తెలంగాణలో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల వేళ బీజేపీతో దోస్తీ కట్ చేస్తున్నట్టు జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే.. త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల వేళ మళ్లీ ఈ రెండు పార్టీల మధ్య పొత్తు పొడిచింది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఖమ్మం కార్పొరేషన్ కు జరగనున్న ఎన్నికల్లో బీజేపీ-జనసేన కలిసి పోటీ చేయాలని నిర్ణయించారు నేతలు. అయితే.. ఈ పొత్తు విషయంలో బీజేపీలో విభేదాలు ఉన్నాయనే గుసగుసలు వినిపిసున్నాయి.
రాష్ట్రంలో బీజేపీ దూకుడు దుబ్బాక ఉప ఎన్నిక తర్వాత పూర్తిగా మారిపోయింది. టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అని చెబుతూ అధికార పార్టీపై తీవ్రవిమర్శలు చేస్తూ వస్తున్నారు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. అయితే.. అది ఏ స్థాయిలో అంటే.. పార్టీలోని సీనియర్లను కూడా పట్టించుకోవట్లేదట. ఈ విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ను కూడా నిర్లక్ష్యం చేస్తున్నారని చాలా కాలంగా ప్రచారం సాగుతోంది.
ఇక, జనసేనతో విభేదాలు తలెత్తడానికి కూడా ఆయన ఒంటెత్తు పోకడే కారణమనే అభిప్రాయంలో ఉన్నారట పార్టీ సీనియర్లు. ఈ వ్యవహార శైలితో పార్టీకి నష్ట కలుగుతుంది భావించిన సీనియర్లు రంగంలోకి దిగారని తెలుస్తోంది. సీన్ కట్ చేస్తే.. జనసేన-బీజేపీ మైత్రి మళ్లీ కుదిరింది. ఈ పొత్తు కుదరడంలో కిషన్ రెడ్డి, లక్ష్మణ్ కీలకంగా వ్యవహరించారని తెలుస్తోంది.
అంతేకాదు.. జనసేనతో పొత్తుకోసం జరిగిన చర్చల్లో బండి సంజయ్ ను పక్కనపెట్టారనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో.. బండి అసహనంగా ఉన్నారనే చర్చ సాగుతోంది. ఈ పరిణామంతో.. తెలంగాణ బీజేపీ నేతల మధ్య ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయని అంటున్నారు. మరి, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ పొత్త ఎలాంటి ఫలితాలను సాధిస్తుంది? ఆ తర్వాత బీజేపీలో ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయి? అన్నది చూడాలి.