Mudragada Padmanabham: కాపు ఉద్యమ నాయకుడు, మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం మనసు మారిందా? ఆయన వైసీపీ ప్రభుత్వంపై పూర్తి వ్యతిరేకతతో ఉన్నారా? జనసేన, టీడీపీల వైపు చూస్తున్నారా? గత ప్రభుత్వాల కంటే జగన్ సర్కారు కాపులకు అన్యాయం జరిగిందని భావిస్తున్నారా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. జరుగుతున్న పరిణామాలు అనుమానాలకు నిజం చేకూరుస్తున్నాయి. వివిధ పార్టీల తరుపున ఐదు సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా వ్యవహరించిన ముద్రగడ పద్మనాభం దశాబ్దాల కాలంగా కాపు రిజర్వేషన్ల కోసం పోరాట బాట పట్టారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో దూకుడుగా వ్యవహరించారు. ఉద్యమాన్ని పతాక స్థాయిలోకి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో రైళ్ల విధ్వంసం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే అదంతా వైసీపీ అజెండాలో భాగమేనన్న ఆరోపణలు ముద్రగడపై వచ్చాయి. కానీ ముద్రగడ మాత్రం తనతో పాటు కుటుంబసభ్యులపై చంద్రబాబు ఉక్కుపాదం మోపారంటూ ఇప్పటికీ ఆక్రోషిస్తుంటారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ముద్రగడ ఉన్నపలంగా కాపు ఉద్యమాన్ని విడిచిపెడుతున్నట్టు ప్రకటించారు. అయితే దీనిపై విమర్శలు వ్యక్తమయ్యాయి. చంద్రబాబుకు ఇబ్బందిపెట్టడానికే ముద్రగడ కాపు ఉద్యమం చేపట్టారంటూ ఆరోపణలు వచ్చాయి. మరోవైపు జగన్ సర్కారు కూడా నాటి విధ్వంస ఘటనకు సంబంధించి కేసులు ఎత్తివేసింది. దీనిపై ముద్రగడ సీఎం జగన్ ను అభినందిస్తూ లేఖ రాశారు. అయితే ముద్రగడ కాపు ఉద్యమం నుంచి తప్పుకున్నా వివిధ సమస్యలపై మాత్రం సీఎం కు లేఖలు పంపుతూ లైమ్ లైట్ లో మాత్రం ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన వైసీపీకి అనుకూలంగా ఉన్నారని ఇప్పటివరకూ టాక్ నడుస్తోంది.

మూడేళ్లుగా మౌనమే…
గత మూడేళ్లుగా ముద్రగడ ఏమంత యాక్టివ్ గా లేరు. కేవలం చంద్రబాబును ఇబ్బందిపెట్టడానికే ఉద్యమంటూ హడావుడి చేశారని.. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కాపులకు అన్యాయం చేస్తున్నా నోరు మెదపడం లేదన్న వ్యాఖ్యలు అయితే వినిపించాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఒక వార్త రాజకీయ సర్కిల్లో తెగ ట్రోల్ అవుతోంది. ముద్రగడ టీడీపీలోకానీ, జనసేనలో కానీ చేరే అవకాశముందని ప్రచారం సాగుతోంది. జగన్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నామని.. కానీ ఆయన కాపులకు అన్నవిధాలా దగా చేశారని ముద్రగడ భావిస్తున్నారు. కేంద్రం ఈబీసీలకు ప్రకటించిన 10 శాతం రిజర్వేషన్లలో చంద్రబాబు సర్కారు కాపులకు ఐదు శాతం కేటాయించింది. విదేశీ విద్యను అభ్యసించే కాపు విద్యార్థులకు పెద్ద ఎత్తున సాయం చేసిన విషయాన్ని ముద్రగడ గుర్తుచేస్తున్నారు. జగన్ సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు ఇచ్చిన ఐదు శాతం రిజర్వేషన్లు ఎత్తివేశారు. అసలు కాపుల రిజర్వేషన్లన్నది తన పరిధిలో లేదని తప్పించుకున్నారు. అంతేకాకుండా చంద్రబాబు సర్కారు విదేశీ విద్యకు పంపించిన విద్యార్థులకు సైతం ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ముద్రగడ పునరాలోచనలో పడ్డారని తెలుస్తోంది. తాను అనుకున్నది ఒకటి అయితే జరిగింది మరొకటని ముద్రగడ భావిస్తున్నారు. వైసీపీ కంటే టీడీపీ ప్రభుత్వమే మేలన్న నిర్ణయానికి వచ్చారు.
Also Read: YS Vivekananda Reddy: మూడున్నరేళ్లవుతున్నా కొలిక్కిరాని వివేకా హత్య కేసు.. అందుకు కారణాలు అవేనా?
డిఫెన్స్ లో ఉన్న వైనం…
అయితే ముద్రగడ ప్రస్తుతం డిఫెన్స్ లో పడిపోయారు. ప్రస్తుతానికి ఏ పార్టీలో లేకున్నా అతడిపై వైసీపీ ముద్ర కొనసాగింది. తటస్థంగా ఉన్నా వైసీపీ ప్రయోజనాల కోసం పాకులాడారన్న అపవాదు అయితే ఉంది. మరోవైపు చంద్రబాబు తనతో పాటు తన కుటుంబం అనుచితంగా ప్రవర్తించారన్న కోపం ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఆయన టీడీపీ వైసే వస్తారా అన్నది ప్రశ్నే. కానీ ఆయన అనుచరుడు ఏసుబాబు టీడీపీలోకి వచ్చేందుకు సిద్ధపడ్డారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడుతో చర్చించారు. చేరికకు అంతా రంగం సిద్ధమైంది. అయితే ఏసుబాబు ముద్రగడకు ప్రధాన అనుచరుడు. ఆయన అనుమతి తీసుకోకుండా పార్టీలో చేరే అవకాశం లేదు. ముందుగా అనుచరులకు పంపించి ముద్రగడ తరువాత చేరుతారన్న టాక్ అయితే నడుస్తోంది. కాపు రిజర్వేషన్లపై చంద్రబాబుతో కీలక ప్రకటన ఇప్పటించి.. కొన్ని షరతులు విధించి ముద్రగడ టీడీపీలో చేరుతారని ప్రచారం ఉంది. మరోవైపు జనసేనలో ఆయన చేరే అవకాశమున్నట్టు తెలుస్తోంది. కాపు రిజర్వేషన్లపై పోరాడిన ట్రాక్ ఉన్నందున పవన్ వెంట నడిస్తేనే బాగుంటుందని ఆయన అనుచరులు భావిస్తున్నారు. అయితే ఎటు వెళ్లాలో తెలియక మాత్రం ప్రస్తతుం ముద్రగడ గుంభనంగా ఉన్నారు. కొద్ది నెలలు ఆగితే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశముంది.
Also Read: Crazy Heroine: క్రేజీ హీరోయిన్ షాకింగ్ నిర్ణయం.. వాటి కోసమే బరితెగింపు !