచారానికి ప్రజల నుంచి విపరీతమైన స్పందన లభించింది.

Written By: Dharma, Updated On : November 27, 2023 9:48 am

CM Jagan

Follow us on

CM Jagan: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. అన్ని పార్టీలు వ్యూహాలను రూపొందించుకుంటున్నాయి. ఎలక్షన్ క్యాంపెయినర్లను నియమించుకునే పనిలో పడ్డాయి. ఇప్పటికే టిడిపి, జనసేన కూటమి కట్టడంతో చంద్రబాబు, పవన్ లు స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్నారు. నారా లోకేష్, బాలకృష్ణ, భువనేశ్వరి, నాగబాబు, నాదెండ్ల మనోహర్ తో పాటు మెగా కాంపౌండ్ వాల్ నుంచి కొంతమంది హీరోలు ఎన్నికల్లో ప్రచారం చేసే ఛాన్స్ ఉంది. అయితే ఈ లెక్కన వైసీపీకి స్టార్ క్యాంపెయినర్లు ఎవరంటే? సమాధానం దొరకని పరిస్థితి. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లి విజయమ్మ, సోదరి షర్మిల దూరమయ్యారు. రక్తసంబంధీకులు అయినా నాయకులు ఉన్నా వారితో ఆ స్థాయిలో ప్రయోజనం లేదు.

గత ఎన్నికల్లో జగన్ తల్లి విజయమ్మ, సోదరి షర్మిల ఊరువాడా ప్రచారం చేశారు. బై బై బాబు అంటూ షర్మిల చేసిన ప్రచారానికి ప్రజల నుంచి విపరీతమైన స్పందన లభించింది. అయితే ఇప్పుడు వారు తెలంగాణకే పరిమితమయ్యారు. విజయమ్మ వస్తారనుకుంటే డౌటే నని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు జగన్ కు ఉన్నది విజయ్ సాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వై వి సుబ్బారెడ్డి, ఆర్టీసీ చైర్మన్ దుర్గాయపల్లె మల్లికార్జున్ రెడ్డి ఉన్నారు. అయితే వీరు పార్టీలోనే పట్టు సాధించగలరు గానీ.. ప్రజా క్షేత్రంలో అడుగు పెట్టి ప్రచారం చేసే సత్తా వీరికి లేదు. పోనీ సినీ గ్లామర్ ఉపయోగించుకుందాం అంటే ఆ స్థాయి నాయకులు ఎవరూ కనిపించడం లేదు. మంత్రి రోజా సొంత నియోజకవర్గ నగిరిలో ఎదురీదుతున్నారు. ఆమె నియోజకవర్గంలో దాటి ప్రచారం చేసే అవకాశం లేదు.

గత ఎన్నికల్లో వైఎస్ కుటుంబం ఏకతాటిపై ఉండేది. వివేకానంద రెడ్డి హత్య కేసు పరిణామాలు, షర్మిల రాజకీయ అరంగేట్రం తదితర కారణాలతో కుటుంబం నిట్ట నిలువునా చీలిపోయింది.కుటుంబంలో మెజారిటీ సభ్యులు జగన్ కు దూరమయ్యారు. దీంతో గతం మాదిరిగా కుటుంబ సభ్యులు ప్రచారం చేసే అవకాశం కనిపించడం లేదు. జగన్ వెంట ఉన్నటువంటి బంధువులు,కుటుంబ సభ్యులు రాజకీయ అవసరాల కోసమే అన్నట్టు ఉన్నారు. జగన్ అధికారం కడప ఎంపీ అవినాష్ రెడ్డికి వివేక హత్య కేసులో ఊరట పొందేందుకు పనికొచ్చిందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. అవి ఆత్మరక్షణలో పడేస్తున్నాయి. కుటుంబంలో చీలికను తెలియజేస్తున్నాయి.

ప్రస్తుతం ఒక్క మాటలో చెప్పాలంటే జగన్ ఒంటరి పోరాటం చేస్తున్నారు. తాను ఇచ్చిన సంక్షేమ పథకాలే స్టార్ క్యాంపెయినర్లుగా భావిస్తున్నారు. మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి సొంత పనులకే పరిమితమవుతున్నారు. నాలుగు సంవత్సరాలు టీటీడీ చైర్మన్ గా బాబాయ్ వైవి సుబ్బారెడ్డి పదవి అనుభవించారు. ప్రస్తుతం ఉత్తరాంధ్ర ఇన్చార్జిగా ఉన్నారు. ఆయనతో పెద్దగా ప్రయోజనం ఉండదని విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. గత ఎన్నికల్లో అండగా నిలిచిన వారిలో బాలినేని ఒకరు. కానీ నిత్యం అలకపాన్పు ఎత్తుతున్నారు. గత ఎన్నికల్లో జగన్ వెన్నంటి ఉండి ప్రచారం చేసిన వారిలో ఒక్కరంటే ఒక్కరు కూడా కనిపించడం లేదు. ఇది ముమ్మాటికీ జగన్ కు నష్టం చేకూరుస్తుంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఇక జగన్ ఎలాంటి ఆలోచన చేస్తారో చూడాలి.