ఏపీలో వై వైస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆర్ధికంగా పీకలలోతు సమస్యలలో చిక్కుకు పోతున్నది. ఒక వంక కరోనా, లాక్ డౌన్ ల కారణంగా ప్రభుత్వ ఆదాయం కుదించుకు పోవడం, కేంద్రం నుండు ఆశించిన నిధులు కూడా రాకపోవడంతో పాటు అప్పులు చేద్దామన్నా ఇచ్చేవారు కనిపించడం లేదు.
ఇంతకు ముందు తీసుకున్న అప్పులు చెల్లించక పోవడంతో కొత్తగా మళ్ళి అప్పులు ఎట్లా ఇస్తామని ప్రశ్నలు తలెత్తుతూ ఉండడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడుతున్నది. రాష్ట్ర ప్రభుత్వాన్ని డిఫాల్టర్‌గా పేర్కొంటూ బకాయిలు తీర్చనిదే కొత్తగా అప్పులు ఇచ్చే ప్రసక్తి లేదని స్పష్టం చేస్తున్నాయి.
ఇది వరకే ఈ మేరకు స్టేట్ బ్యాంకు, నబార్డ్, మరికొన్ని ఇతర బ్యాంకుల నుంచి ఇటువంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయి. తాజాగా ఇచ్చిన రుణాన్ని తిరిగి తీర్చడంలో విఫలమైనందున రాష్ట్రానికి కొత్త రుణం ఇచ్చేందుకు జాతీయ సహకారాభివృద్ధి సంస్థ (ఎన్‌సిడిసి) విముఖత వ్యక్తం చేస్తుంది.
రబీ జొన్న, మొక్కజొన్న, పసుపును సేకరించేందుకు రూ 2,000 కోట్లు రుణాన్నివ్వాలని రాష్ట్ర సహకార మార్కెటిరగ్ ఫెడరేషన్ (మార్క్‌ఫెడ్) ఎన్‌సిడిసికి వ్రాసిన లేఖకు చుక్కెదురయినది. ఈ రుణానికి రాష్ట్ర ప్రభుత్వ హామీ ఉన్నదని చెప్పినా ప్రయోజనం లేకపోయింది.
సహకార చక్కెర కర్మాగారాలకు కావాల్సిన పెట్టుబడి కోసం గత ఏడాది మార్చి, ఏప్రిల్‌లోనే రెండు విడతలుగా రూ.200 కోట్లు విడుదల చేసింది. ఈ రెండు రుణాల మొత్తాన్ని ఈ ఏడాది ఫిబ్రవరి 28, మార్చి 13న తిరిగి చెల్లించాల్సి ఉండగా ఇంతవరకు చెల్లించలేదని గుర్తు చేసింది.
ప్రస్తుతం రాష్ట్రం నుంచి తమకు రూ 225 కోట్లు రావాల్సి ఉన్నదని, అందుకే పాత బకాయిలను తీర్చపోవడం వల్ల కొత్తగా అడుగుతున్న రూ.2,000 కోట్ల ప్రతిపాదనలు పరిశీలించలేమని స్పష్టం చేసింది.