దేశంలో ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతుండగా.. పశ్చిమ బెంగాల్ పైనే అందరి చూపూ నెలకొన్నది. మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిపోగా.. వెస్ట్ బెంగాల్ లో ఇంకా రెండు దశల పోలింగ్ మిగిలి ఉంది. అయితే.. సీఎం మమతా బెనర్జీ ఈ మధ్య తరచూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు బీజేపీ నేతలతోపాటు ఇటు ఎన్నికల కమిషన్ పై మండిపడుతున్నారు. దీంతో.. ఆమె ఆగ్రహానికి కారణమేంటనే చర్చ సాగుతోంది.
మమతా బెనర్జీ ఇప్పటి వరకు రెండు సార్లు అధికారం చేపట్టారు. ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ విజయం నమోదు చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. బెంగాల్ పై పట్టు సాధించడానికి దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న కమలనాథులు.. ఈ సారి అధికారం కైవసం చేసుకోవాలని చూస్తున్నారు. ఫలితంగా.. పోరు హోరాహోరీగా సాగుతోంది.
దీంతో.. విజయం ఏకపక్షం అనే మాటకు తావులేకుండా పోయింది. పరిస్థితులు టగ్ ఆఫ్ వార్ అన్నట్టుగా ఉండడంతో.. ఎవరు గెలుస్తారో చెప్పలేకపోతున్నారు. మరోవైపు.. హంగ్ వచ్చే పరిస్థితులు ఉన్నాయనే విశ్లేషణలు కూడా వెలువడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గెలుపును సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న దీదీ.. బీజేపీపై రాజకీయ విమర్శలు కొనసాగిస్తూనే.. ఎన్నికల కమిషన్ పైనా దాడిచేస్తున్నారు.
రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ తుంగలో తొక్కుతున్నారని, ఎన్నికల కమిషన్ బీజేపీ అనుకూల నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపిస్తున్నారు మమత. అంతేకాదు.. కేంద్ర బలగాలు మహిళలను ఓటు వేయనీయకుండా అడ్డుకుంటున్నాయని, బీజేపీ పక్షాన పనిచేస్తున్నాయంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. మిమ్మల్ని అడ్డుకుంటే కత్తులతో దాడిచేయండి అని కూడా పిలుపునిచ్చారనే ఆరోపణలు కూడా వ్యక్తమయ్యాయి. దీంతో.. ఎన్నికల కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇలాంటి రెచ్చగొట్టే తీరు సరికాదని హితవు చెప్పింది.
అయితే.. మమత ఈ స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడానికి కారణం ఏంటనే ప్రశ్నకు.. ఓటమి భయమేనని సమాధానం ఇస్తున్నారు బీజేపీ నేతలు. ఈ ఎన్నికల్లో టీఎంసీ ఓడిపోవడం ఖాయమని, ఆ విషయం అర్థమైంది కాబట్టే.. ఎన్నికల కమిషన్ పైనా మమత ఆరోపణలు చేస్తున్నారని అంటున్నారు కాషాయ నేతలు. మరి, ఏం జరుగుతోంది? బెంగాల్ ప్రజలు ఎవరివైపు నిలబడ్డారనేది మే 2న తేలిపోనుంది.