Ambati Rambabu: మంత్రి అంబటి రాంబాబుకు వైసిపి హై కమాండ్ షాక్ ఇవ్వనుందా? టికెట్ విషయంలో మొండి చేయి చూపనుందా? 2024 ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి తప్పించనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దీనిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అంబటి రాంబాబు పై సొంత పార్టీ శ్రేణులే గుర్రుగా ఉన్నాయి. సొంత పార్టీ నుంచి వ్యతిరేకత గెలుపోవటములపై ప్రభావం చూపుతోందని వైసిపి హై కమాండ్ భావిస్తోంది.
సత్తెనపల్లి నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం అధికం. టిడిపి నియోజకవర్గ ఇన్చార్జిగా కన్నా లక్ష్మీనారాయణ ఉన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న కన్నా ఇటీవలే టీడీపీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో ఆయన టిడిపి అభ్యర్థిగా పోటీ చేయడం ఖాయం. టిడిపి, జనసేన కూటమి కట్టడంతో ఈ నియోజకవర్గంలో పెను ప్రభావం చూపుతుందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. పైగా జనసేన పై నిత్యం అంబటి రాంబాబు విమర్శలు చేస్తుంటారు. దీంతో జనసేన వర్గాలు ఎలాగైనా అంబటి రాంబాబును ఓడించాలని కసిగా ప్రయత్నాలు చేస్తున్నాయి. కాపు సామాజిక వర్గం జనసేన వైపు ఉండడంతో అంబటి రాంబాబు గెలుపు ప్రశ్నార్ధకంగా మారింది. ఈ తరుణంలో ఇక్కడ అభ్యర్థి మార్పు శ్రేయస్కరమని హై కమాండ్ కు నివేదికలు అందినట్లు తెలుస్తోంది.
సత్తెనపల్లి నుంచి ఈసారి మాజీ ఎమ్మెల్యే ఎర్రం వెంకటేశ్వర రెడ్డి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన వెంకటేశ్వర రెడ్డి విజయం సాధించారు. గత ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా పోటీ చేశారు. అనంతరం వైసీపీలో చేరారు. ఇటీవల ఆయన నియోజకవర్గంలో యాక్టివిటీస్ పెంచారు. అంబటి పై అసమ్మతి నాయకులంతా వెంకటేశ్వర రెడ్డి గూటికి చేరారు.దీంతో ఆయన తనపర్యటనలను విస్తృతం చేశారు. ఇప్పటికే సర్వే నివేదికల ఆధారంగా టిక్కెట్లు ఇస్తానని.. ప్రజల్లో ఆదరణ తగ్గకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాయకులదేనని సీఎం జగన్ తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మొహమాటలకు పోదలుచుకునే ఛాన్స్ లేదని అనేకసార్లు చెప్పుకొచ్చారు. ఇటువంటి నేపథ్యంలో సత్తెనపల్లిలో వెంకటేశ్వర రెడ్డి విస్తృతంగా పర్యటించడం వెనుక వ్యూహం ఏంటనేది అంతుచిక్కడం లేదు.
జగన్ ముద్దు ఎమ్మెల్యే అంబటి వద్దు అన్న నినాదాలు సత్తెనపల్లి నియోజకవర్గంలో తరచూ వినిపించాయి. సర్వే నివేదికల సైతం అంబటికి వ్యతిరేకంగా వచ్చినట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. అయితే జగన్కు అత్యంత నమ్మకమైన నేతల్లో అంబటి ఒకరు.అతన్ని సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి తప్పించి.. మరో నియోజకవర్గం నుంచి పోటీ చేయిస్తారని ప్రచారం జరుగుతోంది. ఎప్పటికీ సత్తెనపల్లి అభ్యర్థి మార్పు విషయంలో జగన్ సీరియస్ గా ఆలోచిస్తున్నారని ఒక టాక్ అయితే ఉంది. ఈ తరుణంలో వెంకటేశ్వర రెడ్డి తన పర్యటనలు పెంచడం ఉమ్మడి గుంటూరు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. అంబటి రాంబాబు పని అయిపోయిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి వైసిపి హై కమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.