Minister Roja: మంత్రి రోజా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కు దిగుతున్నారా? నాయకత్వంపై విధేయత కనబరుస్తూనే హెచ్చరికలు జారీ చేస్తున్నారా? తనకు టికెట్ వచ్చిన రాకపోయినా పార్టీకి పని చేస్తానన్న ఆమె మాటలు నమ్మదగినివిగా ఉన్నాయా? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే అన్నట్టు.. ఆమెను అడ్డుకుంటుంది సొంత పార్టీ శ్రేణులు అయితే.. ఎల్లో మీడియాను నిందించడం విశేషం. తనకు టిక్కెట్ రాదని టిడిపి నేతలు ప్రచారం చేస్తున్నారని చెప్పడం కాస్త అతి అనిపిస్తోంది.
వైసిపి హై కమాండ్ రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులను మార్చుతున్న సంగతి తెలిసిందే. తొలి విడతగా 11 మంది అభ్యర్థులను మార్చారు. ఈ సాయంత్రానికి మరికొందరి పేర్లను ప్రకటించనున్నారు. ఇలా మార్పు జాబితా 80 మంది వరకు ఉండవచ్చని టాక్ నడుస్తోంది. అటు ఫైర్ బ్రాండ్ రోజాను సైతం మార్చుతారని బలమైన ప్రచారం జరుగుతోంది. అయితే ఈ తరహా ప్రచారం ఇప్పటిదికాదు. చాలా రోజుల నుంచి జరుగుతోంది. చాలా సందర్భాల్లో సొంత పార్టీ వారే తనను ఇబ్బందులు పెడుతున్నారని రోజా వాపోయారు కూడా. ఇప్పుడు నిజంగా వైసిపి హై కమాండ్ అభ్యర్థుల మార్పునకు శ్రీకారం చుట్టడంతో రోజా పేరు ప్రధానంగా వినిపిస్తోంది. అయితే దీనిని ఎలా నియంత్రించాలో తెలియక.. మంత్రి రోజా ఎల్లో మీడియాతో పాటు టిడిపి నేతలపై నింద వేసే ప్రయత్నం చేస్తున్నారు. అటు హై కమాండ్ కు విధేయత ప్రకటిస్తూనే.. కష్టపడి పని చేసే తనకు తప్పించి.. ఎవరికి సీటు ఇస్తారని ఎదురు ప్రశ్న వేయడం విశేషం.
గత కొద్ది రోజులుగా వైసీపీలో అభ్యర్థుల మార్పు నేతలను కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ అంటేనే ఎమ్మెల్యేలు బెంబేలెత్తిపోతున్నారు. ఇదే తరుణంలో రోజాపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ ఆమె ఎవరికి సీటు ఇచ్చినా తాను కష్టపడి పని చేస్తానని.. తాను జగన్ సైనికురాలినని తేల్చేశారు. అంతటితో ఆగకుండా తాను జగనన్నకు ప్రాణం ఇస్తానని చెప్పుకొచ్చారు. అంతటితో ఆగి ఉంటే సరిపోయేది. తాను కష్టపడి పని చేస్తున్నానని.. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వెళుతున్నానని.. పల్లె నిద్ర చేస్తున్నానని.. ప్రజల కష్టాలను తెలుసుకుంటున్నానని వల్లె వేయడం మాత్రం… ఏదో తేడా కొడుతుందన్న అనుమానాలు ఉన్నాయి.
తనకు టిక్కెట్టు రాదన్న ప్రచారం టిడిపి నేతలు చేస్తున్నారని.. ఎల్లో మీడియా రాతలు రాస్తూ ఉందని రోజా అనుమానం వ్యక్తం చేశారు. కానీ ఆమెకు అసలు నిజం తెలియదా? రోజాకు వ్యతిరేకంగా పెద్దిరెడ్డి పావులు కదుపుతున్నారని సమాచారం లేదా? తనకు వ్యతిరేకంగా బీసీ నేతను తెరపైకి తెచ్చిన విషయం తెలియదా? అంటే.. అన్ని ఆమెకు తెలుసు. కానీ ఏదో రకంగా భయపెట్టి, ఆపై విధేయత చూపి టికెట్ తెచ్చుకోవాలని చూస్తున్నారు. తన విషయంలో ఇబ్బందులు వస్తే ఏ స్థాయిలో విరుచుకుపడతారో అందరికీ తెలిసిందే. అందుకే హై కమాండ్ కు ఓ రకమైన ఎమోషనల్ బ్లాక్ మెయిల్ తో దారిలోకి తెచ్చుకోవాలని చూస్తూ ఉన్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.