Pawankalyan
చిరంజీవి.. సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్. టాప్ యాక్టర్. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. పొరుగు రాష్ట్రాలు, ఇతర దేశాల్లోనూ ఆయనకు అభిమానులు ఉన్నారు. టాలీవుడ్ నంబర్ వన్ హీరో అయిన చిరంజీవి ఆ మధ్య ఓ రాజకీయ పార్టీని స్థాపించాడు. ప్రజారాజ్యం పేరిట పార్టీ పెట్టి సీఎం సీటు ఎక్కాలని తహతహలాడారు. కానీ.. సినిమాలకు, రాజకీయాలకు ‘నక్కకు.. నాగ లోకానికి ఉన్నంత తేడా ఉందని’ చాలా రోజుల తర్వాత గుర్తించాడు. పార్టీ స్థాపించిన సందర్భంలో చిరంజీవి తాను అందరివాడిని అని గొప్పగా ప్రకటించాడు. కానీ.. ఎన్నికల టైం వచ్చేసరికి ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికే ఎక్కువ టికెట్లు ఇవ్వడం, ఎప్పుడూ తన చుట్టూ కూడా వారినే పెట్టుకోవడంతో ఆయన మీద కులం ముద్ర పడింది.
Also Read: 2024 ఎన్నికల్లో బీజేపీ జనసేనదే హవా…. ఆ రెండు పార్టీలకు షాక్?
సినీ ఇండస్ర్టీలో తన వారసత్వాన్ని చిరంజీవి సోదరుడు పవన్ కల్యాణ్ కంటిన్యూ చేశాడు. యూత్ ఐకాన్‌గా నిలిచాడు. పవర్‌స్టార్‌గా ఎదిగాడు. కులం, మతం, ప్రాంతం, వర్ణం, వర్గం తేడా లేకుండా అభిమాన జనం ఆయనకు నిండుగా ఉన్నారు. టాలీవుడ్‌లో సక్సెస్ ఫుల్ హీరోగా పేరు సాధించిన పవన్‌కు కూడా చిరంజీవి లాగే రాజకీయాలపై మనసు మళ్లింది. ఆయనా ఓ పార్టీని స్థాపించాడు. అదే జనసేన. 2019 ఎన్నికలకు ముందు పోటాపోటీ ప్రచారానికి దిగి.. మెజార్టీ స్థానాల్లో బరిలో నిలిచినా చిరంజీవి లాగే పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు.
ఎన్నికలకు ముందు కర్నూలు పర్యటనలో పవన్ కల్యాణ్ ముస్లింలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘ముస్లింలు దేశ భక్తులు.. వారిని వేరుగా చూడడం తగదు’ అంటూ బీజేపీ మీద విమర్శలు సంధించాడు. కానీ.. పవన్ చేస్తున్నదేంటి..? చేగువేరా నుంచి చాతుర్మాస దీక్షల దాకా తన రాజకీయ కథ నడిపించిన ఆయన తూర్పు పడమరలుగా ఉన్న కమ్యూనిస్టులను, కమలం పార్టీని కూడా కలుపుకున్నారు. ఇప్పుడు హిందూ అజెండా, జెండా పట్టేసి అచ్చమైన కాషాయధారిగా పవన్ అవతరించాడు. నాటి మాటలకు పూర్తి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. అదేంటి అని ప్రశ్నించిన వారికి ‘హిందువులకు అన్యాయం జరుగుతుంటే మాట్లాడకుండా ఎలా ఉంటానని’ చెప్పుకొస్తున్నాడు. హిందువుల పేరు ఎత్తితేనే మతవాదిగా ముద్ర వేస్తారా అంటూ గర్జిస్తున్నాడు.
పవన్ వ్యాఖ్యల నేపథ్యంలో రాజకీయాల్లో పరిధులు, పరిమితులు విధించుకుంటూ తాను కూడా కొందరివాడినన్నట్లు నిరూపించుకుంటున్నాడని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పవన్ కల్యాణ్ ఎందుకు తనను తాను విశ్వసించి ముందుకు అడుగులు వేయలేకపోతున్నారనే ప్రశ్న వినిపిస్తోంది. తనకు ఏ మతం లేదు.. కులం లేదు అని చెప్పిన పవన్ చివరికి ఏపీలో బీజేపీతో పొత్తు కడతారనే చర్చ కూడా మొదలైంది.
Also Read: జగన్ పాలన జనాలకు నచ్చడం లేదా..?
జగన్ సర్కార్ కాపులకు అన్యాయం చేసిందంటూ ఈ మధ్యనే పవన్ హాట్ కామెంట్స్ కూడా చేశాడు. కాపులను బీసీల్లో చేర్చకుండా రిజర్వేషన్లు రానీయకుండా వైసీపీ అడ్డుకుందని ఆరోపణలు చేశాడు. అలా పవన్ కల్యాణ్ మాట్లాడడం వల్ల కాపుల నేతగా ఎన్ని మార్కులు సాధించారో తెలియదు కానీ బీసీల్లో మాత్రం వ్యతిరేకత ఏర్పడింది.
నిజానికి అన్ని మతాలు కలగలిపిన దేశం మనది. లౌకిక భావన మన ఆస్తి. పవన్ కల్యాణ్ సినిమాలు కూడా కులమతాల పట్టింపులు లేకుండా అందరూ చూస్తారు. రాజకీయాల్లో కూడా ఆయన ఆ పంథా అమలు చేసి ఉంటే బాగుండేది. కానీ బీజేపీతో పొత్తు పెట్టుకుని ఆ పార్టీ సిద్ధాంతాలతో కొట్టుకుపోతుంటే కొందరివాడిగా మిగిలిపోకతప్పదని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.